Revised Common Lectionary (Complementary)
148 యెహోవాను స్తుతించండి!
పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
2 సకల దూతలారా, యెహోవాను స్తుతించండి!
ఆయన సర్వ సైనికులారా,[a] ఆయనను స్తుతించండి!
3 సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి.
ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
4 మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి.
ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి.
5 యెహోవా నామాన్ని స్తుతించండి.
ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
6 ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు.
ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
7 భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు!
మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.
8 అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి,
తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
9 పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను,
దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు.
నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
12 యువతీ యువకులను దేవుడు చేశాడు.
వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
13 యెహోవా నామాన్ని స్తుతించండి!
ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి!
భూమిపైన, ఆకాశంలోను ఉన్న
సమస్తం ఆయనను స్తుతించండి!
14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు.
దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు.
ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!
దేవుడు తన ప్రజలను స్వదేశానికి తీసుకొనివస్తాడు
54 ఓ స్త్రీ, సంతోషంగా ఉండు!
నీకు పిల్లలు పుట్టలేదు,
కానీ నీవు చాలా సంతోషంగా ఉండాలి.
“భర్తగల స్త్రీకంటె ఒంటరి స్త్రీ[a]
ఎక్కువ మంది పిల్లలను కంటుంది.”
అని యెహోవా చెబుతున్నాడు.
2 నీ గుడారం విశాలం చేయి.
నీ ద్వారాలు పూర్తిగా తెరువు.
నీ కుటుంబాన్ని వృద్ధి చేయటం ఆపుజేయకు.
నీ గుడారాన్ని విశాలం చేయి, బలంగా చేయి.
3 ఎందుకంటే నీవు చాలా పెరిగిపోవటం మొదలు పెడతావు.
నీ పిల్లలు అనేక రాజ్యాల నుండి ప్రజలను తీసుకొనివస్తారు.
నాశనం చేయబడిన పట్టణాల్లో ఆ పిల్లలు తిరిగి నివసిస్తారు.
4 భయపడవద్దు!
నీవు నిరాశ చెందవు.
నీ మీద ప్రజలు చెడ్డ మాటలు చెప్పరు.
నీవేమీ ఇబ్బంది పడవు.
నీవు చిన్నదానివిగా ఉన్నప్పుడు నీవు సిగ్గుపడ్డావు.
కానీ ఆ సిగ్గు నీవు ఇప్పుడు మరచిపోతావు.
నీ భర్త పోయినప్పుడు నీకు కలిగిన అవమానాన్ని
నీవు జ్ఞాపకం చేసుకోవు.
5 ఎందుకంటే నిన్ను చేసిన వాడు నీ భర్త (దేవుడు)
గనుక ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.
ఇశ్రాయేలును రక్షించేవాడు ఆయనే. ఆయన ఇశ్రాయేలు పరిశుద్ధుడు.
ఆయన సర్వభూమికి దేవుడు అని పిలువ బడతాడు.
6 నీవు భర్త విడిచిన భార్యవలె ఉన్నావు.
ఆత్మలో నీవు చాలా దుఃఖించావు.
కానీ యెహోవా నిన్ను తనదిగా ఉండేందుకు పిలిచాడు.
యవ్వనంలో వివాహమై, భర్తచే విడిచి పెట్టబడిన స్త్రీలా నీవు ఉన్నావు.
కానీ దేవుడు నిన్ను తనదానిగా ఉండుటకు పిలిచాడు.
7 దేవుడు చెబుతున్నాడు,
“నేను నిన్ను విడిచిపెట్టాను. కానీ కొంతకాలం మట్టుకే.
నేను నిన్ను మళ్లీ నా దగ్గరకు చేర్చుకొంటాను. నేను నీకు గొప్ప దయ చూపిస్తాను.
8 నేను చాలా కోపగించి కొద్ది కాలం పాటు నీ నుండి దాక్కున్నాను.
కానీ శాశ్వతంగా నిన్ను నేను దయతో ఆదరిస్తాను.”
నీ రక్షకుడైన యెహోవా ఇది చెప్పాడు.
