Revised Common Lectionary (Complementary)
సొలొమోను కీర్తన.
72 దేవా, రాజు నీవలె జ్ఞానముగల తీర్మానాలు చేయుటకు సహాయం చేయుము.
రాజకుమారుడు నీ మంచితనం గూర్చి నేర్చుకొనేందుకు సహాయం చేయుము.
2 నీ ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేందుకు రాజుకు సహాయం చేయుము.
నీ పేద ప్రజలకు ఏది మంచిదో దానిని చేయుటకు అతనికి సహాయం చేయుము.
3 దేశం అంతటా శాంతి, న్యాయం ఉండనీయుము.
4 పేద ప్రజలకు రాజు న్యాయంగా ఉండునుగాక.
నిస్సహాయులకు అతణ్ణి సహాయం చేయనిమ్ము. వారిని బాధించే ప్రజలను అతణ్ణి శిక్షించనిమ్ము.
5 సూర్యుడు ప్రకాశించునంత వరకు ఆకాశంలో చంద్రుడు ఉన్నంత వరకు
ప్రజలు రాజుకు భయపడి గౌరవిస్తారని ఆశిస్తున్నాను.
ప్రజలు అతనికి శాశ్వతంగా భయపడి గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను.
6 పొలాల మీద కురిసే వర్షంలా రాజు ఉండునట్లు అతనికి సహాయం చేయుము.
నేలమీద పడే జల్లులా ఉండుటకు అతనికి సహాయం చేయుము.
7 అతడు రాజుగా ఉండగా మంచితనం వికసించనిమ్ము.
చంద్రుడున్నంతవరకు శాంతిని కొనసాగనిమ్ము.
8 సముద్రం నుండి సముద్రానికి, నది నుండి భూమి మీద దూర స్థలాలకు
అతని రాజ్యాన్ని విస్తరింపనిమ్ము.
9 అరణ్యంలో నివసించే ప్రజలను అతనికి సాగిలపడనిమ్ము
అతని శత్రువులందరూ ధూళిలో వారి ముఖాలు పెట్టుకొని అతని యెదుట సాగిలపడనిమ్ము.
10 తర్షీషు రాజులు మరియు దూర తీరాల రాజులు అతనికి కానుకలు సమర్పించుదురు గాక.
షేబ మరియు సెబా రాజులు అతనికి కప్పం చెల్లించెదరు గాక.
11 రాజులందరూ మన రాజుకు సాగిలపడుదురు గాక.
రాజ్యాలన్నీ అతన్ని సేవించెదరు గాక.
12 మన రాజు సహాయం లేని వారికి సహాయం చేస్తాడు.
మన రాజు పేదలకు, నిస్సహాయులకు సహాయం చేస్తాడు.
13 పేదలు, నిస్సహాయులు ఆయన మీద ఆధారపడతారు.
రాజు వారిని బ్రతికించి ఉంచుతాడు.
14 వారిని బాధించుటకు ప్రయత్నించే కృ-రుల బారినుండి రాజు వారిని రక్షిస్తాడు.
ఆ పేద ప్రజల ప్రాణాలు రాజుకు చాలా ముఖ్యం.
15 రాజు దీర్ఘాయుష్మంతుడగును గాక.
షేబ నుండి బంగారం అతడు తీసుకొనును గాక.
రాజుకోసం ఎల్లప్పుడూ ప్రార్థించండి.
ప్రతిరోజూ అతణ్ణి దీవించండి.
16 పొలాలు పుష్కలంగా ధాన్యం పండించునుగాక.
కొండలు పంటలతో నిండిపోవునుగాక.
పొలాలు లెబానోనులోని పొలాలవలె సారవంతంగా ఉండును గాక.
పొలాలు గడ్డితో నిండిపోయినట్లు పట్టణాలు ప్రజలతో నిండిపోవును గాక.
17 రాజు శాశ్వతంగా ప్రసిద్ధినొందునుగాక.
