Revised Common Lectionary (Complementary)
12 మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు
నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము.
13 యెహోవా, ఎల్లప్పుడూ మా దగ్గరకు తిరిగి రమ్ము.
నీ సేవకులకు దయ చూపించుము.
14 ప్రతి ఉదయం నీ ప్రేమతో మమ్మల్ని నింపుము.
మేము సంతోషించి, మా జీవితాలు అనుభవించగలిగేలా చేయుము.
15 మా జీవితాల్లో చాలా దుఃఖం, కష్టాలు నీవు కలిగించావు.
ఇప్పుడు మమ్మల్ని సంతోషింపచేయుము.
16 వారి కోసం నీవు చేయగల ఆశ్చర్య కార్యాలను నీ సేవకులను చూడనిమ్ము.
వారి సంతానాన్ని నీ ప్రకాశమును చూడనిమ్ము.
17 మా దేవా, మా ప్రభూ, మా యెడల దయచూపించుము.
మేము చేసే ప్రతిదానిలో మాకు సఫలత అనుగ్రహించుము.
13 నా ప్రభువును, దేవుడును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “యాకోబు వంశాన్ని (ఇశ్రాయేలు) ఈ విషయాలను గూర్చి హెచ్చరించు. 14 ఇశ్రాయేలు పాపం చేసింది. వారి పాపాలకు నేను వారిని శిక్షిస్తాను. బేతేలులోవున్న బలిపీఠాలనుకూడా నేను నాశనం చేస్తాను. బలిపీఠపు కొమ్ములు నరికివేయబడతాయి. అవి కింద పడతాయి. 15 శీతాకాలపు విడిదిని, వేసవి విడిదిని కలిపి నేను నాశనం చేస్తాను. దంతపు ఇండ్లు నాశనం చేయబడతాయి. అనేక ఇండ్లు నాశనం చేయబడతాయి” అని యెహోవా చెపుతున్నాడు.
విలాసవంతులైన స్త్రీలు
4 సమరయ (షోమ్రోను) కొండమీదగల బాషాను ఆవుల్లారా[a] నేను చెప్పేది వినండి. మీరు పేద ప్రజలను గాయపరుస్తారు. ఆ పేద ప్రజానీకాన్ని మీరు అణగదొక్కుతారు. “మేము తాగటానికి ఏదైనా తీసికొని రండి!” అని మీరు మీ భర్తలకు చెపుతారు.
2 నా ప్రభువైన యెహోవా ఒక వాగ్దానం చేసాడు. మీకు కష్టాలు వస్తాయని ఆయన తన పవిత్రత సాక్షిగా చెప్పాడు. శత్రు ప్రజలు మీకు కొంకెలు తగిలించి లాగుతారు. మీ పిల్లను లాక్కుపోవటానికి చేపలు పట్టే గాలాలను ఉపయోగిస్తారు. 3 మీ నగరం నాశనం చేయబడుతుంది. మీ స్త్రీలలో ప్రతి ఒక్కరూ గోడ కంతలగుండా నగరంనుండి బయటకు పోతారు. చనిపోయిన మీ పిల్లలను గుట్టమీదికి విసరివేస్తారు.
యెహోవా ఇది చెపుతున్నాడు: 4 “బేతేలుకు వెళ్లి పాపం చేయండి! గిల్గాలుకు వెళ్లి మరింత పాపం చేయండి. మీ బలులను ఉదయ వేళల్లో ఇవ్వండి. మీ పంటలో పదవవంతు మూడు రోజులకొకసారి తీసికొని రండి. 5 పులియబెట్టిన పదార్థాన్ని స్తోత్రార్పణగా ఇవ్వండి. స్వేచ్ఛార్పణల విషయం అందరికీ చెప్పండి. ఇశ్రాయేలూ, నీవు ఈ పనులు చేయటానికి ఇష్టపడతావు. కావున నీవు వెళ్ళి వాటిని చేయి. యెహోవా చెప్పేది ఇదే.
దేవుని ప్రేమ మరియు మానవ సాంప్రదాయం
(మార్కు 7:1-23)
15 కొందరు పరిసయ్యులు, శాస్త్రులు యెరూషలేము నుండి వచ్చి, 2 “మీ శిష్యులు భోజనానికి ముందు చేతులెందుకు కడుక్కోరు? పెద్దలు నియమించిన ఆచారాల్ని వాళ్ళెందుకు ఉల్లంఘిస్తున్నారు?” అని అడిగారు.
3 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ ఆచారాల కోసం దేవుని ఆజ్ఞల్ని ఎందుకుల్లంఘిస్తున్నారు? 4 దేవుడు ‘తల్లి తండ్రుల్ని గౌరవించు’ అని అన్నాడు. అంతేకాక ‘తల్లి తండ్రుల్ని దూషించిన వానికి మరణ దండన వేయవలెను!’ అని కూడా చెప్పాడు. 5-6 కాని మీరు ఒక వ్యక్తి తన తల్లి తండ్రులతో ‘మీ అవసరాలకివ్వాలనుకొన్న ధనం దేవునికి ముడుపు కట్టాను’ అని అన్నవాడు, తల్లి తండ్రుల్ని గౌరవించనవసరం లేదని అంటున్నారు. అంటే మీరు మీ ఆచారం కోసం దేవుని మాటను కాదంటున్నారన్న మాట. 7 మీరు మోసగాళ్ళు. యెషయా మిమ్మల్ని గురించి సరిగ్గా ముందే చెప్పాడు. అతడు,
8 ‘ఈ ప్రజలు నన్ను పెదాలతో గౌరవిస్తారు.
కాని వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉంటాయి.
9 వాళ్ళ ఆరాధనలు వ్యర్థం!
వాళ్ళ బోధనలు మానవులు సృష్టించిన ఆజ్ఞలతో సమానం,’”(A)
అని అన్నాడు.
© 1997 Bible League International