Revised Common Lectionary (Complementary)
9 ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక.
సర్వోన్నతుడైన దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా చేసుకొన్నావు గనుక.
10 కీడు ఏమీ నీకు జరగదు.
నీ ఇంట ఎలాంటి వ్యాధి ఉండదు.
11 ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు.
12 నీ పాదం రాయికి తగులకుండా
దేవదూతలు వారి చేతులతో నిన్ను పైకి ఎత్తుతారు.
13 సింహాల మీద, విషసర్పాల మీద
నడిచే శక్తి నీకు ఉంటుంది.
14 యెహోవా చెబుతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను.
నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.
15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు.
నేను వారికి జవాబు ఇస్తాను.
వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.
16 నా అనుచరులకు నేను దీర్ఘాయుష్షు యిస్తాను.
నేను వాళ్లను రక్షిస్తాను.”
17 కదొర్లాయోమెరును, అతనితో ఉన్న రాజులను ఓడించిన తర్వాత అబ్రాము తన యింటికి తిరిగి వెళ్లాడు. అతడు యింటికి వచ్చుచున్నప్పుడు షావే లోయలో అతణ్ణి కలుసుకొనేందుకు సొదొమ రాజు వెళ్లాడు. (ఇప్పుడు దీనిని రాజు లోయ అంటారు.)
మెల్కీసెదెకు
18 షాలేము రాజు మెల్కీసెదెకు కూడా అబ్రామును కలుసుకొనేందుకు వెళ్లాడు. మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. రొట్టెను, ద్రాక్షారసాన్ని మెల్కీసెదెకు తెచ్చాడు. 19 మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదించి ఇలా అన్నాడు:
“అబ్రామా, మహోన్నతుడైన దేవుడు నీకు దీవెనలు ప్రసాదించుగాక,
దేవుడు భూమ్యాకాశాలను చేసినవాడు.
20 సర్వోన్నతుడైన దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం
నీ శత్రువుల్ని ఓడించటానికి ఆయనే నీకు సహాయం చేశాడు.”
యుద్ధ సమయంలో అబ్రాము తెచ్చుకొన్న దానంతటిలో నుండి పదోవంతు మెల్కీసెదెకునకు అతడు ఇచ్చాడు. 21 అప్పుడు సొదొమ రాజు, “వీటన్నింటిని నీ కోసమే ఉంచుకో. శత్రువుచేత బాధించబడి, తీసుకొనిపోబడ్డ నా మనుష్యులను మాత్రం నాకు ఇచ్చేయి” అని అబ్రాముతో చెప్పాడు.
22 అయితే సొదొమ రాజుతో అబ్రాము ఇలా చెప్పాడు: “భూమిని, ఆకాశాన్ని చేసిన మహోన్నతుడైన యెహోవాదేవుని పేర నేను వాగ్దానం చేస్తున్నాను. 23 నీకు చెందినది ఏదీ నేను ఉంచుకోను. ఒక నూలుపోగైనా లేక జోళ్ల దారాలయినా, ఏదీ ఉంచుకోనని నేను వాగ్దానం చేస్తున్నాను. ‘అబ్రామును నేనే ధనికునిగా చేశానని నీవు చెప్పడం నాకిష్టం లేదు.’ 24 నా యువకులు భుజించిన ఆహారం ఒక్కటి మాత్రము నేను స్వీకరిస్తాను. అయితే మిగిలినవారికి వారి వంతు నీవు ఇవ్వాలి. యుద్ధములో మేము గెలుచుకొన్న వాటిని తీసుకొని, ఆనేరు, ఎష్కోలు, మమ్రేలకు రావలసిన భాగాలు వారికి ఇవ్వు. వీళ్లు నాకు యుద్ధంలో సహాయపడ్డారు.”
7 దేవునికి ఘనత కలగాలని క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే మీరు కూడా ఇతర్లను అంగీకరించండి. 8 మూలపురుషులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టాలని, దేవుడు సత్యవంతుడని నిరూపించాలని, క్రీస్తు యూదుల సేవకుడు అయ్యాడు. 9 యూదులు కానివాళ్ళు దేవుని అనుగ్రహం కోసం ఆయన్ని స్తుతించాలని క్రీస్తు ఉద్దేశ్యం. ఈ సందర్భాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“ఈ కారణంగానే యూదులు కాని వాళ్ళతో కలిసి నిన్ను స్తుతిస్తాను.
నీ పేరిట భక్తి గీతాలు పాడతాను.”(A)
10 మరొక చోట:
“యూదులు కాని ప్రజలారా!
మీరు కూడా దేవుని ప్రజలతో ఆనందించండి.”(B)
11 ఇంకొక చోట ఇలా వ్రాయబడి వుంది:
“యూదులు కాని ప్రజలారా! ప్రభువును స్తుతించండి.
ఆయన్ని స్తుతిస్తూ గీతాలు పాడండి!”(C)
12 యెషయా ఒక చోట ఈ విధంగా అన్నాడు:
“యెష్షయి వంశ వృక్షం యొక్క వేరు చిగురిస్తుంది.
ఆయన దేశాలను పాలిస్తాడు.
యూదులు కానివాళ్ళు ఆయనలో నిరీక్షిస్తారు.”(D)
13 రక్షణ లభిస్తుందని నిరీక్షణ కలిగించే ఆ దేవుడు మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణమైన ఆనందాన్ని, శాంతిని కలుగ చేయుగాక! అప్పుడు మీలో ఉన్న నిరీక్షణ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొంగి పొర్లుతుంది.
© 1997 Bible League International