Revised Common Lectionary (Complementary)
116 యెహోవా నా ప్రార్థనలు విన్నప్పుడు
నాకు ఎంతో సంతోషం.
2 సహాయంకోసం నేను ఆయనకు చేసిన మొర
ఆయన విన్నప్పుడు నాకు ఇష్టం.
3 నేను దాదాపు చనిపోయాను. మరణ పాశాలు నన్ను చుట్టుకొన్నాయి.
సమాధి నా చుట్టూరా మూసికొంటుంది.
నేను భయపడి చింతపడ్డాను.
4 అప్పుడు నేను యెహోవా నామం స్మరించి,
“యెహోవా, నన్ను రక్షించుము.” అని అన్నాను.
5 యెహోవా మంచివాడు, జాలిగలవాడు.
యెహోవా దయగలవాడు.
6 నిస్సహాయ ప్రజలను గూర్చి యెహోవా శ్రద్ధ తీసుకొంటాడు.
నేను సహాయం లేకుండా ఉన్నాను, యెహోవా నన్ను రక్షించాడు.
7 నా ఆత్మా, విశ్రమించు!
యెహోవా నిన్ను గూర్చి శ్రద్ధ తీసుకొంటాడు.
8 దేవా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు.
నా కన్నీళ్లను నీవు నిలిపివేశావు.
నేను పడిపోకుండా నీవు నన్ను పట్టుకొన్నావు.
9 సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను.
15 ఆ స్త్రీ ఇల్లు పట్టణం ప్రహారీ గోడమీద కట్టబడింది. అది గోడలో ఒక భాగంగా ఉంది. కనుక ఆమె ఒక తాడు ప్రయోగించి కిటికీలోనుంచి వాళ్లిద్దర్నీ క్రిందికి దించింది. 16 అప్పుడు ఆమె వాళ్లతో ఇలా అంది: “పొరబాటున కూడా మీరు రాజుగారి మనుష్యులకు కనపడకుండా పడమటి కొండల్లోకి వెళ్లిపోండి. మూడు రోజులు అక్కడ దాక్కోండి. రాజుగారి మనుష్యులు తిరిగి వచ్చాక, మీ దారిన మీరు వెళ్లవచ్చు.”
17 ఆ మనుష్యులు ఇద్దరూ ఆమెతో ఇలా అన్నారు: “మేము నీకు వాగ్దానం చేసాము. అయితే నీవు ఒక పని చేయాలి. లేకపోతే మా వాగ్దానానికి మేము బాధ్యులం కాదు. 18 మేము తప్పించుకోనేందుకు నీవు ఈ ఎర్రటి తాడు ప్రయోగిస్తున్నావు. మేము ఈ దేశానికి తిరిగి వస్తాము. ఆ సమయంలో ఈ ఎర్రటి తాడును నీవు నీ కిటికీలో కట్టాలి. నీ తండ్రిని, తల్లిని, నీ సోదరులను, నీ కుటుంబం అంతటిని నీవు నీ ఇంట్లో చేర్చాలి. 19 ఈ ఇంట్లో ఉండే ప్రతీ ఒక్కరినీ మేము క్షేమంగా కాపాడుతాము. నీ ఇంట్లో ఉన్న వాళ్లెవరైనా దెబ్బతింటే దానికి మేము బాధ్యులము. నీ ఇంట్లోనుంచి ఎవరైనా బయటకు వెళ్లి, చంపబడితే దానికి మేము బాధ్యులము కాము. అది ఆ వ్యక్తి తప్పు అవుతుంది. 20 ఈ ఒడంబడిక మేము నీతో చేస్తున్నాము. మేము చేస్తోన్న పనిగూర్చి నీవు గనుక ఎవరితోనైనా చెప్పావంటే మేము ఈ ఒడంబడికకు కట్టుబడి ఉండనక్కర్లేదు.”
21 “ఇది నాకు సమ్మతమే” అని ఆ స్త్రీ జవాబిచ్చింది. ఆమె వాళ్లకు వీడ్కోలు చెప్పింది, వాళ్లు ఆమె ఇల్లు విడిచి బయల్దేరారు. అప్పుడు ఆమె ఆ ఎర్రటి తాడును కిటికీకి కట్టింది.
22 ఆ మనుష్యులు ఆమె ఇల్లు విడిచి, కొండల్లోకి వెళ్లిపోయారు. మూడు రోజులు వాళ్లు అక్కడే ఉన్నారు. రాజు మనుష్యులు మార్గం అంతా వెదికారు. మూడు రోజుల తర్వాత రాజు మనుష్యులు వెదకటం మానివేసి పట్టణానికి తిరిగి వెళ్లిపోయారు. 23 అప్పుడు ఆ మనుష్యులు ఇద్దరూ యెహోషువ దగ్గరకు ప్రయాణం మొదలుబెట్టారు. వాళ్లు కొండలు విడిచి, నది దాటారు. నూను కుమారుడైన యెహోషువ దగ్గరకు వారు వెళ్లారు. వారు తెలుసుకొన్న సమాచారం అంతా వాళ్లు యెహోషువకు చెప్పారు. 24 వారు యెహోషువతో, “నిజంగా ఆ దేశం అంతా యెహోవా మనకు ఇచ్చాడు. ఆ దేశ ప్రజలందరికీ మనమంటే భయంగా ఉంది” అని చెప్పారు.
17 విశ్వాసంతో పాటు క్రియ లేకపోతే ఆ విశ్వాసం పూర్తిగా నిష్ప్రయోజనమైపోతుంది.
18 కాని, “ఒకనిలో విశ్వాసం ఉండవచ్చు. మరొకనిలో క్రియ ఉండవచ్చు!” అని మీరనవచ్చు! అలాగైతే క్రియలు లేకుండా మీలో ఉన్న విశ్వాసాన్ని నాకు చూపండి. నేను క్రియారూపకంగా నా విశ్వాసాన్ని చూపుతాను. 19 ఒక్కడే దేవుడున్నాడని మీరు విశ్వసిస్తారు. మంచిదే. దయ్యాలు కూడా దాన్ని నమ్ముతాయి. అయినా, దేవుడు తమను శిక్షిస్తాడేమోనని భయపడ్తూ ఉంటాయి.
20 ఓ మూర్ఖుడా! క్రియలు లేని విశ్వాసం వ్యర్థమన్న[a] దానికి నీకు ఋజువు కావాలా? 21 మన పూర్వికుడు అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై బలిగా యివ్వటానికి సిద్ధమైనందుకు దేవుడతణ్ణి, అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణించలేదా? 22 అతనిలో ఉన్న విశ్వాసము క్రియతో కలిసి పని చెయ్యటం మీరు గమనించారు. అతడు చేసిన క్రియ అతని విశ్వాసానికి పరిపూర్ణత కలిగించింది. 23 “అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. తద్వారా దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు”(A) అని లేఖనాల్లో చెప్పిన విషయం నిజమైంది. దేవుడతణ్ణి తన మిత్రునిగా పిలిచాడు. 24 మానవునిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మాత్రమే కాకుండా అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణింపబడటం మీరు చూసారు.
25 మరొక ఉదాహరణ రాహాబు. ఆమె గూఢచారులకు ఆతిథ్యమిచ్చి వాళ్ళను వేరొక దారిన పంపివేసింది. ఆమె చేసిన క్రియను బట్టి దేవుడు ఆమెను నీతిమంతురాలిగా పరిగణించ లేదా?
26 ఆత్మలేని శరీరం ఏ విధంగా నిర్జీవమైందో అదే విధంగా క్రియలేని విశ్వాసము నిర్జీవమైనది.
© 1997 Bible League International