Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
2 ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
3 నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
4 అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.
అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
5 తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
6 సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.
7 యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
8 యెహోవా చట్టాలు సరియైనవి.
అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.
9 యెహోవాను ఆరాధించుట మంచిది.
అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.
బీదలకు నెహెమ్యా సహాయం
5 తమ యూదా సోదరుల మీద చాలామంది బీదవాళ్లు ఫిర్యాదు చేయసాగారు. 2 వాళ్లలో కొందరు, “మాకు చాలామంది పిల్లపాపలు వున్నారు. మేముతిండి తిని బ్రతికి వుండాలంటే, మాకు ధాన్యము దొరకాలి!” అన్నారు.
3 మరికొందరు, “ఇది కరువు కాలం. మేము ధాన్యము కోసం మా పొలాలు, ద్రాక్షతోటలు, ఇళ్లు కుదువ పెట్టాల్సి వస్తోంది” అని మొత్తుకున్నారు.
4 వేరే కొందరు, “మేము మా పొలాలకీ, ద్రాక్షాతోటలకీ రాజు విధించిన పన్నులు చెల్లించాలి. అయితే, ఆ పన్నులు చెల్లించేందుకు మా దగ్గర డబ్బులు లేక అప్పులు చేయవలసి వస్తోంది. 5 ఆ ధనికుల్ని చూడండి. మేము వాళ్లలాంటి మనుష్యులం కామా? వాళ్ల కొడుకులకి మా కొడుకులు ఏమైనా తీసి పోయారా? అయితేనేమి, మేము మా కొడుకుల్నీ, కూతుళ్లనీ బానిసలుగా అమ్ముకోవలసి వస్తోంది. ఇప్పటికే మాలో కొంతమందిమి మా కూతుళ్లను బానిసలుగా అమ్ముకోవలసి వచ్చింది! మాకు వేరే గత్యంతరం లేదు! ఇప్పటికే మేము మా పొలాలను, ద్రాక్షాతోటలను కోల్పోయాము! అవి ఇప్పుడు ఇతరుల చేతుల్లోకి పోయాయి” అని వాపోయారు.
6 వాళ్ల ఫిర్యాదులు వినేసరికి నాకు చాలా కోపం వచ్చింది. 7 నన్ను నేనే అణచుకుని, ఆ ధనిక కుటుంబాల దగ్గరికీ, ఉద్యోగుల వద్దకీ వెళ్లి, వారి మీద కోపగించుకొని ఇలా చెప్పాను: “మీరు మీ సోదరులకే అప్పులిచ్చి, వారిని వడ్డీ కట్టమని అడుగుతున్నారు. మీరిది కట్టి పెట్టాలి!” అప్పుడు నేను జనులందర్నీ ఒక చోట సమావేశ పరచి, 8 వాళ్లతో ఇలా చెప్పాను, “మన యూదా సోదరులు ఇతర దేశాల వాళ్లకి బానిసలుగా అమ్మబడుతున్నారు. మనం వాళ్లని కొని, వాళ్లని స్వతంత్రులను చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించాము. కాని ఇప్పడు మీరు మళ్లీ వాళ్లని బానిసలుగా అమ్మేస్తున్నారు!”
ఆ ధనికులూ, ఉద్యోగులూ మౌనంగా ఉండి పోయారు. వాళ్లకి ఏమి చెప్పేందుకూ తోచలేదు. 9 సరే, నేను ఇంకా ఇలా కొనసాగించాను: “మీరు చేస్తున్న పని సరైనది కాదు. దేవునిపట్ల భయభక్తులు కలిగి వుండాలన్న విషయం మీకు తెలుసు ఇతరులు చేసే సిగ్గుచేటైన పనులు మీరు చెయ్యకూడదు! 10 నా మనుష్యులూ, నా సోదరులూ, నేను కూడా డబ్బూ, ధాన్యము అప్పుగా ఇస్తున్నాను. అయితే, ఆ అప్పుల మీద వడ్డీ చెల్లించమని నిర్బంధించడం మనం మానుకోవాలి! 11 మీరు వాళ్లనుంచి తీసుకున్న పొలాలు, ద్రాక్షాతోటలు, ఒలీవ పొలాలు, ఇళ్లు వాళ్లకి తక్షణం తిరిగి ఇచ్చెయ్యాలి! మీరు వాళ్ల దగ్గర వసూలు చేసిన వడ్డీ సొమ్ము కూడా వాళ్లకి తక్షణం తిరిగి ఇచ్చెయ్యాలి! వాళ్లకి అప్పుగా ఇచ్చిన డబ్బుకు, ధాన్యానికీ, తాజా ద్రాక్షారసానికి, ఒలీవ నూనెకు మీరు ఒక శాతం వడ్డి తీసుకుంటున్నారు. మీరు సొమ్ము వాళ్లకి తిరిగి ఇచ్చెయ్యాలి!”
