Revised Common Lectionary (Complementary)
యాత్ర కీర్తన.
126 యెహోవా మమ్మల్ని దేశ బహిష్కరణ నుండి
తిరిగి వెనుకకు తీసుకొని వచ్చినప్పుడు అది ఒక కలలా ఉంది!
2 మేము నవ్వుకుంటున్నాము.
మరియు మేము అకస్మాత్తుగా సంతోషగానాలు పాడటం మొదలుపెట్టేవాళ్లము.
“దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేశాడు.”
3 ఇతర రాజ్యాల ప్రజలు దాన్ని గూర్చి చెప్పుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా మాకు ఆశ్చర్యకరమైన పనులు చేశాడు” అని ఆ ప్రజలు చెప్పారు. మేము చాలా ఆనందంగా ఉన్నాము!
4 యెహోవా మేము ఖైదీలముగా ఉన్నాము.
ఇప్పుడు ఎడారిని వికసింప చేసే నీటి ప్రవాహంలా మమ్మల్ని తిరిగి స్వతంత్రులుగా చేయుము.
5 విత్తనాలు నాటేటప్పుడు ఒకడు దుఃఖముగా ఉండవచ్చు,
కాని పంట కూర్చుకొనేటప్పుడు సంతోషంగా ఉంటాడు.
6 అతడు బయట పొలాల్లోనికి విత్తనం మోసికొని పోవునప్పుడు ఏడ్వవచ్చు,
కాని పంటను ఇంటికి తెచ్చునప్పుడు అతడు సంతోషిస్తాడు.
3 బలహీనమైన చేతుల్ని మళ్లీ బలపర్చండి. బలహీనమైన మోకాళ్లను బలపర్చండి. 4 ప్రజలు భయంతో, కలవరపడుతున్నారు. “బలంగా ఉండండి, భయపడవద్దు” అని ఆ మనుష్యులతో చెప్పండి. చూడండి, మీ దేవుడు వచ్చి, మీ శత్రువులను శిక్షిస్తాడు. ఆయన వచ్చి మీ బహుమానం మీకు ఇస్తాడు. యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడు. 5 అప్పుడు గుడ్డివాళ్లు మళ్లీ చూస్తారు. వారి నేత్రాలు తెరువబడతాయి. అప్పుడు చెవిటివాళ్లు వినగలుగుతారు. వారి చెవులు తెరువబడుతాయి. 6 కుంటివాళ్లు లేడిలా గంతులు వేస్తారు. ఇప్పుడు మాట్లాడలేని మూగవాళ్లు, వారి కంఠం ఎత్తి ఆనంద గీతాలు పాడుతారు. అరణ్యంలో జల ఊటలు పారటం మొదలైనప్పుడు ఇది జరుగుతుంది. ఎండిన భూమిలో నీటి ఊటలు ప్రవహిస్తాయి. 7 ఇప్పుడు నీళ్లలా కనిపించే ఎండమావుల్ని ప్రజలు చూస్తున్నారు. కానీ ఆ సమయంలో నిజంగానే నీళ్ల కొలనులు ఉంటాయి. ఎండిన భూమిలో బావులు ఉంటాయి. భూమిలో నుండి నీళ్లు ఉబుకుతాయి. ఒకప్పుడు అడవిమృగాలు ఏలిన చోట ఎత్తయిన నీటి మొక్కలు పెరుగుతాయి.
యోహాను అడగటానికి పంపిన ప్రశ్న
(మత్తయి 11:2-19)
18 యోహాను శిష్యులు యోహానుకు వీటన్నిటిని గురించి చెప్పారు. 19 అతడు తన శిష్యుల్లో యిద్దర్ని పిలిచి, “రానున్నది మీరేనా? లేక మరొకరి కోసం మేము ఎదురు చూడాలా?” అని ప్రభువును అడిగిరమ్మని పంపాడు.
20 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి, “బాప్తిస్మము నిచ్చి, ఉపదేశం చేసే యోహాను ఈ విధంగా అడిగి రమ్మని మమ్మల్ని పంపాడు: ‘రానున్నది మీరేనా? మరొకరి కోసం మేము ఎదురుచూడాలా?’” అని అన్నారు.
21 వాళ్ళు అక్కడ ఉండగా యేసు రోగగ్రస్తులకు, బాధితులకు, దయ్యాలు పట్టిన వాళ్లకు నయం చేశాడు. చాలా మంది గ్రుడ్డి వాళ్ళకు దృష్టినిచ్చాడు. 22 యేసు, ఆ వర్తమానం తెచ్చిన వాళ్ళతో, “వెళ్ళి యోహానుతో గ్రుడ్డివాళ్ళకు దృష్టి లభిస్తొందని, కుంటివాళ్ళు నడుస్తున్నారని, కుష్టురోగులకు నయమౌతుందని, చెవిటి వాళ్ళు వింటున్నారని, పేదవాళ్ళకు దైవ సందేశము బోధింపబడ్తోందని చెప్పండి. మీరు చూసిన వాటిని, విన్నవాటిని అతనికి చెప్పండి. 23 నన్ను విశ్వసించటానికి వెనుకంజ వెయ్యని వాడు ధన్యుడు” అని అన్నాడు.
24 ఆ వార్త తెచ్చిన వాళ్ళు వెళ్ళి పొయ్యాక యేసు అక్కడ సమావేశమైన ప్రజలకు యోహానును గురించి ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “ఎడారి ప్రాంతాలకు ఏం చూడాలని వెళ్ళారు? రెల్లు గాలికి కదలటం చూడాలని వెళ్ళారా? 25 ఏమి చూడాలని వెళ్ళారు? విలువైన వస్త్రాల్ని ధరించిన వాళ్ళనా? విలువైన వస్త్రాలను ధరించేవారు రాజగృహాల్లో ఉంటారు. 26 మరి ఏమి చూడాలని వెళ్ళారు? ప్రవక్తనా? ఔను, యోహాను ప్రవక్త కన్నా గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. 27 యోహానును గురించి లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
‘ఇతడు నా దూత, ఇతణ్ణి నీ కన్నా ముందుగా పంపుతాను.
ఇతడు నీ కోసం దారి సిద్ధం చేస్తాడు.’(A)
28 యోహాను ప్రపంచములో పుట్టిన మానవులందరి కన్నా గొప్పవాడు. కాని దేవుని రాజ్యంలో అందరికన్నా అల్పుడు యోహాను కన్నా గొప్పవాడని నేను చెబుతున్నాను.”
29 (యోహాను బోధనలు విని ప్రజలు, చివరకు పన్నులు వసూలు చేసేవాళ్ళు కూడా, యోహాను ద్వారా బాప్తిస్మము పొందారు. తద్వారా వాళ్ళు దేవుడు సంకల్పించినట్లు చేసారు. 30 కాని పరిసయ్యులు, శాస్త్రులు యోహాను చేత బాప్తిస్మము పొందటానికి నిరాకరించారు. తద్వారా వాళ్ళు దేవుడు తమకోసం సంకల్పించిన దాన్ని నిరాకరించారు.)
© 1997 Bible League International