Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 105:1-15

105 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుము. ఆయన నామాన్ని ఆరాధించుము.
    ఆయన చేసే అద్భుత కార్యాలను గూర్చి జనాలతో చెప్పు.
యెహోవాను గూర్చి పాడుము. ఆయనకు స్తుతులు పాడుము.
    ఆయన చేసే అద్భుతకార్యాలు అన్నింటిని గూర్చి చెప్పు.
యెహోవా పవిత్ర నామాన్ని గూర్చి అతిశయించు.
    యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరంతా సంతోషించండి.
బలంకోసం యెహోవా దగ్గరకు వెళ్లండి.
    సహాయంకోసం ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వెళ్లండి.
యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
    ఆయన అద్భుతాలను, జ్ఞానంగల నిర్ణయాలను జ్ఞాపకం చేసుకోండి.
దేవుని సేవకుడైన అబ్రాహాము సంతతివారు మీరు.
    దేవుడు ఏర్పరచుకొన్న యాకోబు సంతతివారు మీరు.
యెహోవా మన దేవుడు.
    యెహోవా సర్వలోకాన్ని పాలిస్తాడు.[a]
దేవుని ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం చేసికోండి.
    వెయ్యి తరాలవరకు ఆయన ఆదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి.
దేవుడు అబ్రాహాముతో ఒక ఒడంబడిక చేసాడు.
    ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు.
10 యాకోబుకు (ఇశ్రాయేలు) దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు.
    ఇశ్రాయేలుతో దేవుడు తన శాశ్వత ఒడంబడిక చేసాడు.
11 “నేను నీకు కనాను దేశాన్ని ఇస్తాను, ఆ దేశం నీకు చెందుతుంది.”
    అని దేవుడు చెప్పాడు.
12 అబ్రాహాము కుటుంబం చిన్నదిగా ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం చేశాడు.
    మరియు వారు కనానులో నివసిస్తున్న యాత్రికులు మాత్రమే.
13 దేశం నుండి దేశానికి, రాజ్యం నుండి రాజ్యానికి
    వారు ప్రయాణం చేసారు.
14 కాని యితర మనుష్యులు ఆ కుటుంబాన్ని బాధించనియ్యకుండా దేవుడు చేసాడు.
    వారిని బాధించవద్దని దేవుడు రాజులను హెచ్చరించాడు.
15 “నేను ఏర్పాటు చేసుకొన్న నా ప్రజలను బాధించవద్దు.
    నా ప్రవక్తలకు ఎలాంటి కీడూ చేయవద్దు.” అని దేవుడు చెప్పాడు.

