Revised Common Lectionary (Complementary)
జ్ఞాపకార్థ దినం[a] కోసం దావీదు కీర్తన.
38 యెహోవా, నీవు నన్ను విమర్శించేటప్పుడు కోపగించకు.
నీవు నన్ను సరిదిద్దేటప్పుడు కోపగించకుము.
2 యెహోవా, నీవు నన్ను బాధించావు.
నీ బాణాలు లోతుగా నాలో గుచ్చుకొన్నాయి.
3 నీవు నన్ను శిక్షించావు. నా శరీరం అంతా బాధగా ఉంది.
నేను పాపం చేశాను, నీవు నన్ను శిక్షించావు. అందుచేత నా ఎముకలన్నీ బాధగా ఉన్నాయి.
4 నేను చెడు కార్యాలు చేసిన దోషిని,
ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది.
5 నేను తెలివితక్కువగా ఉన్నాను.
ఇప్పుడు నాకు అవి కంపుకొడ్తున్న పుండ్లు అయ్యాయి.
6 నేను దుఃఖించేవానిలా రోజంతా విచారంగా ఉన్నాను.
రోజంతా నేను కృంగిపోయి ఉన్నాను.
7 నా నడుము వేడిగా కాలిపోతోంది.
నా శరీరం అంతా బాధగా ఉంది.
8 నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను.
నేను బాధతో ఉన్నాను గనుక నేను మూలుగుతున్నాను.
9 ప్రభువా, నీవు నా మూలుగు విన్నావు.
నా నిట్టూర్పులు నీకు మరుగు కాలేదు.
10 నా గుండె తడబడుచున్నది. నా బలం పోయింది.
నా చూపు దాదాపు పోయింది.
11 నా రోగం మూలంగా నా స్నేహితులు,
నా పొరుగువారు నన్ను చూసేందుకు రావటం లేదు.
నా కుటుంబం నా దగ్గరకు రాదు.
12 నన్ను చంపగోరేవారు తమ ఉచ్చులను వేసియున్నారు.
నాకు హాని చేయగోరేవారు నా నాశనం గూర్చి మాట్లాడుకొంటున్నారు.
వారు రోజంతా అబద్ధాలు చెప్తున్నారు.
13 అయితే నేను వినబడని చెవిటివానిలా ఉన్నాను.
మాట్లాడలేని మూగవానిలా నేను ఉన్నాను.
14 ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని చెవిటివానిలా నేను ఉన్నాను.
నేను వాదించి, నా శత్రువులదే తప్పు అని రుజువు చేయలేను.
15 కనుక యెహోవా, నీవు నన్ను కాపాడాలని వేచియుంటాను.
నా దేవా, నా ప్రభువా, నా శత్రువులకు సత్యం చెప్పుము.
16 నన్ను చూచి వారిని నవ్వనియ్యవద్దు.
నేను తొట్రుపడినప్పుడు వారిని గర్వపడనియ్యవద్దు.
17 నేను పడిపోయేటట్టు ఉన్నాను.
నేను నా బాధను మరచిపోలేను.
18 యెహోవా, నేను చేసిన చెడు కార్యాలను గూర్చి, నేను నీకు చెప్పాను.
నా పాపాలను గూర్చి నేను విచారిస్తున్నాను.
19 నా శత్రువులు ఇంకా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు,
వారు ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు.
20 నా శత్రువులు నాకు కీడు చేశారు,
నేను వారికి మంచి పనులు మాత్రమే చేశాను.
మంచి పనులు చేయటానికి మాత్రమే నేను ప్రయత్నించాను.
కాని ఆ మనుష్యులు నాకు విరోధం అయ్యారు.
21 యెహోవా, నన్ను విడిచిపెట్టకు.
నా దేవా, నాకు సన్నిహితంగా ఉండు.
22 త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
నా దేవా, నన్ను రక్షించుము.
విభిన్న అకస్మాత్తు పాపాలు
5 “ఒక వ్యక్తి హెచ్చరికను వినవచ్చు, లేక ఒక వ్యక్తి తాను యితరులతో చెప్పాల్సిన ఒక విషయాన్ని వినటమో, చూడటమో తటస్థిస్తుంది. ఆ వ్యక్తి తాను చూసిన దాన్ని లేక విన్నదాన్ని చెప్పకపోతే అతడు అపరాధి.
2 “లేక ఒకవేళ ఏదైనా అపవిత్రమైన దాన్ని ఒక వ్యక్తి తాకవచ్చును. అది అపవిత్ర జంతువు శవం గాని, లేక అపవిత్ర పశు శవంగాని, లేక అపవిత్రమైన ఒక పాకెడు జంతువు శవమేగాని కావచ్చును. వాటిని ముట్టుకొన్నట్టు అతనికి తెలియకపోయినా అతడు మాత్రం అపరాధి అవుతాడు.
