Revised Common Lectionary (Complementary)
3 యోసేపు తన సోదరులతో “మీ సోదరుడు యోసేపును నేనే, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా?” అన్నాడు. కాని ఆ సోదరుల నోట మాట రాలేదు. వారు భయంతో కలవరపడిపోయారు.
4 కనుక యోసేపు మళ్లీ తన సోదరులతో, “నా దగ్గరకు రండి. ఇలా నా దగ్గరకు రమ్మని బ్రతిమాలుతున్నాను, రండి” అన్నాడు. కనుక ఆ సోదరులంతా యోసేపుకు దగ్గరగా వెళ్లారు. యోసేపు వాళ్లతో చెప్పాడు, “నేనే మీ సోదరుణ్ణి, యోసేపును. ఈజిప్టుకు బానిసగా మీరు అమ్మిన వాడిని నేనే. 5 ఇప్పుడేమీ బాధపడకండి. మీరు చేసినదాన్నిబట్టి మీ మీద మీరు కోపం తెచ్చుకోవద్దు. నేను ఇక్కడికి రావటం దేవుని ఏర్పాటు. మీ ప్రాణం కాపాడేందుకు నేను ఇక్కడికి వచ్చాను. 6 భయంకరమైన ఈ కరవు కాలం ఇప్పటికే రెండు సంవత్సరాలనుండి ఉంది. నాట్లు వేయకుండా, కోతలు కోయకుండా ఇంకా అయిదు సంవత్సరాలు గడచిపోవాలి. 7 కనుక మీ వాళ్లందరినీ ఈ దేశంలో నేను రక్షించాలని దేవుడే నన్ను మీకంటె ముందుగా ఇక్కడికి పంపించాడు. 8 నేను యిక్కడికి పంపబడటం మీ తప్పుకాదు. అదంతా దేవుని సంకల్పం. దేవుడు నన్ను ఫరోకు తండ్రిలా చేశాడు. ఆయన దివాణం అంతటిమీదను, మొత్తం ఈజిప్టు అంతటికిని నేను పాలకుడ్ని.”
ఇశ్రాయేలుకు ఈజిప్టు వచ్చుటకు ఆహ్వానం
9 “కనుక మీరు త్వరగా నా తండ్రి దగ్గరకు వెళ్లండి. ఆయన కుమారుడు యోసేపు పంపిన సందేశం ఇది అని నా తండ్రితో చెప్పండి అన్నాడు యోసేపు. ‘దేవుడు నన్ను ఈజిప్టు అంతటి మీద అధికారినిగా చేశాడు. ఇక్కడికి నా దగ్గరకు వచ్చేయండి. ఇంకా వేచి ఉండవద్దు. ఇప్పుడే వచ్చేయండి. 10 గోషెను దేశంలో నా దగ్గర మీరు నివసిస్తారు. మీరు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, మీ జంతువులు, మీ మందలు ఇక్కడికి రావాలని ఆహ్వానిస్తున్నాను. 11 వచ్చే అయిదు కరువు సంవత్సరాల కాలంలోనూ నేను మిమ్మల్ని చూచుకొంటాను. అందుచేత మీరూ, మీ కుటుంబాలు, మీ స్వంతది ఏదీ నష్టపోదు.’”
15 తర్వాత యోసేపు తన సోదరులందరినీ ముద్దు పెట్టుకొని, వారి మీదపడి ఏడ్చాడు. ఆ తర్వాత ఆ సోదరులు అతనితో మాట్లాడటం మొదలు బెట్టారు.
దావీదు కీర్తన.
37 దుర్మార్గుల పట్ల కోపగించకుము
చెడు పనులు చేసేవారి పట్ల అసూయచెందకు.
2 గడ్డి, పచ్చటి మొక్కలు త్వరలోనే వాడిపోయి చస్తాయి.
దుర్మార్గులు సరిగ్గా అలానే ఉంటారు.
3 నీవు యెహోవాయందు నమ్మకం ఉంచి, మంచి పనులు చేస్తే
నీవు బ్రతికి, దేశం ఇచ్చే అనేక వస్తువులను అనుభవిస్తావు.
