Revised Common Lectionary (Complementary)
గీమెల్
17 నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము.
తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను అవుతాను.
18 యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి
నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను.
19 ఈ దేశంలో నేను పరాయివాణ్ణి.
యెహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము.
20 నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి
చదవాలని కోరుతున్నాను.
21 యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు.
ఆ గర్విష్ఠులకు కీడులే సంభవిస్తాయి.
నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు.
22 నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు.
నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను.
23 నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు.
అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను.
24 నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు.
అది నాకు మంచి సలహా ఇస్తుంది.
మోషేకు రుజువు
4 అప్పుడు మోషే, “నీవు నన్ను పంపించావు అని చెబితే ఇశ్రాయేలు ప్రజలు నమ్మరు గదా! ‘యెహోవా నీకు కనబడనే లేదు అంటారు వాళ్లు’” అన్నాడు దేవునితో.
2 అయితే దేవుడు, “నీ చేతిలోనిది ఏమిటి” అని మోషేను అడిగాడు.
“ఇది నా చేతికర్ర” అని మోషే జవాబిచ్చాడు.
3 అప్పుడు దేవుడు, “నీ కర్ర కింద పడవెయ్యి” అన్నాడు. మోషే తన కర్రను నేల మీద పడేసాడు. ఆ కర్ర ఒక పాముగా మారిపోయింది. మోషే భయపడి దాని దగ్గర్నుండి పారిపోయాడు. 4 అయితే యెహోవా మోషేతో, “ముందుకు వెళ్లి ఆ పాము తోక అందుకో” అన్నాడు.
మోషే ముందుకు వెళ్లి పాముతోక అందుకొన్నాడు. మోషే అలా చేయగానే ఆ పాము మళ్లీ కర్ర అయిపోయింది. 5 “ఈ కర్రను ఇలా ప్రయోగించు, అప్పుడు మీ పూర్వీకుల దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా నీకు ప్రత్యక్షమయ్యాడని నీ ప్రజలు నమ్ముతారు” అన్నాడు దేవుడు.
6 ఆ తర్వాత యెహోవా, “నీకు ఇంకో రుజువు ఇస్తాను. నీ చెయ్యి నీ చొక్కాలోపల పెట్టు” అన్నాడు మోషేతో.
కనుక మోషే తన చొక్కా తెరిచి తన చేతిని లోపల పెట్టాడు. మళ్లీ మోషే తన చొక్కాలోనుంచి తన చేతిని బయటికి తీయగానే అది మారిపోయింది. అతని చేతినిండా మంచులాంటి తెల్లని కుష్ఠు మచ్చలు కప్పేసాయి.
7 “నీ చేతిని మళ్లీ నీ చొక్కాలో పెట్టు” అన్నాడు దేవుడు. మోషే తన చేతిని మళ్లీ తన చొక్కాలోపల పెట్టాడు. మోషే అలా పెట్టి మళ్లీ తన చేతిని బయటికి తీయగానే అతని చెయ్యి మారిపోయింది. ఇప్పుడు అతని చెయ్యి బాగైపోయి మళ్లీ మునుపటిలానే ఉంది.
8 “నీకర్రను ఉపయోగించినప్పుడు ప్రజలు నిన్ను నమ్మకపోతే, నీవు ఈ సూచన చూపెట్టినప్పుడు వాళ్లు నిన్ను నమ్ముతారు. 9 నీవు వాళ్లకు ఈ రెండు సూచనలు చూపించాక కూడ వాళ్లు నమ్మటానికి నిరాకరిస్తే, అప్పుడు నైలు నదిలోనుంచి కొన్ని నీళ్లు తీసుకో, ఆ నీళ్లను నేలమీద పొయ్యి. అవి నేలను తాకగానే రక్తం అవుతాయి” అన్నాడు దేవుడు.
10 అయితే మోషే దేవునితో, “కానీ ప్రభూ నేను నిజం చెప్పేస్తున్నాను. నేనేమీ నైపుణ్యంగల మాటకారిని కాను. నాకు మనుష్యులతో చక్కగా మాట్లాడ్డం ఎప్పుడూ చేతకాలేదు. కనీసం ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత కూడ నేను మంచి మాటకారిని కాలేదు. నా మాట నిదానం అనీ, నాకు మంచి పద ప్రయోగం రాదనీ[a] నీకు తెలుసు” అన్నాడు.
11 “మనిషి నోటిని చేసిందెవరు? ఒకన్ని చెవిటివాడిగా లేక మూగవాడిగా చేయగలిగింది ఎవరు? ఒకన్ని గుడ్డివానిగా చేయగలిగింది, చూడగలిగేటట్టు చేయగలిగింది ఎవరు? వీటన్నింటిని చేయగలిగింది నేనే, నేను యెహోవాను, 12 అందుచేత వెళ్లు. నీవు మాట్లాడేటప్పుడు నేను నీతో ఉంటాను. చెప్పాల్సిన మాటలు నేనే నీకు చెబుతాను” అని అతనితో యెహోవా అన్నాడు.
