Revised Common Lectionary (Complementary)
యాత్ర కీర్తన.
120 నేను కష్టంలో ఉన్నాను.
సహాయం కోసం నేను యెహోవాకు మొరపెట్టాను.
ఆయన నన్ను రక్షించాడు.
2 యెహోవా, మోసకరమైన నాలుకనుండి,
నాకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పిన వారినుండి నన్ను రక్షించుము.
3 అబద్దికులారా, యెహోవా మిమ్మల్ని ఎలా శిక్షిస్తాడో మీకు తెలుసా?
మీరేమి పొందుతారో మీకు తెలుసా?
4 మిమ్మల్ని శిక్షించటానికి దేవుడు సైనికుని వాడిగల బాణాన్ని,
మండుతున్న నిప్పులను ఉపయోగిస్తాడు.
5 అబద్ధికులారా, మీ దగ్గర్లో నివసించటం మెషెకులో నివసించటంలాగే ఉంటుంది.
అది కేదారు[a] గుడారాల్లో నివసించినట్టే ఉంటుంది.
6 శాంతిని ద్వేషించే ప్రజలతో నేను చాలా ఎక్కువ కాలం జీవించాను.
7 నాకు శాంతి కావాలి. అయితే, నేను చెప్పినట్లు ఆ ప్రజలకు యుద్ధం కావాలి.
11 యోషీయా కుమారుడైన షల్లూము (యెహోయాహాజు తన తండ్రి మరణానంతరం అతడు రాజయ్యాడు) ను గురించి యెహోవా యిలా అంటున్నాడు: “యెహోయాహాజు యెరూషలేము నుండి దూరంగా వెళ్లిపోయాడు. యెరూషలేముకు అతడు మరల తిరిగి రాడు. 12 ఈజిప్టీయులు యెహోయాహాజును ఎక్కడికి తీసుకొని వెళ్లారో అతనక్కడే చనిపోతాడు. ఈ రాజ్యాన్ని అతడు మరల చూడడు.”
రాజైన యెహోయాకీముకు వ్యతిరేకంగా తీర్పు
13 “రాజైన యెహోయాకీముకు వ్యతిరేకంగా ఇది మిక్కిలి కీడు.
తన భవన నిర్మాణానికి అతడు మిక్కిలి చెడ్డ పనులు చేస్తున్నాడు.
పై అంతస్తులో గదులు కట్టడానికి అతడు ప్రజలను మోసగిస్తున్నాడు.
నా ప్రజలచే అతడు వూరికే పని చేయిస్తూ ఉన్నాడు.
వారి పనికి అతడు ప్రతి ఫలం ఇవ్వటం లేదు.
14 “నా కొరకు నేనొక గొప్ప భవంతిని నిర్మిస్తాను.
‘పై అంతస్తులో ఎన్నో గదులు నిర్మిస్తాను,’ అని యెహోయాకీము అంటాడు.
అలా అని అతడు తన భవంతిని పెద్ద పెద్ద కిటికీలతో నిర్మిస్తాడు.
వాటి చట్రాలకు, తలుపులకు దేవదారు కలపను ఉపయోగించాడు. వాటికి అందంగా ఎరువు రంగు వేశాడు.
15 “యెహోయాకీమా, నీ ఇంటిలో విశేషించి ఉన్న దేవదారు కలప
నిన్ను గొప్ప రాజును చేయదు.
నీ తండ్రియగు యోషీయా తనకు కావలసిన ఆహారపానీయాలతో తృప్తి పడ్డాడు.
అతడు ఏది న్యాయమైనదో, ఏది సత్యమైనదో దానిని చేశాడు.
యోషీయా సత్ప్రవర్తనుడై నందున అతనికి అంతా సవ్యంగా జరిగిపోయింది.
16 యోషీయా పేదవారిని, అవస్థలో ఉన్న వారిని ఆదుకున్నాడు.
యోషీయా అలా చేయుటవల్ల అతనికి అంతా సవ్యంగా జరిగి పోయింది.
యెహోయాకీమా, ‘దేవుని తెలుసు కొనుట’ అంటే ఏమిటి?
దీనులకు దరిద్రులకు సహాయం చేయటం
మరియు న్యాయంగా ప్రవర్తించటమే నన్ను తెలుసుకొనే మార్గాలు.”
ఇదే యెహోవా వాక్కు.
17 “యెహోయాకీమా, నీకు ఏది లాభదాయకంగా ఉంటుందా, అని నీ కళ్లు వెదకుతూ ఉంటాయి.
ఇంకా, ఇంకా ఎలా సంపాదించాలా అని సదా నీ మనస్సు దానిపై లగ్నమై ఉంటుంది.
అందుకు అమాయకులను బలి చేయటానికి కూడా నీవు సిద్ధంగా ఉన్నావు
ఇతరుల సొమ్మును దొంగిలించటానికి నీవు ఇష్టపడుతున్నావు.”
