Revised Common Lectionary (Complementary)
10 నేను వృద్ధుడనయ్యేంత వరకు బ్రతుకుతానని నాలో నేను అనుకొన్నాను.
కానీ నేను పాతాళ ద్వారాలగుండా వెళ్లాల్సిన సమయం అది. ఇప్పుడు నేను నా సమయమంతా అక్కడే గడపాలి.
11 కనుక నేను చెప్పాను: “సజీవుల దేశంలో ప్రభువైన యెహోవాను నేను మరల చూడను.
భూమిమీద మనుష్యులు జీవించుట నేను మరల చూడను.
12 నా ఇల్లు, నా గొర్రెల కాపరి గుడారం లాగివేయబడి నానుండి తీసివేయబడుతుంది.
మగ్గమునుండి ఒకడు బట్టను చుట్టి కత్తిరించినట్టు నా పని అయిపోయింది.
ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొనివచ్చావు.
13 రాత్రి అంతా నేను సింహంలా గట్టిగా అరిచాను.
అయితే సింహం ఎముకలు నమిలినట్టు నా ఆశలు అణగ ద్రొక్కబడ్డాయి.
ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చావు.
14 నేను గువ్వలా మూల్గాను.
నేను పక్షిలా ఏడ్చాను.
నా కళ్లు క్షీణించాయి
కానీ నేను ఆకాశం తట్టు చూస్తూనే ఉన్నాను.
నా ప్రభువా, నాకు కష్టాలు ఉన్నాయి.
నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేయుము.”
15 నేనేం చెప్పగలను?
జరిగేదేమిటో నా ప్రభువు నాకు చెప్పాడు.
నా యజమాని దానిని జరిగిస్తాడు.
నా ఆత్మలో నాకు ఈ కష్టాలు కలిగాయి.
కనుక ఇప్పుడు నేను జీవితాంతం దీనుడనుగా ఉంటాను.
16 నా ప్రభూ, నా ఆత్మ మరల జీవించేట్టుగా ఈ కష్ట సమయాన్ని ఉపయోగించు
నా ఆత్మ బలపడి, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయం చేయుము.
నేను బాగుపడేందుకు సహాయం చేయి.
మరల జీవించేందుకు నాకు సహాయం చేయుము.
17 చూడండి, నా కష్టాలు తొలగి పోయాయి.
ఇప్పుడు నాకు శాంతి ఉంది.
నీవు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు.
నీవు నన్ను సమాధిలో మురిగి పోనివ్వలేదు.
నీవు నా పాపాలన్నీ క్షమించావు.
నీవు నా పాపాలను దూరంగా పారవేశావు.
18 చచ్చినవాళ్లు నీకు స్తుతులు పాడరు.
పాతాళంలోని ప్రజలు నిన్ను స్తుతించరు.
చచ్చినవాళ్లు సహాయం కోసం నిన్ను నమ్ముకోరు. వారు భూగర్భంలోనికి వెళ్తారు, మరల ఎన్నటికీ మాట్లాడరు.
19 నేడు నాలాగే బ్రతికి ఉన్న మనుష్యులే
నిన్ను స్తుతించేవారు.
నీవు నమ్మదగిన వాడవని ఒక తండ్రి తన పిల్లలతో చెప్పాలి.
20 కనుక నేను అంటాను: “యెహోవా నన్ను రక్షించాడు
కనుక మా జీవిత కాలమంతా మేము యెహోవా ఆలయంలో పాటలు పాడి, వాయిద్యాలు వాయిస్తాం.”
9 అప్పుడు ఫిలిష్తీయులు యూదా ప్రాంతానికి తరలిపోయారు. లేహీ అనే చోట వారు నిలిచారు. వారి సైనికులు అక్కడ విడిదిచేసి యుద్ధానికి సిద్ధపడ్డారు. 10 యూదా వంశానికి చెందిన మనుష్యులు వారిని ఇలా ప్రశ్నించారు: “ఫిలిష్తీయులైన మీరు మాతో యుద్ధం చేసేందుకు ఎందుకు ఇక్కడికి వచ్చారు?”
అందుకు వారు ఇలా అన్నారు: “మేము సమ్సోనును పట్టుకోడానికి వచ్చాము. అతనిని మేము మా బందీగా చేసుకోవడానికి వచ్చాము. అతను మా ప్రజలకి చేసిన పనులకు బదులుగా అతనిని శిక్షిస్తాము.”
11 అప్పుడు యూదా వంశస్థులైన మూడువేల మంది మనుష్యులు సమ్సోనును పట్టుకొనుటకు ఏతాము బండకి దగ్గరగా వున్న ఆ గుహ వద్దకు వెళ్లి. అతనితో ఇలా అన్నారు: “నీవు మాకేమి చేశావు? ఫిలిష్తీయులు మమ్మల్ని పరిపాలిస్తున్నారని నీకు తెలియదా?”
“వారు నాకు చేసిన కీడుకు బదులుగా వారిని నేను శిక్షించాను.” అని సమ్సోను సమాధానం చెప్పాడు.
12 అప్పుడు వారు సమ్సోనుతో ఇలా అన్నారు: “మేము నిన్ను బంధించడానికి వచ్చాము. మేము నిన్ను ఫిలిష్తీయులకు అప్పజెప్పుతాము.”
యూదా నుండి వచ్చిన మనుష్యులతో సమ్సోను ఇలా అన్నాడు: “మీరు నాకు ఏమీ అపకారం చేయమని నాకు మాట ఇవ్వాలి.”
