Revised Common Lectionary (Complementary)
ప్రజలలో నమ్మిక మరియు దేవునిలో నమ్మిక
5 యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు:
“ఇతర ప్రజలను నమ్మేవారికి
కీడు జరుగుతుంది.
బలం కొరకు ఇతర ప్రజలపై ఆధారపడేవారికి
కష్ట నష్టాలు వస్తాయి.
ఎందువల్లనంటే ప్రజలు యెహోవాను నమ్ముట మాని వేశారు.
6 ఆ ప్రజలు ఎడారిలో పొదలావున్నారు.
ఆ పొదవున్న ప్రాంతంలో ఎవ్వరూ నివసించరు.
ఆ పొద ఎండిన ఉష్ణ ప్రదేశంలో ఉంది.
ఆ పొద చవుడు భూమిలో ఉంది.
ఆ పొదకు దేవుడు ఇవ్వగల అనేక శుభాలను గురించి తెలియదు.
7 కాని యెహోవాలో నమ్మిక గల వ్యక్తి ఆశీర్వదింపబడతాడు.
ఎందువల్లనంటే తనను నమ్మవచ్చని యెహోవా నిరూపిస్తాడు.
8 నీటి వనరులున్నచోట నాటిన చెట్టువలె
ఆ వ్యక్తి ఏపుగా, బలంగా ఉంటాడు.
నీటి వనరులున్న చెట్టుకు బలమైన వేర్లుంటాయి. ఆ చెట్టు వేసవి వేడికి తట్టుకుంటుంది.
దాని ఆకులు నిత్యం పచ్చగా ఉంటాయి.
ఒక సంవత్సరం వర్షాలు కురియకపోయినా దానికీ భయముండదు.
ఆ చెట్టు ఎల్లప్పుడు కాయలుకాస్తుంది.
9 “మానవ మనస్సు మిక్కిలి కపటంతో కూడివుండి.
మనస్సు చాలా వ్యాధిగ్రస్తమయ్యింది.
మానవ మనస్సును ఎవ్వరూ సరిగా అర్థం చేసికోలేరు.
10 కాని యెహోవానైన నేను
ఒక వ్యక్తి హృదయంలోకి సూటిగా చూడగలను.
వ్యక్తి మనస్సును నేను పరీక్షించగలను. అందువల్ల ఎవ్వరెవ్వరికి ఏమేమి కావాలో నేను నిర్ణయించగలను.
ప్రతి వ్యక్తికీ వాని పనికి తగిన జీతభత్యం నేను ఇవ్వగలను.
మొదటి భాగం
(కీర్తనలు 1–41)
1 ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే,
అతడు చెడ్డవారి సలహాలు పాటించనప్పుడు,
అతడు పాపులవలె జీవించనప్పుడు,
దేవునికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసివుండనప్పుడు.
2 ఆ మంచి మనిషి, యెహోవా ఉపదేశాలను ప్రేమిస్తాడు.
ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్లు అతడు తలపోస్తూంటాడు.
3 కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలె బలంగా ఉంటాడు.
సకాలంలో ఫలాలు ఫలించే ఒక చెట్టువలె అతడు ఉంటాడు.
అతడు ఆకులు వాడిపోని చెట్టువలె ఉంటాడు.
అతడు చేసేది అంతా సఫలం అవుతుంది.
4 అయితే చెడ్డవాళ్లు అలా ఉండరు.
వాళ్లు గాలి చెదరగొట్టివేసే పొట్టువలె ఉంటారు.
5 ఒక న్యాయ నిర్ణయం చేసేందుకు మంచి మనుష్యులు గనుక సమావేశమైతే, అప్పుడు చెడ్డ మనుష్యులు దోషులుగా రుజువు చేయబడతారు.
ఆ పాపాత్ములు నిర్దోషులుగా తీర్చబడరు.
6 ఎందుకంటే యెహోవా మంచి మనుష్యులను కాపాడుతాడు,
చెడ్డ మనుష్యులు ఆయన చేత నాశనం చేయబడతారు.
