Revised Common Lectionary (Complementary)
మంచి కొమ్మ
14 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “నేను ఇశ్రాయేలు, యూదా ప్రజలకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేసియున్నాను. నేనిచ్చిన మాట నెరవేర్చుకునే సమయం ఆసన్నమవుతూ వుంది. 15 ఆ సమయంలో దావీదు వంశం నుండి ఒక మంచి ‘కొమ్మ’ చిగురించి పెరిగేలా చేస్తాను. ఆ మంచి ‘కొమ్మ’ (రాజు) దేశానికి ఏది మంచిదో, ఏది నీతి దాయకమో అది చేస్తుంది. 16 ఈ ‘కొమ్మ’ చిగిర్చిన కాలంలో యూదా ప్రజలు రక్షింపబడతారు. యెరూషలేములో ప్రజలు సురక్షితంగా జీవిస్తారు. ఈ కొమ్మ పేరు ‘యెహోవాయే మా నీతి.’”
దావీదు కీర్తన.
25 యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.
2 నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను.
నేను నిరాశచెందను.
నాశత్రువులు నన్ను చూచి నవ్వరు.
3 నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు.
కాని నమ్మక ద్రోహులు నిరాశపడతారు.
వారికి ఏమీ దొరకదు.
4 యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము.
నీ మార్గాలను ఉపదేశించుము.
5 నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము.
నీవు నా దేవుడవు, నా రక్షకుడవు.
రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
6 యెహోవా, నా యెడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నా యెడల చూపించుము.
7 నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు.
యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
8 యెహోవా నిజంగా మంచివాడు.
జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు.
9 దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు.
న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు.
10 యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను అనుసరించే మనుష్యులందరికి
ఆయన మార్గాలు దయగలవిగా, వాస్తవమైనవిగా ఉంటాయి.
9 మేము దేవుని సమక్షంలో ఉన్నప్పుడు మీ విషయంలో చాలా కృతజ్ఞులము. మేము ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా అవి తక్కువే! 10 మిమ్మల్ని చూసే అవకాశం కలగాలని, మీ విశ్వాసం దృఢపడాలని, దానికి కావలసినవి దేవుడు ఇవ్వాలని, రాత్రింబగళ్ళు మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము.
11 మన తండ్రియైన దేవుడు, మన ప్రభువైన యేసు మేము మీ దగ్గరకు రావటానికి మాకు దారి చూపుగాక! 12 మీపై ఉన్న మా ప్రేమ అభివృద్ధి చెందుతున్నట్లే, మీలో పరస్పరం ప్రేమ అభివృద్ధి చెందేటట్లు, యితరుల పట్ల కూడా మీ ప్రేమ అభివృద్ధి చెందేటట్లు ప్రభువు అనుగ్రహించుగాక. 13 మన యేసు ప్రభువు భక్తులతో వచ్చినప్పుడు మన తండ్రియైన దేవుని ముందు మీరు ఏ అపకీర్తి లేకుండా పవిత్రంగా ఉండేటట్లు దేవుడు మీకు శక్తి ననుగ్రహించు గాక!
భయపడవద్దు
(మత్తయి 24:29-31; మార్కు 13:24-27)
25 “సూర్యునిలో, చంద్రునిలో, నక్షత్రాల్లో సూచనలు కన్పిస్తాయి. సముద్రాల రోదనకు, తీవ్రమైన అలలకు దేశాలు భయపడి కలవరం చెందుతాయి. 26 రానున్న ఘోరాన్ని తలంచుకొని ప్రజలు భయంతో మూర్చపోతారు. ఆకాశపు జ్యోతులు గతి తప్పుతాయి. 27 అప్పుడు శక్తితో, గొప్ప తేజస్సుతో మేఘం మీద మనుష్యకుమారుడు రావటం వాళ్ళు చూస్తారు. 28 ఇవి జరగటం మొదలైనప్పుడు లేచి మీ తలలెత్తి చూడండి. అంటే మీకు రక్షణ దగ్గరకు వచ్చిందని అర్థం” అని అన్నాడు.
చెట్ల ఉపమానం
(మత్తయి 24:32-35; మార్కు 13:28-31)
29 ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “ఆ అంజూరపు చెట్టును చూడండి. అంతెందుకు; చెట్లన్నిటిని చూడండి. 30 చెట్టు చిగురు వేయగానే ఎండాకాలం దగ్గరకు వచ్చిందని గ్రహిస్తారు. 31 అదే విధంగా ఈ సంఘటనలు జరగటం చూసినప్పుడు దేవుని రాజ్యం దగ్గరకు వచ్చిందని గ్రహించండి.
32 “ఇది నిజం. ఇవన్నీ సంభవించేవరకు ఈ తరంవాళ్ళు గతించరు. 33 ఆకాశం, భూమి గతించి పోవచ్చుకాని నామాటలు చిరకాలం నిలిచి పోతాయి.
అన్ని వేళలా సిద్ధంగా ఉండండి
34 “జాగ్రత్త! విందులు, వినోదాలు చేసుకొంటూ త్రాగుబోతులై జీవించకండి. ప్రాపంచిక విషయాల్లో మునిగిపోకండి. అలా చేస్తే మీ బుద్ధి పని చెయ్యటం మానేస్తుంది. అప్పుడు ఆ దినం మీరు సిద్ధంగా లేనప్పుడు వచ్చి మీ మీద పడుతుంది. 35 అది ప్రపంచం మీదికంతా వస్తుంది. 36 అన్ని వేళలా జాగ్రత్తగా ఉండండి. ఈ దుర్ఘటనలనుండి తప్పించుకొనే శక్తి, మనుష్యకుమారుని సమక్షంలో నిలబడగలిగే శక్తి కలగాలని ప్రార్థించండి.”
© 1997 Bible League International