Revised Common Lectionary (Complementary)
నాలుగవ భాగం
(కీర్తనలు 90–106)
దేవుని భక్తుడైన మోషే ప్రార్థన.
90 ప్రభువా, శాశ్వతంగా నీవే మా నివాసం.
2 పర్వతాలు, భూమి, ప్రపంచం చేయబడక ముందే నీవు దేవుడిగా ఉండినావు.
దేవా, ఇదివరకు ఎల్లప్పుడూ నీవే దేవుడవు మరియు ఎప్పటికి నీవే దేవునిగా ఉంటావు.
3 మనుష్యులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుష్య కుమారులారా,
తిరిగి రండని నీవు చెప్పుతావు.
4 నీ దృష్టిలో వేయి సంవత్సరాలు గడచిపోయిన ఒక రోజువలె ఉంటాయి.
గత రాత్రిలా అవి ఉన్నాయి.
5 నీవు మమ్మల్ని ఊడ్చివేస్తావు. మా జీవితం ఒక కలలా ఉంది. మర్నాడు ఉదయం మేము ఉండము.
మేము గడ్డిలా ఉన్నాము.
6 ఉదయం గడ్డి పెరుగుతుంది.
సాయంత్రం అది ఎండిపోయి ఉంటుంది.
7 దేవా, నీకు కోపం వచ్చినప్పుడు మేము నాశనం అవుతాము.
నీ కోపం మమ్మల్ని భయపెడుతుంది!
8 మా పాపాలు అన్నింటిని గూర్చి నీకు తెలుసు.
దేవా, మా రహస్య పాపాలలో ప్రతి ఒక్కటి నీవు చూస్తావు.
9 నీ కోపం నా జీవితాన్ని అంతం చేయవచ్చు.
మా సంవత్సరాలు నిట్టూర్పులా అంతమయి పోతాయి.
10 మేము 70 సంవత్సరాలు జీవిస్తాము.
బలంగా వుంటే 80 సంవత్సరాలు జీవిస్తాము.
మా జీవితాలు కష్టతరమైన పనితోను బాధతోను నిండి ఉన్నాయి.
అప్పుడు అకస్మాత్తుగా మా జీవితాలు అంతం అవుతాయి. మేము ఎగిరిపోతాము.
11 దేవా, నీ కోపం యొక్క పూర్తి శక్తి ఏమిటో నిజంగా ఎవరికీ తెలియదు.
కాని దేవా, నీ యెడల మాకున్న భయము, గౌరవం నీ కోపమంత గొప్పవి.
12 మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు
నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము.
13 యెహోవా, ఎల్లప్పుడూ మా దగ్గరకు తిరిగి రమ్ము.
నీ సేవకులకు దయ చూపించుము.
14 ప్రతి ఉదయం నీ ప్రేమతో మమ్మల్ని నింపుము.
మేము సంతోషించి, మా జీవితాలు అనుభవించగలిగేలా చేయుము.
15 మా జీవితాల్లో చాలా దుఃఖం, కష్టాలు నీవు కలిగించావు.
ఇప్పుడు మమ్మల్ని సంతోషింపచేయుము.
16 వారి కోసం నీవు చేయగల ఆశ్చర్య కార్యాలను నీ సేవకులను చూడనిమ్ము.
వారి సంతానాన్ని నీ ప్రకాశమును చూడనిమ్ము.
17 మా దేవా, మా ప్రభూ, మా యెడల దయచూపించుము.
మేము చేసే ప్రతిదానిలో మాకు సఫలత అనుగ్రహించుము.
24 ఈ విషయాలన్నింటి మూలంగా, ఆ యజమాని, సర్వశక్తిమంతుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల మహాబలశాలి ఇలా చెబుతున్నాడు, “నా శత్రువులారా, నేను మిమ్మల్ని శిక్షిస్తాను. ఇంకెంత మాత్రం మీరు నాకు కష్టం కలిగించరు. 25 వెండిని శుద్ధిచేయటానికి మనుష్యులు క్షారం వాడుతారు. అదే విధంగా మీ తప్పులన్నిటినీ నేను శుద్ధి చేసేస్తాను. మీలోంచి పనికిమాలిన వాటన్నింటినీ నేను తీసివేస్తాను. 26 ఆరంభంలో మీకు ఉన్నమాదిరి న్యాయమూర్తుల్ని నేను మళ్లీ తీసుకొని వస్తాను. మీ సలహాదారులు చాలాకాలం క్రిందట మీకు ఉన్న సలహాదారుల్లా ఉంటారు. అప్పుడు మీరు ‘మంచి, నమ్మకమైన పట్టణం’” అని పిలువబడతారు.
27 దేవుడు మంచివాడు, ఆయన సరైన వాటినే చేస్తాడు. కనుక ఆయన సీయోనును, తన దగ్గరకు తిరిగి వచ్చే ప్రజలను రక్షిస్తాడు. 28 అయితే నేరుస్థులు, పాపులు అందరూ నాశనం చేయబడతారు. (వారు యెహోవాను వెంబడించని ప్రజలు.)
29 మీరు పూజించటానికి ఏర్పరచుకొనే మస్తకివృక్షాలు, ప్రత్యేక వనాలు చూచి భవిష్యత్తులో ప్రజలు సిగ్గుపడతారు. 30 మీరు ఆకులు ఎండిపోతున్న మస్తకి వృక్షాల్లా ఉంటారు. కనుక ఇలా జరుగుతుంది. నీళ్లులేక ఎండిపోతున్న తోటలా మీరుంటారు. 31 శక్తిమంతులైన ప్రజలు ఎండిపోయిన చిన్న చెక్క ముక్కల్లా ఉంటారు. ఆ ప్రజలు చేసే పనులు నిప్పు రాజబెట్టే నిప్పురవ్వల్లా ఉంటాయి. శక్తిమంతులైన ప్రజలూ, వారు చేసే పనులూ కాలిపోవటం మొదలవుతుంది. ఆ అగ్నిని ఎవరూ ఆర్పివేయలేరు.
కొందరు యేసు అధికారాన్ని సందేహించటం
(మత్తయి 12:38-42; మార్కు 8:12)
29 ప్రజల గుంపు పెరుగుతూ పోయింది. యేసు ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “ఈ కాలం వాళ్ళు చెడ్డవాళ్ళు, గనుక అద్భుతాలు అడుగుతారు. దేవుడు యోనాను పంపి యిచ్చిన రుజువు తప్ప, మరే రుజువు మీకు యివ్వబడదు. 30 ఎందుకంటే, నీనెవె ప్రజలకు యోనా ఏ విధంగా ఒక రుజువో అదే విధంగా మనుష్యకుమారుడు ఈ తరం వాళ్ళకు ఒక రుజువు.
31 “దక్షిణ దేశపు రాణి సొలొమోను రాజు బోధిస్తున్న జ్ఞానాన్ని వినటానికి చాలా దురం నుండి వచ్చింది. కాని యిప్పుడు సొలోమోను కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు. ఈనాటి ప్రజలు ఆయన మాటలు వినటం లేదు. కనుక తీర్పు చెప్పబడే రోజు ఆ రాణి వీళ్ళతో సహా నిలబడి వీళ్ళు తప్పు చేశారని నిరూపిస్తుంది.
32 “నీనెవె ప్రజలు యోనా బోధనలు విని మారుమానస్సు పొందారు. కనుక తీర్పు చెప్పబడే రోజున వాళ్ళు ఈనాటి ప్రజలతో సహా నిలుచొని వీళ్ళు తప్పు చేశారని నిరూపిస్తారు. కాని యిప్పుడు యోనా కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు.
© 1997 Bible League International