Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
37 దుర్మార్గుల పట్ల కోపగించకుము
చెడు పనులు చేసేవారి పట్ల అసూయచెందకు.
2 గడ్డి, పచ్చటి మొక్కలు త్వరలోనే వాడిపోయి చస్తాయి.
దుర్మార్గులు సరిగ్గా అలానే ఉంటారు.
3 నీవు యెహోవాయందు నమ్మకం ఉంచి, మంచి పనులు చేస్తే
నీవు బ్రతికి, దేశం ఇచ్చే అనేక వస్తువులను అనుభవిస్తావు.
4 యెహోవాను సేవించటంలో ఆనందించుము.
ఆయన నీకు కావల్సినవాటిని యిస్తాడు.
5 యెహోవా మీద ఆధారపడుము. ఆయనను నమ్ముకొనుము.
జరగాల్సినదాన్ని ఆయన జరిగిస్తాడు.
6 నీ మంచితనం, న్యాయం
మధ్యాహ్నపు సూర్యునిలా ప్రకాశింపనిమ్ము.
7 యెహోవాను నమ్ముకొనుము. ఆయన సహాయం కోసం కనిపెట్టుము.
చెడ్డవాళ్లు జయించినప్పుడు కలవరపడకుము.
చెడ్డవాళ్లు చెడు తలంపులు తలంచి, వారి తలంపులు జయించినప్పుడు కలవరపడకుము.
8 కోపగించవద్దు, ఆవేశపడవద్దు, నీవు కూడ కీడు చెయ్యాలి అనిపించేటంతగా తొందరపడిపోకుము.
9 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు.
కాని సహాయం కోసం యెహోవాను వేడుకొనే వారికి దేశం సొంతమవుతుంది.
10 కొద్ది కాలానికి ఇక దుర్మార్గులు ఉండరు.
అలాంటి మనుష్యుల కోసం నీవు చూడవచ్చు. కాని వాళ్లు కనబడరు.
11 దీనులు భూమిని జయిస్తారు,
వాళ్లు శాంతిని అనుభవిస్తారు.
39 నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు.
నీతిమంతులకు కష్టాలు వచ్చినప్పుడు యెహోవా వారికి బలంగా ఉంటాడు.
40 నీతిమంతులకు యెహోవా సహాయం చేస్తాడు. వారిని రక్షిస్తాడు.
నీతిమంతులు సహాయంకోసం యెహోవా దగ్గరకు వస్తారు, మరియు యెహోవా దుర్మార్గుల నుండి వారిని రక్షిస్తాడు.
యోసేపు పరీక్షించుట
44 అప్పుడు యోసేపు తన సేవకునికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు: “ఈ మనుష్యులు మోసుకొని పోగలిగినంత ధాన్యం వారి సంచుల్లో నింపు. ప్రతి ఒక్కరి సొమ్మును తిరిగి వారి వారి ధాన్యపు సంచుల్లో పెట్టు. 2 అందరిలో చిన్న తమ్ముని సంచిలో డబ్బు పెట్టు. అయితే నా ప్రత్యేకమైన వెండి పాత్రనుకూడ అతని సంచిలో పెట్టు.” ఆ సేవకుడు యోసేపు చెప్పినట్లు చేశాడు.
3 మర్నాటి ఉదయాన్నే ఆ సోదరులు వారి గాడిదలతోబాటు వారి దేశం పంపించబడ్డారు. 4 వారు పట్టణం విడిచిన తర్వాత యోసేపు తన సేవకునితో చెప్పాడు: “నీవు వెళ్లి ఆ మనుష్యుల్ని వెంబడించు. వాళ్లను ఆపుజేసి మేము మీతో మంచిగా ఉన్నాం. అయినా మీరెందుకు మాతో చెడ్డగా ప్రవర్తిస్తున్నారు? మా యజమాని వెండి పాత్రను మీరెందుకు దొంగిలించారు? 5 ఇది నా యజమాని యోసేపు పానం చేసే పాత్ర. రహస్య విషయాలను తెలుసుకొనేందుకు ఆయన ఉపయోగించే పాత్ర ఇది. ఆయన పాత్రను దొంగిలించి మీరు తప్పు చేశారు అని వాళ్లతో చెప్పు.”
6 అందుచేత ఆ సేవకుడు విధేయుడయ్యాడు. అతడు సవారి చేసి ఆ సోదరులను ఆపుజేసాడు. అతడు చెప్పాల్సిందిగా యోసేపు అతనికి చెప్పిన విషయాలు ఆ సేవకుడు వారితో చెప్పాడు.