9 దేవుడు చెబుతున్నాడు:
“నోవహు కాలంలో ప్రళయంతో నేను ప్రపంచాన్ని శిక్షించినట్టుగా ఉంది ఇది.
ప్రపంచాన్ని మళ్లీ ఎన్నడూ ప్రళయంతో ముంచివేయనని నొవహుకు నేను వాగ్దానం చేశాను.
అదే విధంగా, నేను మరల ఎన్నడు నీ మీద కోపగించి, నిన్నుగూర్చి చెడుగా మాట్లాడనని ప్రమాణం చేస్తున్నాను.”
10 యెహోవా చెబుతున్నాడు: “పర్వతాలు కనిపించకుండా పోవచ్చు,
కొండలు ధూళి కావచ్చును.
కానీ నా దయ నిన్ను ఎన్నటికీ విడువదు.
నేను నీతో సమాధానపడతాను,
అది ఎన్నటికీ అంతం కాదు.”
యెహోవా నీ యెడల కరుణ చూపిస్తాడు. మరియు ఈ సంగతులు చెప్పిన వాడు ఆయనే.
11 “అయ్యో, దీన పట్టణమా!
తుఫానులు నిన్ను బాధించాయి,
మరియు నీవు ఓదార్చబడలేదు.
నేను నిన్ను మరల నిర్మిస్తాను.
ప్రశస్తమైన రాళ్లను ఉపయోగించి నేను నీ పునాదులు వేస్తాను.
నీలాంజనాలు, నీలాలు నేను ఉపయోగిస్తాను.
12 మాణిక్య మణులతో నేను నీ గోడలు కడతాను.
సూర్యకాంతాలతో నేను నీ ద్వారాలు కడతాను.
ప్రశస్త రత్నాలతో నేను నీ గోడలన్నింటినీ కడతాను.
13 నీ పిల్లలు దేవుని వెంబడిస్తారు, ఆయన వారికి ఉపదేశం చేస్తాడు.
నీ పిల్లలకు ఎంతో శాంతి ఉంటుంది.
క్రొత్త యెరూషలేము
21 ఆ తర్వాత నేను ఒక క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని[a] చూసాను. మొదటి ఆకాశం, మొదటి భూమి అదృశ్యమయ్యాయి. ఇప్పుడు సముద్రము లేదు. 2 నేను పరిశుద్ధ పట్టణమైన క్రొత్త యెరూషలేము పరలోకం నుండి దిగిరావటం చూసాను. అది దేవుని నుండి, పెళ్ళి కుమారుని కోసం పెళ్ళికూతురిలా అలంకరించుకొని దిగి వచ్చింది.
3 సింహాసనం నుండి ఒక స్వరం బిగ్గరగా, “ఇక నుండి దేవుడు మానవులతో ఉంటాడు. వాళ్ళతో నివసిస్తాడు. వాళ్ళు ఆయన ప్రజలు; ఆయన వాళ్ళ దేవుడై వాళ్ళతో స్వయంగా ఉంటాడు. 4 వాళ్ళ కళ్ళ నుండి కారిన ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేస్తాడు. పాత సంగతులు గతించిపోయాయి. కనుక యిక మీదట చావుండదు. దుఃఖం ఉండదు. విలాపం ఉండదు, బాధ వుండదు” అని అన్నది.
5 సింహాసనంపై కూర్చొన్నవాడు, “నేను ప్రతి వస్తువును క్రొత్తగా చేస్తాను” అని అన్నాడు. “ఇవి విశ్వసింప దగినవి, సత్యం, కనుక యివి వ్రాయి” అని అన్నాడు.
6 ఆయన నాతో, “అంతా సమాప్తమైంది. అల్ఫా (ఆది), ఓమెగా (అంతం) నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే. దాహంతోవున్నవానికి ఊటనుండి జీవజలాన్ని ఉచితంగా ఇస్తాను. 7 జయించినవాడు వీటన్నిటికీ వారసుడౌతాడు. నేను అతనికి దేవునిగా, అతడు నాకు కుమారునిగా ఉంటాము.
© 1997 Bible League International