Revised Common Lectionary (Complementary)
106 యెహోవాను స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
2 యెహోవా నిజంగా ఎంత గొప్పవాడో ఏ ఒక్కరూ వర్ణించలేరు.
ఏ ఒక్కరూ సరిపడినంతగా దేవుని స్తుతించలేరు.
3 దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారు సంతోషంగా ఉంటారు.
ఆ ప్రజలు ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూంటారు.
4 యెహోవా, నీవు నీ ప్రజల యెడల దయ చూపేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
నన్ను కూడా రక్షించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
5 యెహోవా, నీ జనులకు నీవు చేసే మంచివాటిలో
నన్ను పాలుపొందనిమ్ము
నీ ప్రజలతో నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
నీ జనంతో నన్ను నీ విషయమై అతిశయించనిమ్ము.
6 మా పూర్వీకుల్లా మేము కూడా పాపం చేసాము.
మేము తప్పులు చెడుకార్యాలు చేసాము.
13 కాని దేవుడు చేసిన వాటిని మన పూర్వీకులు వెంటనే మరచిపోయారు.
వారు దేవుని సలహా వినలేదు.
14 మన పూర్వీకులు ఎడారిలో ఆకలిగొన్నారు.
అరణ్యంలో వారు దేవుణ్ణి పరీక్షించారు.
15 కాని మన పూర్వీకులు అడిగిన వాటిని దేవుడు వారికి ఇచ్చాడు.
అయితే దేవుడు వారికి ఒక భయంకర రోగాన్ని కూడా ఇచ్చాడు.
16 ప్రజలు మోషే మీద అసూయ పడ్డారు.
యెహోవా పవిత్ర యాజకుడు అహరోను మీద వారు అసూయపడ్డారు.
17 కనుక ఆ అసూయపరులను దేవుడు శిక్షించాడు. భూమి తెరచుకొని దాతానును మింగివేసింది.
తరువాత భూమి మూసుకొంటూ అబీరాము సహచరులను కప్పేసింది.
18 అప్పుడు ఒక అగ్ని ఆ ప్రజాసమూహాన్ని కాల్చివేసింది.
ఆ అగ్ని ఆ దుర్మార్గులను కాల్చివేసింది.
19 హోరేబు కొండవద్ద ప్రజలు ఒక బంగారు దూడను చేశారు.
వారు ఆ విగ్రహాన్ని ఆరాధించారు.
20 ఆ ప్రజలు గడ్డి తినే ఒక ఎద్దు విగ్రహాన్ని
వారి మహిమ గల దేవునిగా మార్చేశారు.
21 మన పూర్వీకులు వారిని రక్షించిన దేవుణ్ణి గూర్చి మర్చిపోయారు.
ఈజిప్టులో అద్భుతాలు చేసిన దేవుణ్ణి గూర్చి వారు మర్చిపోయారు.
22 హాము దేశంలొ[a] దేవుడు అద్భుత కార్యాలు చేశాడు.
దేవుడు ఎర్ర సముద్రం దగ్గర భీకర కార్యాలు చేశాడు.
23 దేవుడు ఆ ప్రజలను నాశనం చేయాలని కోరాడు.
కాని దేవుడు ఏర్పరచుకొన్న సేవకుడు మోషే ఆయనను నివారించాడు.
దేవునికి చాలా కోపం వచ్చింది.
కాని దేవుడు ఆ ప్రజలను నాశనం చేయకుండా మోషే అడ్డుపడ్డాడు.
47 మా దేవుడవైన యెహోవా, మమ్ములను రక్షించు.
నీ పవిత్ర నామాన్ని స్తుతించగలిగేలా
ఈ జనముల మధ్యనుండి మమ్మల్ని సమీకరించుము.
అప్పుడు నీకు మేము స్తుతులు పాడగలం.
48 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
దేవుడు ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు, ఆయన శాశ్వతంగా జీవిస్తాడు.
మరియు ప్రజలందరూ, “ఆమేన్! యెహోవాను స్తుతించండి!” అని చెప్పారు.
21 “మీ మూలంగా యెహోవా నా మీద కొపగించాడు. ఆయన ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు. నేను యొర్దాను నది దాటి అవతలికి వెళ్లకూడదు. మీ దేవుడైన యెహోవా మీకు యిస్తున్న ఆ మంచి దేశంలోనికి నేను వెళ్లజాలనని ఆయన నాతో చెప్పాడు. 22 కనుక నేను యిక్కడ ఈ దేశంలోనే చావాలి. నేను యొర్దాను నది దాటి వెళ్లలేను. కానీ మీరు మాత్రం త్వరలోనే దాటి వెళ్లి, మీరు నివసించేందుకు ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకొంటారు. 23 మీ దేవుడైన యెహోవా మీతో చేసిన ఒడంబడికను మీరు మరచి పోకుండా ఆ కొత్త దేశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు చేయకూడదని మీ యెహోవా దేవుడు మీతో చెప్పిన ఏ రూపంలోనూ ఒక విగ్రహాన్ని చేయకూడదు. 24 ఎందుకంటే మీ దేవుడైన యెహోవా తన ప్రజలు ఇతర దేవుళ్లను పూజించడం అసహ్యించుకొంటాడు. పైగా యెహోవా నాశనం చేసే అగ్నిలా ఉండగలడు.