సూర్యుడు ప్రకాశించునంతవరకు ప్రజలు అతని పేరును జ్ఞాపకం చేసికొందురు గాక.
అతని మూలంగా ప్రజలందరూ ఆశీర్వదించబడుదురు గాక.
మరియు వారందరూ అతన్ని దీవించెదరుగాక.
18 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
అలాంటి అద్భుతకార్యాలు చేయగలవాడు దేవుడు ఒక్కడే.
19 ఆయన మహిమగల నామాన్ని శాశ్వతంగా స్తుతించండి.
ఆయన మహిమ ప్రపంచమంతా వ్యాపించును గాక.
ఆమేన్, ఆమేన్!
20 యెష్షయి కుమారుడు దావీదు ప్రార్థనలు ఇంతటితో సమాప్తం.
కలయొక్క అర్థమును దానియేలు చెప్పుట
24 తర్వాత దానియేలు అర్యోకు వద్దకు వెళ్లాడు. బబులోనులోని వివేకవంతుల్ని చంపటానికి రాజు అర్యోకును ఎంపిక చేశాడు. “బబులోనులోని వివేకవంతుల్ని చంపవద్దు. నన్ను రాజు వద్దకు తీసుకొని వెళ్లు. కలను గురించి, దాని అర్థాన్ని గురించి నేను చెప్తాను” అని దానియేలు అన్నాడు.
25 దానియేలును అర్యోకు తక్షణం రాజువద్దకు తీసుకొని వెళ్లాడు. అర్యోకు రాజుతో, “యూదానుంచి బందీలుగా వచ్చిన మనుష్యులలో నేనొక వ్యక్తిని చూశాను. కలయొక్క అర్థాన్ని రాజైన తమకు అతను వివరించగలడు” అని చెప్పాడు.
26 రాజు దానియేలుకు (బెల్తెషాజరుకు) ఒక ప్రశ్న వేశాడు. “నీవు నా కలను గూర్చి, దాని అర్థాన్ని గూర్చి చెప్పగలవా?”
27 దానియేలు, “నెబుకద్నెజరు రాజా! వివేకవంతుడుగాని, ఇంద్రజాలికుడుగాని, కల్దీయుడుగాని రాజు అడిగిన రహస్య విషయాలగురించి చెప్పలేడు. 28 కాని పరలోకమందున్న దేవుడు మరుగైన విషయాలగురించి చెప్పగలడు. భవిష్యత్తులో జరగబోయేదాన్ని చూపించడానికి దేవుడు రాజుకు ఒక కలను ఇచ్చాడు. నీవు నీ పడకమీద పడుకొని ఉండగా చూచిన విషయాలు ఇవి. 29 రాజా! నీ పడకమీద పడుకొని భవిష్యత్తులో ఏమి జరుగునో అని తలంచుచూ నీవు నిద్రించావు. గుప్త విషయాల గురించి దేవుడే చెప్పగలడు. భవిష్యత్తులో ఏమి జరుగునో దేవుడే నీకు చూపాడు. 30 దేవుడు ఈ రహస్యం నాకు కూడా తెలిపాడు. ఎందుకంటే, ఇతర వివేకవంతులకంటే నాకు ఎక్కువ వివేకం కలదనే కారణం కాదు. రాజువైన నీవు దాని అర్థమేమిటో గ్రహించాలని తలంచి దేవుడు ఈ రహస్య విషయం నాకు తెలిపాడు. ఆ విధంగా నీ మనుస్సులోని ఆలోచనల్ని నీవు గ్రహించగలవు” అని అన్నాడు.
