Revised Common Lectionary (Complementary)
యాత్ర కీర్తన.
126 యెహోవా మమ్మల్ని దేశ బహిష్కరణ నుండి
తిరిగి వెనుకకు తీసుకొని వచ్చినప్పుడు అది ఒక కలలా ఉంది!
2 మేము నవ్వుకుంటున్నాము.
మరియు మేము అకస్మాత్తుగా సంతోషగానాలు పాడటం మొదలుపెట్టేవాళ్లము.
“దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేశాడు.”
3 ఇతర రాజ్యాల ప్రజలు దాన్ని గూర్చి చెప్పుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా మాకు ఆశ్చర్యకరమైన పనులు చేశాడు” అని ఆ ప్రజలు చెప్పారు. మేము చాలా ఆనందంగా ఉన్నాము!
4 యెహోవా మేము ఖైదీలముగా ఉన్నాము.
ఇప్పుడు ఎడారిని వికసింప చేసే నీటి ప్రవాహంలా మమ్మల్ని తిరిగి స్వతంత్రులుగా చేయుము.
5 విత్తనాలు నాటేటప్పుడు ఒకడు దుఃఖముగా ఉండవచ్చు,
కాని పంట కూర్చుకొనేటప్పుడు సంతోషంగా ఉంటాడు.
6 అతడు బయట పొలాల్లోనికి విత్తనం మోసికొని పోవునప్పుడు ఏడ్వవచ్చు,
కాని పంటను ఇంటికి తెచ్చునప్పుడు అతడు సంతోషిస్తాడు.
దొంగ ప్రవక్తలకు వ్యతిరేకంగా తీర్పు
9 ప్రవక్తలకు పవిత్రమైన మాటలు:
నేను విచారంగా ఉన్నాను. నా హృదయం పగిలింది.
నా ఎముకలు వణుకుతున్నాయి.
నేను (యిర్మీయా) ఒక తాగుబోతు వ్యక్తిలా ఉన్నాను.
యెహోవాను బట్టి, ఆయన పవిత్ర వాక్కును బట్టి నేనిలా వున్నాను.
10 యూదా రాజ్యం వ్యభిచరించే వారితో నిండిపోయింది.
వారనేక విధాలుగా అవిశ్వాసులై ఉన్నారు.
యెహోవా రాజ్యాన్ని శపించాడు.
అందుచే అది బీడై పోయింది.
పచ్చిక బయళ్లలో మొక్కలు ఎండి చచ్చిపోతున్నాయి.
పొలాలన్నీ ఎడారుల్లా మారినాయి.
ప్రవక్తలంతా దుష్టులయ్యారు.
ప్రవక్తలు వారి శక్తియుక్తుల్ని తప్పుడు విధంగా వినియోగిస్తున్నారు.
11 “ప్రవక్తలు, యాజకులు కూడా దుష్టులయ్యారు.
వారు నా ఆలయంలోనే దుష్టకార్యాలు చేయటం నేను చూశాను.”
ఇదే యెహోవా వాక్కు.
12 “కావున నా సందేశం ఇక మీదట వారికివ్వను.
వారి జీవితం బలవంతంగా అంధకారంలో నడిచినట్లుంటుంది.
ప్రవక్తలకు, యాజకులకు మార్గం అతి నునుపై జారిపడేలా ఉంటుంది.
గాఢాంధకారంలో ప్రవక్తలు, యాజకులు జారిపడతారు.
వారి మీదికి విపత్తును తీసుకొని వస్తాను.
ఆ సమయంలో ఆ ప్రవక్తలను, యాజకులను శిక్షిస్తాను.”
ఇదే యెహోవా వాక్కు.
13 “సమరయ[a] ప్రవక్తలు చెడు చేయటం నేను చూశాను.
బూటకపు దేవత బయలు పేరిట వారు భవిష్య విషయాలు చెప్పటం నేను చూశాను.
ఆ ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలను యెహోవాకు దూరం చేశారు.
14 యూదా ప్రవక్తలు యెరూషలేములో ఘోరమైన
పనులు చేయటం నేను చూశాను.