25 “మీరు ఆ దేశంలో చాలాకాలం జీవించిన తర్వాత, మీకు పిల్లలు, పిల్లల పిల్లలు కలుగుతారు. మీరు ముసలి వాళ్లవుతారు. అప్పుడు మారిపొయి మీ జీవితాన్ని పాడు చేసుకొనవద్దు. దేని రూపంలోనూ ఒక విగ్రహాన్ని చేయవద్దు. అలాగు యెహోవాకు విరుద్ధరగా కీడు చేస్తే, అది ఆయనకు కోపం పుట్టిస్తుంది. 26 ఆ కీడు మీరు జరిగిస్తే, ఇలా జరుగుతుందని నేడు ఆకాశం భూమి మీమీద సాక్షులుగా ఉంటారు; త్వరలోనే మీరు ఆ దేశంలో ఉండకుండాపోతారు. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ఇప్పుడు మీరు యొర్దాను నది దాటుతున్నారు. కానీ అక్కడ మీరు ఎక్కువ కాలం జీవించరు. మీరు సర్వనాశనం అవుతారు. 27 దేశదేశాలకు యెహోవా మిమ్మల్ని చెదరగొడతాడు. యెహోవా మిమ్మల్ని పంపించే ఆ దేశాల్లో జీవించేందుకు మీరు కొద్దమంది మాత్రమే ఉంటారు. 28 మనుష్యులు చేసిన దేవుళ్లను చెక్కతో రాయితో చేయబడి, కానలేని, వినలేని, తినలేని, వాసన చూడలేని దేవుళ్లను అక్కడ మీరు సేవిస్తారు. 29 అయితే అక్కడ, ఆ ఇతర దేశాల్లో మీరు మీ దేవుడైన యెహోవా కోసం చూస్తారు. మీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మీరు ఆయన కోసం చూస్తే, మీరు ఆయనను కనుగొంటారు. 30 మీరు కష్టంలో ఉన్నప్పుడు – ఆ సంగతులన్నీ మీకు సంభవించినప్పుడు – మీరు మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వచ్చి, ఆయనకు విధేయులవుతారు. 31 మీ దేవుడైన యెహోవా కృపగల దేవుడు ఆయన మిమ్మల్ని విడిచి పెట్టడు. ఆయన మిమ్మల్ని నాశనం చేయడు. మీ పూర్వీకులకు ఆయన వాగ్దానం చేసిన ఒడంబడికను ఆయన మరచిపోడు.
దేవుడు చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఆలోచించండి
32 “ఇంతకు పూర్వం యింత గొప్పది ఏమైనా జరిగిందా? ఎన్నడూ లేదు. గతాన్ని చూడండి, మీరు పుట్టక ముందు జరిగిన వాటన్నింటినీ గూర్చి ఆలోచించండి. భూమిమీద దేవుడు మనిషిని సృజించిన అనాది కాలానికి వెళ్లండి. ప్రపంచంలో ఎక్కడేగాని, ఎన్నడేగాని, జరిగిన వాటన్నింటినీ చూడండి. ఇంతటి గొప్ప విషయాన్ని గూర్చి ఎన్నడైనా ఎవరైనా విన్నారా? లేదు. 33 దేవుడు అగ్నిలోనుండి మీతో మాట్లాడగా మీరు వినికూడ యింకా బ్రతికే ఉన్నారు. అలా యింకెవరికైనా ఎన్నడైనా జరిగిందా? లేదు. 34 మరియు ఎప్పుడైనా, ఏ దేవుడైనా మరో దేశంలో నుండి తనకోసం ఒక ప్రజను తీసుకొనేందుకు ప్రయత్నించాడా? లేదు. కానీ మీ యెహోవా దేవుడు అద్భుత కార్యాలను చేయటం మీ మట్టుకు మీరే చూశారు. ఆయన తన శక్తిని, బలాన్ని మీకు చూపించాడు. ప్రజలను పరీక్షించిన కష్టాలను మీరు చూశారు. అద్భుతాలు మహాత్యాలు మీరు చూశారు. సంభవించిన యుద్ధాలు, భయంకర విషయాలు మీరు చూశారు. 35 ఆయనే దేవుడు అని మీరు తెలుసుకొనేందుకు ఈ సంగతులను యెహోవా మీకు చూపించాడు. ఆయనలాంటి దేవుడు ఇంకొకడు ఎవరూ లేరు. 36 యెహోవా మీకు ఒక పాఠం ప్రబోధించేందుకు పరలోకంనుండి ఆయన తన స్వరాన్ని మిమ్మల్ని విననిచ్చాడు. భూమి మీద ఆయన తన మహా అగ్నిని మిమ్మల్ని చూడనిచ్చి, దానిలోనుండి ఆయన మీతో మాట్లాడాడు.