కీర్తనలు. 105:16-41

16 దేవుడు ఆ దేశంలో ఒక కరువు వచ్చేటట్టు చేశాడు.
    ప్రజలకు తినుటకు సరిపడినంత ఆహారం లేదు.
17 అయితే దేవుడు వారికి ముందుగా వెళ్లుటకు యోసేపు అనే మనిషిని పంపించాడు.
    యోసేపు ఒక బానిసవలె అమ్మబడ్డాడు.
18 యోసేపు కాళ్లను తాళ్లతో వారు కట్టివేశారు.
    అతని మెడకు వారు ఒక ఇనుప కంటె వేశారు.
19 యోసేపు చెప్పిన సంగతులు నిజంగా జరిగేంతవరకు
    అతడు (యోసేపు) బానిసగా చెప్పింది సరియైనది అని యెహోవా సందేశం రుజువు చేసింది.
20 కనుక యోసేపును విడుదల చేయమని ఈజిప్టు రాజు ఆదేశించాడు.
    అనేక మందికి అధికారిగా ఉన్న అతనిని కారాగారం నుండి వెళ్లనిచ్చాడు.
21 అతడు యోసేపును తన ఇంటికి యజమానిగా నియమించాడు.
    రాజ్యంలో అన్ని విషయాలను గూర్చి యోసేపు జాగ్రత్త తీసుకొన్నాడు.
22 యోసేపు యితర నాయకులకు హెచ్చరిక ఇచ్చాడు.
    పెద్ద మనుష్యులకు యోసేపు నేర్పించాడు.
23 తరువాత ఇశ్రాయేలు ఈజిప్టుకు వచ్చాడు.
    యాకోబు హాము దేశంలో[a] నివసించాడు.
24 యాకోబు కుటుంబం చాలా పెద్దది అయింది.
    వారు వారి శత్రువులకంటే శక్తిగలవారయ్యారు.
25 కనుక ఈజిప్టు ప్రజలు యాకోబు వంశాన్ని ద్వేషించటం మొదలు పెట్టారు.
    ఈజిప్టువారు బానిసలకు విరోధంగా పథకాలు వేయటం ప్రారంభించారు.
26 కనుక దేవుడు తన సేవకుడైన మోషేను,
    తాను ఏర్పాటు చేసుకొన్న యాజకుడు అహరోనును పంపించాడు.
27 హాము దేశంలో అనేక అద్భుతాలు చేయటానికి
    దేవుడు మోషే, అహరోనులను వాడుకొన్నాడు.
28 దేవుడు కటిక చీకటిని పంపించాడు.
    కాని ఈజిప్టు వాళ్లు ఆయన మాట వినలేదు.
29 కనుక దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడు.
    వాళ్ల చేపలన్నీ చచ్చాయి.
30 ఆ దేశం కప్పలతో నింపివేయబడింది.
    రాజు గదులలోకి కూడ కప్పలు వచ్చాయి.
31 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా జోరీగలు,
    దోమలు వచ్చాయి.
    అన్నిచోట్లా అవే ఉన్నాయి.
32 దేవుడు వర్షాన్ని వడగండ్లుగా చేశాడు.
    ఈజిప్టువారి దేశంలో అన్ని చోట్లా అగ్ని మెరుపులు కలిగాయి.
33 ఈజిప్టువారి ద్రాక్షా తోటలను, అంజూరపు చెట్లను దేవుడు నాశనం చేశాడు.
    వారి దేశంలో ప్రతి చెట్టునూ దేవుడు నాశనం చేసాడు.
34 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా మిడుతలు వచ్చాయి.
    అవి లెక్కింపజాలనంత విస్తారంగా ఉన్నాయి.
35 మిడుతలు దేశంలోని మొక్కలన్నింటినీ తినివేశాయి.
    నేల మీద పంటలన్నింటినీ అవి తినివేశాయి.
36 అప్పుడు ఈజిప్టు దేశంలో ప్రతి మొదటి సంతానాన్ని దేవుడు చంపేశాడు.
    వారి జ్యేష్ఠ కుమారులను దేవుడు చంపివేశాడు.
37 అప్పుడు దేవుడు ఈజిప్టు నుండి తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చాడు.
    వారు వెండి బంగారాలు వారి వెంట తెచ్చారు.
    దేవుని ప్రజలు ఎవ్వరూ తొట్రిల్లి పడిపోలేదు.
38 దేవుని ప్రజలు వెళ్లిపోవటం చూచి ఈజిప్టు సంతోషించింది.
    ఎందుకంటే దేవుని ప్రజలను గూర్చి వారు భయపడ్డారు.
39 దేవుడు తన మేఘాన్ని ఒక దుప్పటిలా పరిచాడు.
    రాత్రివేళ తన ప్రజలకు వెలుగు ఇచ్చుటకు దేవుడు తన అగ్నిస్తంభాన్ని ఉపయోగించాడు.
40 ప్రజలు మాంసం కోసం ఆడిగినప్పుడు దేవుడు వారికి పూరేళ్లను రప్పించాడు.
    దేవుడు వారికి ఆకాశం నుండి సమృద్ధిగా ఆహారాన్ని యిచ్చాడు.
41 దేవుడు బండను చీల్చగా నీళ్లు ఉబుకుతూ వచ్చాయి.
    ఎడారిలో ఒక నది ప్రవహించడం మొదలైంది.

