Revised Common Lectionary (Complementary)
93 యెహోవాయే రాజు!
ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు.
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
2 దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
3 యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది.
ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
4 పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి.
కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
5 యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి.
నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.
తూరు తనను తాను దేవునిగా భావించుకోవటం
28 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు: 2 “నరపుత్రుడా, తూరు పాలకునికి ఇలా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా నీకు చెప్పునదేమనగా:
“‘నీవు గర్విష్ఠివి!
“నేనే దేవుడను!
సముద్ర మధ్యంలో దైవ స్థానంలో కూర్చున్నాను”
అని నీవంటున్నావు.
“‘కాని నీవు మానవ మాత్రుడవు. దేవుడవు, మాత్రం కాదు.
నీవు దేవుడవని నీకై నీవే అనుకుంటున్నావు.
3 నీవు దానియేలు[a] కంటె తెలివిగలవాడవని తల పోస్తున్నావు!
రహస్యాలన్నిటినీ తెలుసుకొనగలవని నీవనుకుంటున్నావు.!
4 నీ తెలివితేటల ద్వారా, నీ వ్యాపారం ద్వారా నీవు ధనధాన్యాలు విస్తారంగా సేకరించావు.
నీ ధనాగారాలలో వెండి బంగారాలు నిలువజేశావు.
5 గొప్పదైన నీ జ్ఞానంచేత, వ్యాపారం ద్యారా నీ సంపదను పెంచావు.
ఇప్పుడా ఐశ్వర్యాన్ని చూచు కొని నీవు గర్వపడుతున్నావు.
6 “‘అందువల్ల నా ప్రభువైన యెహోవా చెపుతున్న దేమంటే,
నీవొక దేవుడిలా ఉన్నావని తలంచావు.
7 అన్య జనులను నేను నీ మీదికి రప్పిస్తాను.
వారు దేశాలన్నిటిలో అతి భయంకరులు!
వారు తమ కత్తులను దూస్తారు.
నీ తెలివితేటలు సముపార్జించి పెట్టిన అందమైన వస్తువుల మీద వాటిని ఉపయోగిస్తారు.
వారు నీ కీర్తిని నాశనం చేస్తారు.
8 వారు నిన్ను సమాధిలోకి దించుతారు.
నడి సముద్రంలో చనిపోయిన నావికునిలా నీవుంటావు.
9 నిన్నొక వ్యక్తి చంపివేస్తాడు.
అప్పుడు “నేను దేవుణ్ణి” అని నీవు చెప్పుకోగలవా?
ఆ సమయంలో అతడు నిన్ను తన అధీనంలో ఉంచుతాడు.
దానితో నీవొక మానవ మాత్రుడవనీ, దేవుడవు కావనీ నీవు తెలుసుకుంటావు!
10 క్రొత్తవాళ్లు నిన్ను విదేశీయునిగా చూసి చంపివేస్తారు.
నేను ఇచ్చిన ఆజ్ఞ కారణంగా ఆ పనులు జరుగుతాయి!’”
నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
స్తెఫన్ను రాళ్ళతో కొట్టి చంపటం
54 ఈ మాటలు విని వాళ్ళు కోపంతో మండిపోయి, అతణ్ణి చూసి పళ్ళు కొరికారు. 55 కాని స్తెఫను పవిత్రాత్మతో నిండిపోయి పరలోకం వైపు చూసి దేవుని తేజస్సును, యేసు దేవుని కుడి వైపు ఉండటం చూసాడు. 56 “అదిగో చూడండి! పరలోకం తెరుచుకోవటం. దేవుని కుమారుడు ఆయన కుడి వైపు నిలుచొని వుండటం చూస్తున్నాను!” అని అన్నాడు.
57 ఈ మాటలు విని వెంటనే వాళ్ళు తమ చెవులు మూసుకున్నారు. బిగ్గరగా కేకలు వేస్తూ అతని మీదికి వెళ్ళారు. 58 అతణ్ణి ఊరి బయటికి లాగి రాళ్ళతో కొట్టటం మొదలు పెట్టారు. ఈ సంఘటనను చూస్తున్నవాళ్ళు తమ వస్త్రాల్ని “సౌలు” అనబడే ఒక యువకుని కాళ్ళ ముందు వుంచారు. 59 వాళ్ళు రాళ్ళు విసరుతుండగా స్తెఫను, “యేసు ప్రభూ! నా ఆత్మను నీలో చేర్చుకో!” అని ప్రార్థించాడు. 60 ఆ తదుపరి మోకరిల్లి, “ప్రభూ! వాళ్ళపై ఈ పాపం మోపవద్దు!” అని బిగ్గరగా అన్నాడు. ఈ మాట అన్న వెంటనే కళ్ళు మూసాడు.
8 1-3 అతణ్ణి చంపటానికి తన అంగీకారం చూపుతున్నట్లు సౌలు అక్కడే ఉన్నాడు. కొందరు విశ్వాసులు స్తెఫన్ను సమాధి చేసి, అతని కోసం దుఃఖించారు.
సౌలు సంఘాన్ని హింసించటం
ఆ రోజు యెరూషలేములోని సంఘంపై పెద్ద హింసాకాండ మొదలైంది. సౌలు సంఘాన్ని నాశనం చెయ్యటం మొదలు పెట్టాడు. ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళను, మగవాళ్ళను బయటకు లాగి కారాగారంలో వేసాడు. అపొస్తలులు తప్ప మిగతా వాళ్ళంతా చెదిరిపోయి, యూదయ, సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు.
© 1997 Bible League International