యేసు పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని విమర్శించటం
(మత్తయి 23:1-36; మార్కు 12:38-40; లూకా 20:45-47)
37 యేసు మాట్లాడటం ముగించాడు. ఒక పరిసయ్యుడు యేసును తన యింటికి ఆహ్వానించాడు. యేసు అతని యింటికి వెళ్ళి భోజనానికి కూర్చుని ఉన్నాడు. 38 యేసు భోజనానికి ముందు చేతులు కడుక్కోకుండా కూర్చోవటం గమనించి పరిసయ్యునికి ఆశ్చర్యం వేసింది. 39 అప్పుడు ప్రభువు అతనితో, “మీ పరిసయ్యులు గిన్నెల్ని, పళ్ళేల్ని వెలుపలి భాగం శుభ్రం చేస్తారు. కాని లోపల దురాశ, దుష్టత్వము నిండివుంటాయి. 40 మూర్ఖులారా! వెలుపలి భాగం సృష్టించిన వాడే లోపలి భాగం సృష్టించలేదా? 41 మీరు దాచుకున్న వాటిని పేదవాళ్ళకు దానం చెయ్యండి. అప్పుడు మీరు పూర్తిగా శుభ్రమౌతారు.
42 “మీరు మీ తోటలో పండిన పుదీనా, సదాప మొదలగు కూరగాయల యొక్క పదవవంతు దేవునికి యిస్తారు. కాని న్యాయాన్ని, దేవుని ప్రేమని నిర్లక్ష్యం చేస్తున్నారు. కనుక మీకు శ్రమ. పదవవంతు ఇవ్వటం మానుకోకుండా న్యాయాన్ని, దేవుని ప్రేమను కూడా అలవరచుకోవలసింది.
43 “మీరు సమాజ మందిరాల్లో ఉన్నత స్థలాల్లో కూర్చోవటానికోసం ప్రాకులాడుతారు. దారి మీద వెళ్తూవుంటే ప్రజలు గౌరవమివ్వాలని ఆశిస్తారు. కనుక మీకు శ్రమ తప్పదు. 44 ప్రజలు తమకు తెలియకుండా త్రొక్కుతూ నడిచే సమాధుల్లాంటి వాళ్ళు మీరు. మీకు శ్రమ తప్పదు” అని అన్నాడు.
45 ధర్మశాస్త్రంలో పాండిత్యం ఉన్న ఒకడు లేచి, “బోధకుడా! మీరీ విధంగా మాట్లాడి మమ్మల్ని కూడా అవమానిస్తున్నారు” అని అన్నాడు.
46 యేసు, “ధర్మశాస్త్ర పండితులారా! మీరు ప్రజలపై వాళ్ళు మోయలేని భారం వేస్తున్నారు. కాని వాటిని లేపటానికి మీరు ఒక్క వ్రేలు కూడా కదల్చరు. కనుక మీకు శ్రమ తప్పదు. 47 మీరు ప్రవక్తల కోసం సమాధులు కట్టిస్తారు. కాని మీ పూర్వికులు వాళ్ళను చంపారు. కనుక మీకు శిక్ష తప్పదు. 48 అంటే పూర్వికులు చేసిన దాన్ని అంగీకరిస్తున్నట్లు నిరూపించుకొంటున్నారన్న మాట. వాళ్ళు ప్రవక్తల్ని చంపారు. మీరు సమాధులు కట్టించారు. 49 అందువల్లే దేవుడు దివ్యజ్ఞానంతో ఈ విధంగా చెప్పాడు: ‘నేను వాళ్ళకోసం ప్రవక్తల్ని, అపొస్తలులను పంపుతాను. కొందర్ని వాళ్ళు చంపుతారు. మిగతా వాళ్ళను హింసిస్తారు.’
50 “అందువలన ప్రపంచం పుట్టిన నాటినుండి ప్రవక్తలు కార్చిన రక్తానికి ఈ తరం వాళ్ళు బాధ్యులు. 51 హేబెలు హత్య మొదలుకొని ధూప వేదికకు, మందిరానికి మధ్య చంపబడిన జెకర్యా హత్యదాకా వీళ్ళు బాధ్యులు. ఔను. ఈ కాలం వాళ్ళు వీటికి బాధ్యులని నేను చెబుతున్నాను.
52 “ధర్మశాస్త్ర పండితులారా! జ్ఞానం యొక్క తాళం చెవి మీరు తీసుకున్నారు. దాని తలుపులు తెరిచి మీరు లోనికి వెళ్ళలేరు. పైగా వెళ్తున్న వాళ్ళను అడ్డగిస్తారు. మీకు శిక్ష తప్పదు” అని చెప్పాడు.
© 1997 Bible League International