Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: పిల్లన గ్రోవులతో పాడదగిన దావీదు కీర్తన
5 యెహోవా, నా మాటలు ఆలకించుము.
నేను నీకు చెప్పటానికి ప్రయత్నిస్తున్నదాన్ని వినుము.
2 నా రాజా, నా దేవా
నా ప్రార్థన ఆలకించుము.
3 యెహోవా, ప్రతి ఉదయం నేను నా కానుకను నీ ముందు ఉంచుతాను.
సహాయం కోసం నేను నీ వైపు చూస్తాను.
మరి నీవు నా ప్రార్థనలు వింటావు.
4 యెహోవా, నీవు దుష్టులను నీ దగ్గర ఉండడానికి ఇష్టపడవు,
చెడ్డవాళ్లు నీ మందిరంలో నిన్ను ఆరాధించేందుకు రావటం నీకు ఇష్టం లేదు.
5 గర్విష్ఠులు, అహంకారులు నీ దగ్గరకు రాలేరు.
ఎప్పుడూ చెడ్డపనులు చేసే మనుష్యులను నీవు అసహ్యించుకొంటావు.
6 అబద్ధాలు చెప్పే మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
ఇతరులకు హాని చేయుటకు రహస్యంగా పథకాలు వేసే మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.
7 యెహోవా, నేను నీ మందిరానికి వస్తాను. నీవు చాలా దయగల వాడవని నాకు తెలుసు.
యెహోవా, నీ పవిత్ర మందిరం వైపు నేను వంగినప్పుడు, నీకు నేను భయపడతాను. నిన్ను గౌరవిస్తాను.
8 యెహోవా, ప్రజలు నాలో బలహీనతల కోసం చూస్తున్నారు.
కనుక నీ నీతికరమైన జీవిత విధానం నాకు చూపించుము.
నేను ఎలా జీవించాలని నీవు కోరుతావో
అది నాకు తేటగా చూపించుము.
9 ఆ మనుష్యులు సత్యం చెప్పరు.
వాళ్లు జనాన్ని నాశనం చేయకోరుతారు.
వారి నోళ్ళు ఖాళీ సమాధుల్లా ఉన్నాయి.
ఆ మనుష్యులు ఇతరులకు చక్కని మాటలు చెబుతారు. కాని వాళ్లను చిక్కుల్లో పెట్టుటకు మాత్రమే వారు ప్రయత్నిస్తున్నారు.
10 దేవా! వారిని శిక్షించుము.
వారి ఉచ్చులలో వారినే పట్టుబడనిమ్ము.
ఆ మనుష్యులు నీకు విరోధంగా తిరిగారు
కనుక వారి విస్తార పాపాల నిమిత్తం వారిని శిక్షించుము.
11 అయితే దేవునియందు విశ్వాసం ఉంచే ప్రజలందరినీ సంతోషించనిమ్ము.
ఆ ప్రజలను శాశ్వతంగా సంతోషించనిమ్ము. దేవా, నీ నామమును ప్రేమించే ప్రజలకు భద్రత, బలం ప్రసాదించుము.
12 యెహోవా, మంచి మనుష్యులకు నీవు మంచివాటిని జరిగిస్తే
అప్పుడు నీవు వారిని కాపాడే గొప్ప కేడెంలా ఉంటావు.
యాజకుడైన యెహోషువ కిరీటాన్ని పొందటం
9 పిమ్మట యెహోవానుండి నేను మరొక వర్తమానం అందుకున్నాను. 10 ఆయన ఇలా చెప్పాడు: “బబులోనులో బందీలుగాఉన్న వారిలోనుండి హెల్దయి, టోబీయా, యెదాయా అనేవారు వచ్చారు. వారి వద్దనుండి వెండి బంగారాలు తీసికొని, జెఫన్యా కుమారుడైన యోషీయా ఇంటికి వెళ్లు. 11 ఆ వెండి బంగారాలను ఒక కిరీటం చేయటానికి వినియోగించు. ఆ కిరీటాన్ని యెహోషువ తలమీద పెట్టు. (యెహోషువ ప్రధాన యాజకుడు. యెహోజాదాకు కుమారుడే యెహోషువ) తరువాత యెహోషువకు ఈ విషయాలు చెప్పు. 12 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“కొమ్మ అని పిలువబడే ఒక మనిషి ఉన్నాడు.
