Revised Common Lectionary (Complementary)
113 యెహోవాను స్తుతించండి!
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి!
యెహోవా నామాన్ని స్తుతించండి.
2 ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
3 తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి,
సూర్యుడు అస్తమించే స్థలం వరకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
4 యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు.
ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం.
5 ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు.
దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు.
6 ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే
ఆయన తప్పక కిందికి చూడాలి.
7 దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు.
భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు.
8 ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు.
ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు.
9 ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును.
కాని దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు.
యెహోవాను స్తుతించండి!
ఇస్సాకు కుటుంబం
19 ఇస్సాకు కుటుంబం చరిత్ర ఇది. అబ్రాహాముకు ఇస్సాకు అనే కుమారుడు ఉన్నాడు. 20 ఇస్సాకు వయస్సు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు రిబ్కాను అతడు వివాహం చేసుకొన్నాడు. రిబ్కా పద్దనరాముకు చెందినది. ఆమె బెతూయేలు కుమార్తె, అరామీయుడగు లాబానుకు సోదరి. 21 ఇస్సాకు భార్యకు పిల్లలు పుట్టలేదు. కనుక ఇస్సాకు తన భార్య కోసం ప్రార్థించాడు. ఇస్సాకు ప్రార్థన యెహోవా విన్నాడు. రిబ్కాను గర్భవతిని కానిచ్చాడు.
22 రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమె గర్భంలో కవల పిల్లలు పెనుగులాడారు. రిబ్కా యెహోవాను ప్రార్థించి, “ఎందుకు నాకు ఇలా జరిగింది?” అని అడిగింది. 23 ఆమెతో యెహోవా చెప్పాడు:
“నీ గర్భంలో రెండు
జనాంగాలు ఉన్నాయి.
రెండు వంశాల పాలకులు నీలోనుండి పుడతారు.
కాని వారు విభజించబడతారు.
ఒక కుమారుడు మరో కుమారుని కంటే బలవంతుడుగా ఉంటాడు.
పెద్ద కుమారుడు చిన్న కుమారుని సేవిస్తాడు.”
24 తగిన సమయం రాగానే రిబ్కా కవల పిల్లల్ని కన్నది. 25 మొదటి శిశువు ఎరుపు. వాని చర్మం బొచ్చు అంగీలా ఉంది. కనుక వానికి ఏశావు[a] అని పేరు పెట్టబడింది. 26 రెండవ శిశువు పుట్టినప్పుడు వాడు ఏశావు మడిమను గట్టిగా పట్టుకొని ఉన్నాడు. కనుక ఆ శిశువుకు యాకోబు[b] అని పేరు పెట్టబడింది. యాకోబు, ఏశావు పుట్టినప్పుడు ఇస్సాకు వయస్సు 60 సంవత్సరాలు.
27 అబ్బాయిలు పెద్దవాళ్లయ్యారు. ఏశావు నిపుణతగల వేటగాడయ్యాడు. బయట పొలాల్లో ఉండటం అంటే అతనికి చాలా ఇష్టం. అయితే యాకోబు నెమ్మదిపరుడు. అతను తన గుడారంలోనే ఉన్నాడు. 28 ఇస్సాకు ఏశావును చాలా ప్రేమించాడు. ఏశావు వేటాడిన జంతువులను తినటం అతనికి ఇష్టం. కాని రిబ్కాకు యాకోబు మీద ప్రేమ.
క్రీస్తు యొక్క గొప్పతనము
15 క్రీస్తు కనిపించని దేవుని ప్రతిబింబం. ఆయన
అన్నిటికన్నా పూర్వంనుండి అనగా జగత్తుకు
పునాది వేయుటకు ముందునుండి ఉన్నవాడు.
16 క్రీస్తు అన్నిటినీ సృష్టించాడు.
పరలోకంలో ఉన్న వాటిని, భూమ్మీద కనిపించే వాటిని, కనిపించని వాటిని,
సింహాసనాలను, ప్రభుత్వాలను, పాలకులను, అధికారులను, అన్నిటినీ ఆయనే సృష్టించాడు.
అన్నీ తన కోసం సృష్టించుకొన్నాడు.
17 క్రీస్తు ఆదినుండి ఉన్నాడు.
ఆయనలో అన్నీ ఐక్యమై ఉన్నాయి.
18 సంఘం ఆయన శరీరం. ఆయన సంఘానికి శిరస్సు.
ఆయనే అన్నిటికీ మూలం.
చనిపోయి తిరిగి బ్రతికినవాళ్ళలో ఆయన మొదటివాడు.
అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత ఉండాలని దేవుడు యిలా చేసాడు.
19 దేవుడు తనలో ఉన్న పరిపూర్ణత ఆయనలో ఉండటానికి ఆనందంగా అంగీకరించాడు.
20 దేవుడు అన్నిటినీ, అంటే భూమ్మీద ఉన్నవాటినీ, పరలోకంలో ఉన్నవాటిని,
కుమారుని ద్వారా తిరిగి తనలో చేర్చుకోవాలనుకొన్నాడు.
తన కుమారుడు సిలువపై చిందించిన రక్తం ద్వారా ఈ సంధి కలగాలని ఆయన ఉద్దేశ్యం.
© 1997 Bible League International