Revised Common Lectionary (Complementary)
7 యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
8 యెహోవా చట్టాలు సరియైనవి.
అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.
9 యెహోవాను ఆరాధించుట మంచిది.
అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.
13 మర్నాడు ప్రజలకు న్యాయం తీర్చాల్సిన ప్రత్యేక పని మోషేకు ఉంది. (అక్కడ చాలామంది ప్రజలున్నారు) అందుచేత ప్రజలు రోజంతా మోషే ఎదుట నిలబడాల్సి వచ్చింది.
14 ప్రజలకు మోషే న్యాయం తీర్చడం యిత్రో చూసాడు, “నీవు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుచేత నీవు ఒక్కడివే న్యాయమూర్తిగా ఉన్నావు? ప్రజలు రోజంతా నీ దగ్గరకు రావడం ఏమిటి?” అన్నాడు అతను.
15 అప్పుడు మోషే తన మామతో ఇలా చెప్పాడు: “ప్రజలు వారి సమస్యల విషయంలో దేవుని నిర్ణయం ఏమిటో నేను అడిగి తెలుసుకోవాలని నన్ను అడిగేందుకు నా దగ్గరకు వస్తారు. 16 ఎవరిది సరిగ్గా ఉందో నేను నిర్ణయిస్తాను. ఈ విధంగా దేవుడి చట్టాన్ని, ఆయన ప్రబోధాల్ని నేను ప్రజలకు ప్రబోధిస్తాను.”
17 అయితే మోషే మామ అతనితో ఇలా అన్నాడు: “నీవు చేస్తున్న ఈ పని బాగుండలేదు. 18 నీవు ఒక్కడివే చెయ్యాలంటే, ఇది చాలా పెద్ద పని. దీనివల్ల నీవు అలసిపోతావు. ఇది ప్రజలు కూడ అలసిపొయ్యేటట్టు చేస్తుంది. ఈ పని నీవు ఒక్కడివీ చేయలేవు. 19 నీకు నేను సలహా ఇస్తాను, ఏమి చేయాలో నీకు చెబుతాను, దేవుడు నీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తాను. (నీవు చేయాల్సింది ఇది) ప్రజల సమస్యలను గూర్చి నీవు వింటూ ఉండాల్సిందే. ఈ విషయాలను గూర్చి నీవు దేవునితో చెబుతూ ఉండాల్సిందే. 20 దేవుడి కట్టడలను, విధులను నీవు ప్రజలకు బోధించాలి. కట్టడలను ఉల్లంఘించొద్దని ప్రజలను హెచ్చరించు. సరైన జీవిత విధానం ఏమిటో ప్రజలకు చెప్పు. వాళ్లేమి చేయాలో వాళ్లకు చెప్పు.” 21 అయితే, “ప్రజల్లోనుంచి మంచి మనుష్యుల్ని నీవు ఏర్పాటు చేసుకోవాలి. డబ్బుకోసం నిర్ణయాలు మార్చుకోనటువంటి మనుష్యుల్ని ఏర్పాటు చేసుకో.”
“వీళ్లను ప్రజల మీద పరిపాలకులుగా చేయి. 1,000 మంది 100 మందికి, 50 మందికి, చివరికి 10 మందికి పైన పరిపాలకులు ఉండాలి. 22 ఈ పరిపాలకుల్ని ప్రజలకు న్యాయం తీర్చనివ్వు. ముఖ్యమైన వ్యాజ్యము ఏదైనా వుంటే అప్పుడు నిర్ణయంకోసం వాళ్లు నీ దగ్గరకు రావచ్చు. అయితే మిగతా వ్యాజ్యాలను వాళ్లే నిర్ణయించవచ్చు. ఈ విధంగా నీకు తేలిక అవుతుంది. పైగా ఈ మనుష్యులు నీ పనిని నీతోబాటు పంచుకొంటారు. 23 నీవు ఈ నీ పనులు చేస్తే, యెహోవాకు ఇష్టమైతే, నీ పని నీవు కొనసాగించటానికి నీకు చేతనవుతుంది. అదే సమయంలో ప్రజలంతా వారి సమస్యలు పరిష్కారమై ఇంటికి వెళ్లగల్గుతారు.”
24 యిత్రో తనకు చెప్పినట్టు మోషే చేసాడు. 25 ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి మంచి మనుష్యుల్ని మోషే ఏర్పాటు చేశాడు. మోషే వాళ్లను ప్రజలమీద నాయకులుగా చేసాడు. 1,000 మంది ప్రజల మీద 100 మంది ప్రజలమీద 50 మంది ప్రజలమీద 10 మంది ప్రజలమీద పరిపాలకులు ఉన్నారు. 26 ఈ పరిపాలకులే ప్రజలకు న్యాయమూర్తులు. ఎప్పుడైనా సరే ప్రజలు తమ వాదాలను ఈ పరిపాలకుల దగ్గరకు తీసుకురావచ్చు. ప్రాముఖ్యమైన వ్యాజ్యాలను మాత్రమే మోషే పరిష్కారం చేయాల్సి ఉంటుంది.
