Revised Common Lectionary (Complementary)
12 “ఆ సమయాన నీ ప్రజలైన యూదుల పక్షం వహించిన గొప్ప రాజు మిఖాయేలు (ప్రధాన దూత) జోక్యం కలిగించుకొంటాడు. నీ ప్రజలు ఒకే దేశంగా కూడిన కాలంనుండి అప్పటి వరకు ముందెన్నడూ సంభవించనంత మహా విపత్తు వారికి కలుగుతుంది. కాని, నీ ప్రజల్లో ఎవరి పేరు గ్రంథమందు వ్రాయబడిందో వారు తప్పించుకొంటారు. 2 సమాధి చేయబడిన పెక్కుమంది మృతులు, మేల్కొంటారు. కొందరు నిత్యజీవానికి, కొందరు సిగ్గుపొందటానికి, శాశ్వతంగా తిరస్కారం పొందటానికి మేల్కొంటారు. 3 జ్ఞానవంతులు ఆకాశమందలి జ్యోతుల్లాగ ప్రకాశిస్తారు, అనేకులను నీతి మార్గానికి నడిపించేవారు నక్షత్రాల్లాగ శాశ్వతంగా వెలుగుతారు
దావీదుకు అభిమాన కావ్యము.
16 దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము.
2 “యెహోవా, నీవు నా యజమానివి
నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభిస్తుంది”
అని నేను యెహోవాతో చెప్పాను.
3 మీరు ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల గురించి కూడా చెప్పారు,
“వారు నాకు గోప్పవారు, వారే నన్ను సంతోషపెట్టువారు.”
4 కాని ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది.
ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను.
ఆ దేవతల పేర్లు కూడ నేను పలుకను.
5 నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర్నుండి మాత్రమే వస్తుంది.
యెహోవా, నీవే నన్ను బలపరచావు.
యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము.
6 నా వంతు చాలా అద్భుతమయింది.
నా స్వాస్థ్యము చాలా అందమయింది.
7 యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక నేను ఆయనను స్తుతిస్తాను.
రాత్రియందు, నా అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు వచ్చాయి.
8 నేను ఎల్లప్పుడూ యెహోవాను నా యెదుట ఉంచుకొంటాను.
ఎందుకనగా ఆయన నా కుడి ప్రక్కన వున్నాడు.
నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను.
9 కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి.
నా శరీరం కూడ క్షేమంగా బ్రతుకుతుంది.
10 ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు గనుక.
నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్లిపోనీయవు.
11 సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు.
యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది.
నీ కుడిప్రక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది.
11 ప్రతి యాజకుడు మత సంబంధమైన కర్తవ్యాన్ని ప్రతిరోజు నెరవేరుస్తూ ఉంటాడు. ఇచ్చిన బలుల్నే మళ్ళీ మళ్ళీ యిస్తూ ఉంటాడు. ఈ బలులు పాపపరిహారం చెయ్యలేవు. 12 కాని క్రీస్తు మన పాపపరిహారార్థం ఒకే ఒక బలి యిచ్చి దేవుని కుడిచేతి వైపు శాశ్వతంగా కూర్చుండిపొయ్యాడు. 13 అప్పటినుండి, ఆయన శత్రువుల్ని దేవుడు ఆయన పాదపీఠంగా చెయ్యాలని కాచుకొని ఉన్నాడు. 14 ఆయన ఒకే ఒక అర్పణ చేసి పరిశుద్ధులలో శాశ్వతమైన పరిపూర్ణత కలిగించాడు.
15 ఈ విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ మనకు యిలా ప్రకటిస్తున్నాడు:
16 “ఆ తర్వాత నేను వాళ్ళతో ఈ ఒడంబడిక చేస్తాను.
నా నియమాల్ని వాళ్ళ హృదయాల్లో ఉంచుతాను.
వాటిని వాళ్ళ మనస్సులపై వ్రాస్తాను.”(A)
17 పరిశుద్ధాత్మ ఇంకా యిలా అన్నాడు:
“వాళ్ళ పాపాల్ని,
దుర్మార్గాల్ని నేను మరిచిపోతాను!”(B)
18 వాళ్ళ పాపాల్ని దేవుడు క్షమించాడు కాబట్టి, పాపం కోసం బలుల్ని అర్పించవలసిన అవసరం తీరిపోయింది.
