Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 38:10-20

10 నేను వృద్ధుడనయ్యేంత వరకు బ్రతుకుతానని నాలో నేను అనుకొన్నాను.
    కానీ నేను పాతాళ ద్వారాలగుండా వెళ్లాల్సిన సమయం అది. ఇప్పుడు నేను నా సమయమంతా అక్కడే గడపాలి.
11 కనుక నేను చెప్పాను: “సజీవుల దేశంలో ప్రభువైన యెహోవాను నేను మరల చూడను.
    భూమిమీద మనుష్యులు జీవించుట నేను మరల చూడను.
12 నా ఇల్లు, నా గొర్రెల కాపరి గుడారం లాగివేయబడి నానుండి తీసివేయబడుతుంది.
    మగ్గమునుండి ఒకడు బట్టను చుట్టి కత్తిరించినట్టు నా పని అయిపోయింది.
    ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొనివచ్చావు.
13 రాత్రి అంతా నేను సింహంలా గట్టిగా అరిచాను.
    అయితే సింహం ఎముకలు నమిలినట్టు నా ఆశలు అణగ ద్రొక్కబడ్డాయి.
ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చావు.
14 నేను గువ్వలా మూల్గాను.
    నేను పక్షిలా ఏడ్చాను.
నా కళ్లు క్షీణించాయి
    కానీ నేను ఆకాశం తట్టు చూస్తూనే ఉన్నాను.
నా ప్రభువా, నాకు కష్టాలు ఉన్నాయి.
    నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేయుము.”
15 నేనేం చెప్పగలను?
    జరిగేదేమిటో నా ప్రభువు నాకు చెప్పాడు.
    నా యజమాని దానిని జరిగిస్తాడు.
నా ఆత్మలో నాకు ఈ కష్టాలు కలిగాయి.
    కనుక ఇప్పుడు నేను జీవితాంతం దీనుడనుగా ఉంటాను.
16 నా ప్రభూ, నా ఆత్మ మరల జీవించేట్టుగా ఈ కష్ట సమయాన్ని ఉపయోగించు
    నా ఆత్మ బలపడి, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయం చేయుము.
    నేను బాగుపడేందుకు సహాయం చేయి.
    మరల జీవించేందుకు నాకు సహాయం చేయుము.

17 చూడండి, నా కష్టాలు తొలగి పోయాయి.
    ఇప్పుడు నాకు శాంతి ఉంది.
నీవు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు.
    నీవు నన్ను సమాధిలో మురిగి పోనివ్వలేదు.
నీవు నా పాపాలన్నీ క్షమించావు.
    నీవు నా పాపాలను దూరంగా పారవేశావు.
18 చచ్చినవాళ్లు నీకు స్తుతులు పాడరు.
    పాతాళంలోని ప్రజలు నిన్ను స్తుతించరు.
చచ్చినవాళ్లు సహాయం కోసం నిన్ను నమ్ముకోరు. వారు భూగర్భంలోనికి వెళ్తారు, మరల ఎన్నటికీ మాట్లాడరు.
19 నేడు నాలాగే బ్రతికి ఉన్న మనుష్యులే
    నిన్ను స్తుతించేవారు.
    నీవు నమ్మదగిన వాడవని ఒక తండ్రి తన పిల్లలతో చెప్పాలి.
20 కనుక నేను అంటాను: “యెహోవా నన్ను రక్షించాడు
    కనుక మా జీవిత కాలమంతా మేము యెహోవా ఆలయంలో పాటలు పాడి, వాయిద్యాలు వాయిస్తాం.”

