Revised Common Lectionary (Complementary)
106 యెహోవాను స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
2 యెహోవా నిజంగా ఎంత గొప్పవాడో ఏ ఒక్కరూ వర్ణించలేరు.
ఏ ఒక్కరూ సరిపడినంతగా దేవుని స్తుతించలేరు.
3 దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారు సంతోషంగా ఉంటారు.
ఆ ప్రజలు ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూంటారు.
4 యెహోవా, నీవు నీ ప్రజల యెడల దయ చూపేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
నన్ను కూడా రక్షించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
5 యెహోవా, నీ జనులకు నీవు చేసే మంచివాటిలో
నన్ను పాలుపొందనిమ్ము
నీ ప్రజలతో నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
నీ జనంతో నన్ను నీ విషయమై అతిశయించనిమ్ము.
6 మా పూర్వీకుల్లా మేము కూడా పాపం చేసాము.
మేము తప్పులు చెడుకార్యాలు చేసాము.
7 యెహోవా, ఈజిప్టులో నీవు చేసిన అద్భుతాలను మా పూర్వీకులు సరిగ్గా అర్థం చేసుకోలేదు.
నీ అపరిమితమైన ప్రేమను వారు జ్ఞాపకముంచుకోలేదు.
ఎర్రసముద్రం వద్ద మహోన్నతుడైన దేవునికి
విరోధంగా ఎదురు తిరిగారు.
8 అయినా ఆయన తన నామము కోసం వారిని రక్షించాడు,
ఎందుకంటే తన మహాశక్తిని వారికి తెలియజేయాలని.
9 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా ఎర్రసముద్రం ఎండిపోయింది.
దేవుడు మన పూర్వీకులను లోతైన సముద్రంలో ఎడారివలె ఎండిన నేలను ఏర్పరచి, దానిమీద నడిపించాడు.
10 మా పూర్వీకులను వారి శత్రువుల నుండి దేవుడు రక్షించాడు.
వారి శత్రువుల బారి నుండి దేవుడు వారిని కాపాడాడు.
11 అప్పుడు దేవుడు వారి శత్రువులను సముద్రంలో ముంచి, కప్పివేసాడు.
వారి శత్రువులు ఒక్కడూ తప్పించుకోలేదు!
12 అప్పుడు మన పూర్వీకులు దేవుణ్ణి నమ్మారు.
వారు ఆయనకు స్తుతులు పాడారు.
సెలోపెహాదు కుమార్తెలు
27 హెసెరు కుమారుడు సెలోపెహాదు. హెసెరు గిలాదు కుమారుడు. గిలాదు మాకీరు కుమారుడు. మాకీరు మనష్షే కుమారుడు. మనష్షే యోసేపు కుమారుడు. సెలోపెహాదుకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. 2 సన్నిధి గుడారం దగ్గర సమావేశం అవుతోన్న మోషే, యాజకుడైన ఎలియాజరు, పెద్దలు, ప్రజలు అందరి ముందరకు ఈ అయిదుగురు స్త్రీలూ వెళ్లి, సన్నిధి గుడారం ఎదుట నిలబడ్డారు.
ఈ ఐదుగురు కూతుళ్లు ఈ విధంగా చెప్పారు: 3 “మనం అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడే మా తండ్రి చనిపోయాడు. అతడు కోరహు గుంపులో చేరినవాడు కాడు. (కోరహు యెహోవానుంచి తొలగి ఎదురు తిరిగినవాడు.) మా తండ్రిది సహజ మరణం. కానీ మా తండ్రికి కుమారులు లేరు. 4 అంటే మా తండ్రి పేరు కొనసాగదు. మా తండ్రి పేరు కొనసాగక పోవటం సక్రమం కాదు. ఆయనకు కుమారులు లేరు గనుక ఆయన పేరు అంతం అవుతుంది. అందుచేత మా తండ్రి సోదరులకు వచ్చే భూమిలో మాకు కొంత ఇవ్వవలసిందిగా మేము మీకు మనవి చేస్తున్నాము.”
5 కనుక ఏమి చేయాలని యెహోవాను మోషే అడిగాడు. 6 అతనితో యెహోవా ఇలా అన్నాడు, 7 “సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది సరియైనదే. వాళ్లు వారి తండ్రి సోదరులతో పాటు భూమిని పంచుకోవలసిందే. కనుక నీవు వారి తండ్రికిచ్చిన భూమిని వారికి ఇవ్వాలి.
8 “కనుక ఇశ్రాయేలు ప్రజలకు, ఇలా చట్టం తయారు చేయి. ‘ఒకనికి కుమారులు లేకుండానే అతడు చనిపోతే, అతని ఆస్తి అంతా అతని కుమార్తెలకు ఇవ్వాలి. 9 అతనికి కుమార్తెలు లేకపోతే, అతని ఆస్తి అంతా అతని సోదరులకు ఇవ్వాలి. 10 అతనికి సోదరులు లేకపోతే అతని ఆస్తి అంతా అతని తండ్రి సోదరులకు ఇవ్వాలి. 11 అతని తండ్రికి సోదరులు లేకపోతే, అతని ఆస్తి అంతా, అతని కుటుంబంలో దగ్గర బంధువులకు ఇవ్వాలి. ఇశ్రాయేలు ప్రజల్లో ఇది ఒక చట్టంగా ఉండాలి. యెహోవాయే ఈ ఆజ్ఞను మోషేకు ఇస్తున్నాడు.’”
దేహం యొక్క వెలుగు
(మత్తయి 5:15; 6:22-23)
33 “దీపాన్ని వెలిగించి, యింటికి వచ్చే పోయే వాళ్ళకు కనిపించేలా ఒక ఎత్తైన బల్ల మీద పెడ్తాము కాని, గంప క్రింద దాచి ఉంచము. 34 మీ కళ్ళు దేహానికి దీపం లాంటివి. మీ కళ్ళు బాగుంటే మీ దేహమంతా కాంతితో వెలుగుతుంది. కాని, అవి చెడిపోతే, మీ దేహమంతా చీకటైపోతుంది. 35 అందువలన మీలో ఉన్న వెలుగు చీకటైపోకుండా చూసుకొండి. 36 మీ దేహమంతా కొంచెం కూడా చీకటిలో లేకుండా వెలుగుతూ ఉంటే అది సంపూర్ణంగా వెలుగుతూ ఉంటుంది. ఆ దేహం దీపపు వెలుగు ప్రకాశించినట్లు ప్రకాశిస్తుంది.”
© 1997 Bible League International