13 కానీ మోషే, “నా ప్రభువా, నన్ను విడిచిపెట్టి మరెవర్నయినా పంపించుమని బతిమాలు కొంటున్నాను” అన్నాడు.
14 యెహోవాకు మోషేమీద కోపం వచ్చింది, “లేవీ వంశానికి చెందిన నీ సోదరుడు అహరోనును నేను వాడుకొంటాను. అతనికి మాట్లాడుటలో నైపుణ్యం ఉంది. అహరోను నీ దగ్గరకు వస్తాడు. నిన్ను చూచి సంతోషిస్తాడు, 15 అతడు నీతోకూడ ఫరో దగ్గరకు వస్తాడు. నీవు చెప్పాల్సిందేమిటో నేను నీకు చెబుతాను, అది నీవు అహరోనుకు చెప్పాలి. ఫరోతో చెప్పటానికి అహరోను సరైన మాటల్ని సిద్ధం చేసుకొంటాడు. 16 ప్రజలతో కూడ అహరోనే నీ పక్షంగా మాట్లాడుతాడు. అతనికి నీవు ఒక మహారాజులా ఉంటావు. అతనే అధికారంతో నీ తరపున మాట్లాడతాడు.[b] 17 కనుక వెళ్లు. నీతోకూడ నీ కర్ర తీసుకొని వెళ్లు. నీకు నేను తోడుగా ఉన్నానని ప్రజలకు తెలియడానికి నీ కర్రను, మిగతా అద్భుతాలను ప్రయోగించు” అన్నాడు దేవుడు.
2 అందువలన మీరు దుష్టత్వమంతటినీ, మోసమంతటినీ, వేషధారణను, అసూయను మరియు ప్రతివిధమైన దూషణను మీ నుండి తీసివేయండి. 2 అప్పుడే జన్మించిన శిశువులు పాలకోసం తహతహలాడినట్లు, మీరు కూడా దేవుని వాక్యమను పరిశుద్ధ పాల కోసం తహతహలాడండి. ఆ పాల వల్ల మీరు ఆత్మీయంగా రక్షణలో ఎదుగుతారు. 3 ప్రభువు మంచివాడని అనుభవ పూర్వకంగా మీరు తెలిసికొన్నారు.
4 మీరు సజీవమైన రాయియగు ప్రభువు వద్ధకు రండి. మానవులు ఈ సజీవమైన రాయిని తృణీకరించారు. కాని, దేవుడు ఆయన్ని అమూల్యంగా పరిగణించి ఎన్నుకొన్నాడు. 5 మీరు కూడా సజీవమైన రాళ్ళుగా ఆత్మీయమైన మందిర నిర్మాణంలో కట్టబడుచున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ఆత్మీయబలుల్ని అర్పించడానికి మీరు పవిత్ర యాజకులుగా ఎన్నుకోబడ్డారు. 6 ఎందుకంటే, ధర్మశాస్త్రంలో ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాసారు:
“అదిగో చూడు! సీయోనులో ఒక రాయి స్థాపించాను!
పునాది రాయిగా ఎన్నుకున్న అమూల్యమైన రాయి అది.
ఆయన్ని నమ్మిన వానికెవ్వనికి అవమానం ఎన్నటికి కలుగదు!”(A)
7 ఇప్పుడు నమ్మిన మీకు అది అమూల్యమైన రాయి. కాని నమ్మిన వాళ్ళకు:
“ఇల్లు కట్టేవాళ్ళు నిషేధించిన
రాయి మూలకు తలరాయి అయింది.”(B)
8 మరొక చోట యిలా వ్రాయబడి ఉంది:
“ఈ రాయి, మానవులు తొట్రుపడేటట్లు చేస్తుంది.
ఈ బండ వాళ్ళను క్రింద పడవేస్తుంది.”(C)
దైవసందేశాన్ని నిరాకరించిన వాళ్ళు తొట్రుపడతారు. వాళ్ళు దానికని నిర్ణయించబడ్డారు.
9 కాని, మీరు దేవుడు ఎన్నుకొన్న ప్రజలు, మీరు రాజవంశానికి చెందిన యాజకులు, మీరు పవిత్రమైన జనాంగము, మీరు దేవునికి సన్నిహితమైన ప్రజలు. తన ఘనతను గూర్చి చెప్పటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అంధకారం నుండి అద్భుతమైన తన వెలుగులోకి రమ్మని ఆయన మిమ్మల్ని పిలిచాడు.
10 పూర్వం మీరు దేవుని ప్రజ కాదు.
ఇప్పుడు మీరు దేవుని ప్రజ.
పూర్వం మీకు దైవానుగ్రహం లభించలేదు.
కాని యిప్పుడు లభించింది.
© 1997 Bible League International