Revised Common Lectionary (Complementary)
యిర్మీయాపై కుట్ర
18 అనాతోతు ప్రజలు[a] నాపై కుట్ర పన్నుతున్నారని యెహోవా నాకు తెలియపరిచాడు. వారు చేసే పనులు యెహోవా నాకు చూపాడు. అందుచే వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని నాకు తెలిసింది. 19 వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని యెహోవా తెలియపర్చక ముందు, నేనొక అమాయకపు గొర్రె పిల్లవలె నరకబడటానికి సిద్ధంగా వున్నాను. వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని నేను అర్థం చేసికోలేదు. నన్ను గురించి వారిలా అంటున్నారు: “మనం చెట్టును, దాని పండును నాశనం చేద్దాం! మనం వానిని చంపివేద్దాం! అప్పుడు ప్రజలు అతన్ని మర్చిపోతారు.” 20 యెహోవా, నీవు సత్య వర్తనుడవైన న్యాయాధి పతివి. ప్రజల మనస్సులను, హృదయాలను పరీక్షించే విధానం నీకు బాగా తెలుసు. నేను నా వాదనలను నీకు వినిపిస్తాను. వారికి తగిన శిక్ష నీవే యిమ్ము.
సంగీత నాయకునికి: వాయిద్యాలతో పాడునది. దావీదు ధ్యానము. జిఫీయులు సౌలు దగ్గరకు వెళ్లి “దావీదు మా ప్రజల వద్ద దాక్కొన్నాడని తలస్తున్నాము” అని అతనితో చెప్పినప్పటిది.
54 దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము.
నన్ను విడుదల చేయుటకు నీ శక్తి ఉపయోగించుము.
2 దేవా, నా ప్రార్థనను,
నేను చెప్పే సంగతులను ఆలకించుము.
3 పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు.
బలాఢ్యులైన మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. దేవా, ఆ మనుష్యులు నిన్ను కనీసం ఆరాధించరు.
4 చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు.
నా ప్రభువు నన్ను బలపరుస్తాడు.
5 తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచారత్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు.
దేవా, నీవు నాకు నమ్మకస్థుడవై ఉండుటనుబట్టి ఆ జనులను నాశనం చేయుము.
6 దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను.
యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు.
7 నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు.
మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను చూసాను.
తెలివిగల వాళ్ళు
13 జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు మీలో ఎవరైనా ఉన్నారా? అలాగైతే వాళ్ళను సత్‌ప్రవర్తనతో, వినయంతో కూడుకొన్న విజ్ఞానంతో సాధించిన కార్యాల ద్వారా చూపమనండి. 14 ఒకవేళ మీ హృదయాల్లో అసూయతో కూడుకొన్న కోపము, స్వార్ధంతో కూడుకొన్న ఆశ ఉంటే మీలో వివేకముందని ప్రగల్భాలు చెప్పుకోకండి. అలా చేస్తే నిజాన్ని మరుగు పరచినట్లౌతుంది. 15 మీలో ఉన్న ఈ జ్ఞానము పరలోకంలో నుండి దిగి రాలేదు. ఇది భూలోకానికి చెందింది. ఇందులో ఆధ్యాత్మికత లేదు. ఇది సాతానుకు చెందింది. 16 ఎందుకంటే అసూయ, స్వార్థము, ఎక్కడ ఉంటాయో అక్కడ అక్రమాలు, అన్ని రకాల చెడు పద్ధతులు ఉంటాయి. 17 కాని పరలోకం నుండి వచ్చిన జ్ఞానం మొదట పవిత్రమైనది. అది శాంతిని ప్రేమిస్తుంది. సాధుగుణం, వినయం, సంపూర్ణమైన దయ, మంచి ఫలాలు, నిష్పక్షపాతం, యథార్థత కలిగియుంటుంది. 18 శాంతి స్థాపకులు శాంతిని విత్తి, నీతి అనే పంటను కోస్తారు.
