Revised Common Lectionary (Complementary)
112 యెహోవాను స్తుతించండి.
యెహోవాకు భయపడి. ఆయనను గౌరవించే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు.
ఆ వ్యక్తికి దేవుని ఆదేశాలంటే ఇష్టం.
2 ఆ మనిషి సంతతివారు భూమి మీద చాలా గొప్పగా ఉంటారు.
మంచివారి సంతతివారు నిజంగా ఆశీర్వదించబడతారు.
3 ఆ వ్యక్తి కుటుంబీకులు చాలా ధనికులుగా ఉంటారు.
అతని మంచితనం శాశ్వతంగా కొనసాగుతుంది.
4 మంచివాళ్లకు దేవుడు చీకట్లో ప్రకాశిస్తున్న వెలుతురులా ఉంటాడు.
దేవుడు మంచివాడు, దయగలవాడు, జాలిగలవాడు.
5 ఒక మనిషికి దయగా ఉండటం, ధారాళంగా ఇచ్చే గుణం కలిగి ఉండటం, అతనికి మంచిది.
తన వ్యాపారంలో న్యాయంగా ఉండటం అతనికి మంచిది.
6 ఆ మనిషి ఎన్నటికీ పడిపోడు.
ఒక మంచి మనిషి ఎల్లప్పుడు జ్ఞాపకం చేసికోబడతాడు.
7 మంచి మనిషి చెడు సమాచారాలకు భయ పడాల్సిన అవసరం లేదు.
ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు, యెహోవాను నమ్ముకొంటాడు.
8 ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు. అతడు భయపడడు.
అతడు తన శత్రువులను ఓడిస్తాడు.
9 ఆ మనిషి పేదవారికి వస్తువులను ఉచితంగా ఇస్తాడు.
అతడు చేసే మంచి పనులు శాశ్వతంగా కొనసాగుతాయి.
10 దుష్టులు ఇది చూచి కోపగిస్తారు.
వారు కోపంతో పళ్లు కొరుకుతారు, అప్పుడు వారు కనబడకుండా పోతారు.
దుష్టులకు ఎక్కువగా కావాల్సిందేదో అది వారికి దొరకదు.
వివాహ చట్టాలు
13 “ఒక పురుషుడు ఒక యువతిని వివాహం చేసుకొని ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉండ వచ్చును. ఆ తర్వాత ఆమె నచ్చలేదని అతడు చెప్పవచ్చు. 14 ‘నేను ఈమెను పెళ్లి చేసుకొన్నాను కానీ మేము లైంగికంగా కలిసినప్పుడు ఈమె కన్య కాదని నాకు తెలిసింది’ అని అతడు అబద్ధం చెప్పవచ్చు. ఆమెకు విరోధంగా ఇలా చెప్పటంవల్ల ప్రజలు ఆమెను గూర్చి చెడుగా భావిస్తారు. 15 ఇలా జరిగితే ఆమె తల్లిదండ్రులు ఆ పట్టణ సమావేశ స్థలం దగ్గర పెద్దల వద్దకు ఆమె కన్య అనే రుజువు తీసుకొని రావాలి. 16 ఆ యువతి తండ్రి పెద్దలతో చెప్పాలి, ‘నా కూతుర్ని ఇతనికి భార్యగా నేను ఇచ్చాను, కానీ ఇప్పుడు ఆమె అతనికి ఇష్టం లేదు. 17 ఇతడు నా కూతురి మీద అబద్ధాలు చెప్పాడు. “నీ కూతురు కన్య అనే ఋజువు నాకు కనబడలేదు” అని అతడు అన్నాడు. అయితే నా కూతురు కన్య, నా దగ్గర ఋజువుంది’ అప్పుడు వారు ఆమె బట్టను[a] పట్టణ పెద్దలకు చూపించాలి. 18 అప్పుడు ఆ పట్టణ పెద్దలు అతన్ని పట్టుకొని శిక్షించాలి. 19 నూరు వెండితులాలు వారు అతనికి జుల్మానా విధించాలి. ఆమె భర్త ఒక ఇశ్రాయేలు యువతికి అవమానం కలిగించాడు గనుక ఆమె తండ్రికి వారు ఆ ధనం ఇవ్వాలి. ఆ యువతి ఆ పురుషునికి భార్యగా కొనసాగాలి. అతడు తన జీవితాంతం ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.
20 “అయితే ఒకవేళ ఆ భర్త తన భార్యను గూర్చి చెప్పిన విషయాలు నిజం కావచ్చును. ఆమె కన్య అని చెప్పేందుకు ఆ భార్య తల్లిదండ్రుల దగ్గర ఋజువు లేక పోవచ్చును. ఇలా జరిగితే 21 అప్పుడు ఆ పట్టణ నాయకులు ఆ యువతిని ఆమె తల్లిదండ్రుల ఇంటి గుమ్మం దగ్గరకు తీసుకొని రావాలి. తర్వాత ఆ పట్టణంలోని మనుష్యులు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకంటే, ఇశ్రాయేలులో ఆమె అవమానకరమైన పని చేసింది. ఆమె తన తండ్రి ఇంటిలో ఒక వేశ్యలా ప్రవర్తించింది. చెడ్డది ఏదైనా సరే మీ ప్రజల్లోనుండి మీరు తీసివేయాలి.
