Revised Common Lectionary (Complementary)
68 “తన ప్రజలకు స్వేచ్ఛ కలిగించి, రక్షించ వచ్చిన ప్రభువును స్తుతించండి!
ఇశ్రాయేలు ప్రజల దేవుణ్ణి స్తుతించండి!
69 మహాశక్తిగల రక్షకుణ్ణి తన సేవకుడైన దావీదు వంశం నుండి
మనకోసం పంపాడు.
70 గతంలో మహాత్ములైన ప్రవక్తల ద్వారా
ఈ విషయం చెప్పాడు.
71 దేవుడు శత్రువుల బారినుండి,
మనలను ద్వేషించేవారినుండి మనల్ని రక్షిస్తాడు.
72 మన తండ్రులను, తాత ముత్తాతలను కరుణిస్తానన్నాడు.
పవిత్రమైన ఒడంబడిక మరిచి పోనన్నాడు!
73 శత్రువుల బారినుండి రక్షిస్తానని మన తండ్రి అబ్రాహాముతో ప్రమాణం చేశాడు.
74 మనం ఏ భయం లేకుండా తనను సేవించాలి.
75 జీవితాంతం పవిత్రంగా, ధర్మంగా, తన కోసం జీవించాలని ఆయన ఉద్దేశ్యం!
76 “ఓ శిశువా! నీవు సర్వోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు!
ప్రభువు కన్నా ముందు వెళ్ళి ప్రభువు రాకకు మార్గం వేస్తావు!
77 పాపక్షమాపణ ద్వారా రక్షణ కలుగుతుందన్న జ్ఞానాన్ని ఆయన ప్రజలకు బోధిస్తావు!
78 “మన దేవుడు తన కనికరంవల్ల పరలోకం నుండి
ఒక నీతిసూర్యుణ్ణి పంపించి,
79 మరణమనే చీకటి నీడలో నివసించే మనపై ప్రకాశించునట్లు చేసి
మనల్ని శాంతి మార్గంలో నడిపిస్తాడు!”
4 “తీర్పు సమయం వస్తుంది. అది కాలుతున్న అగ్ని గుండంలా ఉంటుంది. ఆ గర్విష్ఠులు అందరూ శిక్షించబడతారు. ఆ దుర్మార్గులు అందరూ గడ్డిలా కాలిపోతారు. ఆ సమయంలో వారు అగ్నిలో మండుతున్న ఒక పొదలా ఉంటారు-దాని కొమ్మగాని, వేరుగాని మిగలదు.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
2 “అయితే నా అనుచరులారా, ఉదయిస్తున్న సూర్యునిలా, మంచితనం మీమీద ప్రకాశిస్తుంది. మరియు సూర్యకిరణాలవలె అది స్వస్థతా శక్తిని తెచ్చిపెడ్తుంది. పాకనుండి విడిచిపెట్టబడిన దూడల్లా, మీరు స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటారు. 3 అప్పుడు మీరు ఆ దుర్మార్గుల మీద నడుస్తారు-వారు మీ పాదాలక్రింద బూడిదలా ఉంటారు. తీర్పు సమయంలో ఆ సంగతులను నేను సంభవింపజేస్తాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు!
4 “మోషే ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం ఉంచుకొని, విధేయత చూపండి. మోషే నా సేవకుడు. హోరేబు (సీనాయి) కొండమీద ఇశ్రాయేలీయులందరికోసం ఆ చట్టాలు, నియమాలు నేను అతనికి ఇచ్చాను.”
5 “చూడండి, ఏలీయా ప్రవక్తను నేను మీ దగ్గరకు పంపిస్తాను. యెహోవానుంచి వచ్చే ఆ మహాభయంకర తీర్పు సమయానికి ముందు ఆయన వస్తాడు. 6 తల్లిదండ్రులు వారి పిల్లలకు సన్నిహితులగుటకు ఏలీయా సహాయం చేస్తాడు. మరియు అతడు (ఏలీయా) పిల్లలు వారి తల్లిదండ్రులకు సన్నిహితులగుటకు సహాయం చేస్తాడు. ఇది జరిగి తీరాలి. లేదా నేను వచ్చి, మీ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తాను,” అని యెహోవా చెప్పాడు!
యేసు అపోస్తలులను పంపటం
(మత్తయి 10:5-15; మార్కు 6:7-13)
9 యేసు తన పన్నెండు మంది శిష్యుల్ని సమావేశ పరిచి దయ్యాల్ని పారద్రోలటానికి, రోగాలను నయం చేయటానికి వాళ్ళకు శక్తి, అధికారము ఇచ్చాడు. 2 వాళ్ళను ప్రపంచంలోకి పంపుతూ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించుమని, రోగాలున్న వాళ్ళకు నయం చెయ్యమని వాళ్ళతో చెప్పాడు. 3 వాళ్ళతో, “ప్రయాణం చేస్తున్నప్పుడు మీ వెంట చేతి కర్రకాని, సంచికాని, ఆహారంకాని, ధనంకాని, మారు దుస్తులు కాని, యితర వస్తువులు కాని తీసుకు వెళ్ళకండి. 4 ఒక యింటికి వెళ్తే ఆ గ్రామం వదిలే దాకా ఆ యిల్లు విడిచి వెళ్ళకండి. 5 ప్రజలు మీకు స్వాగతం ఇవ్వకుంటే ఆ ఊరు వదిలి వెళ్ళే ముందు వాళ్ళు చేసిన పొరపాటు చూపటానికి మీ కాలి ధూళి దులపండి” అని అన్నాడు.
6 ఆ తర్వాత వాళ్ళు బయలు దేరి ప్రతి గ్రామానికి వెళ్ళారు. ప్రతిచోటా దైవ సందేశాన్ని ప్రకటించారు. రోగాలున్న వాళ్ళకు నయం చేసారు.
© 1997 Bible League International