Revised Common Lectionary (Complementary)
146 యెహోవాను స్తుతించండి!
నా ప్రాణమా! యెహోవాను స్తుతించు!
2 నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను.
నా జీవిత కాలమంతా నేను ఆయనకు స్తుతులు పాడుతాను.
3 సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు.
మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు.
4 మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడతారు.
అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన పథకాలన్నీ పోయినట్టే.
5 సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు.
ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు.
6 భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు.
యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు.
7 అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు.
ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు.
చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు.
8 గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు.
కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
9 మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు.
విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు.
అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు.
10 యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
యెహోవాను స్తుతించండి!
27 చూడండి! చాలా దూరం నుండి యెహోవా పేరు వస్తోంది. ఆయన కోపం దట్టమైన పొగ మేఘాలతో కూడిన అగ్నిలా ఉంది. యెహోవా నోరు కోపంతో నిండి ఉంది, ఆయన నాలుక మండుతోన్న మంటలా ఉంది. 28 యెహోవా ఊపిరి (ఆత్మ) గొంతు వరకు పొంగిన మహా నదిలా ఉంది. యెహోవా రాజ్యాలకు తీర్పు తీరుస్తాడు. “నాశనం చేసే జల్లెడలో” ఆయన వారిని జల్లించినట్లు ఉంటుంది. యెహోవా వారిని అదుపులో ఉంచుతాడు. ఒక జంతువును అదుపులో ఉంచే కళ్లెం, మనుష్యుల దవడల్లో ఉంచినట్టుగా అది ఉంటుంది.
29 ఆ సమయంలో మీరు ఆనందగీతాలు పాడుతారు. ఆ సమయంలో మీరు ఒక పండుగ ప్రారంభించిన రాత్రిలా ఉంటుంది. యెహోవా పర్వతానికి నడిచేటప్పుడు మీరు ఎంతో సంతోషిస్తారు. ఇశ్రాయేలీయుల బండ యెహోవాను ఆరాధించేందుకు వెళ్లే మార్గంలో పిల్లనగ్రోవి వినేటప్పుడు మీరు ఎంతగానో సంతోషిస్తారు.
30 యెహోవా ప్రజలంతా తన మహా స్వరం ఆలకించేట్టు చేస్తాడు. యెహోవా తన శక్తిగల హస్తం కోపంగా దిగి రావటం ప్రజలంతా చూచేట్టుగా చేస్తాడు. ఆ హస్తం సమస్తం కాల్చివేసే మహా మంటలా ఉంటుంది, విస్తారమైన వడగండ్లు, వర్షంతో నిండిన గొప్ప తుఫానులా ఉంటుంది యెహోవా శక్తి. 31 అష్షూరు యెహోవా స్వరం విన్నప్పుడు భయపడుతాడు. యెహోవా అష్షూరును దండంతో కొడతాడు. 32 యెహోవా అష్షూరును కొడతాడు, అది డప్పుల మీద, సితార మీద సంగీతం వాయించినట్టుగా ఉంటుంది. యెహోవా తన గొప్ప హస్తంతో అష్షూరును ఓడిస్తాడు.
33 తోపెతు చాలాకాలంగా సిద్ధం చేయబడి ఉంది. అది రాజుకోసం సిద్ధంగా ఉంది. అది చాలా లోతుగా వెడల్పుగా చేయబడింది. అక్కడ చాలా పెద్దగా కట్టెలు పేర్చి ఉన్నాయి. అగ్ని ఉంది. మరియు యెహోవా ఊపిరి (ఆత్మ) అగ్ని గంధక ప్రవాహంలా వచ్చి, దానిని కాల్చివేస్తుంది.
దేవుని తీర్పు
2 ఇతర్లపై తీర్పు చెప్పే నీవు, ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నావు. ఎందుకంటే ఏవిషయాల్లో నీవు ఇతర్లపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవుకూడా చేస్తున్నావు. అందువల్ల నీకు నీవే శిక్ష విధించుకుంటున్నావు. 2 దేవుడు అలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నవాళ్ళకు సత్యం ఆధారం మీద న్యాయమైన శిక్ష విధిస్తాడని మనకు తెలుసు. 3 మిత్రమా! ఏ కారణాలవల్ల నీవు వాళ్ళపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవు కూడా చేస్తున్నావు. మరి అలాంటప్పుడు దేవుని శిక్షను తప్పించుకోగలనని ఎలా అనుకుంటున్నావు? 4 లేక, నీవు దేవుని అనంతమైన దయను, క్షమను, సహనాన్ని ద్వేషిస్తున్నావా? నీవు మారుమనస్సు పొందాలని దేవుడు నీపై దయచూపాడు. ఈ విషయం నీకు తెలియదా?
5 కాని, నీది కఠిన హృదయం. అది పశ్చాత్తాపం పొందదు. కనుక దేవుడు ఆగ్రహం చూపే రోజున నీకు లభింపనున్న శిక్షను స్వయంగా ఎక్కువ చేసుకొంటున్నావు. ఆరోజు న్యాయమైన తీర్పు నీకు వ్యక్తమౌతుంది. 6 ఆ రోజు దేవుడు ప్రతి ఒక్కనికి అతడు చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు.(A) 7 కొందరు ఎప్పుడూ మంచిపనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు తేజస్సును, గౌరవాన్ని, నశించని దేహాన్ని పొందాలని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకే దేవుడు అనంత జీవాన్నిస్తాడు. 8 మరికొందరు సత్యాన్ని తృణీకరించి, చెడును అనుసరిస్తూ స్వార్థంతో జీవిస్తూ ఉంటారు. దేవుడు అలాంటివాళ్ళపై తన ఆగ్రహాన్ని తీవ్రంగా చూపుతాడు. 9 చెడును చేసిన ప్రతి మనిషికి కష్టాలు, దుఃఖాలు సంభవిస్తాయి. అవి యూదులకు, తర్వాత ఇతరులకు కూడా సంభవిస్తాయి. 10 మంచి చేసిన ప్రతి ఒక్కనికి తేజస్సు, గౌరవము, శాంతి లభిస్తాయి. అవి మొదట యూదులకు తర్వాత ఇతరులకు కూడా లభిస్తాయి. 11 దేవుడు పక్షపాతం చూపడు.
© 1997 Bible League International