Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
37 దుర్మార్గుల పట్ల కోపగించకుము
చెడు పనులు చేసేవారి పట్ల అసూయచెందకు.
2 గడ్డి, పచ్చటి మొక్కలు త్వరలోనే వాడిపోయి చస్తాయి.
దుర్మార్గులు సరిగ్గా అలానే ఉంటారు.
3 నీవు యెహోవాయందు నమ్మకం ఉంచి, మంచి పనులు చేస్తే
నీవు బ్రతికి, దేశం ఇచ్చే అనేక వస్తువులను అనుభవిస్తావు.
4 యెహోవాను సేవించటంలో ఆనందించుము.
ఆయన నీకు కావల్సినవాటిని యిస్తాడు.
5 యెహోవా మీద ఆధారపడుము. ఆయనను నమ్ముకొనుము.
జరగాల్సినదాన్ని ఆయన జరిగిస్తాడు.
6 నీ మంచితనం, న్యాయం
మధ్యాహ్నపు సూర్యునిలా ప్రకాశింపనిమ్ము.
7 యెహోవాను నమ్ముకొనుము. ఆయన సహాయం కోసం కనిపెట్టుము.
చెడ్డవాళ్లు జయించినప్పుడు కలవరపడకుము.
చెడ్డవాళ్లు చెడు తలంపులు తలంచి, వారి తలంపులు జయించినప్పుడు కలవరపడకుము.
8 కోపగించవద్దు, ఆవేశపడవద్దు, నీవు కూడ కీడు చెయ్యాలి అనిపించేటంతగా తొందరపడిపోకుము.
9 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు.
కాని సహాయం కోసం యెహోవాను వేడుకొనే వారికి దేశం సొంతమవుతుంది.
10 కొద్ది కాలానికి ఇక దుర్మార్గులు ఉండరు.
అలాంటి మనుష్యుల కోసం నీవు చూడవచ్చు. కాని వాళ్లు కనబడరు.
11 దీనులు భూమిని జయిస్తారు,
వాళ్లు శాంతిని అనుభవిస్తారు.
39 నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు.
నీతిమంతులకు కష్టాలు వచ్చినప్పుడు యెహోవా వారికి బలంగా ఉంటాడు.
40 నీతిమంతులకు యెహోవా సహాయం చేస్తాడు. వారిని రక్షిస్తాడు.
నీతిమంతులు సహాయంకోసం యెహోవా దగ్గరకు వస్తారు, మరియు యెహోవా దుర్మార్గుల నుండి వారిని రక్షిస్తాడు.
బెన్యామీను కోసం యూదా బ్రతిమలాడుట
18 అప్పుడు యోసేపు దగ్గరకు యూదా వెళ్లి ఇలా చెప్పాడు: “అయ్యా, దయచేసి తమరితో నన్ను తేటగా చెప్పనివ్వండి. దయచేసి నాపై కోపగించకండి. మీరు ఫరో అంతటి వారని నాకు తెలుసు. 19 క్రితంసారి మేము ఇక్కడ ఉన్నప్పుడు, ‘మీకు తండ్రిగాని, సోదరుడు గాని ఉన్నాడా?’ అని తమరు అడిగారు. 20 దానికి మేము, ‘మాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ముసలివాడు. మాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు, వాడు మా తండ్రికి ముసలితనంలో పుట్టాడు, అందుచేత మా తండ్రికి వాడంటే చాలా ప్రేమ. పైగా ఆ చిన్న కుమారుని అన్న చనిపోయాడు. అందుచేత ఆ తల్లికి పుట్టిన కుమారులలో మిగిలినవాడు ఇతడు ఒక్కడే. మా తండ్రికి ఇతనంటే ఎంతో ప్రేమ’ అని జవాబు చెప్పాం. 21 అప్పుడు ‘ఆ సోదరుని నా దగ్గరకు తీసుకొని రండి, నేను అతడ్ని చూడాలి’ అన్నారు తమరు. 22 దానికి మేము ‘ఆ చిన్నవాడు రావటానికి వీల్లేదు. అతడ్ని అతని తండ్రి విడిచిపెట్టలేడు. అతని తండ్రి అతణ్ణి గనుక పోగొట్టుకొంటే, ఆయన దుఃఖంతో మరణిస్తాడు’ అని తమరితో చెప్పాం. 23 కానీ తమరేమో ‘మీరు మీ చిన్న తమ్ముడ్ని తప్పక తీసుకొని రావాల్సిందే, లేకపోతే మీకు ధాన్యం అమ్మేది లేదు’ అన్నారు మాతో. 24 కనుక మేము తిరిగి మా తండ్రి దగ్గరకు వెళ్లి, మీరు మాతో చెప్పినది ఆయనకు చెప్పాం.