7 అయితే ఆ సోదరులు ఆ సేవకునితో ఇలా అన్నారు: “ఆ పాలకుడు యిలా ఎందుకు అన్నాడు? అలాంటిదేమీ మేము చేయము. 8 ఇంతకు ముందు మా సంచుల్లో మాకు దొరికిన డబ్బు మేము తెచ్చి ఇచ్చాం. అందుచేత మీ యజమాని ఇంటినుండి వెండి బంగారం ఏవీ మేము నిజంగా దొంగిలించం. 9 మాలో ఎవరి సంచిలోనైనా సరె ఆ వెండి పాత్ర నీకు కనబడితే, వాడు చావాల్సిందే. అతణ్ణి నీవు చంపేయి, మేము మీకు బానిసలమవుతాం.”
10 “మీరు చెప్పినట్లే చేద్దాం. కాని నేను మాత్రం ఎవర్నీ చంపను. వెండి పాత్ర గనుక నాకు కనబడితే ఆ మనిషి మాత్రం నాకు బానిస అవుతాడు. మిగిలిన వాళ్లు స్వేచ్ఛగా వెళ్లొచ్చు” అన్నాడు ఆ సేవకుడు.
బెన్యామీను పట్టుబడుట
11 అప్పుడు ప్రతి ఒక్క సోదరుడూ తన సంచిని నేలమీద పెట్టి తెరిచాడు. 12 సేవకుడు సంచుల్లో చూశాడు. అతడు పెద్దవానితో మొదలు పెట్టి చిన్నవానితో ముగించాడు. బెన్యామీను సంచిలో ఆ పాత్ర అతనికి కనబడింది. 13 సోదరులకు దుఃఖం వచ్చేసింది. దుఃఖంతో వాళ్లు వారి వస్త్రాలు చింపేసుకొన్నారు. వారు వారి సంచుల్ని మళ్లీ గాడిదలమీద పెట్టి తిరిగి ఆ పట్టణం వెళ్లారు.
14 యూదా, అతని సోదరులు యోసేపు ఇంటికి వెళ్లారు. యోసేపు ఇంకా అక్కడే ఉన్నాడు. ఆ సోదరులంతా నేలమీద సాష్టాంగపడ్డారు. 15 యోసేపు “మీరెందుకు ఇలా చేశారు? రహస్యాలు తెలుసుకొనే ఒక ప్రత్యేక పద్ధతి నా దగ్గర ఉందని మీకు తెలియదా? ఈ పని నాకంటె బాగా ఇంకెవ్వరూ చేయలేరు” అన్నాడు.
16 యూదా, “అయ్యా, మేము ఇంకేమీ చెప్పలేం. వివరించే దారి యింకొకటి లేదు. మేము నేరస్థులం కాదని చూపించే విధం ఇంకొకటి లేదు. మేము చేసిన మరో పని మూలంగా దేవుడు మమ్మల్ని నేరస్థులుగా తీర్పు తీర్చాడు. కనుక మేము అందరం చివరకు బెన్యామీనుతో కూడ బానిసలమవుతాం” అన్నాడు.
17 కానీ యోసేపు, “నేను మిమ్మల్ని అందరినీ బానిసలుగా చేయను. పాత్రను దొంగిలించిన మనిషి ఒక్కడే నాకు బానిస అవుతాడు. మిగిలిన మీరు సమాధానంగా మీ తండ్రి దగ్గరకు వెళ్లవచ్చు” అన్నాడు.
12 బిడ్డలారా! ఆయన పేరిట మీ పాపాలు క్షమించబడ్డాయి.
అందుకే మీకు వ్రాస్తున్నాను!
13 వృద్ధులారా! మొదటినుండి ఉన్నవాడెవరో మీకు తెలుసు!
అందుకే మీకు వ్రాస్తున్నాను!
యువకులారా! మీరు సాతాన్ను గెలిచారు.
అందుకే మీకు వ్రాస్తున్నాను!
14 బిడ్డలారా! తండ్రిని మీరెరుగుదురు.
అందుకే మీకు వ్రాస్తున్నాను.
వృద్ధులారా! మొదటినుండి ఉన్నవాణ్ణి మీరెరుగుదురు.
అందుకే మీకు వ్రాస్తున్నాను!
యువకులారా! మీలో బలం ఉంది.
దేవుని సందేశం మీలో జీవిస్తోంది.
మీరు సాతానును గెలిచారు.
అందుకే మీకు వ్రాస్తున్నాను.
15 ప్రపంచాన్ని కాని, ప్రపంచంలో ఉన్నవాటిని కాని ప్రేమించకండి. అంటే, ప్రపంచాన్ని ప్రేమించే వ్యక్తిలో తండ్రి ప్రేమ ఉండదన్నమాట. 16 శారీరక వాంఛలు, కళ్ళలోని దురాశలు, ఒకడు చేసేదాన్ని బట్టి, కలిగియున్న దాన్ని బట్టి కలిగే గర్వం తండ్రికి సంబంధించినవి కావు. ఇవి ప్రపంచానికి సంబంధించినవి. 17 ఈ ప్రపంచము, దానిలో ఉన్న ఆశలు నశించిపోతాయి. కాని దైవేచ్ఛానుసారం జీవించే వ్యక్తి శాశ్వతంగా జీవిస్తాడు.
© 1997 Bible League International