Revised Common Lectionary (Complementary)
తౌ
169 యెహోవా, నా సంతోష గీతం ఆలకించుము.
నీ వాగ్దాన ప్రకారం నన్ను జ్ఞానం గలవానిగా చేయుము.
170 యెహోవా, నా ప్రార్థన వినుము.
నీవు వాగ్దానం చేసినట్టే, నన్ను రక్షించుము.
171 నీవు నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించావు
కనుక నేను స్తుతి గీతాలతో ఉప్పొంగిపోతాను.
172 నీ మాటలకు నన్ను జవాబు చెప్పనిమ్ము.
నా పాట నన్ను పాడనిమ్ము. యెహోవా, నీ న్యాయచట్టాలన్నీ మంచివి.
173 నేను నీ ఆజ్ఞలను అనుసరించాలని నిర్ణయించుకొన్నాను
గనుక నన్ను ఆదుకొని, నాకు సహాయం చేయుము.
174 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కోరుతున్నాను.
కాని నీ ఉపదేశాలు నన్ను సంతోష పరుస్తాయి.
175 యెహోవా, నన్ను జీవించనిమ్ము. నిన్ను స్తుతించనిమ్ము.
నీ న్యాయ చట్టాలు నాకు సహాయం చేయనిమ్ము.
176 నేను తప్పిపోయిన గొర్రెలా తిరిగాను.
యెహోవా, నా కోసం వెదకుతూ రమ్ము.
నేను నీ సేవకుడను.
మరియు నేను నీ ఆజ్ఞలను మరువలేదు.
11 ఆ రోజులలో బేతేలు నగరంలో వృద్ధుడైన ఒక ప్రవక్త నివసిస్తూ వుండేవాడు. ఆ వృద్ద ప్రవక్త యొక్క కుమారులు దైవజనుడు వచ్చి బేతేలు నగరంలో చేసినదంతా తమ తండ్రితో చెప్పారు. రాజైన యరొబాముతో ఆ దైవజనుడు చెప్పినదంతా కూడా వారు తమ తండ్రికి వివరించారు. 12 అయితే “అతడు ఏ మార్గాన వెళ్లాడని” వృద్ధ ప్రవక్త అడిగాడు. యూదానుండి వచ్చిన దైవజనుడు వెళ్లిన దారిని తమ తండ్రికి అతని కుమారులు చూపించారు. 13 వృద్ధ ప్రవక్త తన కుమారులతో అతని గాడిదపై గంత వేయమని చెప్పాడు. వారతిని గాడిదపై గంత వేయగా, దానిపై ఎక్కి ప్రవక్త ప్రయాణమై వెళ్లాడు.
14 ఆ వృద్ధ ప్రవక్త దైవజనుడిని వెతుక్కుంటూ పోయాడు. దైవజనుడు ఒక సింధూర వృక్షం కింద కూర్చుని వుండటం వృద్ద ప్రవక్త చూశాడు. “యూదానుండి వచ్చిన దైవజనుడవు నీవేనా?” అని వృద్ధ ప్రవక్త అడిగాడు.
“అవును నేనే” అన్నాడు దైవజనుడు.
15 “అయితే దయచేసి నా ఇంటికి వచ్చి, నాతో భోజనం చేయండి” అంటూ వృద్ధ ప్రవక్త అడిగాడు.
16 కాని దైవజనుడిలా అన్నాడు: “నేను నీతో రాలేను. నీతో ఈ ప్రదేశంలో అన్నపానాదులు తీసుకోలేను. 17 ‘అక్కడ నీవేదీ తినరాదు; తాగరాదు. నీవు వెళ్లిన దారిన తిరిగి రాకూడదు; అని కూడ యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాడు.’”
18 “కాని నేను కూడా నీలాగే ఒక ప్రవక్తను” అన్నాడు ఆ వృద్ధ ప్రవక్త. అతడు ఒక అబద్ధం కూడా చెప్పాడు. “యెహోవా యొక్క దేవదూత నావద్దకు వచ్చాడు. ఆ యెహోవా యొక్క దేవదూత నిన్ను నా ఇంటికి తీసుకుని వెళ్లమని, నాతో నీవు భోజనాదులు చేసేలా అనుమతివ్వమనీ అన్నాడు” అని చెప్పాడు.