లైగింక పాపాలు
22 “ఒక పురుషుడు మరొక పురుషుని భార్యతో లైంగిక సంబంధం కలిగి ఉంటే ఆ స్త్రీ, ఆమెతో లైగింక సంబంధం గల ఆ పురుషుడూ ఇద్దరూ చావాలి. చెడ్డది ఏదైనా సరే ఇశ్రాయేలు నుండి తొలగించాలి.
23 “మరొక పురుషునికి ప్రధానం చేయబడిన ఒక యువతిని ఇంకో పురుషుడు కలియవచ్చును. ఆతడు ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉండవచ్చు. ఇది పట్టణంలో జరిగితే 24 మీరు వాళ్లిద్దర్నీ పట్టణ ద్వారం బయటకు తీసుకొని వచ్చి, మీరు వారిని రాళ్లలో కొట్టి చంపాలి. ఆ పురుషుడు మరొకని భార్యను లైగింక పాపానికి వాడుకున్నాడు గనుక మీరు ఆతడ్ని చంపాలి. ఆ యువతి పట్టణంలోనే ఉండి కూడా సహాయం కోరలేదు గనుక మీరు ఆ యువతిని చంపాలి. చెడ్డది ఏదైనా సరే మీ ప్రజల్లోనుండి మీరు తొలగించాలి.
25 “అయితే ప్రధానం చేయబడిన ఒక యువతిని ఒక పురుషుడు పొలంలో చూచి అతనితో లైగింక సంబంధం అనుభవించమని ఆమెను బలవంతం చేస్తే. అప్పుడు ఆ పురుషుడు మాత్రమే చావాలి. 26 ఆ యువతి మరణశిక్షకు పాత్రమైనది ఏమీ చేయలేదు, గనుక మీరు ఆమెను ఏమీ చేయకూడదు. ఒకడు మరొక అమాయకుని మీద దాడి చేసి హత్య చేసిన వంటిదే ఈ వ్యాజ్యెముకూడాను. 27 ఆ పురుషుడు ప్రధానం చేయబడిన యువతిని బయట పొలంలో చూసాడు. ఆ యువతి సహాయం కోసం కేకలు పెట్టింది, కానీ ఆమెకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు.
28 “ఒక పురుషుడు ప్రధానం చేయబడని ఒక కన్యను చూచి, అతనితో లైగింక సంబంధం అనుభవించమని బలవంతం చేయవచ్చును. ఒకవేళ అతడు ఇలా చేయటం ప్రజలు చూస్తే 29 అప్పుడు అతడు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు యాభై తులాల వెండి ఇవ్వాలి. ఆ యువతి అతని భార్య అవుతుంది. ఎందుకంటే అతడు ఆమెను లైంగికంగా వాడుకొన్నాడు గనుక. అతడు తన జీవితాంతం ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.
30 “ఒక పురుషుడు తన తండ్రి భార్యతో లైంగింక సంబంధం కలిగియుండి తన తండ్రికి అవమానం కలిగించకూడదు.
వివాహం
7 ఇక మీరు వ్రాసిన ప్రశ్నలకు నా సమాధానం ఇది: ఔను. వివాహం చేసుకోకుండా ఉండటం మంచిది. 2 కాని లైంగిక అవినీతి చాలా వ్యాపించిపోయింది కనుక స్త్రీపురుషులు వివాహం చేసుకోవటం మంచిది. 3 ప్రతీ పురుషుడు భర్తగా తన కర్తవ్యాలు నిర్వహించాలి. అలాగే ప్రతీ స్త్రీ భార్యగా తన కర్తవ్యాలు నిర్వహించాలి. 4 భార్యకు తన శరీరంపై అధికారం లేదు. భర్తకు మాత్రమే ఆమె శరీరంపై అధికారం ఉంది. అలాగే భర్తకు తన శరీరంపై అధికారం లేదు. అతని శరీరంపై అతని భార్యకు మాత్రమే అధికారం ఉంది. 5 భార్యాభర్తలు ఇరువురు సమ్మతించి దేవుని ప్రార్థించటంలో తమ కాలాన్ని గడపదలిస్తే తప్ప వేరువేరుగా ఉండకూడదు. ప్రార్థనా సమయం ముగిసాక మళ్ళీ మీరు కలిసికొనండి. మీలో ఆత్మనిగ్రహంలేదు. కనుక సాతాను ప్రేరేపణకు లొంగిపోకుండా జాగ్రత్త పడటానికి ఇలా చెయ్యటం అవసరం. 6 ఇలా చెయ్యమని నేను ఆజ్ఞాపించటం లేదు. ఇలా చెయ్యటానికి నా అనుమతి తెలుపుతున్నాను. 7 అందరూ నాలా ఉండాలని నా కోరిక. కాని ప్రతి ఒక్కనికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఒకనికి ఒక వరం, ఇంకొకనికి ఇంకొక వరం ఇచ్చాడు.
8 అవివాహితులకు, వితంతువులకు నా సలహా ఇది: వాళ్ళు నాలాగే పెళ్ళి చేసుకోకుండా ఉండటం మంచిది. 9 కాని వాళ్ళలో నిగ్రహం లేకపోతే పెళ్ళి చేసుకోవటం ఉత్తమం. కామంతో కాలిపోవటం కన్నా పెళ్ళి చేసుకోవటం మంచిది.
© 1997 Bible League International