27 కొద్దికాలం తర్వాత మోషే తన మామ యిత్రోకు వీడ్కోలు చెప్పాడు. యిత్రో తన స్వగృహానికి వెళ్లిపోయాడు.
13 పేతురు, యోహాను చదువురాని మామూలు మనుష్యులని వాళ్ళకు తెలుసు. కాని వాళ్ళ ధైర్యాన్ని చూసి సభ్యులకు ఆశ్చర్యం వేసింది. అప్పుడా సభ్యులు వాళ్ళు యేసుతో ఉన్నవాళ్ళని గ్రహించారు. 14 కాని నయమైన మనిషి వాళ్ళతో నిలిచి ఉండటం చూసి యింకే ఆక్షేపణలు చెయ్యలేక పోయారు.
15 వాళ్ళను మహాసభనుండి వెళ్ళమని ఆజ్ఞాపించి పరస్పరం యిలా చర్చించుకొన్నారు: 16 “వీళ్ళనేం చెయ్యాలి? యెరూషలేము నివాసులందరికి వీళ్ళు అద్భుతమైన మహిమ చేసారని బాగా తెలుసు. మనం దాన్ని కాదనలేం. 17 కాని యిది ప్రజల్లో యింకా ఎక్కువగా వ్యాపించక ముందే యిక మీదట అతని పేరిట ఎవరితో ఏమీ మాట్లాడవద్దని వాళ్ళను వారించాలి.”
18 వాళ్ళను మళ్ళీ పిలిచి యేసు పేరిట బోధించకూడదని, ఆయన గురించి మాట్లాడకూడదని ఆజ్ఞాపించారు. 19 కాని పేతురు, యోహాను వాళ్ళకు సమాధానం చెబుతూ, “మీరు చెప్పింది చెయ్యాలో, లేక దేవుడు చెప్పింది చెయ్యాలో, దేవుని దృష్టిలో ఏది న్యాయమో మీలో మీరు నిర్ణయించుకోండి. 20 ఎందుకంటే మేము చూసినదాన్ని, విన్నదాన్ని గురించి ప్రజలకు చెప్పకుండా వుండలేము” అని అన్నారు.
21 వాళ్ళు పేతురును, యోహానును యింకా కొంచెం భయపెట్టి వదిలేసారు. 22 దేవుని మహిమవల్ల నయమైన వ్యక్తి నలభై ఏండ్లు దాటినవాడు. ఈ జరిగిన సంఘటనవల్ల ప్రజలంతా కలిసి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. అందువలన వీళ్ళను ఏ విధంగా శిక్షించాలో వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయారు.
విశ్వాసుల ప్రార్థన
23 విడుదలయ్యాక పేతురు, యోహాను తమ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రధానయాజకులు, పెద్దలు చెప్పినదంతా చెప్పారు. 24 ఇది విన్నాక వాళ్ళంతా కలిసి ఒకే ధ్యేయంతో దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు: “మహా ప్రభూ! నీవు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సకల వస్తువుల్ని సృష్టించావు. 25 నీవు పవిత్రాత్మ ద్వారా నీ సేవకుడు, మా తండ్రి అయిన దావీదు నోటినుండి యిలా పలికించావు:
‘జనాంగములు ఎందుకు రెచ్చుతున్నాయి?
ప్రజలెందుకు వృథాగా పన్నాగాలు పన్నుతున్నారు?
26 ‘రాజులు, పాలకులు కలిసి ప్రభువును,
ఆయన క్రీస్తును ఎందుకు ఎదిరిస్తున్నారు?’(A)
27 హేరోదు మరియు పొంతి పిలాతు ఇశ్రాయేలు ప్రజలతో మరియు యితర దేశ ప్రజలతో కలిసారు. అంతా కలిసి పవిత్రతగల నీ సేవుకుణ్ణి, నీవు క్రీస్తుగా నియమించిన యేసును నిజంగానే ఎదిరించారు. 28 ఏది జరగాలో నీ శక్తి సంకల్పానుసారం నీవు ముందే నిర్ణయించావు. వాళ్ళు నీవు నిర్ణయించినట్లే చేసారు. 29 ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని భయపెడ్తున్నారు, చూడు ప్రభూ! నీ సందేశాన్ని ధైర్యంగా చెప్పే శక్తిని నీ సేవకులకు యివ్వు! 30 యేసు పవిత్రమైనవాడు, నీ సేవకుడు. ఆయన పేరిట రోగుల్ని నయం చెయ్యటానికి, అద్భుతాలు, మహత్యాలు చెయ్యటానికి నీ అభయ హస్తాన్ని చాపి మాకు శక్తినివ్వు!”
31 వాళ్ళ ప్రార్థన ముగిసాక వాళ్ళు సమావేశమైన స్థలం కంపించింది. అందరిలో పవిత్రాత్మ నింపుదల కలిగింది. వాళ్ళు దైవసందేశాన్ని ధైర్యంగా చెప్పటం మొదలు పెట్టారు.
© 1997 Bible League International