Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
27 యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు.
నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు.
యెహోవా, నీవే నా జీవిత క్షేమస్థానం.
కనుక నేను ఎవరికి భయపడను.
2 దుర్మార్గులు నా మీద దాడి చేయవచ్చు.
వారు నా శరీరాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించవచ్చు.
వారు నా శత్రువులు, విరోధులు.
వారు కాలు తప్పి పడిపోదురు.
3 అయితే నా చుట్టూరా సైన్యం ఉన్నప్పటికీ నేను భయపడను.
యుద్ధంలో ప్రజలు నామీద విరుచుకు పడ్డప్పటికీ నేను భయపడను. ఎందుకంటే నేను యెహోవాను నమ్ముకొన్నాను.
4 యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది.
నేను అడిగేది ఇదే:
“నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట.
ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట.
యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.”
5 నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు.
ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు.
ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు.
6 నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కాని ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు.
అప్పుడు నేను ఆయన గుడారంలో బలులు అర్పిస్తాను. సంతోషంతో కేకలు వేస్తూ ఆ బలులు నేను అర్పిస్తాను.
యెహోవాను ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం చేస్తాను.
7 యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు ఇమ్ము.
నా మీద దయ చూపించుము.
8 యెహోవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లాడమంటున్నది.
వెళ్లు, నీ యెహోవాను ఆరాధించమంటున్నది అందువల్ల యెహోవా నేను నిన్ను ఆరాధించటానికి వచ్చాను.
9 యెహోవా, నా దగ్గర్నుండి తిరిగిపోకుము.
కోపగించవద్దు, నీ సేవకుని దగ్గర్నుండి తిరిగి వెళ్లిపోవద్దు.
నీవు నాకు సహాయమైయున్నావు, నన్ను త్రోసివేయకుము. నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నీవు నా రక్షకుడవు.
10 నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిపెట్టారు.
అయితే యెహోవా నన్ను తీసుకొని, తన వానిగా చేసాడు.
11 యెహోవా, నాకు శత్రువులు ఉన్నారు, కనుక నాకు నీ మార్గాలు నేర్పించుము.
సరైన వాటిని చేయటం నాకు నేర్పించుము.
12 నా శత్రువుల కోరికకు నన్నప్పగించవద్దు.
నన్ను గూర్చి వాళ్లు అబద్ధాలు చెప్పారు. నాకు హాని కలిగించేందుకు వాళ్లు అబద్ధాలు చెప్పారు.
13 నేను చనిపోక ముందు యెహోవా మంచితనాన్ని నేను చూస్తానని
నిజంగా నేను నమ్ముచున్నాను.
14 యెహోవా సహాయం కోసం కనిపెట్టి ఉండుము.
బలంగా, ధైర్యంగా ఉండుము.
యెహోవా సహాయం కోసం కనిపెట్టుము.
17 కదొర్లాయోమెరును, అతనితో ఉన్న రాజులను ఓడించిన తర్వాత అబ్రాము తన యింటికి తిరిగి వెళ్లాడు. అతడు యింటికి వచ్చుచున్నప్పుడు షావే లోయలో అతణ్ణి కలుసుకొనేందుకు సొదొమ రాజు వెళ్లాడు. (ఇప్పుడు దీనిని రాజు లోయ అంటారు.)
మెల్కీసెదెకు
18 షాలేము రాజు మెల్కీసెదెకు కూడా అబ్రామును కలుసుకొనేందుకు వెళ్లాడు. మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. రొట్టెను, ద్రాక్షారసాన్ని మెల్కీసెదెకు తెచ్చాడు. 19 మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదించి ఇలా అన్నాడు:
“అబ్రామా, మహోన్నతుడైన దేవుడు నీకు దీవెనలు ప్రసాదించుగాక,
దేవుడు భూమ్యాకాశాలను చేసినవాడు.
20 సర్వోన్నతుడైన దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం
నీ శత్రువుల్ని ఓడించటానికి ఆయనే నీకు సహాయం చేశాడు.”
యుద్ధ సమయంలో అబ్రాము తెచ్చుకొన్న దానంతటిలో నుండి పదోవంతు మెల్కీసెదెకునకు అతడు ఇచ్చాడు. 21 అప్పుడు సొదొమ రాజు, “వీటన్నింటిని నీ కోసమే ఉంచుకో. శత్రువుచేత బాధించబడి, తీసుకొనిపోబడ్డ నా మనుష్యులను మాత్రం నాకు ఇచ్చేయి” అని అబ్రాముతో చెప్పాడు.
22 అయితే సొదొమ రాజుతో అబ్రాము ఇలా చెప్పాడు: “భూమిని, ఆకాశాన్ని చేసిన మహోన్నతుడైన యెహోవాదేవుని పేర నేను వాగ్దానం చేస్తున్నాను. 23 నీకు చెందినది ఏదీ నేను ఉంచుకోను. ఒక నూలుపోగైనా లేక జోళ్ల దారాలయినా, ఏదీ ఉంచుకోనని నేను వాగ్దానం చేస్తున్నాను. ‘అబ్రామును నేనే ధనికునిగా చేశానని నీవు చెప్పడం నాకిష్టం లేదు.’ 24 నా యువకులు భుజించిన ఆహారం ఒక్కటి మాత్రము నేను స్వీకరిస్తాను. అయితే మిగిలినవారికి వారి వంతు నీవు ఇవ్వాలి. యుద్ధములో మేము గెలుచుకొన్న వాటిని తీసుకొని, ఆనేరు, ఎష్కోలు, మమ్రేలకు రావలసిన భాగాలు వారికి ఇవ్వు. వీళ్లు నాకు యుద్ధంలో సహాయపడ్డారు.”
17 సోదరులారా! నావలె జీవించండి. మేము బోధించిన విధానాన్ని అనుసరిస్తున్నవాళ్ళను గమనించండి. 18 నేనిదివరకే ఎన్నో సార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ కన్నీళ్ళతో చెబుతున్నాను. క్రీస్తు సిలువ పట్ల శత్రుత్వంతో జీవిస్తున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. 19 వినాశనమే వాళ్ళ గమ్యం. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. అవమానమే వాళ్ళ కీర్తి. వాళ్ళ మనస్సులు ఐహికమైన వాటిపై ఉంటాయి. 20 కాని మన నివాసం పరలోకంలో ఉంది. మనల్ని రక్షించటానికి పరలోకము నుండి రానున్న క్రీస్తు ప్రభువు కోసం మనం ఆశతో ఎదురు చూస్తున్నాము.
© 1997 Bible League International