Revised Common Lectionary (Complementary)
115 యెహోవా, ఏ ఘనతా మేము స్వీకరించకూడదు. ఘనత నీకే చెందుతుంది.
నీ ప్రేమ, నమ్మకం మూలంగా ఘనత నీదే.
2 మా దేవుడు ఎక్కడ అని జనాంగాలు ఎందుకు ఆశ్చర్యపడాలి?
3 దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన కోరింది చేస్తాడు.
4 ఆ జనాంగాల “దేవుళ్లు” వెండి బంగారాలతో చేయబడ్డ విగ్రహాలే.
ఎవరో ఒక మనిషి చేతులతో చేసిన విగ్రహాలే అవి.
5 ఆ విగ్రహాలకు నోళ్లున్నాయి కాని అవి మాట్లాడలేవు.
వాటికి కళ్లున్నాయి కాని అవి చూడలేవు.
6 వాటికి చెవులున్నాయి కాని అవి వినలేవు.
వాటికి ముక్కులున్నాయి కాని అవి వాసన చూడలేవు.
7 వాటికి చేతులు ఉన్నాయి కాని అవి తాకలేవు.
వాటికి కాళ్లు ఉన్నాయి కాని అవి నడవలేవు.
వాటికి గొంతుల్లోనుంచి ఏ శబ్దాలూ రావు.
8 ఆ విగ్రహాలను చేసేవారు. వాటిని నమ్ముకొనే వారు కూడ సరిగ్గా వాటివలె అవుతారు.
9 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ము.
యెహోవా వారి బలము, ఆయన వారి డాలు.
10 అహరోను వంశస్థులు యెహోవాను నమ్ముతారు.
యెహోవా వారి బలము, డాలు అయివున్నాడు.
11 యెహోవా అనుచరులు యెహోవాను నమ్ముకొంటారు.
యెహోవా తన అనుచరులకు సహాయం చేసి కాపాడుతాడు.
12 యెహోవా మమ్మల్ని జ్ఞాపకం చేసికొంటాడు.
యెహోవా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
యెహోవా ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు.
యెహోవా అహరోను వంశాన్ని ఆశీర్వదిస్తాడు.
13 యెహోవా పెద్దవారైనా, చిన్నవారైనా తన అనుచరులను ఆశీర్వదిస్తాడు.
14 యెహోవా మీ కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆయన మీ పిల్లల కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
15 యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.
ఆకాశాన్ని, భూమిని యెహోవా చేశాడు.
16 ఆకాశం యెహోవాకు చెందుతుంది.
కాని భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చాడు.
17 చనిపోయినవాళ్లు యెహోవాను స్తుతించరు.
కింద సమాధిలో ఉన్న మనుష్యులు యెహోవాను స్తుతించరు.
18 అయితే మనం యెహోవాను స్తుతిస్తాం.
మనం యిప్పటినుండి ఎప్పటికీ ఆయనను స్తుతిస్తాము!
యెహోవాను స్తుతించండి!
అష్షూరు త్వరలో వస్తుంది
8 యెహోవా నాతో చెప్పాడు, “వ్రాయటానికి ఒక పెద్ద పలక తీసుకో. ఘంటంతో (పెన్నుతో) ఈ మాటలు వ్రాయి: ‘మహేరు, షాలాల్, హాష్ బజ్.’ (అంటే ‘త్వరలోనే దోపిడి, దొంగతనం జరుగుతుంది’ అని అర్థం.)”
2 సాక్షులుగా నమ్మదగిన కొందరు మనుష్యుల్ని నేను సమావేశపర్చాను. (వీళ్లు ఊరియా, యెబెరెక్యా, జెకర్యా) నేను ఈ విషయాలు వ్రాయటం ఈ మనుష్యులు గమనించారు. 3 తర్వాత నేను ప్రవక్త్రి దగ్గరకు వెళ్లాను. నేను ఆమెతో ఉన్న తర్వాత ఆమె గర్భవతియై, ఒక కుమారుని కన్నది. అప్పుడు యెహోవా నాతో చెప్పాడు, “పిల్లవాడికి మహేరు షాలాల్ హాష్‌బజ్” అని పేరు పెట్టు. 4 ఎందుకంటే ఆ పిల్లవాడు “అమ్మా” “నాన్నా” అనటం నేర్చుకొనక ముందే దమస్కు, షోమ్రోనుల ధనం, ఐశ్వర్యాలు దేవుడు తీసుకొని, వాటిని దేవుడు అష్షూరు రాజుకు ఇచ్చివేస్తాడు.
