Revised Common Lectionary (Complementary)
సమాధాన ప్రభువు వస్తున్నాడు
11 యెష్షయి మొద్దునుండి (వంశం నుండి) ఒక చిగురు (శిశువు) పుడుతుంది. యెష్షయి వేరులనుండి అంకురం ఎదుగుతుంది. 2 ఆ శిశువులో యెహోవా ఆత్మ ఉంటుంది. జ్ఞానం, అవగాహన, నడిపింపు, శక్తిని ఆత్మ ఇస్తుంది. ఈ శిశువు యెహోవాను తెలుసుకొని, ఘనపర్చటానికి ఆత్మ సహాయం ఉంటుంది. 3 ఈ శిశువు యెహోవాను ఘనపరుస్తాడు. అందువల్ల శిశువు సంతోషంగా ఉంటాడు.
ఈ శిశువు కనబడే వాటిని బట్టి తీర్పు తీర్చడు. అతడు వినేవిషయాలను బట్టి తీర్పు తీర్చడు. 4-5 బీదలకు అతడు న్యాయంగా, నిజాయితీగా తీర్పుచెబుతాడు. దేశంలో పేద ప్రజలకు జరగాల్సిన విషయాల్లో నిర్ణయాలు చేయాల్సినప్పుడు అతడు న్యాయంగా ఉంటాడు. ప్రజలు కొట్టబడాలని అతడు నిర్ణయిస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు, ఆ ప్రజలు కొట్టబడతారు. ఎవరైనా చావాలని అతడు నిర్ణయం చేస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు. ఆ దుష్టులు చంపబడతారు. మంచితనం, న్యాయం ఈ శిశువుకు బలం ప్రసాదిస్తాయి. అవి అతడు తన నడుముకు కట్టుకొనే పట్టాలా ఉంటాయి.
6 ఆ సమయంలో తోడేళ్లు గొర్రెపిల్లలతో కలిసి శాంతిగా జీవిస్తాయి. పెద్ద పులులు మేక పిల్లలతో కలిసి శాంతంగా పండుకొంటాయి. దూడలు, సింహాలు, ఎద్దులు కలిసి శాంతిగా జీవిస్తాయి. ఒక చిన్న పిల్లాడు వాటిని తోల్తాడు. 7 ఆవులు, ఎలుగుబంట్లు కలిసి శాంతిగా జీవిస్తాయి. వాటి పిల్లలన్నీ కలసి పండుకొంటాయి, ఒక దానిని ఒకటి బాధించవు. సింహాలు, ఆవుల్లా గడ్డి మేస్తాయి. చివరికి సర్పాలు కూడా మనుష్యులకు హాని చేయవు. 8 ఒక చిన్నబిడ్డ నాగుపాముపుట్ట దగ్గర ఆడుకొంటుంది. విషసర్పం పుట్టలో ఒకచిన్న పాప చేయి పెట్టగలుగుతుంది.
9 అంతా శాంతిగా ఉంటుందనీ, ఎవరూ ఒకరిని ఒకరు బాధించుకోరనీ ఈ విషయాలు తెలియ జేస్తున్నాయి. నా పరిశుద్ధ పర్వతం మీద ప్రజలు దేనినీ నాశనం చేయాలని ఆశించరు. ఎందుకంటే, ప్రజలు వాస్తవంగా యెహోవాను తెలుసుకొని ఉంటారు గనుక. సముద్రంనీళ్లతో నిండిపోయినట్టు, వారు దైవజ్ఞానంతో నిండిపోయి ఉంటారు.
20 మోషే, అహరోనులతో యెహోవా 21 “ఈ మనుష్యులకు దూరంగా వెళ్లిపోండి, నేను వాళ్లను ఇప్పుడే నాశనం చేసేస్తాను” అన్నాడు.
22 అయితే మోషే, అహరోనూ సాష్టాంగపడిపోయి “ఓ దేవా, మనుష్యులందరి ఆత్మలను ఎరిగిన యెహోవా నీవు. మొత్తం ఈ గుంపు అంతటి మీద కోపగించకు. నిజానికి పాపం చేసింది ఒక్కడే” అంటూ మొరపెట్టారు.
23 అప్పుడు యెహోవా మోషేతో 24 “కోరహు, దాతాను, అబీరాము గుడారాల దగ్గరనుండి అందర్నీ దూరంగా వెళ్లిపొమ్మని చెప్పు” అన్నాడు.
25 మోషే లేచి దాతాను, అబీరాము దగ్గరకు వెళ్లాడు. ఇశ్రాయేలు పెద్దలంతా అతన్ని వెంబడించారు. 26 మోషే ప్రజలను ఈ రీతిగా హెచ్చరించాడు: “ఈ దుర్మార్గుల గుడారాల నుండి దూరంగా వెళ్లిపొండి. వారి వాటిని ఏవీ తాకకండి. మీరు తాకితే వారి పాపాలవల్ల మీరుకూడ నాశనం చేయబడతారు.”
27 కనుక వాళ్లంతా కోరహు, దాతాను, అబీరాము గుడారాలనుండి దూరంగా వెళ్లిపోయారు. దాతాను, అబీరాము వారి భార్యలు, పిల్లలు, శిశువులతోబాటు వారి గుడారాల బయట నిలబడి ఉన్నారు.
