Revised Common Lectionary (Complementary)
6 యెహోవా దరిచేరి జీవించండి.
మీరు యెహోవా వద్దకు వెళ్లకపోతే యోసేపు (పది వంశాలవారు) ఇంటిమీద నిప్పు పడుతుంది.
ఆ అగ్ని యోసేపు ఇంటిని దగ్ధం చేస్తుంది. బేతేలులో చెలరేగిన ఆ అగ్నిని ఎవ్వరూ ఆపలేరు.
7-9 మీరు యెహోవా కొరకు చూడండి.
సప్త ఋషీ నక్షత్రాలను, మృగశీర్ష నక్షత్రాన్ని సృష్టించింది ఆయనే.
చీకటిని ఉదయ కాంతిగా ఆయన మార్చుతాడు.
పగటిని చీకటిగా ఆయన మార్చుతాడు.
ఆయన సముద్ర జలాలను బయట నేలమీద కుమ్మరిస్తాడు.
ఆయన పేరు యెహోవా!
ఒక బలమైన నగరాన్ని ఆయన సురక్షితంగా ఉంచుతాడు.
మరో బలమైన నగరం నాశనమయ్యేలా ఆయన చేస్తాడు.”
ఇశ్రాయేలీయులు చేసిన చెడుపనులు
ప్రజలారా! ఇది మీకు తగని పని. మీరు మంచిని విషంగా మార్చుతారు.
న్యాయాన్ని హత్యచేసి నేలకు కూలేలా చేస్తారు.
10 ప్రవక్తలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళి, ప్రజలు చేసే చెడ్డపనులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. అందుచేత ప్రజలా ప్రవక్తలను అసహ్యించుకుంటారు.
ప్రవక్తలు మంచివైన సామాన్య సత్యాలను బోధిస్తారు. అందుచే ప్రజలు ఆ ప్రవక్తలను అసహ్యించుకుంటారు.
11 మీరు ప్రజలనుండి అన్యాయంగా పన్నులు వసూలు చేస్తారు.
మీరు పేదవారినుండి గోధుమ మోపులను తీసుకుంటారు.
ఈ ధనంతో మీరు చెక్కిన రాళ్లతో అందమైన ఇండ్లు కట్టుకుంటారు.
కాని మీరు ఆ ఇండ్లలో నివసించరు.
మీరు అందమైన ద్రాక్షాతోటలను నాటుతారు.
కాని మీరు వాటినుండి ద్రాక్షారసం తాగరు.
12 ఎందుకంటే మీరు చేసిన అనేక పాపాలగురించి నాకు తెలుసు.
మీరు నిజంగా కొన్ని ఘోరమైన పాపాలు చేశారు.
మంచిపనులు చేసే ప్రజలను మీరు బాధించారు.
చెడు చేయటానికి మీరు డబ్బు తీసుకుంటారు.
బహిరంగ ప్రదేశాలలో పేదవారిని మీరు నెట్టివేస్తారు.
13 ఆ సమయంలో తెలివిగల బోధకులు ఊరుకుంటారు.
ఎందుకంటే అది చెడు కాలం గనుక.
14 దేవుడు మీతోనే ఉన్నట్లు మీరు చెపుతారు.
అందుచే మీరు మంచిపనులు చేయాలేగాని చెడు చేయరాదు.
అప్పుడు మీరు బతుకుతారు.
సర్వశక్తుడగు యెహోవా నిజంగా మీతోవుంటాడు.
15 చెడును ద్వేషించు. మంచిని ప్రేమించు.
న్యాయస్థానాలలో న్యాయాన్ని పునరుద్ధరించండి.
అప్పుడు యోసేపు వంశంలో మిగిలినవారిమీద దేవుడు,
సర్వశక్తిమంతుడు అయిన యెహోవా కనికరం కలిగి ఉండవచ్చు.
12 మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు
నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము.
13 యెహోవా, ఎల్లప్పుడూ మా దగ్గరకు తిరిగి రమ్ము.
నీ సేవకులకు దయ చూపించుము.
14 ప్రతి ఉదయం నీ ప్రేమతో మమ్మల్ని నింపుము.
మేము సంతోషించి, మా జీవితాలు అనుభవించగలిగేలా చేయుము.
15 మా జీవితాల్లో చాలా దుఃఖం, కష్టాలు నీవు కలిగించావు.
ఇప్పుడు మమ్మల్ని సంతోషింపచేయుము.
16 వారి కోసం నీవు చేయగల ఆశ్చర్య కార్యాలను నీ సేవకులను చూడనిమ్ము.
వారి సంతానాన్ని నీ ప్రకాశమును చూడనిమ్ము.
17 మా దేవా, మా ప్రభూ, మా యెడల దయచూపించుము.
మేము చేసే ప్రతిదానిలో మాకు సఫలత అనుగ్రహించుము.
