Revised Common Lectionary (Complementary)
ప్రకాశిస్తున్న మోషే ముఖం
29 అప్పుడు మోషే సీనాయి పర్వతం కిందికి వచ్చాడు. దేవుని ఆజ్ఞలు వ్రాయబడ్డ ఆ రెండు రాతి పలకలనూ, అతను పట్టుకొచ్చాడు. మోషే యెహోవాతో మాట్లాడాడు. కనుక అతని ముఖం ప్రకాశిస్తూ ఉండినది. అయితే అది మోషేకు తెలియదు. 30 మోషే ముఖం మెరిసిపోతూ ప్రకాశిస్తూ ఉండటం అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరూ చూశారు. అందుచేత అతని దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు. 31 అయితే మోషే వాళ్లను పిలిచాడు. కనుక అహరోను, ప్రజానాయకులు అందరూ మోషే దగ్గరకు వెళ్లారు. మోషే వాళ్లతో మాట్లాడాడు. 32 ఆ తర్వాత, ఇశ్రాయేలు ప్రజలంతా మోషే దగ్గరకు వచ్చారు. సీనాయి కొండ మీద యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞలను మోషే వారికీ ఇచ్చాడు.
33 మోషే ప్రజలతో మాట్లాడ్డం ముగించగానే తన ముఖం మీద ముసుగు కప్పుకున్నాడు. 34 యెహోవాతో మాట్లాడేందుకు ఆయన ఎదుటికి వెళ్లినప్పుడల్లా మోషే తన ముఖం మీద ముసుగు తీసివేసాడు. తరువాత మోషే బయటకు వచ్చి – యెహోవా ఆజ్ఞాపించిన విషయాలను ఇశ్రాయేలు ప్రజలకు చెప్పేవాడు. 35 మోషే ముఖం ప్రకాశంగా మెరిసిపోతున్నట్టు ప్రజలు చూసేవాళ్లు కనుక మోషే మరల తన ముఖం కప్పుకొనేవాడు. మరల యెహోవాతో మాట్లాడేందుకు వెళ్లేంతవరకు మోషే తన ముఖం పైనుండి ముసుగును తీసే వాడుకాదు.
99 యెహోవాయే రాజు.
కనుక రాజ్యాలు భయంతో వణకాలి.
కెరూబు[a] దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు.
అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది.
2 సీయోనులో యెహోవా గొప్పవాడు.
ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు.
3 ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక.
దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు.
4 శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు.
దేవా, నీతిని నీవు చేశావు.
యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు.
5 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
ఆయన పవిత్ర పాదపీఠాన్ని[b] ఆరాధించండి.
6 మోషే, అహరోను దేవుని యాజకులలో కొందరు,
మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు.
వారు యెహోవాను ప్రార్థించారు.
దేవుడు వారికి జవాబు యిచ్చాడు.
7 ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు.
వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు.
దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు.
8 మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు.
నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు
ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు.
9 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి.
మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.
12 మాకు అంత నిరీక్షణ ఉంది కనుకనే మాలో యింత ధైర్యముంది. 13 తగ్గిపోతున్న తన ప్రకాశాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడరాదని మోషే తన ముఖానికి ముసుగు వేసుకొన్నాడు. మేము మోషేలాంటివాళ్ళము కాదు. 14 వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఈ నాటికీ వాళ్ళు పాత నిబంధన గ్రంథం చదివినప్పుడు వాళ్ళకు ముసుగు కనిపిస్తూవుంటుంది. దాన్ని ఎవ్వరూ తీయలేరు. క్రీస్తు మాత్రమే ఆ ముసుగు తీసివేయగలడు. 15 ఈ నాటికీ మోషే గ్రంథాలు చదివినప్పుడు ఆ ముసుగు వాళ్ళ బుద్ధిని కప్పివేస్తుంది. 16 కాని ప్రభువు వైపుకు మళ్ళినవాళ్ళ “ముసుగు తీసివేయబడింది.”(A) 17 ప్రభువే “ఆత్మ”. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వేఛ్చ ఉంటుంది. 18 ముసుగు తీసివేయబడ్డ మా ముఖాల్లో ప్రభువు మహిమ ప్రకాశిస్తోంది. అది ఆత్మ అయినటువంటి ప్రభువు నుండి వచ్చింది. అనంతమైన ఆ మహిమ మమ్మల్ని ప్రభువులా మారుస్తోంది.
మట్టి కుండలో సంపద
4 దేవుని అనుగ్రహం వల్ల మేము ఈ సేవ చేస్తున్నాము. కనుక ధైర్యం కోల్పోము. 2 నిజానికి అవమానం కలిగించే రహస్య మార్గాలను మేము వదిలివేసాము. మేము మోసాలు చెయ్యము. దైవసందేశాన్ని మార్చము. సత్యాన్ని అందరికీ స్పష్టంగా తెలియచేస్తాము. తద్వారా మేము ఎలాంటివాళ్ళమో మేము దేవుని సమక్షంలో ఏ విధంగా జీవిస్తున్నామో ప్రజలు తెలుసుకున్నారు.