కీర్తనలు. 105:42

42 దేవుడు తన పవిత్ర వాగ్దానం జ్ఞాపకం చేసికొన్నాడు.
    దేవుడు తన సేవకుడు ఆబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసికొన్నాడు.

2 దినవృత్తాంతములు 20:1-22

యెహోషాపాతు యుద్దం ఎదిరించటం

20 తరువాత మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు కలిసి యెహోషాపాతుతో యుద్ధం ప్రారంభించటానికి వచ్చారు. కొందరు మనుష్యులు యెహోషాపాతు వద్దకు వచ్చి యిలా అన్నారు: “ఎదోము నుంచి ఒక పెద్ద సైన్యం నీమీదికి వస్తూ వుంది. ఆ సైన్యం మృత సముద్రానికి అవతలి పక్క నుండి వస్తూ వుంది. వారు ఇప్పటికే హససోను తామారు అనబడే ఏన్గెదీలో ఉన్నారు.” యెహోషాపాతు భయపడ్డాడు. తాను ఏమి చేయాలో యెహోవాను అడిగి తెలిసికోవాలని యెహోషాపాతు నిశ్చయించాడు. యూదాలో ప్రతి ఒక్కడూ ఉపవాసం చేయలని ఒక నిర్ణీత సమయాన్ని ప్రకటించాడు. యూదా ప్రజలు యెహోవా సహాయం కోరటానికి ఒక చోట సమావేశమయ్యారు. వారు యూదా పట్టణాలన్నిటి నుండీ యెహోవా సహాయం కోరటానికి వచ్చారు. యెహోషాపాతు ఆలయ నూతన ప్రాంగణం ముందు వున్నాడు. యూదా, యెరూషలేము ప్రజల సమావేశంలో అతడు నిలబడ్డాడు. అతడు ఈ విధంగా ప్రార్థించాడు:

“మా పూర్వీకుల దేవుడవైన ఓ ప్రభూ, నీవే పరలోక అధిపతివి. ప్రపంచ రాజ్యాలన్నిటినీ ఏలేవాడవు నీవే! నీకు అధికారం, బలం వున్నాయి! నిన్నెదిరించి ఎవ్వడూ నిలువలేడు! నీవు మా దేవుడివి! ఈ దేశంలో నివసించే ప్రజలను బయటకు పొమ్మని ఒత్తిడి చేశావు. ఈ పని నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ముంగిట చేశావు. ఈ రాజ్యాన్ని అబ్రాహాము సంతతివారికి శాశ్వతంగా యిచ్చావు. అబ్రహాము నీ స్నేహితుడు. అబ్రహాము సంతతివారు ఈ రాజ్యంలో నివసించి, నీ పేరు మీద ఒక ఆలయాన్ని కట్టించారు. వారు, ‘యుద్ధాలు, శిక్ష, వ్యాధులు, కరువు కాటకాలు మొదలైన ఈతి బాధలు మాకు సంభవించినప్పుడు, ఈ మందిరం ముందు, నీ సన్నిధిని నిలబడతాము. ఈ మందిరం నీ పేరు మీద వుంది. మాకు ఆపద వచ్చినప్పుడు నీకు మొర పెట్టుకొంటాము. అప్పుడు నీవు మా మొరాలకించి మమ్ము రక్షిస్తావు’ అని అన్నారు.