ఈ ప్రవక్తలు వ్యభిచార దోషానికి పాల్పడ్డారు.
వారు అబద్ధాలను వింటారు.
వారు తప్పుడు బోధలను అనుసరించారు.
వారు దుర్మార్గులను, చెడు కార్యాలు చేయటానికి ప్రోత్సహించారు.
అందువల్ల ప్రజలు పాపం చేయటం మానలేదు.
వారు సొదొమ నగరం వలె ఉన్నారు.
యెరూషలేము ప్రజలు నా దృష్టిలో
గొమొర్రా నగరం వలె ఉన్నారు!”
15 అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ ప్రవక్తల విషయంలో ఇలా చెపుతున్నాడు.
“ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను.
ఆ శిక్ష విషముతిన్నట్లు, చేదు నీరు తాగినట్లు ఉంటుంది.
ఆ ప్రవక్తలు ఆధ్యాత్మిక పరమైన
ఒక రుగ్మతను ప్రబలింప చేశారు.
ఆ రోగం దేశ వ్యాప్తంగా చెలరేగింది, కావున ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను.
ఆ రోగం యెరూషలేములోని ప్రవక్తల నుండే సంక్రమించింది.”
మెల్కీసెదెకు
7 ఈ మెల్కీసెదెకు షాలేము రాజు, మరియు మహోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రాహాము రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు అతన్ని కలుసుకొని ఆశీర్వదించాడు. 2 అబ్రాహాము తాను జయించిన వాటిలో పదవవంతు మెల్కీసెదెకుకు యిచ్చాడు.
మొదటిదిగా “మెల్కీసెదెకు” అనే పదానికి నీతికి రాజు అనే అర్థం. రెండవదిగా “షాలేము రాజు” అను యితని పేరుకు శాంతికి రాజు అనే అర్థం కూడా వుంది. 3 మెల్కీసెదెకు తల్లిదండ్రులెవరో మనకు తెలియదు. అతని పూర్వికులెవరో మనకు తెలియదు. అతని బాల్యాన్ని గురించి కాని, అంతిమ రోజుల్ని గురించి కాని మనకు తెలియదు. దేవుని కుమారునివలె అతడు కూడా చిరకాలం యాజకుడుగా ఉంటాడు.
4 మూల పురుషుడైన అబ్రాహాము కూడా తాను జయించినదానిలో పదవ వంతు అతనికిచ్చాడంటే, అతడు ఎంత గొప్పవాడో గ్రహించండి. 5 ఇశ్రాయేలు ప్రజలు అబ్రాహాము వంశానికి చెందినవాళ్ళు, లేవి జాతికి చెందిన యాజకుల సోదరులు. అయినా ధర్మశాస్త్రంలో ఈ లేవి యాజకులు ప్రజలు ఆర్జించినదానిలో పదవవంతు సేకరించాలని ఉంది. 6 మెల్కీసెదెకు లేవి జాతికి చెందినవాడు కాకపోయినా, అబ్రాహాము నుండి అతని ఆదాయంలో పదవవంతు సేకరించాడు. దేవుని వాగ్దానాలు పొందిన అతణ్ణి ఆశీర్వదించాడు. 7 ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదం పొందే వానికన్నా గొప్ప వాడవటంలో అనుమానం లేదు.
8 ఒకవైపు చనిపోయేవాళ్ళు పదవ వంతు సేకరిస్తున్నారు. మరొక వైపు చిరకాలం జీవిస్తాడని లేఖనాలు ప్రకటించిన మెల్కీసెదెకు పదవ వంతు సేకరిస్తున్నాడు. 9 ఒక విధంగా చూస్తే పదవవంతు సేకరించే లేవి, అబ్రాహాము ద్వారా పదవవంతు చెల్లించాడని చెప్పుకోవచ్చు. 10 ఎందుకంటే, మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకొన్నప్పుడు లేవి యింకా జన్మించ లేదు. అతడు, తన మూల పురుషుడైన అబ్రాహాములోనే ఉన్నాడు.
© 1997 Bible League International