4 యెహోవాను సేవించటంలో ఆనందించుము.
ఆయన నీకు కావల్సినవాటిని యిస్తాడు.
5 యెహోవా మీద ఆధారపడుము. ఆయనను నమ్ముకొనుము.
జరగాల్సినదాన్ని ఆయన జరిగిస్తాడు.
6 నీ మంచితనం, న్యాయం
మధ్యాహ్నపు సూర్యునిలా ప్రకాశింపనిమ్ము.
7 యెహోవాను నమ్ముకొనుము. ఆయన సహాయం కోసం కనిపెట్టుము.
చెడ్డవాళ్లు జయించినప్పుడు కలవరపడకుము.
చెడ్డవాళ్లు చెడు తలంపులు తలంచి, వారి తలంపులు జయించినప్పుడు కలవరపడకుము.
8 కోపగించవద్దు, ఆవేశపడవద్దు, నీవు కూడ కీడు చెయ్యాలి అనిపించేటంతగా తొందరపడిపోకుము.
9 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు.
కాని సహాయం కోసం యెహోవాను వేడుకొనే వారికి దేశం సొంతమవుతుంది.
10 కొద్ది కాలానికి ఇక దుర్మార్గులు ఉండరు.
అలాంటి మనుష్యుల కోసం నీవు చూడవచ్చు. కాని వాళ్లు కనబడరు.
11 దీనులు భూమిని జయిస్తారు,
వాళ్లు శాంతిని అనుభవిస్తారు.
39 నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు.
నీతిమంతులకు కష్టాలు వచ్చినప్పుడు యెహోవా వారికి బలంగా ఉంటాడు.
40 నీతిమంతులకు యెహోవా సహాయం చేస్తాడు. వారిని రక్షిస్తాడు.
నీతిమంతులు సహాయంకోసం యెహోవా దగ్గరకు వస్తారు, మరియు యెహోవా దుర్మార్గుల నుండి వారిని రక్షిస్తాడు.
బ్రతికి వచ్చిన దేహం
35 కొందరు, “చనిపోయినవాళ్ళు ఏ విధంగా బ్రతికింపబడతారు? వాళ్ళు ఎలాంటి దేహంతో వస్తారు?” అని అడగవచ్చు. 36 ఎంతటి మూర్ఖులు! నీవు భూమిలో నాటిన విత్తనం చనిపోకపోతే అది మొలకెత్తదు. 37 నీవు ఒక చిన్న విత్తనాన్ని, ఉదాహరణకు ఒక గోధుమ విత్తనాన్ని నాటుతావు, కాని పెరగబోయే మొలకను నాటవు. 38 దేవుడు తాను అనుకొన్న విధంగా ప్రతీ విత్తనానికి దానికి తగిన దేహాన్ని యిస్తాడు.
42 చనిపోయినవాళ్ళు బ్రతికి రావటం కూడా అదే విధంగా ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి, నశించని శరీరాన్ని పొందుతారు. 43 గౌరవం లేని శరీరంగా నాటబడి, మహిమగల శరీరంగా లేపబడుతుంది. బలహీనమైన శరీరంగా నాటబడి, శక్తిగల శరీరముగా లేస్తుంది. 44 భౌతికమైన శరీరాన్ని నాటి, ఆత్మీయమైన శరీరాన్ని పుట్టిస్తాడు.
భౌతికమైన శరీరం ఉంది అంటే, ఆత్మీయ శరీరం కూడా ఉంటుంది. 45 ఈ విధంగా వ్రాయబడింది: “ప్రథమ పురుషుడైన ఆదాము జీవించే నరుడయ్యాడు, చివరి ఆదాము జీవాన్ని ఇచ్చే ఆత్మ అయ్యాడు.” 46 ముందు ఆత్మీయత రాలేదు. ముందు భౌతిక శరీరం వచ్చింది. ఆ తర్వాత ఆత్మీయత వచ్చింది. 47 మొదటి పురుషుడు భూమ్మీద ఉన్న మట్టితో సృష్టింపబడ్డాడు. రెండవ మనుష్యుడు పరలోకంనుండి దిగివచ్చాడు. 48 భూమ్మీద ఉన్నవాళ్ళు మట్టితో సృష్టింపబడినవానివలే ఉన్నారు. పరలోకానికి సంబంధించినవాళ్ళు పరలోకంనుండి వచ్చినవానివలె ఉన్నారు. 49 మట్టితో సృష్టింపబడినవాని పోలికలతో మనము జన్మించినట్లే, పరలోకం నుండి వచ్చినవాని పోలికలను కూడా మనము పొందుతాము.
