Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
13 యెహోవా, ఎన్నాళ్లు నన్ను మరచిపోతావు?
నీవు నన్ను శాశ్వతంగా మరచిపోతావా?
నీవు నన్ను స్వీకరించకుండా ఎన్నాళ్లు నిరాకరిస్తావు?
2 నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకెన్నాళ్లు నేను తలంచాలి?
ఇంకెన్నాళ్లు నేను నా హృదయంలో దుఃఖ అనుభూతిని పొందాలి?
ఇంకెన్నాళ్లు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు?
3 నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము.
నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను!
4 అప్పుడు నా శత్రువు, “నేనే వానిని ఓడించాను” అనవచ్చు.
నేను అంతం అయ్యానని నా శత్రువు సంతోషిస్తాడు.
5 యెహోవా, నాకు సహాయం చేయుటకు నీ ప్రేమనే నేను నమ్ముకొన్నాను.
నీవు నన్ను రక్షించి, నన్ను ఆనందింపజేశావు.
6 యెహోవా నాకు మేలైన కార్యాలు చేశాడు.
కనుక నేను యెహోవాకు ఒక ఆనందగీతం పాడుతాను.
దానియేలుకి దర్శనం వివరించబడింది
15 దానియేలు అను నేను ఈ దర్శనం చూశాను. అది యేమిటో తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తూండగా మానవునివంటి ఒకతను నా ఎదుట నిలిచాడు. 16 తర్వాత ఒక మనిషి స్వరం ఊలయి నదిమీదినుంచి ఇలా వినవచ్చింది, “గాబ్రియేలూ, ఈ దర్శనమును ఈ వ్యక్తికి వివరింపుము.”
17 నేను నిలుచుండిన స్థలానికి గాబ్రియేలు రాగా నేను భయభ్రాంతుడనై నేలమీద సాష్టాంగపడ్డాను. గాబ్రియేలు దూత నాతో, “మానవపుత్రుడా!, ఈ దర్శనం అంత్యకాలానికి సంబంధించిందని తెలుసుకో” అని చెప్పాడు.
18 గాబ్రియేలు దూత నాతో మాటలాడుతూ ఉండగా, నేను నేలమీద సాష్టాంగపడి, గాఢనిద్ర పోయాను. అప్పుడు అతను నన్ను తాకి పైకి లేవనెత్తాడు. 19 గాబ్రియేలు దూత ఇలా చెప్పాడు: “శ్రమకాలంపు చివరిలో ఏమి జరుగుతుందో నీకు ఇప్పుడు చెపుతాను. ఈ దర్శనం నియమించబడిన అంత్యకాలానికి సంబంధించింది” అని అన్నాడు.
20 “రెండు కొమ్ములు గల పొట్టేలును నీవు చూశావు. ఆ కొమ్ములు మాదీయ, పారసీక దేశాలు. 21 బొచ్చుగల మేకపోతు గ్రీకు రాజు, దాని కళ్ల మధ్యవున్న పెద్ద కొమ్ము మొదటి రాజు. 22 ఆ కొమ్ము విరిగి పోయింది. ఆ స్థానంలో నాలుగు కొమ్ములు మొలిచాయి. ఆ కొమ్ములు మొదటి రాజు సామ్రాజ్యంనుంచి చీలిన నాలుగు రాజ్యాలు. కాని ఆ నాలుగు రాజ్యాలు మొదటి రాజువలె బలిష్ఠంగా ఉండవు.
23 “ఆ రాజ్యాలకు అంతం సమిపించే సమయాన, వారి దుష్టత్వం నిండినప్పుడు, మొండితనపు ముఖముగలిగి జిత్తులమారి అయిన ఒక రాజు లేస్తాడు. ఈ రాజు తన శక్తి వల్ల కాకుండానే మహా శక్తిమంతుడవుతాడు. 24 ఇతడు భయంకరమైన నాశనాన్ని తెస్తాడు. ఇతడు చేసే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. అతను శక్తిమంతులైన మనుష్యుల్ని, చివరికి దేవుని ప్రత్యేక జనుల్ని కూడా నాశనం చేస్తాడు.
25 “ఈ రాజు చాలా మోసగాడు, జిత్తులమారి అయివుండి, తన యుక్తి ఉపయోగించి, వంచనతో గెలుపొందుతాడు. తాను అతి ముఖ్యుడనని భావిస్తాడు. ప్రజలు క్షేమంగా ఉన్నామని తలస్తూన్నప్పుడు ఇతడు చాలా మందిని, రాజాధిరాజును సహితం ఎదిరిస్తాడు. అయినా ఇతడు నాశనం చేయబడతాడు, కాని మానవ శక్తివల్ల కాదు.
26 “ఆ కాలాన్ని గురించి నీకివ్వబడిన దర్శనం నిజమైంది. కాని ఆ దర్శనానికి ముద్ర వేయి. ఎందుకనగా అది అంత్యకాల సంబంధమైనది.”
27 దానియేలు అను నేను అలసిపోయి చాలా రోజలు జబ్బు పడ్డాను. రాజుకు పనిచేసే నిమిత్తం నేను మరల లేచి వెళ్ళాను. కాని నేను ఆ దర్శనాన్ని తలంచుకుని కలతచెందాను. కాని దాని అర్థమేమిటో నాకు తెలియలేదు.
మీకు కలిగిన ధైర్యసహనాల్ని కాపాడుకోండి
32 మీరు వెలిగింపబడిన రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ రోజుల్లో మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు. అయినా మీరు వాటిని సహించారు. 33 కొన్నిసార్లు మీరు అవమానాన్ని, హింసను బహిరంగంగా అనుభవించారు. మరికొన్నిసార్లు అవమానాన్ని, హింసను అనుభవించేవాళ్ళ ప్రక్కన నిలుచున్నారు. 34 అంతేకాక, చెరసాలల్లో ఉన్నవాళ్ళ పట్ల మీరు సానుభూతి చూపించారు. పైగా “మీ ఆస్తుల్ని” దోచుకొంటుంటే ఆనందంగా అంగీకరించారు. ఎందుకంటే, మీరు పొందిన ఆస్తి మీరు పోగొట్టుకొన్న ఆస్తికన్నా ఉత్తమమైనదని మీకు తెలుసు. అది శాశ్వతమైనదని కూడా మీకు తెలుసు.
35 అందువల్ల మీ విశ్వాసాన్ని వదులుకోకండి. దానికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. 36 మీరు పట్టుదలతో ఉండాలి. దైవేచ్ఛ ప్రకారం నడుచుకోవాలి. ఆ తర్వాత దేవుడు, తాను వాగ్దానం చేసినదాన్ని ప్రసాదిస్తాడు. 37 ఎందుకంటే,
“త్వరలోనే వస్తున్నాడు, వస్తాడు,
ఆలస్యం చెయ్యడు!
38 నీతిమంతులైన నా ప్రజలు
నన్ను విశ్వసిస్తూ జీవిస్తారు.
కాని వాళ్ళలో ఎవరైనా వెనుకంజ వేస్తే
నా ఆత్మకు ఆనందం కలుగదు.”(A)
39 కాని, మనం వెనుకంజ వేసి నశించిపోయేవాళ్ళలాంటి వారం కాదు. గాని విశ్వాసం ద్వారా రక్షంచబడేవాళ్ళ లాంటివారం.
© 1997 Bible League International