Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 37:1-11

దావీదు కీర్తన.

37 దుర్మార్గుల పట్ల కోపగించకుము
    చెడు పనులు చేసేవారి పట్ల అసూయచెందకు.
గడ్డి, పచ్చటి మొక్కలు త్వరలోనే వాడిపోయి చస్తాయి.
    దుర్మార్గులు సరిగ్గా అలానే ఉంటారు.
నీవు యెహోవాయందు నమ్మకం ఉంచి, మంచి పనులు చేస్తే
    నీవు బ్రతికి, దేశం ఇచ్చే అనేక వస్తువులను అనుభవిస్తావు.
యెహోవాను సేవించటంలో ఆనందించుము.
    ఆయన నీకు కావల్సినవాటిని యిస్తాడు.
యెహోవా మీద ఆధారపడుము. ఆయనను నమ్ముకొనుము.
    జరగాల్సినదాన్ని ఆయన జరిగిస్తాడు.
నీ మంచితనం, న్యాయం
    మధ్యాహ్నపు సూర్యునిలా ప్రకాశింపనిమ్ము.
యెహోవాను నమ్ముకొనుము. ఆయన సహాయం కోసం కనిపెట్టుము.
    చెడ్డవాళ్లు జయించినప్పుడు కలవరపడకుము.
    చెడ్డవాళ్లు చెడు తలంపులు తలంచి, వారి తలంపులు జయించినప్పుడు కలవరపడకుము.
కోపగించవద్దు, ఆవేశపడవద్దు, నీవు కూడ కీడు చెయ్యాలి అనిపించేటంతగా తొందరపడిపోకుము.
ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు.
    కాని సహాయం కోసం యెహోవాను వేడుకొనే వారికి దేశం సొంతమవుతుంది.
10 కొద్ది కాలానికి ఇక దుర్మార్గులు ఉండరు.
    అలాంటి మనుష్యుల కోసం నీవు చూడవచ్చు. కాని వాళ్లు కనబడరు.
11 దీనులు భూమిని జయిస్తారు,
    వాళ్లు శాంతిని అనుభవిస్తారు.

కీర్తనలు. 37:39-40

39 నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు.
    నీతిమంతులకు కష్టాలు వచ్చినప్పుడు యెహోవా వారికి బలంగా ఉంటాడు.
40 నీతిమంతులకు యెహోవా సహాయం చేస్తాడు. వారిని రక్షిస్తాడు.
    నీతిమంతులు సహాయంకోసం యెహోవా దగ్గరకు వస్తారు, మరియు యెహోవా దుర్మార్గుల నుండి వారిని రక్షిస్తాడు.

ఆదికాండము 43:16-34

యోసేపు ఇంటియందు సోదరులు

16 ఈజిప్టులో, వారితోబాటు బెన్యామీను ఉండటం యోసేపు చూశాడు. యోసేపు, “ఆ మనుష్యుల్ని నా ఇంటికి తీసుకొని రండి. ఒక పశువును చంపి వంట చేయండి. ఈవేళ మధ్యాహ్నం వాళ్లు నాతోనే భోజనం చేస్తారు” అని తన గృహనిర్వాహకునితో చెప్పాడు. 17 అతను చెప్పినట్లే ఆ సేవకుడు చేశాడు. అతడు వాళ్లను యోసేపు ఇంటికి తీసుకొని వచ్చాడు.

18 వాళ్లు యోసేపు ఇంటికి తీసుకొని రాబడినప్పుడు ఆ సోదరులు భయపడ్డారు. “పోయినసారి మన సంచుల్లో డబ్బు ఉంచబడినందువల్లనే మనల్ని ఇక్కడకు తీసుకు వచ్చారు. మనల్ని నేరస్తులుగా నిరూపించటానికి దాన్ని వారు వినియోగిస్తారు. తర్వాత మన గాడిదల్ని దొంగిలించి, మనల్ని బానిసలుగా చేస్తారు” అని వారనుకొన్నారు.