యేసుని రూపాంతరం
(మత్తయి 17:1-8; మార్కు 9:2-8)
28 ఈ విధంగా చెప్పిన ఎనిమిది రోజులకు పేతురు, యోహాను, యాకోబును తన వెంట తీసుకొని ఒక కొండ మీదికి యేసు ప్రార్థించటానికి వెళ్ళాడు. 29 ఆయన ప్రార్థిస్తుండగా ఆయన ముఖతేజస్సు మారింది. ఆయన దుస్తులు తెల్లగా ప్రకాశించటం మొదలు పెట్టాయి. 30 అకస్మాత్తుగా యిద్దరు వ్యక్తులు తేజస్సుతో యేసు ముందు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళు మోషే, ఏలీయాలు. 31 యెరూషలేములో నెరవేర్చబడనున్న దైవేచ్ఛను గురించి, అంటే ఆయన మరణాన్ని గురించి, మాట్లాడారు. 32 పేతురు, అతని వెంటనున్న వాళ్ళు మంచి నిద్రమత్తులో ఉన్నారు. వాళ్ళకు మెలకువ వచ్చింది. వాళ్ళు లేచి యేసు తేజస్సును, ఆయనతో నిలుచొని ఉన్న ఆ యిద్దరి పురుషుల తేజస్సును చూసారు. 33 మోషే, ఏలీయాలు వెళ్తుండగా పేతురు యేసుతో, “ప్రభూ! మనము యిక్కడ ఉండటం మంచిది. మీకొకటి, మోషేకొకటి, ఏలీయా కొకటి మూడు పర్ణశాలలు వేయమంటారా?” అని అడిగాడు. పరిస్థితి అర్థం చేసుకోకుండా అతడు ఈ మాటలు అన్నాడు.
34 పేతురు ఈ మాట అంటుడగానే ఒక మేఘం వచ్చి వాళ్ళను కప్పివేసింది. వాళ్ళను ఆ మేఘం కప్పివేస్తుండగా పేతురుకు, అతనితో ఉన్న వాళ్ళకు భయం వేసింది. 35 ఆ మేఘం నుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఎన్నుకొన్నవాడు. ఆయన చెప్పినట్లు చెయ్యండి” అని వినబడింది.
36 ఆ స్వరం మాట్లాడటం ముగించాక వాళ్ళకు అక్కడ యేసు మాత్రమే కనిపించాడు. చాలా కాలందాకా శిష్యులు తాము చూసిన దాన్ని ఎవ్వరికి చెప్పలేదు.
యేసు ఒక బాలుని దయ్యంనుండి విడిపించటం
(మత్తయి 17:14-18; మార్కు 9:14-27)
37 మరుసటి రోజు వాళ్ళు కొండ దిగగానే పెద్ద ప్రజల గుంపు ఒకటి యేసును చూడటానికి అక్కడ సమావేశమైంది. 38 ఆ గుంపులో నుండి ఒకడు, “అయ్యా! వచ్చి నా కుమారుణ్ణి కటాక్షించుమని వేడు కుంటున్నాను. నాకు ఒక్కడే కుమారుడు. 39 ఒక దయ్యం అతణ్ణి ఆవరిస్తుంది. అది మీదికి రాగానే అతడు బిగ్గరగా కేకలు వేస్తాడు. అది ఆతణ్ణి క్రింద పడవేస్తుంది. అతడు వణుకుతూ నోటినుండి నురుగులు కక్కుతాడు. అది అతణ్ణి వదలటం లేదు. అతణ్ణి పూర్తిగా నాశనం చేస్తొంది. 40 ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని మీ శిష్యుల్ని వేడుకున్నాను. కాని వాళ్ళు ఆ పని చెయ్యలేక పొయ్యారు” అని అన్నాడు.
41 యేసు, “మూర్ఖతరం వారలారా! విశ్వాస హీనులారా! మీతో ఉండి ఎన్ని రోజులు సహించాలి? నీ కుమారుణ్ణి పిలుచుకురా!” అని అన్నాడు.
42 ఆ దయ్యం పట్టినవాడు వస్తూవుంటే అది అతణ్ణి నేల మీద పడవేసింది. యేసు ఆ దయ్యాన్ని వెళ్ళిపొమ్మని గద్దించి ఆ బాలునికి నయం చేశాడు. తదుపరి అతణ్ణి అతని తండ్రికి అప్పగించాడు. 43 దేవుని మహిమ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం
(మత్తయి 17:22-23; మార్కు 9:30-32)
యేసు చేసింది చూసి వాళ్ళు తమ ఆశ్చర్యం నుండి కోలుకోక ముందే యేసు తన శిష్యులతో ఈ విధంగా అన్నాడు:
© 1997 Bible League International