యెహోషువ 8:1-23

హాయి నాశనమగుట

అప్పుడు యెహోవా యెహోషువతో చెప్పాడు: “భయపడకు. జడియకు. నీ యుద్ధ వీరులందరినీ హాయి మీదికి నడిపించు. హాయి రాజును ఓడించేందుకు నేను నీకు సహాయం చేస్తాను. అతని ప్రజల్ని, అతని పట్టణాన్ని, అతని దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను. నీవు యెరికోకు, దాని రాజుకు చేసినట్టే హాయికి, దాని రాజుకుగూడ చేస్తావు. ఈసారి మాత్రమే మీరు ఐశ్వర్యాలన్నీ తీసుకొని మీకోసం దాచుకోవచ్చు. ఆ ఐశ్వర్యాలను మీరు, మీ ప్రజలు పంచుకోండి. ఇప్పుడు మీ సైనికులు కొందర్ని పట్టణం వెనుక మాటు వేయమని చెప్పు.”

కనుక యెహోషువ తన సైన్యం అంతటినీ హాయివైపు నడిపించాడు. తర్వాత మంచి పరాక్రమంగల ముప్పయివేలమంది శూరులను యెహోషువ ఏర్పాటు చేసుకొన్నాడు. అతడు వీళ్లందరినీ రాత్రి పూట బయటకు పంపించాడు. యెహోషువ వారికి ఇలా ఆజ్ఞాపించాడు: “నేను మీతో చెప్పేది జాగ్రత్తగా వినండి. పట్టణం వెనుక ప్రాంతంలో మీరు దాక్కోవాలి. దాడి చేయాల్సిన సమయంకోసం కనిపెట్టి ఉండాలి. పట్టణానికి మరీ దూరంగా వెళ్లకండి. కనిపెడ్తూ, సిద్ధంగా ఉండండి. నేను నాతో ఉన్న మనుష్యులను పట్టణం మీదికి నడిపిస్తాను. పట్టణంలోపలి మనుష్యులు మాతో యుద్ధం చేయటానికి బయటకు వస్తారు. మేము ఇదివరకువలెనే, వెనుదిరిగి వారి దగ్గర్నుండి పారిపోతాం. ఆ మనుష్యులు పట్టణం నుండి మమ్మల్ని తరుముతారు. ఇదివరకువలెనే మేము వాళ్ల ఎదుట నుండి పారిపోతున్నామని వారు అనుకొంటారు. కనుక మేము పారిపోతాము. అప్పుడు మీరు దాగుకొన్న చోటు నుండి బయటకు వచ్చి పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి. మీ యెహోవా దేవుడు మీరు గెలిచేందుకు మీకు శక్తి ఇస్తాడు.

“యెహోవా చెప్పినట్టే మీరు చేయాలి. నన్ను గమనించండి. దాడి చేసేందుకు నేను మీకు ఆజ్ఞఇస్తాను. మీరు పట్టణాన్ని స్వాధీనం చేసుకొన్న తర్వాత మీరు దాన్ని కాల్చివేయాలి.”

అప్పుడు యెహోషువ, వారు దాగుకొనే చోటుకు వారిని పంపించగా, బేతేలు, హాయికి మధ్యగల ఒకచోటికి వారు వెళ్లారు. ఇది హాయికి పశ్చిమాన ఉంది. ఆ రాత్రి యెహోషువ తన మనుష్యుల దగ్గరే ఉండిపోయాడు.

10 మరునాడు ఉదయాన్నే యోహోషువ పురుషులందరినీ సమావేశం చేసాడు. అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు నాయకులు అందరినీ హాయి మీదికి నడిపించారు. 11 యెహోషువతో ఉన్న సైనికులందరూ హాయి మీద దాడి చేశారు. ఆ పట్టణం ఎదుట వాళ్లు ఆగి పోయారు. పట్టణానికి ఉత్తరాన సైన్యం బసచేసింది. సైన్యానికినీ హాయికినీ మధ్య ఒక లోయఉంది.

