Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
25 యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.
2 నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను.
నేను నిరాశచెందను.
నాశత్రువులు నన్ను చూచి నవ్వరు.
3 నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు.
కాని నమ్మక ద్రోహులు నిరాశపడతారు.
వారికి ఏమీ దొరకదు.
4 యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము.
నీ మార్గాలను ఉపదేశించుము.
5 నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము.
నీవు నా దేవుడవు, నా రక్షకుడవు.
రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
6 యెహోవా, నా యెడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నా యెడల చూపించుము.
7 నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు.
యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
8 యెహోవా నిజంగా మంచివాడు.
జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు.
9 దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు.
న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు.
10 యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను అనుసరించే మనుష్యులందరికి
ఆయన మార్గాలు దయగలవిగా, వాస్తవమైనవిగా ఉంటాయి.
6 యెహోవా నీవే దేవుడివి!,
యెహోవా ఆకాశం, అత్యున్నత పరలోకాలు,
వాటిలోవున్న సమస్తాన్ని నీవే సృజించావు!
భూమినీ, దానిపైనున్న సమస్తాన్నీ
నీవే సృజించావు!
సముద్రాలను సృజించింది నీవే.
వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించింది నీవే!
ప్రతిదానికీ ప్రాణంపోసింది నీవే,
దేవదూతలు నీకు నమస్కరిస్తారు. నీ సన్నిధియందు సాగిలపడతారు నిన్ను ఆరాధిస్తారు!
7 యెహోవా, నీవే దేవుడివి.
అబ్రామును ఎంచుకున్నది నీవే.
అతన్ని బబులోనులోని ఊరునుంచి నడిపించింది నీవే.
అబ్రాహాముగా అతని పేరు మార్చింది నీవే.
8 అతడు నీకు నమ్మకంగా, విశ్వాసంగా ఉండేలా చూసుకున్నావు.
అతనితో నీవొక ఒడంబడిక చేసుకున్నావు.
అతని సంతతి వారికి వాగ్దానం చేశావు
నీవు కనాను, హిత్తీ, అమోరీ, పెరిజ్జీ, యెబూసీ, గిర్గాషి జాతుల దేశాన్ని ఇస్తానన్న.
నీ మాటను నీవు నిలుపుకున్నావు!
నీవు నిజాయితీగలవాడవు, మాట నిలుపుకున్నావు!
9 మా పూర్వీకులు ఈజిప్టులో బాధలు పడటం చూశావు!
సహాయార్థం ఎర్ర సముద్ర తీరాన వారి మొరలు ఆలకించావు.
10 నీవు ఫరోకి అద్భుతాలు ప్రదర్శించావు
అతని ఉద్యోగులకీ, ప్రజలకీ దిగ్ర్భాంతికరమైన పనులు చేసి చూపావు.
మా పూర్వీకుల కంటె తాము గొప్ప అని
ఈజిప్టీయులు అనుకోవడం నీకు తెలుసు.
అయితే నీవు, నీ వెంత గొప్పవాడివో నిరూపించుకొన్నావు!
ఈనాటికీ అది వాళ్లు జ్ఞాపకం ఉంచుకొంటారు.
11 నీవు వాళ్ల కళ్ల ముందు ఎర్ర సముద్రాన్ని విభాగించావు.
వాళ్లు పొడినేల మీద నడిచి పోయారు!
ఈజిప్టు సైనికులు వాళ్లని తరుముతున్నారు కాని, నీవు ఆ శత్రువుని సముద్రంలో ముంచేశావు.
మరి వాళ్లు ఒక రాయిలా నీటిలో మునిగారు.
12 పగటి పూట మేఘస్థంభంలో వుండి వాళ్లని నడిపించావు,
రాత్రివేళ దీపస్ధంభంలో వుండి వాళ్లని నడిపించావు,
ఆ విధంగా నీవు వారి మార్గాన్ని వెలిగించితివి.
