Revised Common Lectionary (Complementary)
దేవుని ఆదేశాలు పాటించమని మోషే ప్రజలను హెచ్చరించటం
4 “ఇక, ఇశ్రాయేలీయులారా, నేను మీకు ప్రబోధించే చట్టాలు, ఆజ్ఞలు వినండి. వాటికి విధేయులవ్వండి. అప్పుడు మీరు బతికి, మీ పూర్వీకుల దేవుడైన యెహోనా మీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోగలుగుతారు. 2 నేను మీకు ఆజ్ఞాపించిన వాటికి మీరేమీ అదనంగా చేర్చకూడదు. అందులో నుంచి మీరేవీ తీసివేయకూడదు. నేను మీకు ఇచ్చిన మీ యెహోవా దేవుని ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి.
6 ఈ ఆజ్ఞలకు జాగ్రత్తగా లోబడండి. మీకు జ్ఞానం, తెలివి ఉన్నట్టు యితర రాజ్యాల ప్రజలకు యిది తెలియజేస్తుంది. ఆ దేశాల ప్రజలు ఈ ఆజ్ఞలను విన్నప్పుడు ‘నిజంగా ఈ గొప్ప రాజ్య ప్రజలు (ఇశ్రాయేలీయులు) జ్ఞానులు, తెలివి గలవారు’ అని చెబుతారు.
7 “మనం దేవునికి మొర్రపెట్టినప్పుడు మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు, మరి ఏ జాతికీ అంత సమీపంగా ఉండే ఏ దేవుడు లేడు. 8 ఈనాడు నేను మీ ఎదుట ఉంచిన ప్రబోధాలంతటి మంచి ఆజ్ఞలు, నియమాలు కలిగి ఉండేందుకు ఏ జాతికూడ అంత గొప్పది కాదు. 9 కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీరు చూసిన సంగతులను మీరు బ్రతికి ఉన్నంతకాలం మరచి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలకు, మీ పిల్లలపిల్లలకు మీరు ఈ సంగతులను ప్రబోధించాలి.
దావీదు కీర్తన.
15 యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు?
నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?
2 ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో
అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు.
3 అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు.
ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు.
ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పడు.
4 ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు.
అయితే యెహోవాను సేవించేవారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు.
ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే
అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు.
5 ఆ మనిషి ఎవరికైనా అప్పిస్తే
అతడు దాని మీద వడ్డీ తీసుకోడు.
నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు.
ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే, అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.
17 ప్రతి మంచి వరానికి, ప్రతి శ్రేష్ఠమైన వరానికి పరలోకం మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలిస్తాడు. ఆ వరాలిచ్చే తండ్రి మార్పుచెందడు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. 18 దేవుడు తన సృష్టిలో మనము ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జన్మనివ్వటానికి సంకల్పించాడు.
వినటం, చెయ్యటం
19 నా ప్రియమైన సోదరులారా! ఈ విషయాల్ని తెలుసుకోండి: ప్రతి మనిషి వినటానికి సిద్ధంగా ఉండాలి. మాట్లాడే ముందు ఆలోచించాలి. కోపాన్ని అణచుకోవాలి. 20 ఎందుకంటే కోపం ద్వారా దేవుడు ఆశించే నీతి కలుగదు. 21 అందువల్ల దుర్మార్గాల్ని, అవినీతిని పూర్తిగా వదిలివెయ్యండి. మీలో నాటుకుపోయిన దైవసందేశాన్ని విధేయతతో ఆచరించండి. అది మీ ఆత్మల్ని రక్షించగలదు.