13 యూదా నుండి వచ్చిన మనుష్యులు ఇలా అన్నారు: “అందుకు మేము సమ్మతిస్తున్నాము. మేము నిన్ను బంధించి, ఫిలిష్తీయులకు అప్పజెప్పుతాము. మేము నిన్ను చంపమని మాట ఇస్తున్నాము.” అప్పుడు వారు రెండు కొత్త తాళ్లతో సమ్సోనును బంధించారు. ఆ ప్రాంతంలోని గుహనుంచి అతనిని తీసుకువెళ్లారు.
14 లేహీ అనే చోటికి సమ్సోను రాగానే, ఫిలిష్తీయులు అతనిని కలుసుకోడానికి అక్కడికి వచ్చారు. సంతోషంతో వారు కేకలు వేశారు. అప్పుడు యెహోవా ఆత్మ గొప్ప శక్తితో సమ్సోనును నింపగా, సమ్సోను తాళ్లు తెంపుకున్నాడు. కాలిపోయిన దారంవలె ఆ తాళ్లు బలహీనముగా కనిపించాయి. కరిగిపోయినట్లుగా ఆ తాళ్లు సడలిపోయాయి. 15 సమ్సోను చచ్చిపోయిన ఒక గాడిద దవడ ఎముకను చూశాడు. అతను ఆ దవడ ఎముకను తీసుకున్నాడు. దానితో వేయి మంది ఫిలిష్తీయుల్ని చంపివేశాడు.
16 తర్వాత సమ్సోను అన్నాడు:
“గాడిద దవడ ఎముకతో
వెయ్యి మందిని చంపాను!
గాడిద దవడ ఎముకతో
వారిని ఎత్తైన కుప్పగా పేర్చాను!”
17 సమ్సోను ఈలాగు చెప్పిన తర్వాత, ఆ దవడ ఎముకను అతడు క్రిందికి విసరివేశాడు. అందువల్ల ఆ ప్రదేశానికి రామత్లేహీ[a] అనే పేరు వచ్చింది.
18 సమ్సోనుకు బాగా దాహం వేసింది. అందువల్ల అతను యెహోవాను ఉద్దేశించి కేకపెట్టాడు. అతను అన్నాడు: “నేను నీ భక్తుడను. నీవు నాకు మహా విజయం సమకూర్చావు. ఇప్పుడు దప్పిక బాధతో నన్ను మరణం పాలుచేయవద్దు. సున్నతి కూడా చేసుకోని మనుష్యులకు నన్ను పట్టుబడకుండా చెయ్యి”
19 లేహీలోని నేలలో ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం బద్దలయ్యేలా దేవుడు చేసెను. నీళ్లు వెలికి వచ్చాయి. ఆ నీటిని సమ్సోను తాగి, హాయిపొందాడు. అతను మళ్లీ బలవంతుడయ్యాడు. అందువల్ల అతను ఆ నీటి బుగ్గకి ఎన్ హకోరె[b] అని పేరు పెట్టాడు. నేటికీ లేహీ నగరంలో అది ఉంది.
20 ఈ రీతిగా ఇశ్రాయేలు ప్రజలకు సమ్సోను న్యాయాధిపతిగా ఇరవై సంవత్సరాలపాటు వ్యవహరించాడు. ఇది ఫిలిష్తీయులు నివసించిన కాలంలో జరిగింది.
యేసు ఒక బాలుని దయ్యంనుండి విడిపించటం
(మార్కు 9:14-29; లూకా 9:37-43)
14 వాళ్ళు ప్రజల దగ్గరకు రాగానే ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి మోకరిల్లి, 15 “ప్రభూ! నా కుమారునిపై దయ చూపండి. అతడు మూర్ఛ రోగంతో చాలా బాధపడ్తున్నాడు. మాటి మాటికి నిప్పుల్లో పడ్తూ ఉంటాడు. 16 అతణ్ణి నేను మీ శిష్యుల దగ్గరకు తీసుకు వచ్చాను. కాని వాళ్ళతనికి నయం చెయ్యలేక పొయ్యారు” అని అన్నాడు.
17 అప్పుడు యేసు, “మూర్ఖులైన ఈ తరానికి చెందిన మీలో విశ్వాసం లేదు. మీకు సక్రమమైన ఆలోచనలు రావు. నేనెంత కాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని మీ పట్ల సహనం వహించాలి. ఆ బాలుణ్ణి నా దగ్గరకు పిలుచుకు రండి” అని అన్నాడు. 18 యేసు ఆ దయ్యానికి వెళ్ళిపొమ్మని గట్టిగా చెప్పాడు. అది ఆ బాలుని నుండి వెలుపలికి వచ్చింది. అదే క్షణంలో ఆ బాలునికి నయమైపోయింది.
19 శిష్యులు ఆ తర్వాత యేసు దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేక పోయాము?” అని అడిగారు.
20 యేసు, “మీలో దృఢవిశ్వాసం లేదు కనుక మీరు దాన్ని వెళ్ళగొట్టలేక పొయ్యారు. కాని ఇది సత్యం. 21 మీలో ఆవగింజంత విశ్వాసమున్నా చాలు. మీరీ కొండతో ‘అక్కడికి వెళ్ళు’ అని అంటే వెళ్తుంది. మీకు అసాధ్యమనేది ఉండదు” అని అన్నాడు.
© 1997 Bible League International