Revised Common Lectionary (Complementary)
ఆలెఫ్[a]
119 పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు.
ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు.
2 యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు.
వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు.
3 ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు.
వారు యెహోవాకు విధేయులవుతారు.
4 యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు.
ఆ ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు.
5 యెహోవా, నేను నీ ఆజ్ఞలకు
ఎల్లప్పుడూ విధేయుడనౌతాను,
6 అప్పుడు నేను నీ ఆజ్ఞలను
ఎప్పుడు చదివినా సిగ్గుపడను.
7 అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి చదివి
నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను.
8 యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము!
32 “వృద్ధులను గౌరవించండి. వారు గదిలోనికి వచ్చినప్పుడు లేచి నిలబడండి. మీ దేవునికి గౌరవం చూపెట్టండి. నేను యెహోవాను.
33 “మీ దేశంలో నివసిస్తున్న విదేశీయులకు కీడు చేయకండి. 34 మీ స్వంత పౌరులను గౌరవించినట్టే, విదేశీయుల్ని కూడా మీరు గౌరవించాలి. మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకొంటారో విదేశీయుల్ని కూడా అలా ప్రేమించాలి. ఎందుచేతనంటే ఒకప్పుడు మీరూ ఈజిప్టులో విదేశీయులే. నేను మీ దేవుడైన యెహోవాను.
35 “ప్రజలు తీర్పు తీర్చేటప్పుడు మీరు న్యాయంగా ఉండాలి. అలానే వస్తువుల్ని తూచేటప్పుడు, కొలిచేటప్పుడ మీరు న్యాయంగా ఉండాలి. 36 మీ తక్కెడలు సమానంగా ఉండాలి. మీ మొగ్గులు ద్రావకాలను సరిగ్గా నింపేవిగా ఉండాలి. మీ త్రాసులు, తూనికరాళ్లు వస్తువుల్ని సరిగ్గా తూచేవిగా ఉండాలి. నేను మీ దేవుడైన యెహోవాను. నేనే మిమ్మన్ని ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకొనివచ్చాను!
37 “నా ఆజ్ఞలు, నియమాలు అన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. వాటికి మీరు విధేయులు కావాలి. నేను యెహోవాను!”
విశ్వాసం ద్వారా నీతిమంతుడు కావటం
21 కాని దేవుడు ఇప్పుడు ధర్మశాస్త్రం ఉపయోగించకుండా నీతిమంతులయ్యే విధానం మనకు తెలియచేసాడు. ఈ విధానాన్ని ప్రవక్తలు ముందే చెప్పారు. ఇది ధర్మశాస్త్రంలోనూ ఉంది. 22 దీని ప్రకారం యేసు క్రీస్తులో మనకున్న విశ్వాసంవల్ల దేవుడు మనల్ని నిర్దోషులుగా పరిగణిస్తున్నాడని విదితమౌతుంది. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కనికి ఈ విధానం వర్తిస్తుంది. 23 అందరూ పాపం చేసారు, కనుక దేవుని తేజస్సు[a] పంచుకోవటానికి ఎవ్వరికీ అర్హత లేదు. అందువల్ల ఈ విధానం అందరికీ వర్తిస్తుంది. వ్యత్యాసం లేదు. 24 కాని, దేవుడు వాళ్ళను తన ఉచితమైన కృపవల్ల నీతిమంతులుగా చేస్తున్నాడు. ఇది యేసు క్రీస్తు వల్ల కలిగే విముక్తి ద్వారా సంభవిస్తుంది. 25 దేవుడు ఇదివరలో ప్రజలు చేసిన పాపాల్ని లెక్క చెయ్యకుండా సహనం వహించాడు. ఆయన తన నీతిని నిరూపించాలని యేసు క్రీస్తు రక్తాన్ని విశ్వసించే ప్రజలకోసం ఆయనను కరుణాపీఠంగా చేసాడు. 26 అలా చేసి ఇప్పుడు తన నీతిని ప్రదర్శిస్తున్నాడు. ప్రజలు తనను నీతిమంతునిగా పరిగణించాలని, యేసును విశ్వసించే ప్రజలను నీతిమంతులుగా చెయ్యాలని ఆయన ఉద్దేశ్యం.
27 మరి, మనం గర్వించటానికి కారణం ఉందా? ఖచ్చితంగా లేదు. ఏ న్యాయం ప్రకారం కారణం లేదని చెప్పగలుగుతున్నాము? విశ్వాసానికి సంబంధించిన న్యాయంవల్ల కారణం లేదని చెపుతున్నాము. కాని క్రియా న్యాయం వల్లకాదు. 28 మనిషిలో ఉన్న విశ్వాసం అతణ్ణి నీతిమంతునిగా చేస్తుంది. ధర్మశాస్త్రం ఆదేశించిన క్రియలు చేసినందుకు కాదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. 29 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడొక్కడే కనుక ఆయన యూదులు కానివాళ్ళకు కూడా దేవుడే. 30 దేవుడు సున్నతి పొందినవాళ్లను వాళ్ళలో విశ్వాసం ఉంది కనుక నీతిమంతులుగా పరిగణిస్తాడు. సున్నతి పొందనివాళ్ళను కూడా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా పరిగణిస్తాడు. 31 మరి అలాగైతే, ఈ విశ్వాసాన్ని స్థాపించి మనం ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తున్నామా? కాదు. దాని విలువను ఎత్తి చూపిస్తున్నాము.
© 1997 Bible League International