12 దైవసందేశం సజీవమైంది. దానిలో చురుకుదనం ఉంది. అది రెండు వైపులా పదునుగానున్న కత్తికన్నా పదునైంది. అది చొచ్చుకొని పోయి ఆత్మను, ప్రాణాన్ని, కీళ్ళను, ఎముకలో ఉన్న మూలుగను విభాగించగలదు. అది మనస్సు యొక్క భావాలమీద, ఆలోచనల మీద తీర్పు చెప్పగలదు. 13 సృష్టిలో ఉన్న ఏ వస్తువూ దేవుని దృష్టినుండి తప్పించుకోలేదు. కళ్ళ ముందు పరచబడినట్లు ఆయనకు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి దేవునికి మనం మనకు సంబంధించిన లెక్కల్ని చూపవలసి వుంటుంది.
యేసు గొప్ప ప్రధాన యాజకుడు
14 పరలోకానికి వెళ్ళిన యేసు దేవుని కుమారుడు. ఆయనే మన ప్రధాన యాజకుడు. మనం బహిరంగంగా అంగీకరించిన విశ్వాసాన్ని విడువకుండా దృఢంగా ఉండాలి. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను చూసి సానుభూతి చెందుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనలాగే అన్ని రకాల పరీక్షలకు గురి అయ్యాడు. కాని, ఆయన ఏ పాపమూ చెయ్యలేదు. 16 అందువలన మనకు అనుగ్రహం ప్రసాదించే దేవుని సింహాసనం దగ్గరకు విశ్వాసంతో వెళ్ళుదాం. అలా చేస్తే మనకు అవసరమున్నప్పుడు, ఆయన దయ, అనుగ్రహము మనకు లభిస్తాయి.
ధనవంతుడు యేసును వెంబడించుటకు నిరాకరించటం
(మత్తయి 19:16-30; లూకా 18:18-30)
17 యేసు బయలుదేరుతుండగా ఒక మనిషి పరుగెత్తుకొంటూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మంచి బోధకుడా! నేను నిత్యజీవం పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.
18 యేసు, “నేను మంచివాణ్ణి అని ఎందుకు అంటున్నావు. దేవుడు తప్ప ఎవరూ మంచివారు కారు. మోషే ఆజ్ఞలు నీకు తెలుసు కదా! 19 హత్య చేయరాదు, వ్యభిచారం చేయరాదు. దొంగతనము చెయ్యరాదు. దొంగ సాక్ష్యం చెప్పరాదు. మోసం చెయ్యరాదు. నీ తల్లి తండ్రుల్ని గౌరవించు” అని అన్నాడు.
20 అతడు, “అయ్యా! నా చిన్నతనంనుండి నేను వీటిని పాటిస్తున్నాను!” అని అన్నాడు.
21 యేసు అతని వైపు చూసాడు. అతనిపై యేసుకు అభిమానం కలిగింది. అతనితో, “నీవు యింకొకటి చెయ్యాలి. వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకివ్వు. అప్పుడు నీకు పరలోకంలో సంపద లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు.
22 ఇది విన్నాక ఆ వచ్చిన వ్యక్తి ముఖం చిన్నబోయింది. అతని దగ్గర చాలా ధనముండటం వల్ల దుఃఖంతో అక్కడినుండి వెళ్ళిపొయ్యాడు.
23 యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, “ధనమున్నవాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం చాలా కష్టం” అని అన్నాడు.
24 శిష్యులు ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు. యేసు మళ్ళీ, “శిష్యులారా! దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఎంతో కష్టం! 25 ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు.
26 ఇది విని శిష్యులు యింకా ఎక్కువ ఆశ్చర్యపడ్డారు. అలాగైతే, “ఎవరికి రక్షణ లభిస్తుంది?” అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు.
27 యేసు వాళ్ళవైపు చూసి, “మానవునికి ఇది అసాధ్యమైన పని కాని, దేవునికి అన్నీ సాధ్యమే!” అని అన్నాడు.
28 పేతురు ఆయనతో, “మిమ్మల్ని అనుసరించాలని మేము అన్నీ వదిలివేసాము” అని అన్నాడు.
29-30 యేసు, “ఇది నిజం. నా కోసం, సువార్తకోసం, తన యింటినికాని, సోదరులనుకాని, అక్క చెల్లెండ్లను కాని, తల్లినికాని, తండ్రినికాని, సంతానాన్ని కాని, పొలాల్ని కాని, విడిచినవాడు ఈ తరంలోనే నూరు రెట్లు యిళ్ళను, సోదరులను, అక్క చెల్లెండ్లను, తల్లుల్ని, సంతానాన్ని, పొలాల్ని పొందుతాడు. వీటితో పాటు హింసల్ని కూడా పొందుతాడు. రానున్న లోకంలో నిత్యజీవం పొందుతాడు. 31 కాని ముందున్న వాళ్ళు చివరివాళ్ళై, చివర వున్న వాళ్ళు ముందుకు వెళ్తారు” అని అన్నాడు.
© 1997 Bible League International