Revised Common Lectionary (Complementary)
71 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.
కనుక నేను ఎన్నటికీ నిరాశ చెందను.
2 నీ మంచితనాన్ని బట్టి నీవు నన్ను రక్షిస్తావు. నీవు నన్ను తప్పిస్తావు.
నా మాట వినుము. నన్ను రక్షించుము.
3 భద్రత కోసం నేను పరుగెత్తి చేరగల గృహంగా, నా కోటగా ఉండుము.
నన్ను రక్షించుటకు ఆజ్ఞ ఇమ్ము.
నీవు నా బండవు కనుక నా క్షేమస్థానమై ఉన్నావు.
4 నా దేవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
కృ-రమైన దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
5 నా ప్రభువా, నీవే నా నిరీక్షణ.
నేను నా యౌవనకాలంనుండి నిన్ను నమ్ముకొన్నాను.
6 నేను పుట్టినప్పటినుండి నీమీదనే ఆధారపడ్డాను.
నా తల్లి గర్భమునుండి నీవు నన్ను జన్మింపజేశావు.
నేను ఎల్లప్పుడూ నిన్నే ప్రార్థించాను.
యోషీయా మరణం
20 యోషీయా ఆలయం విషయంలో ఈ మంచి పనులన్నీ చేసిన పిమ్మట రాజైన నెకో యూఫ్రటీసు నదీతీర పట్టణమైన కర్కెమీషు మీదికి దండెత్తి వచ్చాడు. నెకో ఈజిప్టు రాజు. రాజైన యోషీయా నెకోను ఎదిరించటానికి బయలుదేరి వెళ్లాడు. 21 కాని నెకో యోషీయా వద్దకు దూతలను పంపాడు.
వారు యిలా అన్నారు: “యోషీయా రాజా, ఈ యుద్ధం నీకు సంబంధించినది కాదు. నేను నీమీద యుద్ధానికి రాలేదు. నేను నా శత్రువుతో పోరాడటానికి వచ్చాను. దేవుడు నన్ను తొందరచేసి పంపినాడు. దేవుడు నా పక్షాన వున్నాడు. కావున నీవు అనవసరమైన శ్రమ తీసుకోవద్దు. నీవు గనుక నాతో యుద్ధం చేస్తే. దేవుడు నిన్ను నాశనం చేస్తాడు!”
22 కాని యోషీయా వెళ్లి పోలేదు. అతడు నెకోతో యుద్ధం చేయటానికే నిశ్చయించాడు. అందువల్ల అతడు తన వేషం మార్చుకొని యుద్ధానికి వెళ్లాడు. దేవుని ఆజ్ఞ విషయంలో నెకో చెప్పిన దానిని యోషీయా వినటానికి నిరాకరించాడు. మెగిద్దో మైదానంలో యుద్ధం చేయటానికి యోషీయా వెళ్లాడు. 23 రాజైన యోషీయా యుద్ధంలో వుండగా, అతడు బాణాలతో కొట్టబడ్డాడు. అతడు తన సేవకులతో, “నన్ను దూరంగా తీసుకొని వెళ్లండి. నేను తీవ్రంగా గాయపడ్డాను!” అని చెప్పాడు.
24 దానితో అతని సేవకులు యోషీయాను అతని రథం నుండి దించి తనతో యుద్ధరంగానికి తెచ్చిన మరియొక రథంలో అతనిని వుంచారు. వారు యోషీయాను యెరూషలేముకు తీసికొని వచ్చారు. రాజైన యోషీయా యెరూషలేములో చనిపోయాడు. తన పూర్వీకులు వుంచబడిన సమాధులలోనే యోషీయా సమాధి చేయబడినాడు. యోషీయా చనిపోయినందుకు యూదా, యెరూషలేము ప్రజలంతా చాలా దుఃఖించారు. 25 యోషీయాపై యిర్మీయా కొన్ని ప్రగాఢ విలాపగీతికలు వ్రాశాడు. ఆ విలాపగీతాలు ఆలపిస్తూ స్త్రీ పురుష గాయకులు ఈనాటికీ యోషీయాను తలచుకొని గౌరవిస్తారు. యోషీయాను తలుస్తూ ఒక విలాపగీతిక ఆలపించటం ఇశ్రాయేలీయులకు వాడుక అయ్యింది. ఆ గీతికలు విలాప వాక్యములలో పొందుపర్చబడినాయి.
26-27 తాను రాజుగా వున్న కాలంలో యోషీయా మొదటినుండి తన పాలన అంతం అయ్యే వరకు చేసిన ఇతర కార్యములన్నీ ఇశ్రాయేలు, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడినాయి. ఆ గ్రంథం యెహోవాపట్ల అతనికున్న ప్రేమ, యెహోవా ధర్మశాస్త్రాన్ని అతను అనుసరించిన తీరును తెలియజేస్తుంది.
ఎఫెసులో పౌలు
19 అపొల్లో యింకా కొరింథులోనే ఉన్నాడు. పౌలు భూమార్గం ద్వారా ప్రయాణం చేసి ఎఫెసు చేరుకున్నాడు. అక్కడ కొంత మంది శిష్యుల్ని కలుసుకొని 2 వాళ్ళతో, “మీరు విశ్వసించిన పిదప పవిత్రాత్మను పొందారా?” అని అడిగాడు.
వాళ్ళు, “లేదు! పవిత్రాత్మ ఉన్నాడనేది కూడా మేము వినలేదు” అని సమాధానం చెప్పారు.
3 పౌలు, “మీరు ఎలాంటి బాప్తిస్మం పొందారు?” అని అడిగాడు.
“యోహాను బాప్తిస్మం” అని వాళ్ళు చెప్పారు.
4 పౌలు, “యోహాను మారుమనస్సుకు సంబంధించిన బాప్తిస్మము నిచ్చాడు. అతడు, తన తర్వాత రానున్నవాణ్ణి, అంటే యేసును నమ్మమని ప్రజలకు బోధించాడు కదా!” అని అన్నాడు.
5 ఇది విన్నాక వాళ్ళు యేసు ప్రభువు పేరిట బాప్తిస్మము పొందారు. 6 పౌలు తన చేతుల్ని వాళ్ళ తలలపై ఉంచగానే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి వచ్చాడు. వాళ్ళంతా తమకు రాని భాషల్లో మాట్లాడారు. దేవుడు ప్రేరేపించిన సత్యాలు ప్రకటించారు. 7 అక్కడ మొత్తం పన్నెండు మంది ఉన్నారు.
8 పౌలు యూదుల సమాజమందిరానికి మూడు నెలలు వెళ్ళాడు. దేవుని రాజ్యాన్ని గురించి ధైర్యంగా వాదించి వాళ్ళను ఒప్పించటానికి ప్రయత్నించాడు. 9 కాని కొందరు నమ్మలేదు. తమ పట్టు వదులుకోలేదు. పైగా ప్రభువు చూపిన మార్గాన్ని బహిరంగంగా దూషించారు. అందువల్ల పౌలు వాళ్ళను వదిలి, శిష్యుల్ని తన వెంట పిలుచుకు వెళ్ళాడు. అతడు, తురన్ను ఉపన్యాస శాలలో ప్రతి రోజూ తర్కించేవాడు. 10 ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి. ఫలితంగా ఆసియ ప్రాంతాల్లో నివసిస్తున్న యూదులు, గ్రీకులు అందరూ ప్రభువు సందేశాన్ని విన్నారు.
© 1997 Bible League International