10 “కాని ఇప్పుడు అమ్మోను, మోయాబు, మరియు శేయీరు పర్వత ప్రాంత మనుష్యులు ఇక్కడ వున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి బయటికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులను వారి రాజ్యంలోనికి నీవు వెళ్లనీయలేదు[a] అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు వారి జోలికి పోకుండా తిరిగి వచ్చి, వారిని నాశనం చేయలేదు. 11 కాని మేము వారిని నాశనం చేయకుండా వదిలిపెట్టినందుకు వారు మాకు ఏ రకమైన ప్రతిఫలం ఇస్తున్నారో చూడు. నీ దేశం నుండి మమ్మల్ని తరిమి వేయటానికి వారు వచ్చారు. ఈ దేశాన్ని నీవు మాకు యిచ్చి యున్నావు. 12 మా దేవా, ఆ మనుష్యులను శిక్షించుము! మామీదికి దండెత్తి వస్తున్న ఈ మహా సైన్యాన్ని ఎదిరించే శక్తి మాకు లేదు! మేము ఏమి చేయాలో మాకు తోచటంలేదు! అందువల్ల నీ సహాయం కొరకు ఎదురు చూస్తూన్నాం.”[b]

13 యూదా ప్రజలంతా తమ పసిబిడ్డలు, భార్యలు, పిల్లలతో యెహోవా ముందు నిలబడ్డారు. 14 అప్పుడు యెహోవా ఆత్మ యహజీయేలు మీదికి వచ్చింది. యహజీయేలు తండ్రి పేరు జెకర్యా. జెకర్యా తండ్రి పేరు బెనాయా. బెనాయా తండ్రి పేరు యెహీయేలు. యెహీయేలు తండ్రి పేరు మత్తన్యా. యహజీయేలు ఒక లేవీయుడు. ఆసాపు సంతతిలోనివాడు. సమావేశం మధ్యలో 15 యహజీయేలు నిలబడి యిలా అన్నాడు: “రాజైన యెహోషాపాతూ, యూదా, యెరూషలేములలో నివసిస్తున్న ప్రజలారా వినండి! యెహోవా మీకు ఈ విధంగా తెలియజెప్పుతున్నాడు: ‘ఈ మహా సైన్యాన్ని చూచి మీరు భయపడవద్దు. చింతించవద్దు. ఎందువల్లననగా ఇప్పుడు యుద్ధం మీది కాదు. ఇది దేవుని యుద్ధం. 16 రేపు మీరు అక్కడకి వెళ్లి ఆ సైన్యంతో యుద్ధం చేయండి. వారు జీజు కనుమ ద్వారా వస్తారు. యెరూవేలు ఎడారికి అవతలి పక్కనున్న లోయ చివర మీరు వారిని చూస్తారు. 17 ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన అవసరం లేదు. మీరీ స్థానాలలో దృఢంగా నిలబడండి. యెహోవా మిమ్ముల్ని రక్షించటం మీరు చూస్తారు. యూదా, యెరూషలేము ప్రజలారా భయపడకండి! చింతించవద్దు! యెహోవా మీ పక్షాన వున్నాడు. కావున రేపు వారి మీదికి వెళ్లండి.’”

18 యెహోషాపాతు తన శిరస్సు నేల తాకేలా సాష్టాంగపడ్డాడు. యూదా ప్రజలు, యెరూషలేములో వుంటున్న వారు యెహోవా ముందు సాష్టాంగపడ్డారు. వారంతా యెహోవాను ఆరాధించారు. 19 లేవీయులలో కహాతీయుల కుటుంబాలవారు, కోరహీయులు నిలబడి ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవాకు స్తోత్రం చేశారు. వారు గొంతెత్తి స్తోత్రం చేశారు.

20 తెల్లవారుఝామునే యెహోషాపాతు సైన్యం తెకోవ ఎడారికి వెళ్లింది. వారు బయలుదేరి వెళ్లేటప్పుడు యెహోషాపాతు నిలబడి యిలా అన్నాడు: “యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, నేను చెప్పేది వినండి. మీ దేవుడైన యెహోవాలో విశ్వాసముంచండి. అప్పుడు మీరు దృఢంగా నిలువ గలుగుతారు. యెహోవా ప్రవక్తలలో విశ్వాసముంచండి. మీరు విజయం సాధిస్తారు!”

