Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: పిల్లన గ్రోవులతో పాడదగిన దావీదు కీర్తన
5 యెహోవా, నా మాటలు ఆలకించుము.
నేను నీకు చెప్పటానికి ప్రయత్నిస్తున్నదాన్ని వినుము.
2 నా రాజా, నా దేవా
నా ప్రార్థన ఆలకించుము.
3 యెహోవా, ప్రతి ఉదయం నేను నా కానుకను నీ ముందు ఉంచుతాను.
సహాయం కోసం నేను నీ వైపు చూస్తాను.
మరి నీవు నా ప్రార్థనలు వింటావు.
4 యెహోవా, నీవు దుష్టులను నీ దగ్గర ఉండడానికి ఇష్టపడవు,
చెడ్డవాళ్లు నీ మందిరంలో నిన్ను ఆరాధించేందుకు రావటం నీకు ఇష్టం లేదు.
5 గర్విష్ఠులు, అహంకారులు నీ దగ్గరకు రాలేరు.
ఎప్పుడూ చెడ్డపనులు చేసే మనుష్యులను నీవు అసహ్యించుకొంటావు.
6 అబద్ధాలు చెప్పే మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
ఇతరులకు హాని చేయుటకు రహస్యంగా పథకాలు వేసే మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.
7 యెహోవా, నేను నీ మందిరానికి వస్తాను. నీవు చాలా దయగల వాడవని నాకు తెలుసు.
యెహోవా, నీ పవిత్ర మందిరం వైపు నేను వంగినప్పుడు, నీకు నేను భయపడతాను. నిన్ను గౌరవిస్తాను.
8 యెహోవా, ప్రజలు నాలో బలహీనతల కోసం చూస్తున్నారు.
కనుక నీ నీతికరమైన జీవిత విధానం నాకు చూపించుము.
నేను ఎలా జీవించాలని నీవు కోరుతావో
అది నాకు తేటగా చూపించుము.
9 ఆ మనుష్యులు సత్యం చెప్పరు.
వాళ్లు జనాన్ని నాశనం చేయకోరుతారు.
వారి నోళ్ళు ఖాళీ సమాధుల్లా ఉన్నాయి.
ఆ మనుష్యులు ఇతరులకు చక్కని మాటలు చెబుతారు. కాని వాళ్లను చిక్కుల్లో పెట్టుటకు మాత్రమే వారు ప్రయత్నిస్తున్నారు.
10 దేవా! వారిని శిక్షించుము.
వారి ఉచ్చులలో వారినే పట్టుబడనిమ్ము.
ఆ మనుష్యులు నీకు విరోధంగా తిరిగారు
కనుక వారి విస్తార పాపాల నిమిత్తం వారిని శిక్షించుము.
11 అయితే దేవునియందు విశ్వాసం ఉంచే ప్రజలందరినీ సంతోషించనిమ్ము.
ఆ ప్రజలను శాశ్వతంగా సంతోషించనిమ్ము. దేవా, నీ నామమును ప్రేమించే ప్రజలకు భద్రత, బలం ప్రసాదించుము.
12 యెహోవా, మంచి మనుష్యులకు నీవు మంచివాటిని జరిగిస్తే
అప్పుడు నీవు వారిని కాపాడే గొప్ప కేడెంలా ఉంటావు.
18 నేనీ వర్తమానం సర్వశక్తిమంతుడైన యెహోవానుండి అందుకున్నాను. 19 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “మీరు ప్రత్యేక సంతాప దినాలు, ఉపవాస దినాలు నాల్గవ నెలలోను, ఐదవ నెలలోను, ఏడవ నెలలోను, పదవ నెలలోను కలిగి ఉన్నారు. ఆ సంతాప దినాలు సంతోష దినాలుగా తప్పక మార్చబడాలి. అవి యోగ్యమైన, సంతోషదాయకమైన విశ్రాంతి దినాలవుతాయి. కావున మీరు సత్యాన్ని, శాంతిని ప్రేమించండి!”
20 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు,
“భవిష్యత్తులో అనేక నగరాలనుండి ప్రజలు యెరూషలేముకు వస్తారు.
21 ఒక నగరంనుండి వచ్చిన ప్రజలు, వారు కలిసిన మరొక నగరవాసులతో ఇలా అంటారు,
వేరేవాళ్లు మేము మీతో వస్తాము అని అంటారు.
‘సర్యశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి మేము వెళ్తున్నాము.
మాతో రండి!’”
22 అనేక బలమైన రాజ్యాలనుండి అనేకమంది ప్రజలు సర్యశక్తిమంతుడైన యెహోవాను వెదుక్కుంటూ యెరూషలేముకు వస్తారు. ఆయనను ఆరాధించటానికి వారు అక్కడికి వస్తారు. 23 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ఆ సమయంలో వివిధ భాషలు మాట్లాడేవారు ఒక యూదా మనిషి వద్దకు వచ్చి, ‘దేవుడు నీతో ఉన్నాడని మేము విన్నాము. ఆయనను ఆరాధించటానికి మేము నీతో రావచ్చునా?’ అని అడుగుతారు.”
క్రీస్తు విరోధుల విషయంలో జాగ్రత్త
18 బిడ్డలారా! ఇది చివరి గడియ. క్రీస్తు విరోధి రానున్నాడని మీరు విన్నారు. ఇప్పటికే క్రీస్తు విరోధులు చాలా మంది వచ్చారు. తద్వారా యిది చివరి గడియ అని తెలిసింది. 19 క్రీస్తు విరోధులు మననుండి విడిపొయ్యారు. నిజానికి, వాళ్ళు మనవాళ్ళు కారు. ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళైనట్లయితే మనతోనే ఉండిపొయ్యేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళలో ఎవ్వరూ మనవాళ్ళు కారని తెలుపుతోంది.
20 కాని దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. తద్వారా మీరంతా సత్యాన్ని గురించి తెలుసుకొన్నారు. 21 మీకు సత్యాన్ని గురించి తెలియదని భావించి నేను మీకు వ్రాస్తున్నాననుకోకండి. సత్యాన్ని గురించి మీకు తెలుసు. పైగా సత్యంనుండి అసత్యం బయటకు రాదు.
22 అసత్యమాడేవాడెవ్వడు? యేసే క్రీస్తు కాదని అనేవాడు. అతడే క్రీస్తు విరోధి. అలాంటి వ్యక్తి తండ్రిని, కుమారుణ్ణి నిరాకరిస్తాడు. 23 కుమారుణ్ణి నిరాకరించే వ్యక్తికి తండ్రి రక్షణ ఉండదు. కుమారుణ్ణి అంగీకరించే వ్యక్తికి తండ్రి రక్షణ తోడుగా ఉంటుంది.
24 మొదట మీరు విన్నవి మీలో ఉండిపోయేటట్లు చూసుకోండి. అప్పుడే మీరు కుమారునిలో, తండ్రిలో జీవించగలుగుతారు. 25 పైగా ఆయన మనకు నిత్యజీవం గురించి వాగ్దానం చేసాడు.
© 1997 Bible League International