వాళ్లు చేరవలసిన గమ్యాన్ని చూపావు.
13 అప్పుడిక సీనాయి పర్వతం మీదికి దిగి
ఆకాశంనుంచి వాళ్లతో మాట్లాడాపు.
వాళ్లకి చక్కటి. ధర్మనియమాలిచ్చావు.
వాళ్లకి సదుపదేశాలిచ్చావు.
మంచి ఆజ్ఞలిచ్చావు, చక్కటి ఆదేశాలిచ్చావు!
14 నీ ప్రత్యేక విశ్రాంతి దినమైన సబ్బాతుని గురించి వాళ్లకి చెప్పావు.
వాళ్లకి ఆజ్ఞలు, చట్టాలు, ఉపదేశాలు ఇచ్చేందుకు నీ సేవకుడు మోషేని వినియోగించావు.
15 వాళ్లు ఆకలిగొన్నప్పుడు
వాళ్లకి నీవు ఆకాశంనుంచి తిండినిచ్చావు.
వాళ్లు దప్పి గొన్నప్పుడు
వాళ్లకి నీవు బండ నుంచి మంచి నీళ్లిచ్చావు.
వాళ్లకి చెప్పావు,
‘రండి, ఈ భూమి తీసుకోండని’
నీవు నీ శక్తిని వినియోగించి
వారికోసం ఆ భూమిని తీసుకున్నావు!
ప్రభువు రాకకు సిద్ధంగా ఉండండి
5 సోదరులారా! ఇవి ఎప్పుడు జరుగనున్నాయో, వాటి సమయాలను గురించి, కాలాలను గురించి మేము వ్రాయనవసరం లేదు. 2 ప్రభువు రానున్న దినము అకస్మాత్తుగా రాత్రిపూట దొంగ వచ్చినట్లు వస్తుందని మీకు బాగా తెలుసు. 3 ప్రజలు, “మేము శాంతంగా, క్షేమంగా ఉన్నాము” అని అంటున్నప్పుడు గర్భిణీయైన స్త్రీకి అకస్మాత్తుగా నొప్పులు వచ్చినట్లే వాళ్ళు నాశనమౌతారు. తప్పించుకోలేరు.
4 కాని సోదరులారా! మీరు చీకట్లో లేరు. కనుక ఆ దినం మిమ్మల్ని దొంగల్లా ఆశ్చర్యపరచదు. 5 మనం వెలుగుకు, పగటి వేళకు సంబంధించినవాళ్ళము. రాత్రికి, చీకటివేళకు సంబంధించినవాళ్ళము కాము. 6 మరి అలాంటప్పుడు యితరుల వలె నిద్రపోకుండా, హుషారుగా, ఆత్మ నిగ్రహంతో ఉందాము. 7 ఎందుకంటే, నిద్రపొయ్యే వాళ్ళు రాత్రివేళ నిద్రపోతారు. త్రాగుబోతులు రాత్రివేళ త్రాగుతారు. 8 మనం పగటికి చెందిన వాళ్ళము కనుక ఆత్మ నిగ్రహంతో ఉందాము. విశ్వాసాన్ని, ప్రేమను కవచంగాను, రక్షణ, నిరీక్షణలను శిరస్త్రాణంగాను ధరించుదాము.
9 ఎందుకంటే దేవుడు కోపాన్ని చూపటానికి మనల్ని ఎన్నుకోలేదు. మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ ఇవ్వటానికి ఎన్నుకొన్నాడు. 10 మనం మరణించినా, లేక బ్రతికి ఉన్నా తాను వచ్చినప్పుడు తనతో కలిసి జీవించాలని క్రీస్తు మనకోసం మరణించాడు. 11 మీరు ఎప్పటిలాగే పరస్పరం ఉత్సాహపరుచుకుంటూ, యితర్ల అభివృద్ధికి తోడ్పడుతూ ఉండండి.
© 1997 Bible League International