Revised Common Lectionary (Complementary)
12 మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు
నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము.
13 యెహోవా, ఎల్లప్పుడూ మా దగ్గరకు తిరిగి రమ్ము.
నీ సేవకులకు దయ చూపించుము.
14 ప్రతి ఉదయం నీ ప్రేమతో మమ్మల్ని నింపుము.
మేము సంతోషించి, మా జీవితాలు అనుభవించగలిగేలా చేయుము.
15 మా జీవితాల్లో చాలా దుఃఖం, కష్టాలు నీవు కలిగించావు.
ఇప్పుడు మమ్మల్ని సంతోషింపచేయుము.
16 వారి కోసం నీవు చేయగల ఆశ్చర్య కార్యాలను నీ సేవకులను చూడనిమ్ము.
వారి సంతానాన్ని నీ ప్రకాశమును చూడనిమ్ము.
17 మా దేవా, మా ప్రభూ, మా యెడల దయచూపించుము.
మేము చేసే ప్రతిదానిలో మాకు సఫలత అనుగ్రహించుము.
ప్రజలు దేవునికి భయపడటం
22 “మీరంతా కలిసి ఆ కొండ దగ్గర ఉన్నప్పుడు మీ అందరికీ ఈ ఆజ్ఞలను యెహోవా యిచ్చాడు. అగ్ని, మేఘం, గాఢాంధకారంలోనుండి వచ్చిన పెద్ద శబ్దంతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఈ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత యింకేమీ చెప్పలేదు. ఆయన తన మాటలను రెండు రాతి పలకలమీద వ్రాసి వాటిని నాకు ఇచ్చాడు.
23 “పర్వతం అగ్నితో మండిపోతున్నప్పుడు అంధకారంలోనుంచి వచ్చిన ఆ స్వరం మీరు విన్నారు. అప్పుడు, మీ వంశాల నాయకులు అందరూ, మీ పెద్దలూ నా దగ్గరకు వచ్చారు. 24 వారు అన్నారు: ‘మన దేవుడైన యెహోవా తన మహిమను, మహాత్యాన్ని మాకు చూపించాడు. ఆయన అగ్నిలోనుండి మాట్లాడటం మేము విన్నాము. ఒక మనిషితో దేవుడు మాట్లాడిన తర్వాత కూడ ఆ మనిషి బ్రతకటం సాధ్యమేనని ఈవేళ మేము చూశాము. 25 కానీ మన దేవుడైన యెహోవా మాతో ఇంకొక్కసారి మాట్లాడటం గనుక మేము వింటే మేము తప్పకుండా చస్తాము. ఆ భయంకర అగ్ని మమ్మల్ని నాశనం చేసేస్తుంది. కానీ మేము చావటం మాకు యిష్టంలేదు. 26 సజీవ దేవుడు మాట్లాడటం మేము విన్నట్టుగా వినికూడ బ్రతికిన మనిషి ఎన్నడూ ఎవ్వడూ లేడు. 27 మోషే, నీవు దగ్గరగా వెళ్లి, మన దేవుడైన యెహోవా చెబుతున్న సంగతులన్నీ విను. తర్వాత, యెహోవా నీకు చెప్పే విషయాలన్నీ నీవు మాకు చెప్పు. మేము నీ మాట వింటాము, నీవు చెప్పేది అంతా చేస్తాము.’
మోషేతో యెహోవా మాట్లాడటం
28 “మీరు నాతో చెప్పిన సంగతులను యెహోవా విన్నాడు. అప్పుడు యెహోవా నాతో అన్నాడు, ‘ఈ ప్రజలు చెప్పిన విషయాలు నేను విన్నాను. వారు చెప్పింది అంతా మంచిదే. 29 వారు ఎల్లప్పుడూ వారి హృదయాల్లో నన్ను గౌరవించి, నా ఆజ్ఞలన్నింటికీ విధేయులైతే బాగుండును అని మాత్రమే నా కోరిక. అప్పుడు వాళ్లకు, వాళ్ల సంతతివారికి సర్వం శుభం అవుతుంది.