21 యెహోషాపాతు ప్రజల సలహాను ఆలకించాడు. అతడు గాయకులను నియమించాడు. యెహోవా పరిశుద్ధుడు, అద్భుతమైన వాడు గనుక ఆయనను స్తుతించటానికి ఆ గాయకులు ఎంపిక చేయబడ్డారు. వారు సైన్యానికి ముందు నడుస్తూ యెహోవాకు స్తుతి గీతాలు పాడారు.

“యెహోవాకు భజన చేయండి;
    ఆయన ప్రేమ తరగనిది!”

అంటూ వారు సంకీర్తన చేశారు. 22 ఆ మనుష్యులు పాడుతూ, దేవుని స్తుతిస్తూ వెళ్తూండగా, అమ్మోను, మోయాబు ప్రజల మీదికి, శేయీరు పర్వత ప్రాంతం వారిమీదికి మాటు వేసిన మనుష్యులను యెహోవా పంపాడు. వారంతా యూదా రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నారు. వాళ్లు బాగా దెబ్బలు తిన్నారు.

లూకా 13:22-31

ఇరుకు ద్వారం

(మత్తయి 7:13-14, 21-23)

22 యేసు పట్టణాల్లో, పల్లెల్లో బోధిస్తూ యెరూషలేము వైపు ప్రయాణం సాగించాడు. 23 ఒకడు, “ప్రభూ! కొద్దిమంది మాత్రమే రక్షింపబడతారా?” అని అడిగాడు.

ఆయన వాళ్ళతో, 24 “దేవుని రాజ్యానికి ఉన్న ద్వారం యిరుకైనది. ఆ ద్వారం ద్వారా ప్రవేశించటానికి గట్టి ప్రయత్నం చేయండి అనేకులు ఆ ద్వారం ద్వారా ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తారు. కాని ప్రవేశించలేరు. 25 ఇంటి యజమాని లేచి తలుపులకు తాళం వేస్తాడు. మీరు బయట నిలబడి తలుపు తడుతూ ‘అయ్యా! మాకోసం తలుపు తెరవండి!’ అని వేడుకొంటారు. కాని ఆయన ‘మీరెవరో, ఏ ఊరినుండి వచ్చారో నాకు తెలియదు’ అని సమాధానం చెబుతాడు. 26 అప్పుడు మీరు, ‘మీతో కలిసి తిన్నాము. మీరు మా వీధుల్లో బోధించారు’ అని అంటారు. 27 కాని ఆయన, ‘మీరెవరో నాకు తెలియదు. ఎక్కడినుండి వచ్చారో తెలియదు. ఇక్కడినుండి వెళ్ళండి, మీరంతా దుర్మార్గులు’ అని అంటాడు.

28 “మీరు అబ్రాహామును, ఇస్సాకును, యాకోబును ఇతర ప్రవక్తలను దేవుని రాజ్యంలో చూస్తారు. మిమ్మల్ని బయట పారవేసినందుకు మీరు దుఃఖిస్తారు. బాధననుభవిస్తారు. 29 ప్రజలు ఉత్తర దక్షిణాల నుండి, తూర్పు పడమరల నుండి దేవుని రాజ్యంలో జరుగుతున్న విందుకు వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. 30 ఇప్పుడు చివరి స్థానాల్లో కూర్చున్నవాళ్ళు అక్కడ ముందు స్థానాల్లో కూర్చుంటారు. ఇప్పుడు మొదటి స్థానాల్లో ఉన్న వాళ్ళు అక్కడ చివరి స్థానాల్లో కూర్చుంటారు” అని అన్నాడు.

యేసు యెరూషలేము విషయంలో దుఃఖించటం

(మత్తయి 23:37-39)

31 అప్పుడు కొందరు పరిసయ్యులు యేసు దగ్గరకు వచ్చి, “ఈ ప్రాంతం వదిలి యింకెక్కడికైనా వెళ్ళు. హేరోదు రాజు నిన్ను చంపాలనుకుంటున్నాడు” అని అన్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International