12 అప్పుడా ధనవంతులూ, ఉద్యోగులూ ఇలా సమాధానమిచ్చారు, “మేము వారి ఆస్తులను, వారిమీద వేసిన వడ్డీలను తిరిగి ఇచ్చేస్తాము. మేము వాళ్ల దగ్గర్నుంచి ఇంకేమీ అడగము. నెహెమ్యా, మేము నీవు చెప్పినట్లే చేస్తాము.”
తర్వాత నేను యాజకులను పిలిచాను. ధనికులచేతా, ఉద్యోగులచేతా తాము చెప్పిన మాటలను అమలు చేస్తామని యాజకుల సమక్షంలో దేవునికి ప్రమాణం చేసేలా చూశాను. 13 తర్వాత నేను నా దుస్తుల మడతలు పోయేలా వాటిని దులిపి, ఇలా చెప్పాను, “తన వాగ్దాన భంగం చేసిన ప్రతివానికీ దేవుడు ఇదే చేస్తాడు. దేవుడు వాళ్లని వాళ్ల ఇళ్ల నుంచి బయటికి విసిరిపారేస్తాడు. తాము కూడబెట్టుకున్న వన్నీ వాళ్లు కోల్పోతారు! ఆ వ్యక్తి తన సర్వస్వం కోల్పోతాడు!”
నేను చెప్పిన ఈ విషయాలన్నింటికీ వాళ్లందరూ ఒప్పుకొనెదమని చెప్పిరి. వాళ్లంతా, “ఆమేన్!” అన్నారు. యెహోవాను స్తుతించారు. ఆ మనుష్యులు తాము ఒప్పుకొన్న ప్రకారం అన్ని జరిగించిరి.
యోసేపు, మరియ ఇంటికి తిరిగి రావటం
39 ప్రభువు ధర్మశాస్త్రానుసారం చేయవలసినవన్నీ చేశాక మరియ, యోసేపులు తమ స్వగ్రామమైన గలిలయలోని నజరేతుకు తిరిగి వెళ్ళిపోయారు. 40 యేసు పెరిగి పెద్ద వాడయ్యాడు. బలంతోపాటు తెలివి కూడా ఆయనలో అభివృద్ధి కొనసాగింది. దేవుని అనుగ్రహం ఆయన మీద ఉంది.
పన్నెండు ఏండ్ల తర్వాత
41 ప్రతి సంవత్సరం ఆయన తల్లిదండ్రులు పస్కా పండుగకు యెరూషలేము వెళ్ళేవాళ్ళు. 42 కనుక ఎప్పటిలాగే అలవాటు ప్రకారం యేసుకు పన్నెండు సంవత్సరాలున్నప్పుడు వాళ్ళు పండుగ కోసం యెరూషలేముకు వెళ్ళారు. 43 పండుగ తర్వాత ఆయన తల్లిదండ్రులు తిరిగి తమ ఊరికి వెళ్ళటానికి ప్రమాణమయ్యారు. కాని యేసు యెరూషలేములోనే ఉండిపొయ్యాడు. తల్లిదండ్రులకు ఇది తెలియదు. 44 తమ గుంపులో ఉన్నాడనుకొని వాళ్ళు ఒక రోజంతా ప్రయాణం చేసారు. తమతో లేడని గ్రహించాక వాళ్ళు తమ స్నేహితులతో, బంధువులతో ఉన్నాడనుకొని వాళ్ళలో వెతకసాగారు. 45 ఆయన కనిపించక పోయే సరికి వాళ్ళు ఆయన్ని వెతకటానికి యెరూషలేము తిరిగి వెళ్ళారు.
46 మూడు రోజులు వెతికాక ఆయన వాళ్ళకు మందిరంలో కూర్చొని వాళ్ళు చెప్పినవి వింటూ, వాళ్ళను ప్రశ్నిస్తూ ఉండగా కన్పించాడు. 47 ఆయనలో ఉన్న గ్రహింపు శక్తికి, ఆయన సమాధానాలకు అక్కడవున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. 48 ఆయన తల్లిదండ్రులు కూడా ఆయన్ని చూసి చాలా ఆశ్చర్య పోయారు. యేసు తల్లి ఆయనతో, “ఇలా ఎందుకు చేసావు బాబు? నేను, మీ నాన్న దిగులుపడి అన్ని చోట్లా వెతికాము!” అని అన్నది.
49 యేసు, “నా కోసం ఎందుకు వెతికా రమ్మా! నేను నా తండ్రి పనిలో ఉండాలని మీకు తెలియదా?” అని అన్నాడు. 50 వాళ్ళకు ఆయన అన్న మాటలు అర్థం కాలేదు.
51 ఆ తర్వాత ఆయన వాళ్ళ వెంట నజరేతుకు వెళ్ళాడు. వినయ విధేయతలతో నడుచుకునే వాడు. కాని ఆయన తల్లి జరిగిన ఈ సంఘటనల్ని తన మనస్సులో ఆలోచిస్తూ ఉండేది. 52 యేసు జ్ఞానంలో, బలంలో, అభివృద్ధి చెందుతూ పెరగసాగాడు. దేవుని మెప్పు, ప్రజల మెప్పు సంపాదించాడు.
© 1997 Bible League International