విశ్వాసాన్ని వదులుకోకండి
19 సోదరులారా! యేసు తన రక్తాన్ని అర్పించాడు. తద్వారా అతి పవిత్ర స్థానానికి వెళ్ళగలమనే విశ్వాసం మనలో కలిగింది. 20 ఆయన శరీరం ఒక తెరగా ఉంది. దాన్ని తొలగించి మనకోసం సజీవమైన నూతన మార్గాన్ని వేశాడు. 21 అంతేకాక, ఆ ప్రధాన యాజకుడు మన దేవాలయంపై అధికారిగా పనిచేస్తున్నాడు. 22 తప్పు చేసి బాధపడ్తున్న మన హృదయాలపై రక్తం ప్రోక్షింపబడింది. స్వచ్ఛమైన నీళ్ళతో మన దేహాలు పరిశుభ్రం చేయబడ్డాయి. ఇప్పుడిక మంచి హృదయాలతో, సంపూర్ణ విశ్వాసంతో దైవ సన్నిధిని చేరుకొందాం. 23 మనకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అందువల్ల మనం బహిరంగంగా ప్రకటిస్తున్న విశ్వాసాన్ని విడవకుండా ధైర్యంతో ఉందాం.
ఒకరికొకరు సహాయం చేసుకొంటూ బలవంతులై యుండండి
24 ప్రేమిస్తూ మంచిపనులు చేస్తూ ఉండమని పరస్పరం ప్రోత్సాహపరుచుకొందాం. 25 సమావేశాలకు రాకుండా ఉండటం కొందరికి అలవాటు. కాని, మనం పరస్పరం కలుసుకొంటూ ఉందాం. ముఖ్యంగా ప్రభువు రానున్నదినం[a] సమీపిస్తోంది గనుక పరస్పరం ప్రోత్సాహపరచుకొంటూ ఉందాం.
యేసు అంత్య కాలాన్ని గురించి హెచ్చరించటం
(మత్తయి 24:1-25; లూకా 21:5-24)
13 యేసు మందిరం నుండి వెళ్తుండగా శిష్యుల్లో ఒకడు, “బోధకుడా! చూడండి, ఎంత అద్భుతమైన పెద్ద రాళ్ళో! ఎంత పెద్ద కట్టడాలో చూడండి!” అని అన్నాడు.
2 యేసు సమాధానంగా, “నీవు పెద్ద కట్టడాన్ని చూస్తున్నావా? రాయి మీద రాయి నిలువకుండా రాళ్ళన్ని పడిపోతాయి” అని అన్నాడు.
3 యేసు మందిరానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండపై కూర్చొన్నాడు. ఆయన వెంట ఆయన శిష్యులు పేతురు, యాకోబు, యోహాను మరియు అంద్రెయ ఉన్నారు. వాళ్ళు ఆయనతో 4 “ఇది ఎప్పుడు జరుగుతుందో మాకు చెప్పండి. ఇవి జరుగబోయే సమయం వచ్చిందని సూచించటానికి ఏం జరుగుతుంది?” అని అడిగారు.
5 యేసు వాళ్ళతో, “మిమ్మల్నెవరూ మోసం చేయకుండా జాగ్రత్తపడండి. 6 అనేకులు నా పేరు పెట్టుకొని వచ్చి, నేనే ఆయన్ని అని చెప్పి అనేకుల్ని మోసం చేస్తారు. 7 మీరు యుద్ధాల్ని గురించి కాని, యుద్ధాల వదంతుల్ని గురించి కాని వింటే వెంటనే ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు. 8 దేశాలకు, రాజ్యాలకు మధ్య యుద్ధాలు సంభవిస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు వస్తాయి. కరువులు వస్తాయి. అంటే ప్రసవించే ముందు కలిగే నొప్పులు ప్రారంభమయ్యాయన్నమాట.
© 1997 Bible League International