30 “‘వెళ్లి, ప్రజలందరినీ వారి గుడారాలకు వెళ్లి పొమ్మని చెప్పు. 31 అయితే మోషే, నీవు యిక్కడ నాకు దగ్గరగా నిలబడు. నీవు వాళ్లకు నేర్పించాల్సిన ఆజ్ఞలు, చట్టాలు, నియమాలు అన్నీ నీకు నేను చెబుతాను. వారు జీవించేందుకు నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ఈ పనులు చేయాలి’.
32 “అందుచేత యెహోవా మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేసేందుకు మీరు జాగ్రత్తగా వుండాలి. మీరు దేవుణ్ణి అనుసరించటం మానకూడదు. 33 మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన విధంగా మీరు జీవించాలి. అప్పుడు మీరు జీవించడం కొనసాగుతుంది, మీకు అంతా శుభ ప్రదం అవుతుంది. మరియు మీది కాబోతున్న ఆ దేశంలో మీ జీవితం పొడిగించబడుతుంది.
4 దేవుని విశ్రాంతిలో ప్రవేశించుదుమన్న వాగ్దానం యింకా అలాగే ఉంది. అందువలన అక్కడికి వెళ్ళగలిగే అవకాశాన్ని ఎవ్వరూ జారవిడుచుకోకుండా జాగ్రత్త పడదాం. 2 ఎందుకంటే, వాళ్ళకు ప్రకటింపబడినట్లే మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. కాని, వాళ్ళు ఆ సువార్తను విశ్వాసంతో వినలేదు గనుక అది వాళ్ళకు నిష్ర్పయోజనమైపోయింది. 3 సువార్తను విశ్వసించే మనం దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాము.
“నా కోపంతో ప్రమాణం చేసి చెప్పుచున్నాను:
‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను’”(A)
అని దేవుడు అన్నాడు. ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఆయన కార్యం ముగిసింది. 4 కాని, “దేవుడు ప్రపంచాన్ని సృష్టించటం ముగించిన తర్వాత విశ్రాంతి తీసుకొనెను”(B) అని ఏడవ రోజును గురించి ఒక చోట వ్రాయబడి ఉంది. 5 దేవుడు ఈ విషయాన్ని గురించి మళ్ళీ చెబుతూ, “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని అన్నాడు.
6 ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి అవకాశం ఇంకావుంది. ఇదివరలో శుభసందేశాన్ని విన్నవాళ్ళు, వాళ్ళ అవిధేయతవల్ల లోపలికి వెళ్ళలేకపొయ్యారు. 7 అందువల్ల దేవుడు మరొక దినాన్ని నిర్ణయించాడు. దాన్ని “ఈ రోజు” అని అన్నాడు. నేను ముందు వ్రాసినట్లు చాలాకాలం తర్వాత దేవుడు దావీదు ద్వారా ఈ విధంగా మాట్లాడాడు:
“ఈ రోజు మీరాయన స్వరం వింటే,
మూర్ఖంగా ప్రవర్తించకండి.”(C)
8 యెహోషువ వాళ్ళకు విశ్రాంతి ఇచ్చినట్లయితే దేవుడు ఆ తర్వాత మరొక రోజును గురించి మాట్లాడి ఉండేవాడు కాదు. 9 అందువల్ల, దేవుని ప్రజల కోసం “విశ్రాంతి” కాచుకొని ఉంది. 10 దేవుడు తన పని ముగించి విశ్రమించాడు. అలాగే, దేవుని విశ్రాంతిలో ప్రవేశించే ప్రతి ఒక్కడూ తన పనినుండి విశ్రాంతి పొందుతాడు. 11 అందువల్ల ఆ విశ్రాంతిని పొందటానికి మనం అన్ని విధాలా ప్రయత్నంచేద్దాం. వాళ్ళలా అవిధేయతగా ప్రవర్తించి క్రింద పడకుండా జాగ్రత్తపడదాం.
© 1997 Bible League International