19 కనుక యోసేపు ఇంటికి బాధ్యుడైనవాని దగ్గరకు ఆ సోదరులు వెళ్లారు. 20 వారు చెప్పారు: “అయ్యా, ప్రమాణం చేసి సత్యం చెబుతున్నాం. పోయినసారి మేము వచ్చినప్పుడు ఆహారం కొనుగోలు చేసేందుకే మేము వచ్చాం. 21-22 ఇంటికి వెళ్తూ మార్గంలో మేము మా సంచులు విప్పితే, మా ప్రతి ఒక్కరి సంచిలోనూ డబ్బు కనబడింది. ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చిందో మాకు తెలియదు. అయితే ఆ డబ్బు మళ్లీ మీకు ఇచ్చేయాలని ఇప్పుడు మాతో తెచ్చాం. పైగా ఇప్పుడు మేము కొనాలనుకొంటున్న ధాన్యంకోసం ఇంకా ఎక్కువ మొత్తంకూడ మళ్లీ ఇప్పుడు తెచ్చాం.”

23 అయితే ఆ సేవకుడు, “భయపడకండి, నన్ను నమ్మండి. మీ దేవుడు, మీ తండ్రి దేవుడు ఆ డబ్బును మీ సంచుల్లో కానుకగా పెట్టి ఉంటాడు. పోయినసారి ధాన్యంకోసం డబ్బును మీరు నాకే చెల్లించినట్లు నాకు గుర్తు” అని వారితో చెప్పాడు.

ఆ సేవకుడు షిమ్యోనును చెరసాలలోనుంచి బయటకు తీసుకొని వచ్చాడు. 24 ఆ సేవకుడు వాళ్లందరిని యోసేపు ఇంటికి తీసుకొని వెళ్లాడు. అతడు వారికి నీళ్లు ఇస్తే, వాళ్లు కాళ్లు కడుక్కొన్నారు. తర్వాత అతడు వారి గాడిదలకు మేత పెట్టాడు.

25 ఆ సోదరులు తాము యోసేపుతోబాటు భోంచేయబోతున్నట్లు విన్నారు. కనుక వారు అతనికోసం తెచ్చిన కానుకల్ని మధ్యాహ్నంవరకు సిద్ధం చేసుకొన్నారు.

26 యోసేపు ఇంటికి వచ్చాడు, ఆ సోదరులు వారితో తెచ్చిన కానుకలు అతనికి ఇచ్చారు. తర్వాత వారు నేలమీద సాష్టాంగపడ్డారు.

27 వారెలా ఉన్నారని యోసేపు వాళ్లను అడిగాడు, “మీరు నాతో చెప్పిన మీ ముసలి తండ్రి క్షేమంగా ఉన్నాడా? ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడా?” అన్నాడు యోసేపు.

28 ఆ సోదరులు, “అయ్యా, మా తండ్రి బాగున్నాడు. ఆయన ఇంకా బ్రతికి ఉన్నాడు” అని జవాబిచ్చారు. మళ్లీ వాళ్లంతా యోసేపు ముందర సాష్టాంగపడ్డారు.

29 అప్పుడు యోసేపు తన సోదరుడు బెన్యామీనును చూశాడు, (బెన్యామీను, యోసేపు ఒక్క తల్లి పిల్లలు). “మీరు నాతో చెప్పిన మీ చిన్న సోదరుడు ఇతడేనా?” అని యోసేపు అడిగాడు. అప్పుడు యోసేపు, “కుమారుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించు గాక!” అన్నాడు బెన్యామీనుతో.

30 అప్పుడు యోసేపు ఆ గదిలోనుంచి పరుగెత్తిపోయాడు. బెన్యామీను మీద తనకు ఉన్న ప్రేమను అతనికి చూపెట్టాలని యోసేపు ఎంతో ఆశించాడు. అతనికి ఏడ్చెయ్యాలనిపించింది గాని అతడు ఏడ్వటం అతని సోదరులు చూడకూడదు అనుకొన్నాడు. కనుక యోసేపు తన గదిలోనికి పరుగెత్తి పోయి అక్కడ ఏడ్చాడు. 31 తర్వాత యోసేపు తన ముఖం కడుక్కొని బయటకు వచ్చాడు. అతడు తనను తాను ఓదార్చుకొని, “భోజనానికి వేళ అయ్యింది” అన్నాడు.

