Revised Common Lectionary (Complementary)
12 యెరూషలేమా, యెహోవాను స్తుతించుము.
సీయోనూ, నీ దేవుని స్తుతించుము!
13 యెరూషలేమా, దేవుడు నీద్వారబంధాలను బలపరుస్తాడు.
నీ పట్టణంలోని ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు.
14 నీ దేశానికి దేవుడు శాంతి కలిగించాడు. కనుక యుద్ధంలో నీ శత్రువులు నీ ధాన్యం తీసుకొని పోలేదు.
ఆహారం కోసం నీకు ధాన్యం సమృద్ధిగా ఉంది.
15 దేవుడు భూమికి ఒక ఆజ్ఞ ఇస్తాడు.
దానికి వెంటనే అది లోబడుతుంది.
16 నేల ఉన్నిలా తెల్లగా అయ్యేంతవరకు మంచు కురిసేటట్టు దేవుడు చేస్తాడు.
ధూళిలా గాలిలో మంచు విసిరేటట్టు చేస్తాడు.
17 దేవుడు ఆకాశం నుండి బండలవలె వడగండ్లు పడేలా చేస్తాడు.
ఆయన పంపే చలికి ఎవడూ నిలువ జాలడు.
18 అప్పుడు, దేవుడు మరో ఆజ్ఞ ఇస్తాడు. వెచ్చటి గాలి మరల వీస్తుంది.
మంచు కరిగిపోతుంది. నీళ్లు ప్రవహించటం మొదలవుతుంది.
19 దేవుడు యాకోబుకు (ఇశ్రాయేలు) తన ఆజ్ఞ ఇచ్చాడు.
దేవుడు ఇశ్రాయేలుకు తన న్యాయచట్టాలు, ఆదేశాలు ఇచ్చాడు.
20 దేవుడు యిలా మరి ఏ దేశానికీ చెయ్యలేదు.
ఇతర మనుష్యులకు దేవుడు తన న్యాయ చట్టం ఉపదేశించలేదు.
యెహోవాను స్తుతించండి!
7 ఆ రోజు రాత్రి దేవుడు సొలొమోనుతో స్వప్నములో యిలా అన్నాడు: “సొలొమోనూ, నీకు ఏమి కావాలో కోరుకో.”
8 సొలొమోను దేవునితో యిలా అన్నాడు: “నా తండ్రి దావీదు పట్ల నీవు చాలా దయకలిగియున్నావు. నా తండ్రి స్థానంలో కొత్త రాజుగా వ్యవహరించటానికి నీవు నన్ను ఎంపిక చేశావు. 9 నా ప్రభువైన దేవా నీవు నా తండ్రి దావీదుకు చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు నెరవేర్చు. ఒక గొప్ప రాజ్యానికి నన్ను రాజుగా ఎంపిక చేశావు. ఇక్కడి జనాభా భూమి మీద ధూళిలా విస్తారంగా వుంది. 10 ఇప్పుడు నాకు తెలివిని, జ్ఞానాన్ని ప్రసాదించు. దానివల్ల ఈ అశేష ప్రజానీకాన్ని సన్మార్గంలో నడిపించగలను. నీ సహాయం లేకుండా ఈ ప్రజానీకాన్ని ఏ ఒక్కడూ పరిపాలించలేడు!”
11 అది విని సొలొమోనుతో దేవుడు యీలా అన్నాడు: “నీ ప్రవర్తన బాగుంది. నీవు ఐశ్వర్యాన్నిగాని, ధనికులకుండే భోగ భాగ్యాలను గాని, పేరుప్రతిష్ఠలనుగాని కోరలేదు. నీ శత్రువులంతా నాశనం కావాలని కూడా నీవు కోరలేదు. నీవు చాలాకాలం బ్రతకాలని దీర్ఘాయుష్షూ కోరలేదు. నా ప్రజలను పాలించటానికి నీవు తెలివిని, వివేచననూ, జ్ఞానాన్ని ప్రసాదించమని కోరావు. ఈ ప్రజలకు రాజుగా నిన్ను నేను ఎంపిక చేశాను. 12 కావున నీకు నేను తెలివిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను. నీకు ధనాన్ని, భాగ్యాలను, గౌరవాన్ని కూడ నేను ఇస్తున్నాను. నీకు ముందున్న రాజులెవ్వరూ ఇంతటి ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని పొందియుండలేదు. నీ తరువాత వచ్చే రాజులుకూడ ఇంతటి భాగ్యాన్ని, ఘనతను కలిగియుండరు.”
13 సొలొమోను గిబియోనులోని ఆరాధనా స్థలానికి వెళ్లాడు. సన్నిధి గుడారాన్ని వదిలి, ఇశ్రాయేలు రాజుగా పాలించటానికి యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
32 “ఆ దినము, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో, పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారునికి గాని మరెవ్వరికి గాని తెలియదు. అది తండ్రికి మాత్రమే తెలుసు. 33 జాగ్రత్తగా, సిద్ధంగా ఉండండి.[a] ఆ సమయం ఎప్పుడు రాబోతోందో మీకు తెలియదు.
34 “ఇది తన యిల్లు విడిచి దూరదేశం వెళ్ళే ఒక మనిషిని పోలి ఉంటుంది. అతడు తన యింటిని సేవకులకు అప్పగిస్తాడు. ప్రతి సేవకునికి ఒక పని అప్పగిస్తాడు. ద్వారం దగ్గరవున్నవానికి కాపలా కాయమని చెబుతాడు. 35 ఎల్లప్పుడు సిద్ధంగా ఉండమని చెబుతాడు. ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, కోడికూసే వేళకు వస్తాడో, సూర్యోదయం వేళకు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. 36 అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రిస్తూ ఉండటం చూస్తాడేమో. 37 హెచ్చరికగా ఉండండి అని మీకు చెబుతున్నాను. అదే ప్రతి ఒక్కనికి చెబుతున్నాను.”
© 1997 Bible League International