చనిపోయిన వాళ్ళు బ్రతికి రావటం
12 కాని మేము క్రీస్తు చావు నుండి బ్రతికి వచ్చాడని బోధించాము కదా! మరి మీలో కొందరు చనిపోయినవాళ్ళు బ్రతికి రారని ఎందుకంటున్నారు? 13 అది నిజమైతే క్రీస్తు కూడా చనిపోయి బ్రతికి రాలేదనే అర్థం వస్తుంది. 14 క్రీస్తు చనిపోయి బ్రతికి రానట్లయితే మా బోధన, మీ విశ్వాసము వృథా అయినట్లే కదా! 15 అంతే కాదు. దేవుడు చనిపోయిన క్రీస్తును బ్రతికించాడని మేము చెప్పాము. అలా కాని పక్షంలో మేము దేవుణ్ణి గురించి తప్పు సాక్ష్యము చెప్పినవాళ్ళమౌతాము. కాని ఒకవేళ దేవుడు చనిపోయినవాళ్ళను నిజంగా బ్రతికించనట్లయితే ఆయన్ని కూడా బ్రతికించలేదు. 16 ఎందుకంటే చనిపోయిన వాళ్ళను బ్రతికించనట్లయితే క్రీస్తును కూడా బ్రతికించలేదు. 17 క్రీస్తును బ్రతికించలేదు అంటే, మీ విశ్వాసం వ్యర్థం. మీకు మీ పాపాలనుండి విముక్తి కలుగలేదన్న మాట. 18 అంటే చనిపోయిన క్రీస్తు విశ్వాసులు కూడా తమ పాపాల నుండి విముక్తి పొందలేదన్నమాట. 19 మనకు క్రీస్తు పట్ల ఉన్న ఆశాభావం ప్రస్తుత జీవితం కోసం మాత్రమే అయినట్లయితే మన స్థితి అందరికన్నా అధ్వాన్నం ఔతుంది.
20 కాని నిజానికి చనిపోయిన క్రీస్తు బ్రతికింపబడ్డాడు. చనిపోయి బ్రతికింపబడ్డవాళ్ళలో ఆయన ప్రథముడు.
యేసు బోధించి రోగులను నయం చేయటం
(మత్తయి 4:23-25; 5:1-12)
17 యేసు వాళ్ళతో సహా కొండ దిగి సమంగా ఉన్న స్థలంలో నిలుచున్నాడు. చాలా మంది శిష్యులు ఆయనతో ఉన్నారు. ఆయన శిష్యులే కాక యూదయ నుండి, యెరూషలేం నుండి చాలా మంది ప్రజలు వచ్చారు. సముద్ర తీరంలో ఉన్న తూరు, సీదోను పట్టణాల నుండి కూడా చాలా మంది ప్రజలు వచ్చారు. 18 ఆయన బోధనలు వినాలని ఆయన ద్వారా తమ రోగాలు బాగు చేయించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం. దయ్యాలు పట్టి బాధపడ్తున్న వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా నయమైపోయింది. 19 ఆయన నుండి శక్తి ప్రవహించి అందరికి నయం చేస్తూవుండటం వల్ల అందరూ ఆయన్ని తాకటానికి ప్రయత్నించారు.
20 యేసు తన శిష్యుల వైపు చూసి ఈ విధంగా అన్నాడు:
“దీనులైన మీరు ధన్యులు.
దేవుని రాజ్యం మీది.
21 ఇప్పుడు ఆకలితో ఉన్న మీరు ధన్యులు.
మీ ఆకలి తీరుతుంది.
ఇప్పుడు దుఃఖిస్తున్న మీరు ధన్యులు.
భవిష్యత్తులో మీరు నవ్వుతారు.
22 “మనుష్యకుమారుని కారణంగా ప్రజలు మిమ్ముల్ని ద్వేషించినప్పుడు, మిమ్మల్ని దూరం చేసి అవమానించినప్పుడు, మీ పేరే హానికరమైనదని వారు భావించినప్పుడు మీరు ధన్యులౌతారు! 23 మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక యిది జరిగిన రోజు ఆనందంతో గంతులు వెయ్యండి! వీళ్ళ పూర్వీకులు కూడా ఆనాడు ప్రవక్తల పట్ల యిదే విధంగా ప్రవర్తించారు.
24 “ఓ ధనికులారా! మీకు శ్రమ తప్పదు!
మీరు అనుభవించవలసిన సుఖాన్ని యిదివరకే అనుభవించారు!
25 కడుపులు నిండిన ప్రజలారా మీకు శ్రమ తప్పదు.
మీకు ఆహారం దొరకదు!
నవ్వుతున్న ప్రజలారా! మీకు శ్రమ తప్పదు!
మీరు దుఃఖిస్తారు, శోకిస్తారు!
26 “పొగడ్తులుపొందే ప్రజలారా! మీకు శిక్ష తప్పదు! వాళ్ళ పూర్వులు యిదే విధంగా అబద్ధ ప్రవక్తల్ని పొగిడారు.
© 1997 Bible League International