32 ఆ సేవకులు యోసేపు ఒక్కడిని ఒక బల్ల దగ్గర వేరుగాను, సోదరులను మరో బల్ల దగ్గర వేరుగాను కూర్చుండబెట్టారు. వారితో భోంచేస్తున్న ఈజిప్టు వారిని వారి మట్టుకే ఒక బల్లదగ్గర కూర్చుండ బెట్టారు. ఈజిప్టువాళ్లు హీబ్రూవారితో కలిసి భోజనం చేయరు, అది ఈజిప్టు మత విరోధం. 33 యోసేపు సోదరులు అతనికి ఎదురుగా ఇంకో బల్ల దగ్గర కూర్చున్నారు. ఆ సోదరులను పెద్దవానితో మొదలుబెట్టి చిన్నవాని వరకు వరుసక్రమంలో కూర్చోబెట్టారు. అందువల్ల వాళ్ళకు ఆశ్చర్యమైంది. జరుగుతున్నదంతా ఏమిటా అన్నట్లు అన్నదమ్ములంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొంటున్నారు.[a] 34 సేవకులు యోసేపు బల్లమీద నుంచే వారికి భోజనం వడ్డిస్తున్నారు. అయితే ఆ సేవకులు మిగిలిన వాళ్లకంటె అయిదు రెట్లు ఎక్కువగా బెన్యామీనుకు వడ్డించారు. ఆ సోదరులు దాదాపు మత్తెక్కినంత వరకు యోసేపుతో కలిసి తిని త్రాగారు.

రోమీయులకు 8:1-11

ఆత్మ ద్వారా జీవము

అందువల్ల, ప్రస్తుతం యేసు క్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న వాళ్ళకు దేవుడు శిక్ష విధించడు. దేవుని ఆత్మ మనం యేసు క్రీస్తుతో ఐక్యత పొందటంవల్ల మనలో జీవాన్ని కలుగచేశాడు. ఆ ఆత్మ యొక్క నియమం మన పాపానికి, మరణానికి చెందిన నియమం నుండి నాకు విముక్తి కలిగించింది. ధర్మశాస్త్రం అన్నీ చెయ్యలేక పోయింది. పాపస్వభావం దాన్ని బలహీనంచేసింది. అందువల్ల దేవుడు తన కుమారుణ్ణి పాపాలు చేసే మానవుని రూపంలో పాపాలకు బలిగా పంపాడు. ఆయన వచ్చి మానవునిలో ఉన్న పాపాలకు శిక్ష విధించాడు. ధర్మశాస్త్రం ఆదేశించిన నీతికార్యాలు మన ద్వారా జరగాలని ఆయన ఉద్దేశ్యం. మనము పాపస్వభావంతో జీవించటంలేదు. పరిశుద్ధాత్మ చెప్పినట్లు జీవిస్తున్నాము.

ప్రాపంచికంగా జీవించేవాళ్ళ మనస్సు ప్రాపంచిక విషయాలకు లోనై వుంటుంది. కాని దేవుని ఆత్మ చెప్పినట్లు జీవించేవాళ్ళ మనస్సు ఆ ఆత్మకు సంబంధించిన విషయాలకు లోనై ఉంటుంది. ప్రాపంచిక విషయాలకు లోనవటంవల్ల మరణం సంభవిస్తుంది. కాని పరిశుద్ధాత్మకు లోనవటంవల్ల జీవం. శాంతం లభిస్తాయి. ఎందుకంటే, ప్రాపంచిక విషయాలకు లోనైనవాని మనస్సు దేవుణ్ణి ద్వేషిస్తుంది. అలాంటి మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి ఆధీనమై ఉండదు. ఉండజాలదు. ప్రాపంచికంగా జీవించేవాళ్ళు దేవుని మెప్పుపొందలేరు.

దేవుని ఆత్మ మీలో నిజంగా నివసిస్తున్నట్లైతే, మీరు ఈ లోక సంబంధంగా జీవించటంలేదన్నమాట. అంటే మీరు ఆత్మీయంగా జీవిస్తున్నారన్నమాట. క్రీస్తు యొక్క ఆత్మ తనలో లేనివాడు క్రీస్తుకు చెందడు. 10 ఒకవేళ క్రీస్తు మీలో జీవిస్తున్నట్లైతే పాపం కారణంగా మీ శరీరం చనిపోయినా మీలో వున్న దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేసాడు కనుక, ఆయన ఆత్మ మీకు జీవాన్నిస్తాడు. 11 మరణించిన యేసును దేవుడు లేపినాడు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నట్లైతే, నశించిపోయే మీ దేహాలకు ఆయన జీవం పోస్తాడు. మృతి నుండి యేసును లేపినవాడు దేవుడే కావున మీలో నివసిస్తున్న ఆయన ఆత్మద్వారా దేవుడు మీ శరీరాలను జీవింపచేస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International