Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 సమూయేలు 2:18-20

18 కానీ సమూయేలు యెహోవాను సేవించాడు. సమూయేలు ఏఫోదు[a] ధరించిన ఒక బాల సహాయకుడు. 19 ప్రతి సంవత్సరం సమూయేలు తల్లి అతనికై ఒక చిన్న అంగీ తయారుచేసి, తన భర్తతో షిలోహుకు బలి అర్పించేందుకు వెళ్లినపుడు ఆ అంగీని సమూయేలు కొరకు తీసుకొని వెళ్లేది.

20 ఎల్కానాను, అతని భార్యను ఏలీ ఆశీర్వదించేవాడు: “హన్నా ప్రార్థన ఫలితంగా పుట్టిన వానిని మరల యెహోవా సేవకై ఇచ్చారు గనుక అతని స్థానాన్ని భర్తీ చేసే విధంగా హన్నాద్వారా యెహోవా మీకు పిల్లలను కలుగజేయుగాక.”

తర్వాత ఎల్కానా, హన్నా ఇంటికి వెళ్లిపోయారు.

1 సమూయేలు 2:26

26 బాలుడైన సమూయేలు మాత్రం దేవుని దయయందును, మనుష్యుల దయయందును పెరుగుతూ వచ్చాడు.

కీర్తనలు. 148

148 యెహోవాను స్తుతించండి!
పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
సకల దూతలారా, యెహోవాను స్తుతించండి!
    ఆయన సర్వ సైనికులారా,[a] ఆయనను స్తుతించండి!
సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి.
    ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి.
    ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి.
యెహోవా నామాన్ని స్తుతించండి.
    ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు.
    ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు!
    మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.
అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి,
    తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను,
    దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు.
    నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
12 యువతీ యువకులను దేవుడు చేశాడు.
    వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
13 యెహోవా నామాన్ని స్తుతించండి!
    ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి!
భూమిపైన, ఆకాశంలోను ఉన్న
    సమస్తం ఆయనను స్తుతించండి!
14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు.
    దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు.
ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!

కొలొస్సయులకు 3:12-17

ప్రతి ఒక్కరితో నూతన జీవముతో నుండండి

12 మీరు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళు. ఆయన ప్రేమిస్తున్న పవిత్రులు. అందువల్ల మీరు సానుభూతి, దయ, వినయము, సాత్వికము, సహనము అలవర్చుకోవాలి. 13 మీలో ఎవడైనా మీకు అన్యాయం చేసినవాడనిపిస్తే కోపగించుకోకుండా అతణ్ణి క్షమించండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా యితరులను క్షమించండి. 14 అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమను అలవర్చుకోండి. అది సంపూర్ణమైన బంధాన్ని, పరిపూర్ణమైన ఐక్యతను కలుగ చేస్తుంది. 15 క్రీస్తు కలుగచేసిన శాంతిని మీ హృదయాలను పాలించనివ్వండి. మీరు ఒకే శరీరంలో ఉండాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీలో శాంతి కలుగచేయాలని ఆయన ఉద్దేశ్యం. కృతజ్ఞతతో ఉండండి.

16 క్రీస్తు సందేశాన్ని మీలో సంపూర్ణంగా జీవించనివ్వండి. మీ తెలివినంతా ఉపయోగించి పరస్పరం సహాయం చేసుకోండి. దైవసందేశాన్ని బోధించుకోండి. దేవునికి మీ హృదయాల్లో కృతజ్ఞతలు తెలుపుకొంటూ స్తుతిగీతాలు, కీర్తనలు పాడుకోండి. వాక్యాలు చదవండి. 17 మాటద్వారా కాని, క్రియా రూపంగా కాని మీరేది చేసినా యేసు ప్రభువు పేరిట చెయ్యండి. ఆయన ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతతో ఉండండి.

లూకా 2:41-52

పన్నెండు ఏండ్ల తర్వాత

41 ప్రతి సంవత్సరం ఆయన తల్లిదండ్రులు పస్కా పండుగకు యెరూషలేము వెళ్ళేవాళ్ళు. 42 కనుక ఎప్పటిలాగే అలవాటు ప్రకారం యేసుకు పన్నెండు సంవత్సరాలున్నప్పుడు వాళ్ళు పండుగ కోసం యెరూషలేముకు వెళ్ళారు. 43 పండుగ తర్వాత ఆయన తల్లిదండ్రులు తిరిగి తమ ఊరికి వెళ్ళటానికి ప్రమాణమయ్యారు. కాని యేసు యెరూషలేములోనే ఉండిపొయ్యాడు. తల్లిదండ్రులకు ఇది తెలియదు. 44 తమ గుంపులో ఉన్నాడనుకొని వాళ్ళు ఒక రోజంతా ప్రయాణం చేసారు. తమతో లేడని గ్రహించాక వాళ్ళు తమ స్నేహితులతో, బంధువులతో ఉన్నాడనుకొని వాళ్ళలో వెతకసాగారు. 45 ఆయన కనిపించక పోయే సరికి వాళ్ళు ఆయన్ని వెతకటానికి యెరూషలేము తిరిగి వెళ్ళారు.

46 మూడు రోజులు వెతికాక ఆయన వాళ్ళకు మందిరంలో కూర్చొని వాళ్ళు చెప్పినవి వింటూ, వాళ్ళను ప్రశ్నిస్తూ ఉండగా కన్పించాడు. 47 ఆయనలో ఉన్న గ్రహింపు శక్తికి, ఆయన సమాధానాలకు అక్కడవున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. 48 ఆయన తల్లిదండ్రులు కూడా ఆయన్ని చూసి చాలా ఆశ్చర్య పోయారు. యేసు తల్లి ఆయనతో, “ఇలా ఎందుకు చేసావు బాబు? నేను, మీ నాన్న దిగులుపడి అన్ని చోట్లా వెతికాము!” అని అన్నది.

49 యేసు, “నా కోసం ఎందుకు వెతికా రమ్మా! నేను నా తండ్రి పనిలో ఉండాలని మీకు తెలియదా?” అని అన్నాడు. 50 వాళ్ళకు ఆయన అన్న మాటలు అర్థం కాలేదు.

51 ఆ తర్వాత ఆయన వాళ్ళ వెంట నజరేతుకు వెళ్ళాడు. వినయ విధేయతలతో నడుచుకునే వాడు. కాని ఆయన తల్లి జరిగిన ఈ సంఘటనల్ని తన మనస్సులో ఆలోచిస్తూ ఉండేది. 52 యేసు జ్ఞానంలో, బలంలో, అభివృద్ధి చెందుతూ పెరగసాగాడు. దేవుని మెప్పు, ప్రజల మెప్పు సంపాదించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International