దేవుణ్ణి శరణు కోరండి
4 మీలో మీకు యుద్ధాలు, పోట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి? మీ ఆంతర్యంలోని ఆశలు మీలో యుద్ధం చేయటం వల్లనే గదా యివి జరగటం? 2 మీరు కోరుతారు. అది లభించదు. దాని కోసం మీరు చంపటానికి కూడా సిద్ధమౌతారు. మీలో అసూయ కలుగుతుంది. అయినా మీ కోరిక తీర్చుకోలేరు. మీరు పోట్లాడుతారు. యుద్ధం చేస్తారు. కాని మీరు దేవుణ్ణి అడగరు కనుక మీ కోరిక తీరదు. 3 మీరు దురుద్దేశ్యంతో అడుగుతారు. కనుక మీరు అడిగినా మీకు లభించదు. మీరు అడిగేది మీ సుఖాలకు ఖర్చు పెట్టాలని అడుగుతారు.
7 అందువల్ల దేవుని పట్ల విధేయతతో ఉండండి. సాతాన్ను ఎదిరించండి. అప్పుడు సాతాను మీనుండి పారిపోతాడు. 8 దేవుణ్ణి మీరు సమీపిస్తే దేవుడు మిమ్మల్ని సమీపిస్తాడు. పాపాత్ములారా! మీ పాపాలు కడుక్కోండి. చంచలమైన మనస్సుగల ప్రజలారా! మీ హృదయాల్ని పవిత్రం చేసుకోండి.
యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం
(మత్తయి 17:22-23; లూకా 9:43b-45)
30-31 వాళ్ళా ప్రాంతాన్ని వదిలి గలిలయ ద్వారా ప్రయాణం సాగించారు. యేసు తన శిష్యులకు బోధిస్తూ ఉండటం వల్ల తామెక్కడ ఉన్నది కూడా ఎవ్వరికి తెలియకూడదని ఆశించాడు. ఆయన వాళ్ళతో, “ఒకడు మనుష్యకుమారునికి ద్రోహం చేసి శత్రువులకు అప్పగిస్తాడు. వాళ్ళాయన్ని చంపుతారు. మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి బ్రతికివస్తాడు” అని అన్నాడు. 32 కాని యేసు చెప్పింది శిష్యులకు అర్థంకాలేదు. దాన్ని గురించి అడగటానికి వాళ్ళకు భయం వేసింది.
దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప?
(మత్తయి 18:1-5; లూకా 9:46-48)
33 వాళ్ళు కపెర్నహూము అనే పట్టణాన్ని చేరుకొన్నారు. అందరూ యింట్లోకి వెళ్ళాక యేసు వాళ్ళతో, “దార్లో దేన్ని గురించి చర్చించుకొన్నారు?” అని అడిగాడు. 34 వాళ్ళు వచ్చేటప్పుడు అందరికన్నా గొప్ప వాడెవరన్న విషయాన్ని గురించి చర్చించారు. కాబట్టి అందరూ మౌనంగా ఉండిపొయ్యారు.
35 యేసు కూర్చుంటూ, పన్నెండుగురిని పిలిచి, “ముఖ్యస్థానాన్ని వహించాలనుకొన్నవాడు అందరికన్నా చివరన ఉండి సేవచెయ్యాలి” అని అన్నాడు.
36 ఒక బాలుణ్ణి పిలుచుకు వచ్చి వాళ్ళ మధ్య నిలుచోబెట్టాడు. ఆ బాలుణ్ణి ఎత్తుకొని, 37 “నా పేరిట ఇలాంటి పసివానిని అంగీకరించేవాడు నన్ను అంగీకరించినవానిగా పరిగణింపబడతాడు. నన్ను అంగీకరించేవాడు నన్నే కాదు, నన్ను పంపినవానిని కూడా అంగీకరిస్తాడు” అని అన్నాడు.
© 1997 Bible League International