31 “రాజా, నీవు నీ కలలో ఒక పెద్ద విగ్రహం నీ ముందు నిలిచియుండటం చూశావు. అది తళతళ మెరుస్తూ భయంకరంగా ఉండినది. 32 విగ్రహంయొక్క తల స్వచ్ఛమైన బంగారంతోను, రొమ్ము, చేతులు వెండితోను, పొట్ట, తొడలు కంచుతోను, 33 మోకాళ్ల క్రింది భాగం ఇనుముతోను, పాదాలు మట్టి, ఇనుముతోను కలిసి చేయబడినవి. 34 నీవు ఆ విగ్రహంవైపు చూస్తూ ఉండగా, ఒక రాయి మానవుని చేతితో తీయ బకుండా గాలిలో ఎగిరి, దానంతట అదే వెళ్లి ఇనుముతోను, బంకమట్టితోను చేయబడిన విగ్రహం పాదాలమీద పడి, దానిని పొడిపొడి చేసింది. 35 తర్వాత ఇనుము, బంకమట్టి, కంచు, వెండి, బంగారం పొడిపొడి అయ్యాయి. ఆ పొడి గాలికి కొట్టుకొనిపోయి కనబడకుండా పోయింది. తర్వాత విగ్రహాన్ని పొడి చేసిన ఆ రాయి పెద్ద కొండగా మారిపోయి భూమి అంతటా వ్యాపించింది.
36 “అదే నీ కల. ఇప్పుడు ఆ కలయొక్క అర్థమేమిటో మేము రాజుకు వివరిస్తాము. 37 రాజా, నీవు చాలా ముఖ్యుడవైన రాజువి. పరలోకమందున్న దేవుడు నీకు అధికారం, బలం, రాజ్యం, ప్రఖ్యాతిని, ప్రసాదించాడు. 38 నీవు ప్రజల్ని, భూజంతువుల్ని, ఆకాశ పక్షుల్ని లోబరచుకొని, పరిపాలించే శక్తిని ఆయన నీకు ఇచ్చాడు. వాళ్లందరూ, అవన్నీ ఎక్కడున్నా, దేవుడు నీవు పరిపాలించేటట్లు చేశాడు. ఓ నెబుకద్నెజరు రాజా! ఆ విగ్రహపు బంగారు తల నీవే.
39 “మరో రాజ్యం నీ తర్వాత వస్తుంది. అది వెండి లాంటిది. కాని ఆ రాజ్యం నీ రాజ్యంలా అంత గొప్పగా ఉండదు. ఆ తర్వాత మూడవ రాజ్యం భూమిని పరిపాలిస్తుంది. అది కంచు లాంటిది. 40 తర్వాత నాలుగవ రాజ్యం వస్తుంది. అది ఇనుములా శక్తివంతంగా ఉంటుంది. ఇనుము బ్రద్దలుచేసి ముక్కలు మక్కలుగా విరుగకొడుతుంది. ఆ విధంగానే, ఆ నాలుగవ రాజ్యం ఇతర రాజ్యాల్ని ముక్కలుగా పగులగొడుతుంది.
41 “ఆ విగ్రహం పాదాలు, వ్రేళ్లు కొంత ఇనుముతోను, కొంత బంకమట్టితోను చేయబడినవిగా నీవు చూశావు. అనగా, ఆ రాజ్యం భాగాలైన రాజ్యంగా ఉంటుంది. నీవు ఇనుమూ, బంకమట్టి కలిసినట్టుగా చూశావు గనుక ఆ రాజ్యం కొంతవరకు ఇనుమునకున్నంత బలంగానూ, బంకమట్టిలా బలహీనంగానూ ఉంటుందని అర్థం. 42 ఆ విగ్రహంయొక్క పాదాలు, బొటనవ్రేళ్లు ఇనుము, బంకమట్టితో కలిసి ఉన్నట్లుగా చూశావు. అలాగే ఆ రాజ్యం కొంత ఇనుమువలె బలంగాను, కొంత బంకమట్టివలె బలహీనంగానూ ఉంటుంది. 43 (నీవు ఇనుము బంకమన్నుతో కలిసింది చూశావు.) ఆ విధంగానే, ఆ మనుష్యులు ఒకరితోనొకరు కలసిమెలసి వుండలేరు.