22 దైవసందేశం చెప్పినట్లు చెయ్యండి. దాన్ని విని కూడా మీరు ఏమీ చెయ్యలేకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొన్న వాళ్ళవుతారు. 23-24 దైవసందేశం విని అది చెప్పినట్లు చెయ్యని వాడు అద్దంలో తన ముఖం చూసుకొని తానేవిధంగా కనిపించాడో వెంటనే మరచిపోయే వ్యక్తిలాంటివాడు. 25 స్వేచ్ఛను కలిగించే పరిపూర్ణమైన ధర్మశాస్త్రాన్ని పరిశీలిస్తూ దాని ప్రకారం జీవించేవాడు క్రియచేస్తున్న వానిగా పరిగణింపబడతాడు. అలాంటివాడు విని మరచిపోయే రకం కాదు. అతడు చేస్తున్న ప్రతీ కార్యము ఫలించాలని దేవుడు అతణ్ణి దీవిస్తాడు.
దేవుణ్ణి ఆరాధించే సత్యమార్గం
26 తానొక విశ్వాసినని తలంచి తన నాలుకకు కళ్ళెం వేసుకోకపోతె తనకు తాను మోసం చేసుకొన్నవాడౌతాడు. అతని విశ్వాసం నిష్ప్రయోజనమౌతుంది. 27 అనాథుల్ని, వితంతువుల్ని కష్టాల్లో ఆదుకోవటం, ఈ ప్రపంచంలో ఉన్న చెడువల్ల మలినం కాకుండా ఉండటము, ఇదే మన తండ్రియైన దేవుడు అంగీకరించే నిజమైన భక్తి.
దేవుని ప్రేమ మరియు మానవ సాంప్రదాయం
(మత్తయి 15:1-20)
7 యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు,[a] శాస్త్రులు యేసు చుట్టూ చేరారు. 2 వాళ్ళు, యేసు శిష్యుల్లో కొందరు అపరిశుభ్రమైన చేతులతో, అంటే ఆచారం ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం గమనించారు. 3 పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దలు చెప్పిన ఆచారం ప్రకారం తమ చేతుల్ని ప్రత్యేకంగా శుభ్రం చేసుకోకుండా భోజనం చెయ్యరు. 4 వాళ్ళు వీథిలోకి వెళ్ళివస్తే చేతులు కడుక్కోకుండా భోజనం చెయ్యరు. ఇదేకాక వాళ్ళింకా అనేకమైన ఆచారాలు పాటిస్తారు. లోటాలను, చెంబులను, గిన్నెలను[b] శుద్ధి చేయటం వాళ్ళ ఆచారం.
5 అందువల్ల పరిసయ్యులు, శాస్త్రులు యేసుతో, “మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం ఎందుకు చేస్తారు? పెద్దలు చెప్పిన ఆచారం ఎందుకు పాటించరు?” అని అడిగారు.
6 యేసు సమాధానంగా, “యెషయా వేషధారులైన మిమ్మల్ని గురించి సరిగ్గా ప్రవచించాడు. అతడు తన గ్రంథంలో ఇలా ప్రవచించాడు:
‘వీళ్ళు మాటలతో నన్ను గౌరవిస్తారు.
కాని వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి.
7 వాళ్ళు మానవ కల్పితమైన నియమాలను బోధిస్తారు.
కనుక వాళ్ళ ఆరాధన నిరర్థకం.’(A)
8 దేవుని ఆజ్ఞల్ని పాటించటం మానేసి, మానవుడు కల్పించిన ఆచారాల్ని పట్టుకొని మీరు పాటిస్తున్నారు.
14 యేసు మళ్ళీ, ప్రజల్ని తన దగ్గరకు పిలిచి, “ప్రతి ఒక్కళ్ళు ఇది వినండి. అర్థం చేసుకోండి. 15 బయట ఉన్నవేవీ మనిషి కడుపులోకి వెళ్ళి అతణ్ణి అపవిత్రం చేయవు.
21 ఎందుకంటే, మానవుల హృదయాల నుండి దురాలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారం, 22 లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం బయటకు వస్తాయి. 23 ఇవే లోపలనుండి బయటకు వచ్చి నరుని అపవిత్రం చేస్తాయి.”
© 1997 Bible League International