Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లూకా 1:68-79

68 “తన ప్రజలకు స్వేచ్ఛ కలిగించి, రక్షించ వచ్చిన ప్రభువును స్తుతించండి!
    ఇశ్రాయేలు ప్రజల దేవుణ్ణి స్తుతించండి!
69 మహాశక్తిగల రక్షకుణ్ణి తన సేవకుడైన దావీదు వంశం నుండి
    మనకోసం పంపాడు.
70 గతంలో మహాత్ములైన ప్రవక్తల ద్వారా
    ఈ విషయం చెప్పాడు.
71 దేవుడు శత్రువుల బారినుండి,
    మనలను ద్వేషించేవారినుండి మనల్ని రక్షిస్తాడు.
72 మన తండ్రులను, తాత ముత్తాతలను కరుణిస్తానన్నాడు.
    పవిత్రమైన ఒడంబడిక మరిచి పోనన్నాడు!
73 శత్రువుల బారినుండి రక్షిస్తానని మన తండ్రి అబ్రాహాముతో ప్రమాణం చేశాడు.
74     మనం ఏ భయం లేకుండా తనను సేవించాలి.
75     జీవితాంతం పవిత్రంగా, ధర్మంగా, తన కోసం జీవించాలని ఆయన ఉద్దేశ్యం!

76 “ఓ శిశువా! నీవు సర్వోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు!
    ప్రభువు కన్నా ముందు వెళ్ళి ప్రభువు రాకకు మార్గం వేస్తావు!
77 పాపక్షమాపణ ద్వారా రక్షణ కలుగుతుందన్న జ్ఞానాన్ని ఆయన ప్రజలకు బోధిస్తావు!

78 “మన దేవుడు తన కనికరంవల్ల పరలోకం నుండి
    ఒక నీతిసూర్యుణ్ణి పంపించి,
79 మరణమనే చీకటి నీడలో నివసించే మనపై ప్రకాశించునట్లు చేసి
మనల్ని శాంతి మార్గంలో నడిపిస్తాడు!”

మలాకీ 3:5-12

అప్పడు నేను మీ దగ్గరకు వస్తాను. మరియు సరైనది నేను చేస్తాను. ప్రజలు చేసిన చెడుకార్యాలను గూర్చి న్యాయమూర్తితో చెప్పటానికి సిద్ధంగా ఉన్న మనిషిలా నేను ఉంటాను. కొంతమంది మాయమంత్రాలు చేస్తారు. కొంతమంది వ్యభిచార పాపం చేస్తారు. కొంతమంది బూటకపు వాగ్దానాలు చేస్తారు. కొంతమంది తమ పనివారిని మోసం చేస్తారు. వారు వాగ్దానం చేసిన డబ్బును వారు చెల్లించరు. విధవలకు, అనాథ బాలబాలికలకు ప్రజలు సహాయం చేయరు. విదేశీయులకు ప్రజలు సహాయం చేయరు. ప్రజలు నన్ను గౌరవించరు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

దేవుని దగ్గర దొంగిలించటం

“నేను యెహోవాను, నేను మారను. మీరు యాకోబు పిల్లలు, మరియు మీరు పూర్తిగా నాశనం చేయబడలేదు. కానీ మీరు ఎన్నడూ నా ఆజ్ఞలకు విధేయులు కాలేదు. చివరికి మీ వూర్వీకులు కూడా నన్ను అనుసరించటం మానివేశారు. తిరిగి నా దగ్గరకు రండి, నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

“మేము ఎలా తిరిగి వెనుకకు రాగలం?” అని మీరు అంటారు.

దేవుని దగ్గర వస్తువులు దొంగిలించటం మానివేయండి! మనుష్యులు దేవుని దగ్గ ర వస్తువులు దొంగిలించకూడదు. కానీ మీరు నా దగ్గర వస్తువులు దొంగిలించారు!

“నీ దగ్గర మేము ఏమి దొంగిలించాం?” అని మీరు అంటారు.