25 “తర్వాత మా తండ్రి ‘మీరు మళ్లీ వెళ్లి మనకోసం ధాన్యం కొనండి’ అన్నాడు. 26 మేము మా తండ్రితో ‘మా చిన్న తమ్ముడు లేకుండా మేము వెళ్లలేం. మా చిన్న తమ్ముడ్ని చూచేంత వరకు మళ్లీ మాకు ధాన్యం అమ్మనని ఆ పాలకుడు అన్నాడు’ అని చెప్పాం. 27 అప్పుడు మా తండ్రి మాతో, ‘నా భార్య రాహేలు ఇద్దరు కుమారుల్ని నాకు కన్నది. 28 ఒక కుమారుడ్ని నేను బయటకు వెళ్లనిస్తే, అతణ్ణి అడవి మృగం చంపేసింది. అప్పట్నుండి నేను అతణ్ణి చూడలేదు. 29 రెండో కుమారునిగూడా మీరు నా దగ్గర్నుండి తీసుకొని పోతే, అతనికి ఏమైనా సంభవిస్తే ఆ దుఃఖంతో నేను మరణించాల్సిందే!’ అన్నాడు. 30 కనుక ఇప్పుడు మేము మా చిన్నసోదరుడు మాతో లేకుండా ఇంటికి వెళ్తే, ఏమి జరుగుతుందో ఊహించండి. మా తండ్రి జీవితంలో ఈ కుర్రవాడు చాలా ముఖ్యం. 31 ఈ కుర్రవాడు మాతో లేకపోవటం గమనిస్తే, మా తండ్రి చనిపోతాడు. ఆ తప్పు మాదే అవుతుంది. మహాగొప్ప దుఃఖంతో మా తండ్రి చనిపోయేటట్లు చేసిన వాళ్లమవుతాం.
32 “ఈ పిల్లవాని విషయం నేను బాధ్యత తీసుకొన్నాను. ‘ఇతణ్ణి మళ్లీ నీ దగ్గరకు తీసుకొని రాకపోతే నా జీవితకాలమంతా నన్ను నీవు నిందించమని’ నా తండ్రితో నేను చెప్పాను. 33 కనుక ఇప్పుడు నేను మీకు మనవి చేసేది, మిమ్మల్ని బ్రతిమాలాడేది ఏమిటంటే, దయచేసి ఈ పిల్లవాణ్ణి తన సోదరులతో వెళ్లనివ్వండి. నేను ఇక్కడే ఉండి, మీకు బానిసను అవుతాను. 34 ఈ పిల్లవాడు నాతో లేకపోతే, నేను తిరిగి నా తండ్రి దగ్గరకు వెళ్లలేను. నా తండ్రికి ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది.”
నీ సమస్యలను తీర్చుకొనుము
(మత్తయి 5:25-26)
57 “ఏది న్యాయమో స్వయంగా మీరే నిర్ణయించండి. 58 మీ ప్రతి వాదితో కలిసి న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళటానికి ముందు దారి మీద ఉన్నప్పుడే అతనితో రాజీ పడటానికి గట్టిగా ప్రయత్నించండి. అలా చెయ్యకపోతే అతడు మిమ్మల్ని న్యాయధిపతి ముందుకు లాగవచ్చు. ఆ న్యాయాధిపతి మిమ్మల్ని భటులకు అప్పగించవచ్చు. ఆ భటులు మిమ్మల్ని కారాగారంలో వేయవచ్చు. 59 నేను చెప్పేది వినండి. మీ దగ్గర ఉన్న చివరి పైసా చెల్లించే దాకా మీరు బయటపడరు.”
© 1997 Bible League International