Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: గితీత్ రాగం. దావీదు కీర్తన.
8 యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.
2 పరలోకమంతా నీ కీర్తి బాలురు, చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది.
నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.
3 యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను.
నీవు సృష్టించిన చంద్ర నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.
4 మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు?
నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు?
మానవమాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం?
నీవు వానిని గమనించటం ఎందుకు?
5 అయితే మానవుడు నీకు ముఖ్యం.
వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు.
మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.
6 నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు.
ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు.
7 గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.
8 ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే
చేపల మీద వారు ఏలుబడి చేస్తారు.
9 మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!
అబీమెలెకుతో అబ్రాహాము బేరం
22 అంతట అబీమెలెకు, ఫీకోలు అబ్రాహాముతో మాట్లాడారు. అబీమెలెకు, అతని సైన్యాధిపతి ఫీకోలు అబ్రాహాముతో ఇలా చెప్పారు: “నీవు చేసే ప్రతి దానిలోను దేవుడు నీతో ఉన్నాడు. 23 కనుక ఇక్కడ దేవుని యెదుట నాకు ఒక వాగ్దానం చేయాలి. నాతో, నా పిల్లలతో నీవు న్యాయంగా వ్యవహరిస్తానని వాగ్దానం చేయాలి. నీవు నివసించిన ఈ దేశం మీద, నా మీద నీవు దయగలిగి ఉంటానని వాగ్దానం చేయాలి. నీపైన నేను ఎంత దయ చూపెట్టానో, నాపైన నీవు కూడా అంత దయ చూపెడ్తానని వాగ్దానం చేయాలి.”
24 “నన్ను నీవు ఎలా పరామర్శించావో నేను కూడా నిన్ను అలాగే పరామర్శిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను” అన్నాడు అబ్రాహాము. 25 అప్పుడు అబ్రాహాము అబీమెలెకుతో ఒక ఫిర్యాదు చేశాడు. అబీమెలెకు సేవకులు ఒక మంచినీటి బావిని స్వాధీనం చేసుకొన్నందుచేత అబ్రాహాము అబీమెలెకుతో ఫిర్యాదు చేశాడు.
26 కానీ అబీమెలెకు, “ఇది ఎవరు చేశారో నాకు తెలియదు. ఇంతకు ముందు ఈ విషయం నీవు నాతో చెప్పలేదు” అన్నాడు.
27 కనుక అబ్రాహాము, అబీమెలెకు ఒక ఒడంబడిక చేసుకొన్నారు. ఆ ఒడంబడికకు సూచనగా కొన్ని గొర్రెలను, పశువులను అబ్రాహాము అబీమెలెకుకు ఇచ్చాడు. 28 ఏడు[a] ఆడ గొర్రె పిల్లల్ని కూడా అబ్రాహాము అబీమెలెకు ఎదుట ఉంచాడు. 29 “ఈ ఏడు ఆడ గొర్రెపిల్లల్ని ఇలా ప్రత్యేకంగా ఎందుకు పెట్టావు?” అని అబీమెలెకు అబ్రాహామును అడిగాడు.
30 “ఈ గొర్రెపిల్లల్ని నా దగ్గర నుండి నీవు స్వీకరించినప్పుడు, ఈ బావిని నేను తవ్వించినట్లు రుజువు అవుతుంది” అని అబ్రాహాము జవాబిచ్చాడు.
31 కనుక ఆ తర్వాత ఆ బావి బెయేర్షెబా[b] అని పిలువబడింది. వారిద్దరు ఒకరికి ఒకరు ఆ స్థలంలో వాగ్దానం చేసుకొన్న చోటు గనుక దానికి వారు ఆ పేరు పెట్టారు. 32 కనుక అబ్రాహాము, అబీమెలెకు బెయేర్షెబా దగ్గర ఒక ఒడంబడిక చేసుకొన్నారు. అప్పుడు అబీమెలెకు, అతని సైన్యాధిపతి తిరిగి ఫిలిష్తీ ప్రజల దేశం వెళ్లిపోయారు.