“మీ సంపాదనలో పదోవంతు మీరు నాకు ఇచ్చి ఉండాల్సింది. మీరు నాకు ప్రత్యేక కానుకలు ఇచ్చి ఉండాల్సింది. కానీ మీరు నాకు వాటిని ఇవ్వలేదు. ఈ విధంగా మీ రాజ్యం మొత్తం, అందరూ నా దగ్గర దొంగిలించారు. కనుక మీకు చెడు విషయాలు సంభవిస్తున్నాయి.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.

10 సర్వశక్తిమంతుడైన యెహోవా అంటున్నాడు, “ఈ పరీక్షలో ప్రయత్నించండి. మీకు ఉన్నవాటిలో పదో భాగం నా దగ్గరకు తీసికొని రండి. వాటిని ధనాగారంలో ఉంచండి. నా మందిరానికి ఆహారం తీసికొనిరండి. నన్ను పరీక్షించండి! మీరు ఆ పనులు చేస్తే, అప్పుడు నేను నిజంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆకాశంనుండి వర్షం కురిసినట్టు, మంచి మంచి విషయాలు మీకు లభిస్తాయి. మీకు సమస్తం, కావలసిన దానికంటె ఎక్కువగా ఉంటాయి. 11 నేను చీడ పురుగులు మీ పంటలను తినివేయనియ్యను. మీ ద్రాక్షావల్లులు అన్నీ ద్రాక్షాపండ్లు ఫలిస్తాయి.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

12 “ఇతర రాజ్యాల ప్రజలు మీ యెడ దయగలిగి ఉంటారు. నిజంగా మీకు ఒక అద్భుత దేశం ఉంటుంది.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

ఫిలిప్పీయులకు 1:12-18

పౌలు సంకెళ్ళు, సువార్త

12 సోదరులారా! నాకు జరిగిన సంఘటనలు దైవసందేశాన్ని ప్రచారం చేయటానికి తోడ్పడతాయని మీరు గమనించాలి. 13 ఈ సంఘటనలు సంభవించటం వల్ల క్రీస్తు కోసం సంకెళ్ళలో బంధింపబడ్డానని అందరికీ తెలిసిందే. ఇది రాజభవనంలో ఉన్న రక్షకభటులకు కూడా తెలిసిందే. 14 ఈ సంకెళ్ళ మూలంగా, ప్రభువు కారణంగా నా సోదరులైన అనేకులకు దైవసందేశం బోధించటానికి ప్రోత్సాహం కలిగింది. వాళ్ళు ఇంకా ఎక్కువ ధైర్యంతో భయం లేకుండా మాట్లాడగలుగుతున్నారు.

15 కొందరు నాపై అసూయవల్ల పగతో క్రీస్తును గురించి బోధిస్తున్నారు. కాని మరి కొందరు మంచి ఉద్దేశ్యంతో బోధిస్తున్నారు. 16 వీళ్ళు, దైవసందేశాన్ని ప్రకటించటానికి నేనిక్కడ ఉంచబడ్డానని గమనించి ప్రేమతో బోధిస్తున్నారు. 17 మొదట పేర్కొనబడ్డవాళ్ళు స్వార్థంతో, విశ్వాసహీనులై క్రీస్తును గురించి బోధిస్తున్నారు. ఎందుకంటే నేనిక్కడ సంకెళ్ళలో ఉన్నప్పుడు నాకు ఎక్కువ కష్టాలు కలిగించాలని వాళ్ళ ఉద్దేశ్యం. 18 దాని వల్ల కలిగేది ఏమీలేదు. ముఖ్యమైన విషయమేమిటంటే సదుద్దేశాలతో అయితేనేమిటి, దురుద్దేశాలతో అయితేనేమిటి క్రీస్తును గురించి బోధింపబడుతోంది. కనుక నాకు ఆనందంగా ఉంది.

ఔను, నేను యిదే విధంగా ఆనందిస్తూ ఉంటాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International