19 ఈ మాటలు నమ్మి ఆ దైవజనుడు వృద్ధ ప్రవక్త ఇంటికి వెళ్లాడు. అతనితో కలిసి భోజనాదికములు చేశాడు. 20 వారు బల్లవద్ద కూర్చునివుండగా, యెహోవా వృద్ధ ప్రవక్తతో మాట్లాడాడు. 21 ఆ వృద్ధ ప్రవక్త యూదా దేశపు దైవజనునితో ఇలా అన్నాడు: “ప్రభువాజ్ఞ నీవు పాటించలేదని ఆయన అన్నాడు! యెహోవా ఆదేశించిన దానిని నీవు చేయలేదు. 22 ఈ ప్రదేశంలో నీవు ఏమీ తినరాదనీ, త్రాగరాదనీ యెహోవా ఆజ్ఞాపించాడు. కాని నీవు తిరిగి వచ్చి భోజనాదికాలు నిర్వర్తించావు. అందువల్ల నీ శవం నీ పితరుల సమాధిలో ఉంచబడదు.”
23 దైవజనుడు భోజనం ముగించాడు. వృద్ధ ప్రవక్త గాడిదపై గంత వేయగా, దైవజనుడు దానిపై వెళ్లాడు. 24 తను ఇంటికి తిరిగి వెళ్లే మార్గంలో ఒక సింహం దైవజనుని మీదపడి చంపేసింది. దైవజనుని శరీరం బాటపై పడివుంది. గాడిద, సింహం శవం పక్కన నిలబడివున్నాయి. 25 కొందరు ఆ దారిన పోతూ, శవం పక్కన సింహం నిలబడివుండటం చూశారు. వృద్ధ ప్రవక్త వున్న నగరానికి వచ్చి, వారు దారిలో చూసినదంతా చెప్పారు.
క్రొత్త జీవితం
3 మీరు క్రీస్తుతో కూడా సజీవంగా లేచి వచ్చారు. ఆయన పరలోకంలో దేవుని కుడిచేతి వైపు కూర్చొని ఉన్నాడు. కనుక పరలోకంలో ఉన్నవాటిని ఆశించండి. 2-3 మీరు మరణించారు. ఇప్పుడు మీ ప్రాణం క్రీస్తుతో సహా దేవునిలో దాగి ఉంది. కనుక భూమ్మీద ఉన్నవాటిని కాకుండా పరలోకంలో ఉన్నవాటిని గురించి ఆలోచించండి. 4 క్రీస్తు మీ నిజమైన ప్రాణం. ఆయన వచ్చినప్పుడు మీరాయనతో సహా దేవుని మహిమలో భాగం పంచుకొంటారు.
5 మీరు మీ భౌతిక వాంఛల్ని చంపుకోవాలి. అంటే, వ్యభిచారము, అపవిత్రత, మోహము, దురాశ, అత్యాశ. ఇవి ఒక విధమైన విగ్రహారాధన కనుక, వీటన్నిటినీ వదులుకోవాలి. 6 వీటివల్ల దేవునికి కోపం వస్తుంది.[a] 7 మీ గత జీవితంలో ఈ గుణాలు మీలో ఉన్నాయి.
8 కాని యిక మీరు ఆగ్రహాన్ని, ద్వేషాన్ని, దుష్టత్వాన్ని వదులుకోవాలి. ఇతరులను దూషించరాదు. బూతులు మాటలాడరాదు. 9 మీరు మీ పాత స్వభావాల్ని, పద్ధతుల్ని వదిలి వేసారు కనుక అసత్యములాడరాదు. 10 మీరు క్రొత్త జీవితం పొందారు. ఆ జీవితానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు మిమ్మల్ని తన ప్రతిరూపంలో మలుస్తూ, తనను గురించిన జ్ఞానాన్ని మీలో అభివృద్ధి పరుస్తున్నాడు. 11 ఇక్కడ గ్రీసు దేశస్థునికి, యూదునికి భేదం లేదు. సున్నతి పొందినవానికి, పొందనివానికి భేదంలేదు. విదేశీయునికి, సిథియనుడికి[b] భేదం లేదు. బానిసకు, బానిసకానివానికి భేదం లేదు. క్రీస్తే సర్వము. అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు.
© 1997 Bible League International