3 “ఒక మనిషి నుండి అపవిత్రం అయినవి ఎన్నోవస్తాయి. ఒక వ్యక్తి అవతల వ్యక్తిలోని యిలాంటి అపవిత్రమైన వాటిలో దేనినైనా ముట్టుకోవచ్చు, అది అతనికి తెలియకపోవచ్చు. అపవిత్రమైనది ఏదో తాను ముట్టుకొన్నానని అతనికి తెలిసినప్పుడు అతడు అపరాధి అవుతాడు.
4 “లేక ఒక వ్యక్తి మంచిగాని చెడుగాని ఒకటి చేస్తానని తొందరపడి వాగ్దానం చేయవచ్చు. మనుష్యులు తొందరపడి చాలా వాగ్దానాలు చేస్తూంటారు. ఒకడు అలాంటి వాగ్దానంచేసి, దానిని మరిచిపోయి, మరల ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొన్నప్పుడు అతను దానిని చేయక పోతే అపరాధి అవుతాడు. 5 కనుక వీటిలో దేని విషయంలో అతడు అపరాధియైనా, అతడు చేసిన తప్పు ఏమిటో అతడు చెప్పాలి. 6 అతడు చేసిన పాపానికి పరిహారంగా అపరాధ పరిహారార్థబలిని యెహోవాకు అర్పించాలి. గొర్రెల మందలోనుండి ఒక ఆడ జంతువును పాప పరిహారార్థబలిగా అతడు తీసుకొని రావాలి. అది గొర్రెపిల్ల కావచ్చును, లేక మేక కావచ్చును. అప్పుడు ఆవ్యక్తి పాపాన్ని తుడిచివేసేందుకు చేయాల్సిన వాటిని యాజకుడు చేస్తాడు.
7 “ఆ వ్యక్తి గొర్రెపిల్లను ఇవ్వలేకపోతే అతడు రెండు గువ్వలనుగాని, రెండు పావురాలను గాని తీసుకొని రావాలి. ఇవి అతని అపరాధ పరిహారార్థబలి. ఒకటి పాపపరిహారార్థ బలికోసం, మరొకటి దహన బలికోసం. 8 ఆ వ్యక్తి వాటిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. పాపపరిహారార్థ బలిగా మొదట ఒక దాన్ని యాజకుడు అర్పిస్తాడు. యాజకుడు దాని తలను మెడనుండి వేరు చేస్తాడు. కానీ ఆ పక్షిని రెండు భాగాలుగా మాత్రం యాజకుడు విడదీయడు. 9 పాపపరిహారార్థబలి రక్తాన్ని బలిపీఠం ప్రక్కలో యాజకుడు చిలకరించాలి. తర్వాత మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున యాజకుడు పోయాలి. అది పాపపరిహారార్థ బలి. 10 తర్వాత యాజకుడు చట్టం ప్రకారం దహన బలిగా రెండో పక్షిని అర్పించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి పాపాన్ని తుడిచి వేస్తాడు. మరియు దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు.
11 “ఆ వ్యక్తికి రెండు పావురాలను, రెండు గువ్వలను యిచ్చే సామర్థ్యం లేకపోతే తూమెడు మంచి పిండిలో పదోవంతును అతడు తీసుకొని రావాలి. ఇది అతని పాపపరిహారార్థ బలి అర్పణ. ఆ పిండిమీద అతడు నూనె పోయకూడదు. అది పాపపరిహారార్థ బలి గనుక అతడు దానిమీద సాంబ్రాణి కూడా వేయకూడదు. 12 అతడు ఆ పిండిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. ఆ పిండిలోనుండి యాజకుడు పిడికెడు పిండిని జ్ఞాపకార్థ అర్పణగా తీసుకోవాలి. యెహోవాకు హోమం వేయు బలిపీఠం మీద యాజకుడు ఆ పిండిని దహించాలి. అది పాపపరిహారార్థ బలి. 13 ఈ విధంగా ఆ వ్యక్తి పాపాన్ని యాజకుడు నిర్మూలిస్తాడు. మరియు దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు. ధాన్యార్పణలో వలెనే పాపపరిహారార్థ బలిలో మిగిలినది కూడా యాజకునికి చెందుతుంది.”
పాపము మరియు క్షమాపణ
(మత్తయి 18:6-7, 21-22; మార్కు 9:42)
17 యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “ప్రజలు పాపం చేసే పరిస్థితులు కలుగచేసే వాళ్ళకు శిక్ష తప్పదు. 2 ఈ అమాయకుల్లో ఏ ఒక్కడు పాపం చేసేటట్లు చేసినా శిక్ష తప్పదు. అది జరుగక ముందే అలాంటి వాని మెడకు తిరగటి రాయి కట్టి సముద్రంలో పడవేస్తే అది అతనికి మేలు చేసినట్లవుతుంది. 3 అందువల్ల జాగ్రత్త!
“మీ సోదరుడు పాపం చేస్తే గద్దించండి. పశ్చాత్తాపం చెందితే క్షమించండి. 4 అతడు రోజుకు ఏడుసార్లు మీ పట్ల పాపం చేసి ఏడుసార్లు మీ దగ్గరకు వచ్చి, ‘నేను పశ్చాత్తాపం చెందాను’ అని అంటే అతణ్ణి క్షమించండి.”
© 1997 Bible League International