అతడు బలంగా పెరుగుతాడు.
అతడు యెహోవా ఆలయాన్ని నిర్మిస్తాడు.
13 అతడు యెహోవా ఆలయాన్ని నిర్మించి,
గౌరవాన్ని పొందుతాడు.
అతడు తన సింహాసనంపై కూర్చుని, పాలకుడవుతాడు.
ఒక యాజకుడు అతని సింహాసనంవద్ద నిలబడతాడు.
ఈ ఇద్దరు మనుష్యులూ శాంతియుత వాతావరణంలో కలిసి పనిచేస్తారు.
14 వారు కిరీటాన్ని ప్రజల జ్ఞాపకార్థం ఆలయంలో ఉంచుతారు. ఆ కిరీటం హెల్దయి, టోబీయా, యెదాయా మరియు జెఫన్నా కుమారుడైన యోషీయాలకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.”
15 మిక్కిలి దూరంలో నివసిస్తున్నవారు వచ్చి ఆలయాన్ని నిర్మిస్తారు. అప్పుడు ప్రజలైన మీవద్దకు యెహోవా నన్ను పంపినట్లు మీరు నిశ్చయంగా తెలుసుకుంటారు. యెహోవా ఏమి చెపుతున్నాడో అది మీరు చేస్తే ఈ విషయాలన్నీ జరుగుతాయి.
సజీవమైన ఆశాభావం
3 మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించుదాం. ఆయనకు మనపై అనుగ్రహం ఉండటం వల్ల యేసు క్రీస్తును బ్రతికించి మనకు క్రొత్త జీవితాన్ని యిచ్చాడు. అంతేకాక మనలో సజీవమైన ఆశాభావాన్ని కలిగించాడు. 4 నాశనంకాని, మచ్చలేని, తరగని వారసత్వం పొందటానికి ఆశించండి. దేవుడు మీకోసం దాన్ని పరలోకంలో దాచి ఉంచాడు.
5 చివరి దశలో మనకు వ్యక్తం కావటానికి రక్షణ సిద్ధంగా ఉంది. మీలో విశ్వాసం ఉండటంవల్ల, అది లభించే వరకూ మీకు దైవశక్తి రక్షణ కలిగిస్తుంది. 6 కొంతకాలం సంభవించిన అనేక రకాల కష్టాల్ని అనుభవించవలసి వచ్చినప్పుడు మీరు అనుభవించారు. దానికి ఆనందించండి. 7 మీ విశ్వాసం యథార్థమైనదని రుజువగుటకు ఈ శ్రమలు మీకొచ్చాయి. బంగారం నిప్పుచేత కాల్చబడి శుద్ధి అయినా, చివరికది నాశనం కాక తప్పదు. మీ విశ్వాసం బంగారం కంటే విలువైనదిగా యుండి యేసు క్రీస్తు వచ్చినప్పుడు ప్రశంస, మహిమ, ఘనత పొంద తగినదిగా వుంటుంది.
8 మీరాయన్ని చూడలేదు. అయినా ప్రేమిస్తున్నారు. ప్రస్తుతం చూడటం లేదు. అయినా విశ్వసిస్తున్నారు. వ్యక్తం చేయలేని దివ్యమైన ఆనందం మీలో నిండిపోయింది. 9 ఎందుకంటే ఏ ఉద్దేశ్యంతో మీరు విశ్వసిస్తున్నారో ఆ ఉద్దేశ్యం నెరవేరుతోంది. మీ ఆత్మలకు రక్షణ లభిస్తోంది.
© 1997 Bible League International