12 అప్పుడు యెహోషువ ఐదువేల మంది పురుషులను ఏర్పరచుకొన్నాడు. పట్టణానికి పశ్చిమంగా, బేతేలుకు, హాయికి మధ్య ప్రాంతంలో దాగి ఉండమని యెహోషువ వారిని పంపించాడు. 13 కనుక యెహోషువ తన మనుష్యుల్ని యుద్ధానికి సిద్ధం చేసాడు. పట్టణానికి ఉత్తరాన ముఖ్యమైన బస ఉంది. మిగిలిన వాళ్లు పడమటివైపు దాగుకొన్నారు. ఆ రాత్రి యెహోషువ లోయలోనికి దిగి వెళ్లాడు.

14 తర్వాత హాయి రాజు ఇశ్రాయేలు సైన్యాన్ని చూసాడు. రాజు, అతని ప్రజలు లేచి, ఇశ్రాయేలు సైన్యంతో యుద్ధం చేసేందుకు త్వరపడ్డారు. హాయి రాజు పట్టణానికి తూర్పు దిశన బయటికి వెళ్లాడు. కనుక పట్టణం వెనుకవైపు సైనికులు దాగి ఉన్న విషయం అతనికి తెలియదు.

15 యెహోషువ, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులు అందరూ హాయివారి చేత వెనుకకు నెట్టబడ్డారు. యెహోషువ, అతని మనుష్యులు ఎడారివైపు తూర్పు దిశగా పారిపోవటం మొదలుబెట్టారు. 16 పట్టణంలో ఉన్న ప్రజలు కేకలు వేస్తూ, యెహోషువను, అతని మనుష్యులను తరమటం మొదలుబెట్టారు. ప్రజలంతా పట్టణం వదలిపెట్టేసారు. 17 హాయి, బేతేలు ప్రజలంతా ఇశ్రాయేలు సైన్యాన్ని తరిమారు. పట్టణం బాహాటంగా తెరచి ఉంది పట్టణాన్ని కాపాడేందుకు ఎవరూ అక్కడ ఉండలేదు.

18 యెహోవా “నీ ఈటెను హాయి పట్టణం మీదికి ఎత్తి పట్టుకో. ఆ పట్టణాన్ని నేను నీకు ఇస్తాను” అని యెహోషువతో చెప్పాడు. కనుక యెహోషువ తన ఈటెను హాయి పట్టణం మీదికి ఎత్తి పట్టుకొన్నాడు. 19 దాగుకొన్న ఇశ్రాయేలు మనుష్యులు ఇది చూసారు. వారు దాగుకొన్న చోటునుండి త్వరగా బయటకు వచ్చి, పట్టణంవైపు త్వరగా బయల్దేరారు. వారు పట్టణంలో ప్రవేశించి, దాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అప్పుడు సైనికులు ఆ పట్టణాన్ని కాల్చి వేసేందుకు మంటలు పెట్టడం మొదలుపెట్టారు.

20 హాయినుండి వచ్చిన మనుష్యులు వెనుకకు తిరిగి చూడగా వారి పట్టణం కాలిపోవటం కనుపించింది. పొగ ఆకాశానికి ఎక్కటం వారు చూసారు. కనుక వారి బలం, ధైర్యం క్షీణించిపోయాయి. వారు ఇశ్రాయేలీయులను తరమటం మానివేసారు. ఇశ్రాయేలు మనుష్యులు పారిపోవటం మానివేసారు. వారు వెనుకకు తిరిగి హాయి మనుష్యులతో పోరాటానికి దిగారు. హాయి మనుష్యులు పారిపోయేందుకు క్షేమకరమైన స్థలం ఏమీ లేకపోయింది. 21 యెహోషువ, అతని మనుష్యులు అందరూ, వారి సైన్యం ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటం చూసారు. ఆ పట్టణంనుండి పొగ లేవటం వారు చూసారు. అప్పటికే వారు పరుగెత్తటం మానివేసారు. వారు వెనుకకు తిరిగి హాయి మనుష్యుల మీద పోరాటానికి పరుగెత్తారు. 22 అప్పుడు దాగుకొనియున్న మనుష్యులు పోరాటంలో సహాయం చేసేందుకు పట్టణంలో నుండి బయటకు వచ్చారు. హాయి మనుష్యులకు రెండువైపులా ఇశ్రాయేలు సైన్యంఉంది. హాయి మనుష్యులు చిక్కులోపడ్డారు. ఇశ్రాయేలీయులు వారిని ఓడించారు. హాయి మనుష్యుల్లో ఒక్కరినిగూడ బ్రతకనీయకుండా, శత్రువు ఒక్కడూ తప్పించుకోకుండా వారు పోరాడారు. 23 అయితే హాయి రాజును ప్రాణంతో ఉండనిచ్చారు. యెహోషువ మనుష్యులు అతణ్ణి యెహోషువ దగ్గరకు తీసుకొచ్చారు.