44 “ఆ రాజ్యపు పరిపాలకుల కాలంలో పరలోకమందున్న దేవుడు మరొక రాజ్యం స్థాపిస్తాడు. ఈ రాజ్యం ఎల్లప్పుడూ ఉంటుంది. అది యెన్నటికీ నాశనం కాదు! అది దాన్ని పొందేవాళ్లకి తప్ప వేరే వాళ్లకు చెందదు. ఈ రాజ్యం ఇతర రాజ్యాలన్నిటినీ నాశనం చేసి అంతం చేస్తుంది. కాని ఆ రాజ్యం మాత్రమే సదాకాలం కొనసాగుతూ ఉంటుంది.
45 “నెబుకద్నెజరు రాజా, ఒక పర్వతంనుండి విరిగిన ఒక రాయిని నీవు చూశావు. అది మనిషి చేతులతో తీయబడింది కాదు. ఆ రాయి ఇనుమును, కంచును, బంకమట్టిని, వెండిని, బంగారాన్ని ముక్కలుగా విరుగగొట్టింది. ఈ విధంగా, దేవుడు భవిష్యత్తులో జరగనున్నదాన్ని నీకు చూపాడు. కల నిజం, దాని అర్థం నమ్మదగినది” అని దానియేలు రాజుతో చెప్పాడు.
46 అప్పుడు రాజైన నెబుకద్నెజరు దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజు దానియేలును గౌరవించాలనుకొన్నాడు. కాబట్టి అతనికి అర్పణాన్ని, ధూపాన్ని సమర్పించాలని ఆజ్ఞాపించాడు. 47 అప్పుడు దానియేలుతో రాజు, “నీవు దేవుడు గొప్పవాడనీ, శక్తిమంతుడనీ నేను నిస్సందేహంగా తెలుసుకున్నాను. ఆయన రాజులకు రాజు, దేవుళ్ళకు దేవుడు. ప్రజలకు తెలియని విషయాలు ఆయన చెపుతాడు. ఈ రహస్య విషయాలన్నిటినీ నీవు నాకు చెప్పావు కాబట్టి, ఇది సత్యమని నేను భావిస్తున్నాను” అని అన్నాడు.
48 అప్పుడు రాజు దానియేలుకు తన రాజ్యంలో అతి ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు. మరియు రాజు ఖరీదైన కానుకలు ఎన్నో అతనికిచ్చాడు. నెబుకద్నెజరు దానియేలును బబులోను రాజ్యమంతటికీ పరిపాలకునిగా చేశాడు. బబులోనులోని వివేకవంతులందరిమీద దానియేలును అధికారిగా నియమించాడు. 49 షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బబులోను రాజ్యంలో ముఖ్యులైన అధికారులుగా నియమింపుమని దానియేలు రాజుని కోరాడు. దానియేలు చెప్పినట్లుగానే, రాజు చేశాడు. మరియు దానియేలు రాజు దగ్గరే ఉండేవాడు.
15 మీరు ఏ విధంగా జీవిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. బుద్ధిహీనుల్లాకాక, బుద్ధిగలవారిలా జీవించండి. 16 ఇవి మంచి రోజులు కావు. కనుక వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 17 మూర్ఖంగా ప్రవర్తించకండి. ప్రభువు ఆంతర్యాన్ని తెలుసుకోండి. 18 మత్తు పదార్థాలు త్రాగుతూ, త్రాగుబోతుల్లా జీవించకండి. త్రాగుబోతుతనం వ్యభిచారానికి దారితీస్తుంది. కనుక దానికి మారుగా పరిశుద్ధాత్మతో నింపబడండి. 19 స్తుతిగీతాలతో, పాటలతో, ఆత్మీయ సంకీర్తనలతో హెచ్చరింపబడుతూ, ప్రభువును మీ మనస్సులలో కీర్తిస్తూ, స్తుతిగీతాలు, పాటలు పాడండి. 20 మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట తండ్రియైన దేవునికి అన్ని వేళలా కృతజ్ఞతలు చెల్లించండి.
© 1997 Bible League International