28 అప్పుడు మోషే చెప్పాడు: “నేను మీతో చెప్పిన విషయాలన్నీ చేసేందుకు యెహోవా నన్ను పంపించాడని నేను మీకు రుజువు చూపిస్తాను. అవన్నీ నా స్వంత తలంపులు కావని నేను మీకు చూపిస్తాను. 29 ఈ మనుష్యులు ఇక్కడే చస్తారు. కానీ సాధారణంగా మనుష్యులు చనిపోయే సామాన్య విధానంలోనే గనుక వీరు మరణిస్తే, నన్ను నిజంగా యెహోవా పంపించలేదని అర్థం. 30 కానీ ఈ మనుష్యులు వేరే విధంగా, మరో క్రొత్తరకంగా మరణించేటట్టు యెహోవా గనుక చేస్తే అప్పుడు వీళ్లు నిజంగా యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసారని మీకు తెలుస్తుంది. భూమి తెరచుకొని వీళ్లను మింగేస్తుంది. వారు సజీవ సమాధి అయిపోతారు. వీరికి చెందినది అంతా వీరితోబాటే లోపలికి వెళ్లిపోతుంది.”
31 మోషే ఈ మాటలు చెబుతూ ఉండగానే ఆ మనుష్యుల కాళ్ల క్రింద భూమి తెరచుకొంది. 32 అది భూమి తన నోరు తెరచి వారిని మింగివేసినట్టుగా ఉంది. వారి కుటుంబాలన్నీ, కోరహు మనుష్యులంతా, వారికి ఉన్నదంతా భూమిలోకి వెళ్లిపోయింది. 33 వారు సజీవంగానే సమాధిలోనికి వెళ్లిపోయారు. వారికి ఉన్నదంతా వారితో బాటే లోపలికి వెళ్లిపోయింది. అప్పుడు వారిమీద భూమి కప్పివేసింది. వారు నాశనమైపోయి, పాళెములో లేకుండా పోయారు.
34 నాశనం చేయబడుతోన్న మనుష్యుల అరుపులు ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. అందుచేత వాళ్లంతా “భూమి మనల్నికూడ మ్రింగివేస్తుంది” అంటూ అటు ఇటు పరుగులెత్తారు.
35 తర్వాత యెహోవా దగ్గర్నుండి అగ్ని దిగి వచ్చి, ధూపం వేస్తున్న ఆ 250 మందిని నాశనం చేసింది.
23 పౌలును కలుసుకోవటానికి వాళ్ళు ఒక దినాన్ని నిర్ణయించారు. ఆ రోజు మొదటి రోజుకన్నా ఎక్కువ మంది పౌలు నివసిస్తున్న స్థలానికి వచ్చారు. పౌలు ఉదయంనుండి సాయంకాలం దాకా వాళ్ళతో మాట్లాడి, దేవుని రాజ్యాన్ని గురించి విడమరచి చెప్పాడు. మోషే ధర్మశాస్త్రంనుండి, ప్రవక్తల వ్రాతలనుండి ఉదాహరణలు తీసుకొని, యేసును గురించి చెప్పి వాళ్ళను ఒప్పించటానికి ప్రయత్నించాడు. 24 అతడు చెప్పింది కొందరు నమ్మారు. కొందరు నమ్మలేదు. 25 వాళ్ళలో వాళ్ళకు భేదాభిప్రాయం రావటం వలన వాళ్ళు వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. పౌలు ఈ చివరి మాట చెప్పటం మొదలు పెట్టాడు: “పరిశుద్ధాత్మ మీ పూర్వికులతో యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్పి నిజం పలికాడు:
26 ‘ప్రజలతో ఈ విధంగా చెప్పు:
మీరెప్పుడూ వింటుంటారు.
కాని ఎన్నటికి అర్థం చేసుకోరు!
మీరు అన్ని వేళలా చూస్తుంటారు.
కాని ఎన్నటికి గ్రహించరు.
27 వాళ్ళు కళ్ళతో చూసి,
చెవుల్తో విని హృదయాలతో అర్థం చేసుకొని
నా వైపు మళ్ళితే నేను వాళ్ళకు నయం చేస్తాను.
కాని అలా జరుగకూడదని ఈ ప్రజల
హృదయాలు ముందే మొద్దు బారాయి.
వాళ్ళకు బాగా వినిపించదు.
వాళ్ళు తమ కళ్ళు మూసుకున్నారు.’(A)
28 “అందువల్ల మీరీ విషయాన్ని గ్రహించాలి. రక్షణను గురించి ఈ సందేశం యూదులు కానివాళ్ళ వద్దకు పంపబడింది. వాళ్ళు వింటారు!” 29 [a]
30 పౌలు రెండు సంవత్సరాలు తాను అద్దెకు తీసుకున్న ఇంట్లో నివసించాడు. తనను చూడాలని వచ్చినవాళ్ళందరికీ స్వాగతం చెప్పాడు. 31 ధైర్యంగా, స్వేచ్ఛతో దేవుని రాజ్యాన్ని గురించి చెప్పి, యేసు క్రీస్తు ప్రభువును గురించి బోధించాడు.
© 1997 Bible League International