హెబ్రీయులకు 12:3-13

పాపాత్ములు తనపట్ల కనబరచిన ద్వేషాన్ని ఆయన ఏ విధంగా సహించాడో జాగ్రత్తగా గమనించండి. అప్పుడు మీరు అలిసిపోకుండా, ధైర్యం కోల్పోకుండా ఉంటారు.

దేవుడు తండ్రిలాంటివాడు

మీరు పాపంతో చేస్తున్న యుద్ధంలో రక్తం చిందించవలసిన అవసరం యింతవరకు కలుగలేదు. మిమ్మల్ని కుమారులుగా భావించి చెప్పిన ప్రోత్సాహకరమైన ఈ సందేశాన్ని పూర్తిగా మరిచిపోయారు:

“నా కుమారుడా! ప్రభువు విధించిన క్రమశిక్షణను చులకన చెయ్యకు!
    నీ తప్పు ప్రభువు సరిదిద్దినప్పుడు నిరుత్సాహపడకు!
ఎందుకంటే, ప్రభువు తనను ప్రేమించిన వాళ్ళనే శిక్షిస్తాడు.
    అంతేకాక తన కుమారునిగా అంగీకరించిన ప్రతి ఒక్కణ్ణి శిక్షిస్తాడు.”(A)

కష్టాల్ని శిక్షణగా భావించి ఓర్చుకోండి. దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా చూసుకొంటాడు. తండ్రి నుండి శిక్షణ పొందని కుమారుడెవడున్నాడు? మీకు శిక్షణ లభించకపోతే మీరు దేవుని నిజమైన కుమారులు కారన్న మాట. ప్రతి ఒక్కడూ క్రమశిక్షణ పొందుతాడు. మన తండ్రులు మనకు శిక్షణనిచ్చారు. ఆ కారణంగా వాళ్ళను మనం గౌరవించాము. మరి అలాంటప్పుడు మన ఆత్మలకు తండ్రి అయిన వానికి యింకెంత గౌరవమివ్వాలో ఆలోచించండి. 10 మన తల్లిదండ్రులు వాళ్ళకు తోచిన విధంగా కొద్దికాలం పాటు మనకు క్రమశిక్షణ నిచ్చారు. కాని దేవుడు మన మంచికోసం, ఆయన పవిత్రతలో మనం భాగం పంచుకోవాలని మనకు శిక్షణనిచ్చాడు. 11 శిక్షణ పొందేటప్పుడు బాధగానే వుంటుంది. ఆనందంగా ఉండదు. కాని ఆ తర్వత శిక్షణ పొందినవాళ్ళు నీతి, శాంతి అనే ఫలం పొందుతారు.

నీవు ఎలా జీవిస్తున్నావో జాగ్రత్తగావుండు

12 అందువల్ల మీ బలహీనమైన చేతుల్ని, వణకుతున్న మోకాళ్ళను శక్తివంతం చేసుకోండి. 13 మీరు నడిచే దారుల్ని[a] సమంగా చేసుకోండి. అప్పుడు ఆ దారులు కుంటివాళ్ళకు అటంకం కలిగించటానికి మారుగా సహాయపడ్తాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International