5 దేవుడు మళ్లీ నాతో మాట్లాడాడు. 6 నా ప్రభువు చెప్పాడు: “ఈ ప్రజలు నిదానంగా ప్రవహించే షిలోహు[a] జలాలను స్వీకరించేందుకు నిరాకరించారు. రెజీను, రెమల్యా కుమారునితో (పెకహు) వీళ్లు సంతోషపడి పోతున్నారు. 7 అందుచేత చూడు, నా యెహోవా మహా గొప్ప యూఫ్రటీసు నదీ ప్రవాహంలాగా అష్షూరును దాని శక్తి అంతటిని తీసుకొని వస్తున్నాడు. వారు ఒక నది పొంగి పొర్లేలా, ప్రవాహంలా మీ దేశంలోనికి వస్తారు. 8 ఆ నదిలోంచి నీళ్లు పొంగి యూదాలోకి ప్రవహిస్తాయి. యూదా గొంతుల వరకు నీళ్లు పొంగి, యూదాను దాదాపుగా ముంచేస్తాయి.
“ఇమ్మానుయేలూ, నీ దేశం అంతటినీ ముంచివేసేంతగా ఈ వరద విస్తరిస్తుంది.”
9 సర్వ దేశాల్లారా, యుద్ధానికి సిద్ధపడండి.
కాని మీరు ఓడిపోతారు.
దూర దేశాలన్నీ ఆలకించండి.
యుద్ధానికి సిద్ధపడండి.
కానీ మీరు ఓడిపోతారు
10 యుద్ధానికి మీ వ్యూహాలు పన్నండి.
కానీ మీ వ్యూహాలు అన్నీ ఓడిపోతాయి.
మీ సైన్యాలకు ఆజ్ఞాపించండి.
కానీ మీ ఆజ్ఞలు నిష్ప్రయోజనమే. ఎందుకంటే, దేవుడు మాతో ఉన్నాడు[b] గనుక.
యెషయాకు హెచ్చరికలు
11 యెహోవా తన మహా శక్తితో నాతో మాట్లాడాడు. ఈ ఇతర మనుష్యుల్లా ఉండొద్దని యెహోవా నన్ను హెచ్చరించాడు. 12 “ప్రతివారూ ఇతరులు తమకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నట్టు చెబుతున్నారు. నీవు ఆ విషయాలు నమ్మవద్దు. ఆ ప్రజలు భయపడే వాటికి నీవు భయపడవద్దు. వాటిగూర్చి నీవు భయపడవద్దు” అని యెహోవా నాతో చెప్పాడు.
13 సర్వశక్తిమంతుడైన యెహోవా ఒక్కడికే మీరు భయపడాలి. మీరు గౌరవించాల్సిన వాడు ఆయనే. మీరు భయపడాల్సింది ఆయనకే. 14 మీరు యెహోవాను గౌరవించి, ఆయనను పవిత్రునిగా ఎంచుకొంటే, అప్పుడు ఆయనే మీకు క్షేమస్థానంగా ఉంటాడు. కానీ మీరు ఆయనను గౌరవించరు. కనుక మీరు పడిపోయేట్టు చేసే బండ ఆయనే. ఇశ్రాయేలు యొక్క రెండు కుటుంబాలను తొట్రిల్లేలా చేసే బండ ఆయనే. యెరూషలేము ప్రజలందరినీ పట్టుకొనే బోను యెహోవాయే. 15 (అనేకమంది మనుష్యులు ఈ బండ తగిలి పడిపోతారు. వాళ్లు పడిపోయి, విరిగిపోతారు. వారు బోనులో పట్టుబడతారు.)
లేవి (మత్తయి) యేసును వెంబడించటం
(మత్తయి 9:9-13; మార్కు 2:13-17)
27 తర్వాత యేసు అక్కడి నుండి వెళ్ళి పోయాడు. లేవి[a] అనే ఒక పన్నులు సేకరించే గుమాస్తా, పన్నులు సేకరిస్తూ ఒక గదిలో కూర్చొని ఉన్నాడు. యేసు అతణ్ణి చూసి, “నా వెంటరా!” అని అతనితో అన్నాడు. 28 లేవి లేచి అన్నీవదిలి యేసును అనుసరించాడు.
29 ఆ తర్వాత లేవి తన యింట్లో యేసు కోసం ఒక పెద్ద విందు చేశాడు. చాలా మంది పన్నులు వసూలు చేసేవాళ్ళు, ఇతర్లు ఆయనతో కలసి భోజనం చేస్తూఉన్నారు. 30 పరిసయ్యులు, వాళ్ళ గుంపుకు చెందిన శాస్త్రులు యేసు అనుచరులతో, “మీరు పన్నులు సేకరించే వాళ్ళతో, పాపులతో కలిసి ఎందుకు తింటారు?” అని విమర్శిస్తూ అడిగారు.
31 యేసు, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉంటుంది. 32 నేను నీతిమంతుల్ని పిలిచి, వాళ్ళకు మారుమనస్సు పొందుమని చెప్పటానికి రాలేదు. పాపుల కోసం వచ్చాను” అని సమాధానం చెప్పాడు.
© 1997 Bible League International