33 బెయేర్షెబాలో అబ్రాహాము ఒక అలంకారపు చెట్టు[c] నాటాడు. అప్పుడు అబ్రాహాము, ప్రభువును, ఎల్లప్పుడు జీవిస్తున్న దేవుడునైన యెహోవాకు అక్కడ ప్రార్థన చేశాడు. 34 ఫిలిష్తీయుల దేశంలో అబ్రాహాము చాలాకాలం నివసించాడు.
ఆత్మ ద్వారా జీవము
8 అందువల్ల, ప్రస్తుతం యేసు క్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న వాళ్ళకు దేవుడు శిక్ష విధించడు. 2 దేవుని ఆత్మ మనం యేసు క్రీస్తుతో ఐక్యత పొందటంవల్ల మనలో జీవాన్ని కలుగచేశాడు. ఆ ఆత్మ యొక్క నియమం మన పాపానికి, మరణానికి చెందిన నియమం నుండి నాకు విముక్తి కలిగించింది. 3 ధర్మశాస్త్రం అన్నీ చెయ్యలేక పోయింది. పాపస్వభావం దాన్ని బలహీనంచేసింది. అందువల్ల దేవుడు తన కుమారుణ్ణి పాపాలు చేసే మానవుని రూపంలో పాపాలకు బలిగా పంపాడు. ఆయన వచ్చి మానవునిలో ఉన్న పాపాలకు శిక్ష విధించాడు. 4 ధర్మశాస్త్రం ఆదేశించిన నీతికార్యాలు మన ద్వారా జరగాలని ఆయన ఉద్దేశ్యం. మనము పాపస్వభావంతో జీవించటంలేదు. పరిశుద్ధాత్మ చెప్పినట్లు జీవిస్తున్నాము.
5 ప్రాపంచికంగా జీవించేవాళ్ళ మనస్సు ప్రాపంచిక విషయాలకు లోనై వుంటుంది. కాని దేవుని ఆత్మ చెప్పినట్లు జీవించేవాళ్ళ మనస్సు ఆ ఆత్మకు సంబంధించిన విషయాలకు లోనై ఉంటుంది. 6 ప్రాపంచిక విషయాలకు లోనవటంవల్ల మరణం సంభవిస్తుంది. కాని పరిశుద్ధాత్మకు లోనవటంవల్ల జీవం. శాంతం లభిస్తాయి. 7 ఎందుకంటే, ప్రాపంచిక విషయాలకు లోనైనవాని మనస్సు దేవుణ్ణి ద్వేషిస్తుంది. అలాంటి మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి ఆధీనమై ఉండదు. ఉండజాలదు. 8 ప్రాపంచికంగా జీవించేవాళ్ళు దేవుని మెప్పుపొందలేరు.
9 దేవుని ఆత్మ మీలో నిజంగా నివసిస్తున్నట్లైతే, మీరు ఈ లోక సంబంధంగా జీవించటంలేదన్నమాట. అంటే మీరు ఆత్మీయంగా జీవిస్తున్నారన్నమాట. క్రీస్తు యొక్క ఆత్మ తనలో లేనివాడు క్రీస్తుకు చెందడు. 10 ఒకవేళ క్రీస్తు మీలో జీవిస్తున్నట్లైతే పాపం కారణంగా మీ శరీరం చనిపోయినా మీలో వున్న దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేసాడు కనుక, ఆయన ఆత్మ మీకు జీవాన్నిస్తాడు. 11 మరణించిన యేసును దేవుడు లేపినాడు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నట్లైతే, నశించిపోయే మీ దేహాలకు ఆయన జీవం పోస్తాడు. మృతి నుండి యేసును లేపినవాడు దేవుడే కావున మీలో నివసిస్తున్న ఆయన ఆత్మద్వారా దేవుడు మీ శరీరాలను జీవింపచేస్తాడు.
© 1997 Bible League International