37 “యెహోవా మీ వూర్వీకులను ప్రేమించాడు. అందుకే వారి సంతతివారైన మిమ్మల్ని ఆయన ఏర్పర చుకొన్నాడు. మరియు అందుకే ఆయన మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు రప్పించాడు. ఆయన మీతో ఉండి తన మహా శక్తితో మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. 38 మీరు ముందుకు సాగినప్పుడు, మీ ముందు బలమైన గొప్ప రాజులను యెహోవా బలవంతంగా వెళ్లగొట్టాడు. అయితే వారి దేశంలోనికి యెహోవా మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. మీరు నివసించేందుకు వారి దేశాన్ని ఆయన మీకు యిచ్చాడు. పైగా నేటికీ ఈ దేశం యింకా మీదే.
39 “అందుచేత నేడు మీరు జ్ఞాపకం చేసుకొని, యెహోవా దేవుడని అంగీకరించాలి. పైన ఆకాశంలోను, క్రింద భూమి మీదను ఆయనే దేవుడు. ఇంక వేరే ఏ దేవుడూ లేడు. 40 మరియు ఈ వేళ నేను మీకు యిచ్చే ఆయన చట్టాలు, ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి. అప్పుడు మీకూ, మీ తర్వాత జీవించే పిల్లలకు అంతా శుభం అవుతుంది. శాశ్వతంగా మీ దేశంగా ఉండేందుకు మీ దేవుడైన యెహోవా మీకు యిస్తున్న ఈ దేశంలో మీరు దీర్ఘకాలం జీవిస్తారు.”
9 “మీరు దేవుని ఆజ్ఞల్ని కాదని, మీ ఆచారాలను స్థాపించటంలో ఘనులు. 10 ఉదాహరణకు, మోషే మీ తల్లితండ్రుల్ని గౌరవించమని(A) మరియు తల్లిని కాని, తండ్రిని కాని దూషించినవారికి మరణ దండన విధించమని ఆజ్ఞాపించాడు.(B) 11 కాని ఒక మనిషి దగ్గర తన తల్లితండ్రులకు సహాయం చెయ్యటానికి కొంత ధనం ఉన్నా అతడు వాళ్ళతో, అది అంటే దేవునికి అర్పితం అని అంటే, 12 ఆ మనిషి తన తల్లి తండ్రులకు సహాయం చేయనవసరంలేదని మీరు అతణ్ణి సమర్థిస్తున్నారు. 13 మీ పెద్దల ఆచారం దేవుని ఆజ్ఞను రద్దు చేస్తోంది. ఇలాంటివి మీరు ఎన్నో చేస్తున్నారు” అని అన్నాడు.
14 యేసు మళ్ళీ, ప్రజల్ని తన దగ్గరకు పిలిచి, “ప్రతి ఒక్కళ్ళు ఇది వినండి. అర్థం చేసుకోండి. 15 బయట ఉన్నవేవీ మనిషి కడుపులోకి వెళ్ళి అతణ్ణి అపవిత్రం చేయవు. 16 మనిషినుండి బయటకు వచ్చేది. అతణ్ణి అపవిత్రం చేస్తొంది” అని అన్నాడు.
17 యేసు ప్రజల్ని వదిలి యింట్లోకి వెళ్ళాక ఆయన శిష్యులు ఆ ఉపమానాన్ని గురించి అడిగారు. 18 యేసు, “మీరింత అజ్ఞానులా! బయట ఉన్నది లోపలికి వెళ్ళి మనిషిని అపవిత్రం చెయ్యటం లేదని మీరు గమనించటం లేదా! 19 అది మనిషి హృదయంలోకి వెళ్ళదు. కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది” అని అన్నాడు. (యేసు ఈ విధంగా చెప్పి అన్ని ఆహార పదార్థాలు తినడానికి పవిత్రమైనవి అని సూచించాడు.)
20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “మనిషి నుండి బయటకు వచ్చేవి అతణ్ణి అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే, మానవుల హృదయాల నుండి దురాలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారం, 22 లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం బయటకు వస్తాయి. 23 ఇవే లోపలనుండి బయటకు వచ్చి నరుని అపవిత్రం చేస్తాయి.”
© 1997 Bible League International