Revised Common Lectionary (Complementary)
లామెద్
89 యెహోవా, నీ మాట శాశ్వతంగా కొనసాగుతుంది. నీ మాట పరలోకంలో శాశ్వతంగా కొనసాగుతుంది.
90 నీవు ఎప్పటికీ నమ్మదగిన వాడవు.
యెహోవా, భూమిని నీవు చేశావు, అది ఇంకా నిలిచి ఉంది.
91 నీ ఆజ్ఞ మూలంగా, ఇంకా అన్నీ కొనసాగుతాయి.
యెహోవా, అన్నీ నీ సేవకుల్లా నీ ఆజ్ఞకు లోబడుతాయి.
92 నీ ఉపదేశాలు నాకు స్నేహితుల్లా ఉండకపోతే,
నా శ్రమ నన్ను నాశనం చేసి ఉండేది.
93 యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను జీవింపజేస్తాయి
కనుక నేను ఎన్నటికీ వాటిని మరచిపోను.
94 యెహోవా, నేను నీ వాడను. నన్ను రక్షించుము.
ఎందుకంటే, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు కష్టపడి ప్రయత్నిస్తాను.
95 దుష్టులు నన్ను నాశనం చేయాలని ప్రయత్నించారు.
అయితే నీ ఒడంబడిక నాకు తెలివినిచ్చింది.
96 నీ ధర్మశాస్త్రానికి తప్ప
ప్రతిదానికీ ఒక హద్దు ఉంది.
27 యెహోవా వాక్కు యిర్మీయాకు వినిపించింది. యెహోవా నుండి వచ్చిన సందేశాలన్నీ పొందుపర్చబడిన సుదీర్గ పుస్తకాన్ని రాజైన యెహోయాకీము తగులబెట్టిన పిమ్మట ఇది జరిగింది. యిర్మీయా ఆ విషయాలు బారూకుతో చెప్పగా, బారూకు వాటన్నిటినీ పుస్తకంగా వ్రాశాడు. యిర్మీయాకు వచ్చిన యెహోవ సందేశం ఇలా ఉంది:
28 “యిర్మీయా, మరో పత్రం తీసికో. దానిమీద మొదటి చుట్టలో వున్న వర్తమానములన్నిటినీ నీవు తిరిగి వ్రాయుము. ఆ మొదటి పుస్తకాన్నే యూదా రాజైన యెహోయాకీము తగుల బెట్టాడు. 29 యిర్మీయా, యూదా రాజైన యెహోయాకీముకు ఈ విషయం కూడా చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నాడు: యెహోయాకీమా, నీవా పుస్తకాన్ని తగులబెట్టావు. “బబులోను రాజు వచ్చి నిశ్చయంగా ఈ రాజ్యాన్ని నాశనం చేస్తాడని యిర్మీయా ఎందుకు వ్రాశాడు? ఈ దేశంలో గల మనుష్యులను, జంతువులను బబులోను రాజు నాశనం చేస్తాడని ఎందుకు చెప్పాడు?” అని నీవు అన్నావు. 30 కావున, యూదా రాజైన యెహోయాకీము విషయంలో యెహోవా ఇలా అంటున్నాడు: యెహోయాకీము సంతతివారు దావీదు సింహాసనంపై కూర్చొనరు. యెహోయాకీము చనిపోయినప్పుడు రాజ లాంఛనాలతో అంత్యక్రియలు జరగవు. అతని కళేబరం నేలమీద పారవేయబడుతుంది. అతని శవం పగలు ఎండకు ఎండి, రాత్రి మంచుకు నానిపోతుంది. 31 ప్రభువునైన నేను యెహోయాకీమును, అతని సంతానాన్ని శిక్షిస్తాను. అతని అధికారులను కూడ నేను శిక్షిస్తాను. వారు దుర్మార్గులు గనుక నేనలా చేస్తాను. ఆ అధికారులపైకి, యెరూషలేము ప్రజలపైకి, యూదా ప్రజలపైకి మహా విపత్తు తీసికొని వస్తానని నేను అనియున్నాను. నేను చెప్పిన విధంగా వారికి అష్ట కష్టాలను తెచ్చి పెడతాను. కారణమేమంటే, వారు నేను చెప్పినది వినలేదు.’”
32 యిర్మీయా మరో గ్రంథాన్ని తీసికొని లేఖకుడు నేరీయా కుమారుడు బారూకుకు ఇచ్చాడు. రాజైన యెహోయాకీము నిప్పులో వేసి తగులబెట్టిన పుస్తకంలో వున్న వర్తమానములన్నిటినీ, యిర్మీయా చెప్పుచుండగా బారూకు ఆ పత్రం మీద మరల వ్రాశాడు. పాత వర్తమానాల వంటివే మరికొన్ని క్రొత్తగా ఈ రెండవ గ్రంథములో చేర్చబడ్డాయి.
యేసు పేతురు అత్తను నయం చేయటం
(మత్తయి 8:14-17; మార్కు 1:29-34)
38 యేసు సమాజమందిరాన్ని వదిలి సీమోను యింటికి వెళ్ళాడు. సీమోను అత్తకు జ్వరం తీవ్రంగా ఉంది. వాళ్ళు ఆమె జ్వరాన్ని గురించి యేసుకు చెప్పారు. 39 యేసు, ఆమె దగ్గరకు వచ్చి జ్వరాన్ని వదిలి పొమ్మని గద్దించాడు. జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె లేచి అందరిని ఆదరించటం మొదలు పెట్టింది.
యేసు అనేకులను నయం చేయటం
40 సూర్యాస్తమయమౌతుండగా ప్రజలు రక రకాల రోగాలున్న వాళ్ళను ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన ప్రతి ఒక్కరి మీద తన చేతుల్ని ఉంచి అందరిని నయం చేశాడు. 41 “నీవు దేవుని కుమారుడవు” అని బిగ్గరగా కేకలు వేస్తూ చాలా మంది నుండి దయ్యాలు బయటకు వచ్చాయి. వాటికి తాను క్రీస్తు అని తెలియటం వల్ల యేసు వాటిని మాట్లాడవద్దని గద్దించాడు.
యేసు ఇతర పట్టణాలకు వెళ్ళటం
(మార్కు 1:35-39)
42 తెల్లవారుతుండగా యేసు గ్రామం వదిలి ఎడారిలో ఒంటరిగా ఒక ప్రత్యేక స్థలానికి వెళ్ళాడు. ప్రజలాయన కోసం వెతుకుతూ ఆయనున్న చోటికి వచ్చారు. ఆయన తమను మళ్ళీ వదిలి వెళ్ళకుండా చెయ్యాలని ప్రయత్నించారు. 43 కాని యేసు, “దేవుని రాజ్యం యొక్క సువార్త నేను యితర పట్టణాల్లో కూడా ప్రకటించాలి. దేవుడు నన్ను అందుకే పంపాడు” అని అన్నాడు.
44 ఆయన యూదయ ప్రాంతాల్లోని సమాజ మందిరాల్లో బోధించాడు.
© 1997 Bible League International