50 సోదరులారా! నేను చెప్పేదేమిటంటే, రక్త మాంసాలతో ఉన్నవాళ్ళు దేవుని రాజ్యం పొందలేరు. నశించిపోయేది అమరత్వం పొందదు.
శత్రువులను ప్రేమించు
(మత్తయి 5:38-48; 7:12)
27 “కాని, నా మాటలు వినే వాళ్ళకు యిది నేను చెబుతున్నాను: మీ శత్రువుల్ని ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళకు మంచి చెయ్యండి. 28 మిమ్మల్ని దూషించే వాళ్ళను దీవించండి. మీకు కీడు చేసిన వాళ్ళకు మంచి కలగాలని ప్రార్థించండి. 29 ఒక చెంప మీద కొట్టిన వానికి రెండవ చెంప కూడా చూపండి. నీ పైకండువాను తీసికొనే వానిని నీ చొక్కాను కూడ తీసికోనివ్వు. 30 అడిగిన వాళ్ళకు యివ్వండి. మీ వస్తువుల్ని ఎవరైనా తీసుకుంటే వాటిని తిరిగి అడక్కండి. 31 ఇతర్లు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాలని మీరు ఆశిస్తారో అదేవిధంగా మీరు యితర్ల పట్ల ప్రవర్తించండి.
32 “మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను ప్రేమిస్తే అందులో గొప్పేముంది? పాపులు కూడా తమను ప్రేమించిన వాళ్ళను ప్రేమిస్తారు. 33 మీకు మంచి చేసిన వాళ్ళకు మీరు మంచి చేస్తే అందులో గొప్పేముంది? పాపులుకూడా అదే విధంగా చేస్తారు. 34 అప్పు తిరిగి చెల్లిస్తారని ఆశించి అప్పిస్తే అందులో గొప్పేముంది? తమ అప్పు పూర్తిగా చెల్లిస్తారని పాపులు కూడా తమలో తాము యిచ్చి పుచ్చుకుంటారు.
35 “మీ శత్రువుల్ని ప్రేమించండి. వాళ్ళకు మంచి చెయ్యండి. తిరిగి చెల్లిస్తారని ఆశించకుండా అప్పివ్వండి. విశ్వాస ఘాతుకుల మీద, దుర్మార్గుల మీద కూడా దేవుడు దయ చూపుతాడు. మీరు నేను చెప్పినట్లు చేస్తే సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా పరిగణిస్తాడు. మీకు గొప్ప బహుమతి లభిస్తుంది. 36 మీ తండ్రివలె మీరు కూడా దయ, ప్రేమ చూపుతూ జీవించండి.
ఇతరులను విమర్షించటంలో జాగ్రతపడుము
(మత్తయి 7:1-5)
37 “ఇతర్లపై తీర్పు చెప్పకండి. అప్పుడు ఇతర్లు మీపై తీర్పు చెప్పరు. ఇతర్లను నిందించకండి. అప్పుడు యితర్లు మిమ్మల్ని నిందించరు. ఇతరులను క్షమించండి. అప్పుడు యితర్లు మిమ్మల్ని క్షమిస్తారు. 38 ఇతర్లకు యివ్వండి, మీకివ్వబడుతుంది. అప్పుడు మీకు కొలతలు నింపి, అదిమి, కుదిల్చి ఒలికిపోతుండగా మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో యిస్తే ఆ కొలతతో మీకు లభిస్తుంది.”
© 1997 Bible League International